
మీ ఉద్యోగంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుందా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నింపాదిగా కూర్చుని పనిచేసే వారితో పోలిస్తే.. శారీరక శ్రమ ఎక్కువైన ఉద్యోగులు అకాల మరణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ హెచ్చరిస్తోంది. చాలా రకాల వ్యాధులను అడ్డుకోవడంలో వ్యాయామం కీలకమన్నది మనకు తెలిసిన విషయమే. ఉద్యోగంలో చేసే శారీరక శ్రమతో సంబంధం లేకుండా రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలని, తద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి.
అయితే ఉద్యోగంలో భాగంగా ఎక్కువగా శ్రమపడే వారి విషయం లో మాత్రం ఇది వ్యతిరేక ఫలితాలిస్తుందని తాజా అంచనా. 1960 – 2010 మధ్యకాలంలో దాదాపు రెండు లక్షల మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం జరిగిందని.. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న వారు తొందరగా మరణించడానికి 18 శాతం ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఈ అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనం నేపథ్యంలో ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ప్రజలకు తగిన సూచనలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.