వాడిపోతున్నా వీడలేరు | problems of narsamma | Sakshi
Sakshi News home page

వాడిపోతున్నా వీడలేరు

Published Wed, Jun 17 2015 10:43 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

వాడిపోతున్నా వీడలేరు

వాడిపోతున్నా వీడలేరు

ఓ పూలబుట్టను ముందుపెట్టుకొని భగభగా మండుతున్న నేలపై కూర్చొని, ఎండను తట్టుకుంటూ పూలమ్ముకుంటున్న నలభై ఏళ్ల నర్సమ్మను పలకరిస్తే కష్టాన్ని కడుపారా చెప్పుకుంది. నర్సమ్మ అమ్మే పూలు పరిమళాన్ని వెదజల్లుతున్నాయి కానీ నర్సమ్మ జీవితం మాత్రం వాడిన పూలలా నిర్జీవంగా సాగుతోంది.
 
పెద్ద ఆపరేషన్

‘‘మాది రాజమండ్రి. అక్కడున్నప్పుడు పొలాల్లో కలుపు తీయడానికి పోయేదాన్ని. ఎప్పుడైతే పెద్దాపరేషన్ అయిందో అప్పటి నుంచి నేను ఏ  బరువు పనులు చేయలేకపోయాను. మా ఆయనకు కూడా ఏ పని సరిగ్గా దొరక్కపోయేది. అందుకే ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని మూసాపేట్‌కు వచ్చేశాం. అప్పటి నుంచీ ఈ పూల వ్యాపారం చేస్తున్నా. నేను రోజూ ఇటు పూలు అమ్మడానికొస్తే మా ఆయనేమో సిమెంట్ పనికి పోతాడు.
 
లాభమెంతన్నది దేవుడి దయ
గిరాకీ అంటారా? అది ఆ రోజు మా అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఓ రోజు రూ.150 వస్తే ఆ మరుసటి రోజే రూ.50 కూడా వచ్చిన రోజులున్నాయి. నేను విడి చామంతులు, గులాబీలూ అమ్ముతా. అల్లిన మల్లెలు, కనకాంబరాలను జనం బాగా కొంటారు. కానీ నాకు అల్లడం రాక విడి పూలు అమ్ముతున్నా. వర్షాకాలంలో అయితే ఓ రోజుకు ఎన్ని పూలు అమ్ముతామో, అన్ని పూలు వానకు తడిసి పాడయిపోతాయి. పోలీసు సార్లు మమ్మల్ని రోడ్లపై కూర్చోనివ్వరు. గొడుగులూ పెట్టుకోనివ్వరు. మరి షట్టర్లు పెట్టుకునే స్తోమత మాకు ఎక్కడుంది. అందుకే ఇలా రోడ్లపైన కూర్చొని అమ్మక తప్పదు.
 
కుదిరితేనే తింటాం
ప్రతి రోజూ పొద్దున్నే ఏడు గంటలకు పూలు పట్టుకొని ఇంటి నుంచి మెహిదీపట్నానికి వస్తా. తెచ్చిన పూలు పూర్తిగా అమ్ముడుపోయే రోజులు తక్కువే. రాత్రి తొమ్మిది గంటలకు మిగిలిన పూలను తీసుకొని మళ్లీ ఇంటి బాట పట్టాల్సిందే. పండ్లో, కాయలో అయితే దాచి పెట్టేవాళ్లం కానీ పూలు కదా, త్వరగా వాడిపోతాయి. వచ్చేటప్పుడు టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటా కానీ ఒక్కోసారి తినడానికి కుదరక అలాగే తిరిగి పట్టుకెళ్తుంటా.’’
 - నిఖిత
 ఫొటో: నోముల రాజేశ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement