గురువుల్లో సద్గురువు సాయినాథుడు. గురుశిష్య సంబంధం, పరమేశ్వరుడికి, పరమభక్తుడికి నడుమ అనుబంధం లాంటిదని అడుగడుగునా సాయివాణిని వినిపించారు. గురువుపైనే చిత్తాన్ని, ఏకాగ్రతను చూపితే పరమార్థం సులువుగా బోధపడుతుందని విడమరచి చెప్పారు. చిత్తశాంతికి, వెలుగుదారిలో బతుకు పయనం సాగడానికి అంతకు మించిన మార్గం లేదని జీవనతత్వం బోధించారు. గురుహృదయాన్ని పసిగట్టి, దానినాయన ఆజ్ఞాపించడానికి పూర్వమే నెరవేర్చడం ఉత్తమ శిష్యుల లక్షణం. ఆయన తరచు ‘‘రాముడు, రహీము ఒక్కడే! ఏ మాత్రం తేడాలేదు. మరిక వారి భక్తులు ఎందుకు విడిపోయి పోట్లాడుకోవటం, అందరూ కలసి జాతీయ సమైక్యత సాధించండి’’ అని చెప్పేవారు. అంతేకాదు, సామాజిక సమస్యలకు సమాధానం చెప్పారు. అనేకమైన లౌకిక బాధలకు పరిష్కార మార్గం చూపారు. ఒక ఫకీరుగా, పరమయోగిగా, నిరంతర ఆత్మానుసంధానంలో మునిగి ఉండే బాబా... తన భక్తుల కోసం – మానవాళికోసం వారిలో ఒకరిగా జీవించారు. ఆడారు, పాడారు, కష్టాలు, కన్నీళ్లలో సహానుభూతిని ప్రదర్శించారు. తనవైన లీలలతో కాపాడారు. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు.
గురువులు మానవరూపంలో అవతరించేది మనుష్యులను ఉద్ధరించేందుకే. అందువల్ల అతని అసలయిన నిర్గుణ స్వభావం కొంచెం కూడా చెడి పోదు. వారి దాక్షిణ్యం, దైవికశక్తి, జ్ఞానం ఏమాత్రం తరగదు. శిష్యుడు కూడా అటువంటి స్వరూపం కలవాడే. అనేక జన్మల అజ్ఞానం తానే శుద్ధ చైతన్యమనే సంగతిని మరుగున పడేలా చేస్తుంది. అతను తనను తాను ‘నేను సామాన్య నికృష్ట జీవుడను’ అని అనుకుంటాడు. గురువు శిష్యుడిలోని ఆ అజ్ఞానాన్ని మూలంతో సహా తీసివేయాలి. తగిన ఉపదేశాన్ని ఇవ్వాలి. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానాన్ని గురువు నిర్మూలించి ఉపదేశించాలి. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడననుకొనే శిష్యుణ్ణి గురువు కొన్ని వందల జన్మల వరకు నీవే దైవం, ‘నీవే సర్వశక్తి మంతుడివి’ అని బోధిస్తాడు. అప్పుడు శిష్యుడు కొద్దికొద్దిగా తానే దైవమని గ్రహిస్తాడు. తాను శరీరమనే భ్రమను, తానొక జీవినని లేదా అహంకారమని, అనేక జన్మల నుంచి వస్తున్న దోషం దానిపై ఆధారపడి చేసిన పనుల నుండి సంతోషం, విచారం, ఈ రెండింటి మిశ్రమం కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment