ద్వారకామాయి | Sai patham interchange story 49 | Sakshi
Sakshi News home page

ద్వారకామాయి

Published Sun, May 19 2019 12:42 AM | Last Updated on Sun, May 19 2019 12:42 AM

Sai patham interchange story  49 - Sakshi

ఎవరు ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ.. ‘మనది హిందూ ధర్మమే తప్ప హిందూమతం కానేకాదు’. ‘మతి’ని బట్టి ఏర్పడేది మతం. ఎవరో కొందరు ఓ సంఘంగా ఏర్పడి, ఒకరిని అనుసరిద్దామని నిర్ణయించుకుని, ఆ ఉత్తమ లక్షణాలు ఫలానావానిలో ఉన్నాయని, కాలంలో జరిగే ఆయన ప్రవర్తనలని బట్టి నిశ్చయించుకుని, ఆయన మతిని బట్టి కొన్ని నియమాలనీ, సంప్రదాయాలనీ ఏర్పరుచుకుంటే అదీ ‘మతం’. మన హిందూధర్మం ఓ మతం కాదు. ఎవరి ఇష్టాన్ని బట్టీ నడుస్తూ ఉండే విధానం కలదీ కాదు. మనకి కనిపించని ఋషులందరూ.. ఏ ఉపనిషత్తులూ, వేదాలూ అనే వాటిని నిరంతరం మననం  చేస్తూ.. ఉండేవారో ఆ వేదాలని బట్టి ఏర్పడిన ధర్మం మనది. అందుకే దీనికి మొదట్లో వేదధర్మం లేదా వైదికధర్మం అని పేరు ఏర్పడింది. ఆ మీదట కాలక్రమంలో ఇతర మతాలు ఏవేవో వచ్చాక ఈ గుర్తింపు నిలవడం కోసం ‘హిందూధర్మం’ అనే పేరుతో స్థిరపడింది. ఇదంతా ఎందుకంటే.. సాయి ఉండిన మసీదులో హిందూధర్మమే ఆచరింపబడుతూ ఉండేది. వినడానికి ‘ఇది నిజమా?’ అనిపిస్తుంది గానీ, కొద్దిగా పరిశీలించి చూస్తే మాత్రం– ఎందుకు ఇంతకాలం ఈ విషయాన్ని గమనించలేదు? అన్నంతగా హిందూధర్మమే పాటింపబడుతూ కనిపిస్తుంది పరిశీలిద్దాం!!

1. పంచసూనాలు
భారతీయులం.. అందునా హిందువులమయ్యుండి కూడా ఈ మాటని (పంచసూనాలు) ఎందరో విని ఉండలేదు? సాయి మాత్రం నిరంతరం ఈ 5 దోషాలు(సూనాలు) ఏమున్నాయో వాటిని తొలగించుకుంటూనే ఉండేవాడు. రోట్లో ధాన్యం పోసి, రోకలితో దంచి, బియ్యంగా చేసేటప్పుడు (అప్పట్లో అదే మరి విధానం) మనకి తెలియకుండా ఎన్నో సూక్ష్మజీవులు మన కారణంగా చంపబడతాయి. ఇలా దంచినప్పుడు ధాన్యపు పై–పొట్టుపోతుంది – తినే వీలుకల బియ్యంగా అవుతుంది ధాన్యం. దీన్నే సంస్కృతంలోనైతే వ్రీహీ అవఘాతనం (వడ్లని దంచడం) అంటారు. మరాఠాలోనైతే ‘కండణి’ అంటారు. ఇది మొదటి దోషం. దోషమంటే ఇక్కడ పాపదోషమని అర్థం. అన్ని దోషాల వల్లా పాపం రాదు. ఉదాహరణకి పిల్లలు ఎక్కువగా తీపిని తింటూ ఉంటే.. ఆ బెల్లం ముక్కని దాచేసి, కాకి ఎత్తుకుపోయిందని అబద్ధమాడతాం. అది దోషమే అయినా పాపదోషం (పాపాన్ని తెచ్చిపెట్టే దోషం) కాదు.

ఇక ఆ రోజుల్లో ఎండినపుల్లలు, కందికట్టలు, కొబ్బరి డొక్కలు, మట్టలు.. వంటి వంటచెరకుతో వండుతూండేవారు. వాటిలో కొన్ని పురుగులుండచ్చు. అలాగే ఆ వండేటప్పుడు కూడా కొన్ని పురుగులు మంటలో మనకారణంగా చనిపోవచ్చు. ఇది రెండవ దోషం. సంస్కృతంలోనైతే ‘దాహన’మంటారు. మరాఠాలో ‘ఛుల్లీ’ అంటారు. ఇది రెండవ పాపదోషం. ఒకప్పటి రోజుల్లో తిరుగలి వాడకం మరింత ఎక్కువగా ఉండేది. కందులు, పెసలు, మినుములు, శనగలు, గోధుమలు... ఇలా అన్నింటినీ.. కొన్నింటిని పప్పుబద్దలుగా, కొన్నింటిని మొరుముగా, మరి కొన్నింటిని పిండిగా అయ్యేంత వరకూ విసిరేవారు. ఈ సందర్భంలో కూడా మన కారణంగా ఎన్నో సూక్ష్మజీవులు మరణిస్తాయి. ఇది మూడవసూనం. దీన్నే మరాఠా, సంస్కృత భాషల రెండింటిలోనూ ‘పేషణి’ అంటారు. ఇది మూడవ పాపదోషం. ఇక నీళ్లని కడవలతో తెచ్చేందుకు వాటిని మట్టితో కడగడం, తొలవడం చేస్తారు. దానివల్ల ఎన్నో సూక్ష్మజీవులు మరణిస్తాయి. దాన్ని ‘ఉదకుంభి’ దోషంగా చెబుతారు. ఇది నాల్గవది. మరాఠాలో ‘ఉత్కంభి’ అంటారు.
ఇక చీపురుతో నేలని ఊడ్చినప్పుడూ ఎన్నో జీవులు మనవల్ల చనిపోతాయి.. బలమైన సన్నికల్లు వంటి వాటిని నేల మీద పెట్టినప్పుడూ.. ఇంకా బూజు వంటివాటిని దులిపినప్పుడూ, ఆవుపేడనీటితో కలిపి కలాపం(అందం సౌందర్యం కోసం) (కలాపి)చల్లినప్పుడూ కొన్ని సూక్ష్మజీవులు మన కారణంగానే మరణిస్తాయి. ఆ పాప దోషాన్ని ‘మార్జని’ అంటారు ఉభయభాషల్లోనూ. ఆ 5 పాపదోషాలూ తొలగడం కోసం సాయి ఏ రోజునా బ్రహ్మయజ్ఞం – పితృయజ్ఞం– దేవయజ్ఞం– భూతయజ్ఞం(ఇది మరీ ముఖ్యం పంచసూనాల దోష నివృత్తికి) మనుష్యయజ్ఞమనే వాటినీ చేస్తూనే ఉండేవారు. (ఈ యజ్ఞాల గురించి 46వ భాగంలో వివరణ ఉంది) సాయి... ఈ చిన్నవాటిని ‘పంచసూనాలనే పేరిట చెప్పడమంటే? ప్రాచీన భారతీయధర్మాన్నీ, హైందవసంప్రదాయాన్నీ పాటించడం కిందికి రాదా?’ పోనీ ఇదంతా ఏ హిందూ దేవాలయంలోనా? అని ఆలోచిస్తే స్పష్టంగా మసీదులో కదా!?

2. అగ్ని ఆరాధన
హైందవధర్మంలో అతి ముఖ్యమైనది దీపారాధన. ‘అగ్నిముఖా వై దేవాః’ దేవతల్లో ఏ ఒక్కరికి దేన్ని మనవి చేసుకోవాలన్నా ఆ దైవానికి సంబంధించిన జపం, ధ్యానం, మంత్రమననం అనే వాటిని– ఏ దైవానికి ఎంత సంఖ్యతో మననం చేయాలో అలా చేశాక ఆ మంత్రసంఖ్యలో దశాంశాన్ని (ఉదాహరణకి లక్షమార్లు మంత్రాన్ని మననం చేసే దానిలో 10వ వంతు అంటే.. 10 వేల మార్లు తర్పణం హోమం చేయాలి) మళ్లీ మంత్రాన్ని మననం చేస్తూ కొన్ని వస్తుద్రవ్యాలతో అగ్నిలో హోమం చేయాలి. అప్పుడు మాత్రమే ఏ దైవాన్ని పూజిస్తున్నామో కోరిక ఏమిటో ఏ దైవానికి చెందించవలసిందో అగ్నిదేవునికి తెలియజేయబడినట్లు. దాంతో ఆ అగ్ని ఆ దేవునికి ఈ వ్యక్తి వివరాలనీ కోరికలనీ తెలియజేస్తాడు ఆ అగ్నిలో వేయబడిన వస్తు ద్రవ్యాలతో సహా. ఈ అగ్నిలో వేయబడిన వస్తుద్రవ్యాలని నేతితో వేసే కారణంగా దాన్ని హవిస్సు అంటారు.అలా దేవతలతో మనకి దగ్గర సంబంధాన్ని ఏర్పరిచే దైవం అగ్ని అన్నమాట. మసీదులో నిత్యం అగ్ని వెలిగింపబడి దీప ఆరాధనం నిరంతరం సాగుతూనే ఉంటుంది. నూనె దీపాలన్నింటినీ వెలిగిస్తూ మనని నూనెకి ఇబ్బంది పెట్టడమా? అంటూ వర్తకులందరూ నూనెని ఇయ్యడం మానేసారనే విషయం – సాయే నీటితో దీపాలని మసీదు నిండుగా వెలిగించాడనీ అనుకున్నాం కదా! ఈ దీపారాధన అది కూడా మసీదులో జరగడమంటే హైందవ సంప్రదాయాన్ని పాటించడం కాదూ మరీ! అలాగే ఏ కోరిక తీరాలన్నా ఆ కోరికకి సరిపడిన హోమాన్ని చేస్తూ ఉంటాం. సరిగ్గా అదే పద్ధతి నిత్యహోమం జరుగుతూండే ‘ధుని’ ద్వారా మసీదులో నిర్వహింపబడుతూనే ఉంది. ఉదయం నిద్రనుండి లేచీ లేవగానే.. కాళ్లూచేతులూ కడుక్కుని, నోటిని పుక్కిలింత ద్వారా శుభ్రపరుచుకుని, వెంటనే గాయత్రీ మంత్రాన్ని మననం చేయడమనే ఆ హైందవసంప్రదాయాన్ని.. ‘అజపాగాయత్రి’ అంటారు. అదే విధానం సక్రమంగా సాయి చేత పాటించబడుతూ ‘అల్లాహ్‌హో మాలిక్‌!’ అనే మంత్రమే మననం చేయబడుతూ ఉండేది. ఈ లో–విశేషం తెలియని ఏ కొందరో మాత్రం ‘సాయి ఇంకా స్నానాన్నే చేయలేదు’ అని భావిస్తూ ఉండేవారు. ఈ స్నానానికి వెనుక మంత్ర మననం హైందవ సంప్రదాయం ప్రకారం ఉన్నదే కదా! పైగా ఇది మసీదులోనే జరుగుతూ ఉండేది!

3. నిత్య పారాయణాలు
సహజంగా ఎవరైనా దేవాలయానికి వెళ్తే అక్కడ ఆ దైవసమక్షంలో ఆ దైవానికి సంబంధించిన – దీంతోపాటూ ఇతర దేవతలకి సంబంధించిన మంత్రాలనో స్తోత్రాల్నో శ్లోకాల్నో పాటల్నో కీర్తనల్నో పద్యాల్నో అలా నోటికొస్తే చదువుతూ ఉండటం, రాని పక్షంలో చూసి చదువుతూండటమో చేస్తుంటాం. దాన్నే పారాయణం అంటాం. ఆశ్చర్యకరమైన అంశమేమంటే.. ‘రామదాసుబువా’ వంటి శ్రోత్రియులు శ్రీమద్రామాయణాన్నీ భగవద్గీతనీ అధ్యాత్మరామాయణకీర్తనలనీ ఇన్నింటికీ ముందు గాయత్రీమంత్రజపాన్నీ చేస్తూ ఉంటే, శ్యామా వంటి వాళ్లు శ్రీ విష్ణు సహస్రనామాలని పఠిస్తూ ఉంటే.. ఇంకా ఎందరో మరెందురో వాళ్ల వాళ్ల కొచ్చిన ఎన్నెన్నో స్తోత్రాలని చదువుకుంటూనే ఉంటూండేవాళ్లు. ‘ఇది మసీదు’ అని ఏ ఒక్కరూ అభ్యంతరపెట్టడం గాని, సాయి వీరందరినీ ఉద్దేశించి పఠించవద్దని అనడం గాని ఏ నాడూ జరగనే లేదు. 

4. యా సాయీ!
ఖండోబా దేవాలయపు అర్చకుడైన మహల్సాపతి తనని చూస్తూనే ‘యా సాయీ!’ (సాయీ! నిన్ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ నీ రాకని పవిత్రపూర్వకంగానూ ఆదరణపూర్వకంగానూ భావిస్తున్నాను) అన్నాడు. ఈ అర్చకుడూ సామాన్యుడు కాదు నిజానికి. సాయిలో ఉన్న గొప్పదనాన్ని గమనించే ‘సాయీ!’ అనే పేరుతో పిలిచాడు. నిజంగా మహమ్మదీయాభిమానమే తనకి ఉన్నట్లయితే ‘నేను రాను!’ అనవచ్చు. మహమ్మదీయనామంతో తనని పిలిచినట్లయితేనే వస్తానని భీష్మించవచ్చు – లేదా – లోపల ద్వేషించుకుంటూ పైకి అలా అంగీకరించినట్లు భావించవచ్చు. అలాంటిదేమీ లేకుండా స్పష్టంగా తానంగీకరించాడంటే హైందవధర్మంతో మసీదు నిండిపోయి కనిపించడం లేదా? ఆయన చేతిలో ఉన్న సటుకాని సంన్యాసులకుండే ధర్మదండం (ఆకారంలో కనిపించే)గా భావించవచ్చు. నుదుట పెట్టించుకున్న భస్మాన్నీ దాన్ని కూడా త్రిపుండ్రాంకంగా (మూడు గీతలుగా భావించి ముఖాన పూసుకునే శైవ చిహ్నం) అంతేకాక హిందూసంప్రదాయానుగుణంగా ఏ చందనాన్ని అతిపవిత్రంగా భావిస్తూ అభిషేకాన్ని కూడా ఏ దైవానికి చేస్తూ ఉంటారో ఆ చందనంతో నామాన్ని డాక్టర్‌ పండిత్‌ పెడితే ఏ మాత్రపు అభ్యంతరాన్నీ పెట్టలేదు. శ్యామా మొదలైన వాళ్లు కంఠానికి చందనాన్ని రాస్తే ఆనందిస్తూ ఉండేవాడు కూడా. ఇక హైందవ సంప్రదాయ అర్చన పుష్పాలంకరణ నైవేద్యాలని పెట్టడం, హారతి విధానం, అగరుధూపసేవ.. ఇలా ఒకటేమిటి అన్నీ కూడా మసీదులోనే జరిగాయంటే ఇదంతా సంపూర్ణ హైందవ విధానం కాదూ! ఇంతటి హైందవ సంప్రదాయం పాటింపబడుతోంది కాబట్టే.. హిందూధర్మంలో నిత్యం మునకలేస్తూ ఉండే మహానుభావులైన తాపసులూ (తపస్సు మాత్రమే తను జీవన వృత్తిగా కలవారు) దండకమండలాలని ధరించేవారూ హరిద్వార్‌ మొదలైన పుణ్యపవిత్ర క్షేత్రంల్లో నిత్యం ఉండే యోగులూ మఠాధిపతులై మఠాల్లో ఉండే సంన్యాసులూ ఇంకా మఠం స్థాపించుకున్న స్థితిలో లేని పరి వ్రాజకులూ (నిత్యం భక్తులకి దర్శనాన్నిచ్చేందుకై యాత్రల్ని చేస్తూ తిరుగుతూ ఉండే సంన్యాసులూ) అన్నింటినీ విడిచిన త్యాగ బుద్ధితో ఉన్న త్యాగులూ ఎక్కడా భోజనాన్ని చేయకుండా తామే వండుకుని, తినే సంప్రదాయాన్ని పాటించే శిష్టులూ.. ఇలా అందరూ మసీదుకొస్తూ  సాయిని దర్శించి వెళ్తూ ఉండేవారు. 

5. శిరోవేష్టనం
శిరః అంటే తలకి వేష్టనం అంటే ధరించిన వస్త్రవిధానమని అర్థం. మహమ్మదీయుల సంప్రదాయం ప్రకారం తలకి టోపీ పెట్టుకుంటారు. కొందరు బారుగా ఉండే పెద్ద వస్త్రాన్ని ఒక తలపాగాలాగా ఉండే పద్ధతిలో ధరిస్తారు. మరి కొందరైతే ఒంటిపొరతో గుడ్డని తలపాగగా ధరిస్తూ శిరసుని పూర్తిగా గుడ్డతో కలిపివేస్తూ కనిపిస్తాడు. సాయి శిరోవేష్టనవిధానాన్ని చూస్తే స్పష్టంగా అది ఇన్నింటికంటే భిన్నంగా కనిపిస్తుంది. ఎలా అయితే హైందవధర్మ ప్రబోధకులైన స్వాములూ సంన్యాసులూ మఠాధిపతులూ తమ శిరసు కనిపించకుండా ఉండేలా ఒంటిపొర వస్త్రాన్ని తల మీద ఉంచుకుని, రెండు చెవులూ వినపడేలానూ, శిరసు కప్పబడి ఉండేలానూ ఆ మిగిలిన వస్త్రాన్ని చెవిపక్కన ముడివేసి కనిపించేలానూ శిరోవేష్టనాన్ని కలిగి ఉంటాడు. ఆయన శిరసు ఏనాడూ ఆచ్ఛాదన లేకుండా ఉండేది కాదు– ఉండదు. మన హైందవ సంన్యాసులు కూడా అదే తీరుగా ఉంటారనేది అనుభవంలో కనిపించే సత్యమే. ఇదే శిరోవేష్టన విధానాన్ని అవలంబిస్తూ సాయి దర్శనానికి వచ్చే భక్తులు స్త్రీలైతే తల మీద చీర చెంగుని ధరిస్తూనూ, పురుషులైతే తలపాగలతోనూ వస్తూండేవారు. 

యతిలాగా భిక్షావృత్తి
హిందూ ధర్మ సంప్రదాయంలో యతీ లేదా సంన్యాసీ అయిన మహానుభావుడు మధ్యాహ్నం ఒక్కసారి మాత్రమే బిచ్చమెత్తాలి నిరహంకార విధానాన్ని సూచించుకుంటూ.. అది కూడా 5 ఇళ్ల నుండి మాత్రమే తీసుకోవాలి. ఆ తీరుగా వచ్చిన అన్నాన్ని పప్పుతో అన్నాన్ని కలిపీ.. పచ్చడితో అన్నాన్ని కలిపీ.. పులుసుతో అలాగే పెరుగుతో.. ఈ తీరుగా వేటి రుచిని వాటికిగా అనుభవిస్తూ తినడం సంన్యాససంప్రదాయం కాదు. అన్నింటినీ కలిపి రుచిలో అభిరుచి కలిగినవానిగా కాకుండా తినాలి. మళ్లీ కావాలంటూ మారు(రెండోమారు) అడగకూడదు. తినకూడదు. ఆ రోజుకి భగవంతుడు అంత మాత్రపు ఆహారాన్నే అంతటి రుచితోనే అనుగ్రహించాడని భావించి – యదృచ్ఛాలాభ సంతుష్టః – దొరికిందానితోనే సంతృప్తిపడే లక్షణాలతో ఉండాలి సంన్యాసి. సాయి ఇదే సంప్రదాయాన్ని మసీదులో పాటిస్తూ ఉండేవాడు.ఏ భజన సంప్రదాయం మన హిందువులదో ఆ ధర్మాన్ని మసీదులో పాటింపజేస్తూ పండరినాధుని భజననీ, వేణుగోపాలుని భజననీ చేయిస్తూ చేస్తూ ఉండేవాడు. కాళ్లకి గజ్జెలని కట్టుకుని ఆనందంతో నృత్యాన్ని చేస్తూ ఉండేవాడు కూడా. ఎందరెందరో భక్తులు ఏమేమో ఆహారపదార్థాలు తెచ్చినా ఆహారపదార్థాలు తెచ్చినా సంన్యాసధర్మానికనుగుణమైన భిక్షాటనాన్ని ఏనాడూ మరవలేదు. మహానుభావులైన ఏ కొందరు మహానుభావులో పవిత్రజీవనాన్ని గడిపి మరణిస్తే వాళ్ల సమాధుల వద్ద జరిగే ఉత్సవమైన ఉరుసురోజునే శ్రీరామనవమిని ఏర్పాటు చేసి మసీదుని హిందూదైవ మందిరంగా మార్చేసాడు సాయి.  పైవారం – సాయి సమక్షంలో ఆమరణ నిరాహార దీక్షా..?
– సశేషం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement