జనతంత్రం
భారతీయ జనతా పార్టీ వారు ఉత్తర భారతదేశాన్ని తమ కంచుకోటగా భావించుకుంటారు. ఆ కోట బీటలు వారుతున్న ఆనవాళ్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో రాజకీయంగా నష్టం జరిగితే దానిని పూడ్చుకోవడానికి కొత్త ప్రాంతాలకు విస్తరించాలి. ఇది కాషాయ దళానికి తక్షణ కర్తవ్యం. ఉత్తరాదిన బలపడటం కోసం మూడు దశాబ్దాల కిందనే మతాన్ని రాజకీయాల్లోకి లాగిన ఘనత ఆ పార్టీదే! అదే వ్యూహంతో దక్షిణాది విస్తరణకు కమల దళం అడుగులు వేస్తున్నది. కర్ణాటక, తెలంగాణాల్లో దాని ఎత్తుగడలు ఒకమేరకు ఫలించాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత కేరళలో ఆ పార్టీ వోటు బ్యాంకు చెప్పుకోదగినంత పెరిగింది. ఆంధ్ర, తమిళనాడు మాత్రమే ఇంకా కొరకరాని కొయ్యలుగా మిగిలాయి.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు కమల దళాలను కూరలో కరివేపాకులా చంద్రబాబు వాడేసుకుంటున్నారని బీజేపీలో చాలామంది బాధపడుతుంటారు. చంద్రబాబుకు ఆయన మామగారైన ఎన్టీరామారావు ‘జామాతా దశమగ్రహం’ అనే పేరును ఖాయం చేశారు. ఈ దశమ గ్రహానికి ఉపగ్రహం మాదిరిగా పరిభ్రమిస్తున్న కారణంగా స్వయం ప్రకాశితం కాలేక పోతున్నామని ‘ఒరిజినల్ పరివార్’ (ఓపీ బ్యాచ్) చింతాక్రాంత మవుతున్నది. వ్యక్తిగత పొరపొచ్చాల వల్ల మధ్యలో రెండు పార్టీలు దూరమైన ఓ రెండేళ్లు తప్పితే రాష్ట్ర బీజేపీలో ఎప్పుడూ ‘యెల్లో పరివార్’ (వైపీ బ్యాచ్)దే పైచేయి.
ఇటీవల చంద్రబాబు సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరుని ప్రసా దాన్నే రాజకీయాల్లోకి లాగడం, ఫలితంగా ఆయనపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిన సంగతులే. తెలుగు దేశం పార్టీ నాయకులెవరూ సుప్రీం వ్యాఖ్యలపై స్పందించలేదుకానీ బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న వైపీ బ్యాచ్ నాయకురాలు మాత్రం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. న్యాయ మూర్తుల కామెంట్లనే ఆమె తప్పుపట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన సంద ర్భాన్నీ, సన్నివేశాన్నీ కూడా గమనించాలి.
కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినా ఒక్క హామీని పట్టాలెక్కించకపోవడం... వరద నివారణ చర్యల్లో వైఫల్యం... వరద బాధితుల సహాయ చర్యల్లో చేతులెత్తేసిన సందర్భం. మూడు కూటమి పార్టీలు ముచ్చటగా జరుపుకున్న శతదినోత్సవ వేడుక ఆ సన్నివేశం. కనుక తిరుమలేశుడి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగాలనుకోవడం కూటమి ఉమ్మడి వ్యూహంగానే భావించవలసి ఉంటుంది. ఆ వ్యూహం గొంతు కలో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఉండటంతో వైపీ బ్యాచ్ బీజేపీకి బీపీ పెరిగిపోయింది.
చంద్రబాబుపైనే పూర్తిగా ఆధారపడటం, ఆయన పల్లకీని నిరంతరం మోయడం పట్ల బీజేపీలో భిన్నాభిప్రాయాలు న్నాయి. రాష్ట్ర బీజేపీలో చంద్రబాబు స్వయంగా ప్రవేశపెట్టిన వైపీ బ్యాచ్ (యెల్లో పరివార్)కు యథాతథ స్థితి పట్ల అభ్యంత రాలేమీ లేవు. ఒరిజినల్ పరివార్ (ఓపీ బ్యాచ్) మాత్రం పార్టీ సొంతంగా ఇంకొంత బలం పుంజుకుంటేనే చంద్రబాబు దగ్గర కూడా గౌరవం లభిస్తుందనీ, లేకుంటే ఉపగ్రహం మాదిరిగానే మిగిలిపోతామనీ హైకమాండ్ దగ్గర వాదిస్తున్నది.
తెలుగుదేశం పార్టీతో పొత్తును కొనసాగించినా సొంత బలం పెంచుకొని ఎక్కువ స్థానాలను దక్కించుకోవలసిన అవసరం జాతీయ నాయకత్వానికి కూడా ఉన్నది. సొంత బలం పెంచుకోవడానికి వారి దగ్గరున్న ప్రణాళిక పాత మంత్రమే! మత విశ్వాసాలను ఆలంబన చేసుకోవాలి.
వైపీ బ్యాచ్ నాయకత్వం కింద ఉన్న రాష్ట్ర బీజేపీతో ఈ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని హైకమాండ్ అభిప్రాయపడి ఉండవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు కలిగిన వాడు, దాదాపు 13 శాతం జనాభా ఉన్న సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, సినిమాల్లో మాదిరిగా వేషాల్నీ, సంభాషణల్నీ అవలీలగా మార్చగలిగినవాడు వారి దృష్టిలో పడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలాకాలంగా బీజేపీ అధిష్ఠానానికి విధేయుడిగా ఉంటున్నారు.
ఇంక కావలసిందేముంది? వీరవైష్ణవావతారం సిద్ధమైంది. శ్రీమహావిష్ణువు అవతారాలన్నీ ధర్మ సంస్థాపనార్థం సంభవించి కర్తవ్యం పూర్తికాగానే ఆయనలోనే ఐక్యమైపోయాయని చదువుకున్నాము. కానీ కమలం పార్టీ సృజించిన ఈ కొత్త వీరవైష్ణవమూర్తి వచ్చే ఎన్నికల కర్తవ్యానికి ముందుగానే అదే పార్టీలో విలీనమయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం.
సినీనటుడు కావడం వల్ల పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ ఆయన సేవలు వాడుకోవాలని బీజేపీ పెద్దల ఆలో చన. తమిళనాడులో అన్నామలై పాదయాత్ర చేసి పార్టీకి కొంత ఊపు తెచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితం కలుగలేదు. బీజేపీ సొంతంగా ఏపీలో బలపడటం సహజంగానే చంద్రబాబుకు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఆయనక్కూడా మరో దారి లేదు.
వంద రోజుల్లోనే ప్రభుత్వ ప్రతిష్ఠ కనీవినీ ఎరుగని రీతిలో దిగ జారింది. ఈ మాట ప్రతిపక్షం వాళ్లు చెప్పడం కాదు. తెలుగు దేశం పార్టీకి వీరవిధేయులుగా ఉన్నవారు, సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ కోసం ఎన్నికల యుద్ధం చేసినవారు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారు చేస్తున్న ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి.
ఇకముందు తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ దిగ జారుడే తప్ప మెరుగయ్యే అవకాశం లేదు. ఉద్యోగుల బదిలీల్లో, ఇసుక దోపిడీలో, లిక్కర్ దుకాణాల పేరుతో పిండుకుంటున్న లంచాల ఫలితంగా ఇప్పటికే పార్టీ జెండా అవినీతి కంపు కొడు తున్నది. ఒక్క వాగ్దానం అమలు కాలేదు. ఈ రకమైన ట్రాక్ రికార్డుతో వారు జనం ముందుకు వెళ్లగలిగే పరిస్థితి రానున్న రోజుల్లో సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు మత విశ్వా సాలు రెచ్చగొట్టే పార్టీ వెంట నడవడం గుడ్డిలో మెల్ల కదా!
పవన్ కల్యాణ్ ధరించిన కొత్త అవతారాన్ని చంద్రబాబే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాడనుకోవాలి. కాకపోతే తిరుమల లడ్డూ ప్రసాదం ప్రతిష్ఠను పణంగా పెట్టి ఆయన ఆ టెంకా యను కొట్టారు. కూటమి సమావేశంలో చంద్రబాబు కల్తీ వ్యాఖ్యలు చేసిన మూడోరోజే పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష – కాషాయ వస్త్రధారణ ప్రారంభమైంది. స్క్రిప్టు చేతిలో సిద్ధంగా ఉంటే సినిమా చకచకా తీసేయవచ్చని ప్రసిద్ధ దర్శకులు చెప్పే మాట ఇక్కడ కూడా రుజువైంది.
ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని ఆయన విరమించారు. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ‘సనాతన ధర్మం’ అనే మాటను హిందూ మతానికి పర్యాయపదంగానే ఆయన వాడారు. ‘నేను ముమ్మాటికీ సనాతన హిందువునే.
నా ప్రాణాన్ని అడ్డుపెట్టయినా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. దానికోసం నా రాజకీయ హోదాను, పదవిని, అధికారాన్నే కాదు... నా ప్రాణాల్ని కోల్పోవడానికి సిద్ధమ’ని గంభీరంగా ప్రకటించారు. గతంలో సనాతన ధర్మాన్ని విమర్శించిన ఉదయనిధి స్టాలిన్‌పై పేరు చెప్పకుండా నిప్పులు చెరిగారు.
పవన్ కల్యాణ్ తన ప్రాణాలు బలిపెట్టడానికి కూడా సిద్ధపడిన ‘సనాతన ధర్మం’ అంటే ఏమిటన్న ప్రశ్న సాధారణ ప్రజల మెదళ్లను ఇప్పుడు తొలుస్తున్నది. ఆయన ఉపన్యాసమంతా గమనిస్తే హిందూ మతావలంబనే సనాతన ధర్మాన్ని పాటించడం అని భావిస్తున్నట్టుగా ఉన్నది. భారతీయ తాత్విక ధారలో ఎక్కడ కూడా ఇటువంటి ప్రస్తావన లేదని పలువురు పండితుల అభిప్రాయం.
అపౌరుషేయాలుగా, సకల శాస్త్రాలకు మాతృశాస్త్రంగా భారతీయులు పరిగణించే వేదాల్లో సనాతన ధర్మం అనే మాటను ఎక్కడా వాడలేదని చెబుతారు. బౌద్ధ సాహిత్యంలో ఏది సత్యమో అది సనాతనం... అంటే శాశ్వతమైనదనే ప్రస్తావన ఉన్నదట! అంటే ఉషస్సు సత్యం. సూర్యుడు సత్యం. చంద్రుడు సత్యం, గ్రహగతులు సత్యం కనుక అవి సనాతనం, అంటే శాశ్వతమని అర్థం.
అట్లాగే సత్య వాక్కు కూడా! వర్ణాశ్రమ ధర్మం పేరుతో మానవ అసమానతలకు పెద్దపీట వేసి, స్త్రీ స్వాతంత్య్రాన్ని నిరాకరించిన మనుస్మృతిలో కూడా సత్యవాక్పాలనే సనాతన ధర్మమనే ప్రస్తావన ఉన్నది. మహాభారత యుద్ధానంతరం అంపశయ్య మీదున్న భీష్మాచార్యుని దగ్గర రాజధర్మాన్ని తెలుసు కోగోరిన పాండవులు ఆయన చెంతకు వచ్చారట! పరిపాలకులు ప్రజా సంక్షేమాన్ని కనిపెట్టి ఉండటం సనాతనమని భీష్ముడు వారికి ఉపదేశించాడట! వ్యాస భారతంలో ఈ ప్రస్తావన ఉన్న దని ఇటీవల ‘ఫ్రంట్‌లైన్’ ప్రచురించిన ఓ వ్యాసంలో రచయిత ఉటంకించారు.
సత్యం సనాతనం, అంటే శాశ్వతం. ధర్మం యుగాన్ని బట్టి, కాలాన్ని బట్టి సామాజిక కట్టుబాటు కోసం ఏర్పడిన నియమావళి. ఈ ప్రజాస్వామిక యుగంలో ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైంది. మన రాజ్యాంగం మత ప్రసక్తి లేని లౌకికత్వానికి కట్టుబడింది. అట్లాగే ప్రజా సంక్షేమాన్ని ధ్యేయంగా ప్రకటించింది. పౌరుల హక్కులకు పట్టం కట్టింది. ఇప్పుడు ఈ సనాతన ధర్మం రాజ్యాంగ ధర్మానికి భిన్నమైనదా? ఎందు కంటే, సనాతన ధర్మంపై న్యాయస్థానాలు చిన్నచూపు చూస్తున్నాయని కూడా తిరుపతి సభలో పవన్ కల్యాణ్ అభియోగాన్ని మోపారు. పైగా అన్యమతాలకు కొమ్ము కాస్తున్నాయని కూడా న్యాయస్థానాలపై ఆయన విమర్శలు చేశారు.
భారత రాజ్యాంగాన్ని నిర్వచించడం, దాని ఆదర్శాలను నిలబెట్టడం రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన న్యాయస్థానాల విధి. అటువంటి న్యాయస్థానాలకు స్వమతం ఏమిటి? అన్యమతం ఏమిటి? ఇదేమి అభియోగం? రాజ్యాంగాన్ని పక్కనపెట్టి సనా తన ధర్మాన్ని క్రోడీకరిద్దామా! ఇప్పుడు బీఫ్ తిన్నారనే అభియోగాలతో వీరహిందువులంతా కొందరిని వెంటాడి వేటాడి వధిస్తున్నారు. ఇది సనాతనమా? వేదకాలంలోని ముని వాటికల్లో పశుమాంస భక్షణ ఆమోదయోగ్యమే కదా!
రుగ్వేద కాలంలో వసుక్ర రుషి దేవేంద్రుడిని ఇలా ప్రార్థించాడట! ‘‘ఓ ఇంద్రుడా! నీ కొరకు రుత్వికులు వేగంగా మత్తెక్కించే సోమాన్ని సిద్ధం చేస్తున్నారు. నీవు సోమాన్ని తాగు తున్నావు. వారు నీ కొరకు వృషభాన్ని వండుతున్నారు. నీవు ఆహారాన్ని తింటున్నావు’’ – ఈ రుగ్వేద శ్లోకాన్ని మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ తన ‘రుగ్వేద ఆర్యులు’ పుస్తకంలో ఉటంకించారు. కనుక ఆచార వ్యవహారాలు, ఆహారపు అల వాట్లు వగైరా ధర్మాధర్మ విచికిత్సలన్నీ కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి.
ఈ కాలానికి రాజ్యాంగమే భారతీయ ధర్మశాస్త్రం. సత్యం ఒక్కటే శాశ్వతం. ప్రజా సంక్షేమం కూడా సనాతనమని మహాభారతం చెబుతున్నది. మన రాజ్యాంగం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. హిందూ ధర్మ రక్షణే సనా తన ధర్మ రక్షణగా భావిస్తే అందుకోసం చాలామంది స్వాము లున్నారు. శంకర పీఠాలతో సహా బోలెడన్ని పీఠాలున్నాయి. అదనంగా రాజకీయ పీఠాధిపతులెందుకు? ప్రజల్లో తమ హక్కుల పట్ల చైతన్యం పెరిగిన ప్రతిసారీ, సమాన అవకాశాల కోసం ముందుకొస్తున్న ప్రతి సందర్భంలో పెత్తందారీ ప్రవక్తలు వారి స్వార్థచింతనకు మత విశ్వాసాల ముసుగు తొడిగి ముందుకు తోస్తున్నారు. ప్రజా చైతన్యాన్ని పక్కదారి పట్టిస్తు న్నారు. ప్రజలారా... తస్మాత్ జాగ్రత్త!!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment