జీవితాన్ని ఆగి చూద్దామా..! | Pranik Healing Workshop | Sakshi
Sakshi News home page

జీవితాన్ని ఆగి చూద్దామా..!

Published Mon, Apr 2 2018 1:24 AM | Last Updated on Mon, Apr 2 2018 1:24 AM

Pranik Healing Workshop  - Sakshi

అది ప్రాణిక్‌ హీలింగ్‌ వర్క్‌షాప్‌. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరుగుతోంది. వెళ్లేసరికి అప్పటికే హాల్‌ నిండిపోయింది! వర్క్‌షాప్‌కి వచ్చిన  వారిలో 80 శాతం యువతే ఉండటం ఆశ్చర్యమనిపించింది. ‘‘పరుగెడుతున్నాం. పరుగెడుతూనే ఉన్నాం.ఈ పరుగుకు అర్ధమేంటో తెలియాలి కదా! అందుకే అప్పుడప్పుడు కాస్త ఆగి మనల్ని మనం చూసుకోవాలి’’.. వేదిక మీద మాట్లాడుతున్న దినేష్‌.. పుట్టెడు ఇంటి సమస్యలు మీదేసుకొని జీవితాన్ని లాగలేక లాగే మధ్యతరగతి తండ్రి ఏమీ కాదు. బి.టెక్‌ పూర్తిచేసి ఇటీవలే ఉద్యోగంలో చేరాడట. ఇన్నాళ్లూ చదువు, ఇప్పుడు ఉద్యోగ విధుల పరుగులో పడిపోయి తనని తాను మర్చిపోతున్నానని, ఆన్‌లైన్‌లో హీలింగ్‌ వర్క్‌షాప్స్‌ గురించి తెలుసుకుని పేరు ఎన్‌రోల్‌ చేసుకున్నానని చెప్పాడు.

‘‘ఎస్‌.. నేను కూడా అంతే! ఎంత కాదనుకున్నా మైండ్‌సెట్‌లో చాలా చెత్త చేరుతుంది. అది రోజువారీ పనిలో ఉండే ఒత్తిళ్లు అవ్వచ్చు, రకరకాల ఇగోస్‌ అవ్వచ్చు.. వీటిని క్లీన్‌ చేసుకోవాలంటే కొన్ని మెథడ్స్‌ అవసరం. ఇలాంటి వర్క్‌షాప్స్‌ గురించి కొంత తెలుసు. నేరుగా తెలుసుకుందామని వచ్చాను’’ అంది రేడియో ఆర్జేగా వర్క్‌ చేస్తున్న వర్ష. ఇలాగే మరికొందరు. వారంలో ఆదివారం జాలీడే అంటూ ఇంట్లో బద్ధకంగా గడిపేస్తుంటారంతా అనే మాటలకు అర్ధం లేదనిపించింది వీరిని కలిశాక.

లంచ్‌ టైమ్‌ అయ్యింది. ఆఫీస్‌కు వెళుతున్నట్టు ఎవరి లంచ్‌ బాక్స్‌ వాళ్లే తెచ్చుకున్నారు. కొత్త పరిచయస్తులతో కలిసి నవ్వుతూ భోజనం చేస్తున్నారు. వారిలో డిగ్రీ చదివేవాళ్లు, కాల్‌సెంటర్‌లలో పనిచేసేవాళ్లు, గృహిణులతో పాటు వ్యాపారులూ ఉన్నారు. ‘‘యోగా, ధ్యానం చేసే పద్ధతులను తెలుసుకోవడం కోసమే కాదు ఒకేలాంటి అభిరుచి ఉన్న మరికొందరితో పరిచయాలు ఏర్పడతాయి. దీని వల్ల కొత్త జీవనంలోకి ఉత్సాహం వస్తుంది’’ అంటోంది ఇంటివద్దే బొటిక్‌ నిర్వహిస్తున్న శ్రీవాణి. జీవితాన్ని ఉత్సాహంగా గడపడానికి ఆధ్యాత్మిక ప్రయాణమూ అవసరమే అన్నది ఆమెకున్న మరొక నమ్మకం.

‘‘కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగుండటం లేదు. మానసిక సమస్యలే అందుకు కారణం. వాటిని క్లియర్‌ చేసుకోవడానికే ఇక్కడకు వచ్చాను’’ అని చెప్పారు ఆరుపదుల వయసు దాటిన రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పూర్ణచందర్‌రావు. ‘‘పదేళ్లుగా హెల్త్‌ అండ్‌ హీలింగ్, బాడీ అండ్‌ సోల్, స్పిరిచ్యువల్‌ ప్రాణిక్‌ హీలింగ్‌ వంటి వర్క్‌షాప్స్‌కి హాజరవుతున్న’ట్టు చెప్పారు యోగా టీచర్‌ సుభద్ర.

‘ఇంటి వద్ద చుట్టుపక్కల వారికి ఉచితంగా హీలింగ్‌ క్లాసులూ తీసుకుంటున్నాను’ అంటూ విజిటింగ్‌ కార్డుతో ఆహ్వానం పలికారు ఆమె. ఆరోగ్య సమస్యలకు మైండ్‌పై చూపే చెడు ప్రభావాలే కారణం అంటూ సాయంత్రం వరకు రకరకాల పరిష్కారాలు సూచిస్తూనే ఉన్నారు నిర్వాహకులు. ఈ వర్క్‌షాప్స్‌ను ఏడాదిపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు అయ్యే ఖర్చు గురించి  హీలింగ్‌ గురు శివ ను అడిగితే ‘హాజరయ్యేవారి ఆసక్తే’ అన్నారు.

మరుసటి రోజు ఆఫీస్‌కొచ్చి రోజువారీ షెడ్యూల్‌ని చెక్‌ చేస్తుంటే స్నేహితురాలు రమ్య నుంచి ఫోన్‌ ‘ఈ వీక్‌ కుదిరితే ఇంటికి రా! మా అబ్బాయి విపాసన ధ్యానకేంద్రలో చేరాడు. పది రోజుల వరకు ఫ్రీ’ అంది. ‘ఇంకా వాడు డిగ్రీయే చదువుతున్నాడు కదా! అప్పుడే ఈ ధ్యానకేంద్రాల చుట్టూ తిరగడమేంటి?’ అని అడిగితే ‘తన గురించి తను తెలుసుకోవాలని ఉందన్నాడు. మంచిదేగా’ అంది. జీవితపు పరుగు పందాన్ని ఆగి ఆగి కొనసాగించడం ఈ రోజుల్లో అవసరమే అనే అభిప్రాయం మెల్లగా బలపడుతున్నట్లే ఉంది.

పరుగుపందెంలో క్షణం ఆగినా వెనుకబడిపోతాం. ఓడిపోతాం. కానీ, జీవితం పరుగులో కాస్త ఆగి మనల్ని మనం సమీక్షించుకుంటే సక్సెస్‌ సాధిస్తామని నేటి తరం భావిస్తోంది!

– నిర్మలారెడ్డి చిల్కమర్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement