పబ్లిక్ పరీక్షలు.. మెరుగైన మార్కులకు మార్గాలు!! | public exams time | Sakshi
Sakshi News home page

పబ్లిక్ పరీక్షలు.. మెరుగైన మార్కులకు మార్గాలు!!

Published Sun, Feb 22 2015 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

పబ్లిక్ పరీక్షలు..  మెరుగైన మార్కులకు మార్గాలు!!

పబ్లిక్ పరీక్షలు.. మెరుగైన మార్కులకు మార్గాలు!!

పదో తరగతి, ఇంటర్మీడియెట్/+2 కోర్సులు ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన దశ. అలాంటి కీలకమైన పదో తరగతి, ఇంటర్మీడియెట్, +2 పబ్లిక్ పరీక్షల సమయం ఆసన్నమైంది. మరికొద్ది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. అదే విధంగా సీబీఎస్‌ఈ నిర్వహించే టెన్త్, +1, +2 పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. నెలల తరబడి క్లాస్ రూంలో నేర్చుకున్న అంశాల్లో నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటివరకు ప్రిపరేషన్ సాగించడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు పరీక్షల సమయంలో అనుసరించే ప్రిపరేషన్ ప్లాన్ మార్కుల సాధనలో అత్యంత కీలకం. పదో తరగతి, ఇంటర్మీడియెట్, +2 విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు అనుసరించాల్సిన మార్గాలు తెలుసుకుందాం..
 
ప్రస్తుతం.. పునశ్చరణే ప్రధానం
 
పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులందరూ ఇప్పటికే సిలబస్‌ను పూర్తి చేసుకుని ఉంటారు. కాబట్టి ప్రస్తుత సమయంలో రివిజన్ (పునశ్చరణ)కు ప్రాధాన్యమివ్వాలి. పాఠ్యాంశాల్లో కష్టంగా భావించి విస్మరించిన అంశాలపై కొత్తగా దృష్టి పెట్టడం ఆశాజనకం కాదు. ఇప్పటికే పూర్తి స్థాయిలో నేర్చుకున్న అంశాల్లో మరింత పట్టు సాధించేలా ప్రస్తుత సమయాన్ని వినియోగించుకోవాలి. ఆయా అంశాలకు సంబంధించి ముఖ్యాంశాలను షార్ట్ నోట్స్ రూపంలో, తమకు అనుకూలమైన రీతిలో షార్ట్ కట్ మెథడ్‌లో పొందుపర్చుకుంటే రివిజన్ సులువుగా సాగుతుంది.
 
పదో తరగతి- సమకాలీనంపైనా
 
పదో తరగతి విద్యార్థులు ఈ ఏడాది కొత్త తరహా పరీక్షను ఎదుర్కోనున్నారు. సీబీఎస్‌ఈ టెన్త్ కరిక్యులం మాదిరిగానే రాష్ట్ర బోర్డ్‌లలోనూ కరిక్యులం మారింది. విషయ పరిజ్ఞానంతోపాటు సమకాలీన అంశాలపై అవగాహనను ప్రశ్నించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు సోషల్ సబ్జెక్ట్‌ను పరిశీలిస్తే లింగ వివక్షను రూపుమాపడానికి కొన్ని మార్గాలు సూచించండి? ఈ ప్రశ్నకు సంబంధించి ప్రాథమిక అవగాహన కల్పించే విధంగా సిలబస్‌లో సమాచారం ఉంది. కానీ నేరుగా ప్రశ్న-సమాధానం రూపంలో అది లభించదు.
 
భావనల ఆధారంగా సొంత శైలి
 
సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ల్లోనూ సొంత శైలిలో సమాధానం రాసే విధంగా ప్రశ్నలు అడగనున్నారు. ఆ ప్రశ్నలు ఒక భావనను అన్వయించే విధంగా ఉంటాయి. ఉదాహరణకు బయాలజీ నమూనా ప్రశ్నపత్రంలోని ఒక ప్రశ్నను చూద్దాం.. ప్ర: తిలక్ తనకు ఆకలైనప్పటికీ సరైన సమయానికి అన్నం తినలేదు. కొంతసేపటికి అతనికి క్షుద్బాధ తీరి సరైన స్థితికి వచ్చాడు. కారణమేమై ఉంటుంది? అదే విధంగా మ్యాథమెటిక్స్‌లోనూ సమస్య-సాధన ద్వారా పరిష్కారంతోపాటు అన్వయం అనుసంధానం చేసి సమాధానం రాబట్టే విధంగానూ ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణ: 7తో భాగించగలిగే రెండంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఈ తరహా ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు తాము నేర్చుకున్న కాన్సెప్ట్‌లను అన్వయించే సమయస్ఫూర్తి, నైపుణ్యం సొంతం చేసుకోవాలి.
 
పరిశీలన ప్రధానంగా
 
కొత్త సిలబస్‌లోని అన్ని సబ్జెక్ట్‌ల ప్రశ్నలు విద్యార్థుల్లోని పరిశీలన సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ఉదాహరణకు టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్‌ల రూపంలో కొంత సమాచారం లేదా డేటా ఇచ్చి దాని ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా పటాల ప్రశ్నలను కొత్త తరహాలో అడిగే అవకాశముంది. బొమ్మ ఇచ్చి అందులో ముఖ్య భాగాలు, వాటి ప్రాధాన్యతను వివరించమని అడగొచ్చు. కాబట్టి పరిశీలనాత్మక అధ్యయనం ఎంతో అవసరం.
 
విశ్లేషణ నైపుణ్యం ఆధారంగా
 
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల్లో విశ్లేషణ నైపుణ్యాన్ని పరీక్షించే విధంగానూ ప్రశ్నలు ఎదురయ్యే ఆస్కారముంది.
 ఉదాహరణ: ఆధునిక యుద్ధాలకు పారిశ్రామికీకరణ ఏ విధంగా కారణమైంది? అనే ప్రశ్న. ఇది విశ్లేషణాత్మక సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్న. ఇందుకోసం పాఠ్యపుస్తకంలోని యూనిట్‌లో ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించాలి. దాంతోపాటు దినపత్రికల్లో వ్యాసాలు, వార్తలు చదివి ముఖ్యాంశాలు గుర్తుంచుకోవాలి. పదో తరగతి పరీక్షల్లో ఈసారి బిట్ పేపర్‌లో అడిగే ప్రశ్నల తీరు కూడా భిన్నంగా ఉండొచ్చు. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలకే పరిమితం కాకుండా అసెర్షన్ అండ్ రీజన్ తరహా ప్రశ్నలు ఇచ్చే అవకాశముంది. విద్యార్థిలోని తులనాత్మక, పరిశీలనాత్మక నైపుణ్యాలను పరీక్షించడమే ప్రధాన లక్ష్యంగా భావించడమే అందుకు కారణం.
 
సక్సెస్ టిప్స్
 
విషయ పరిజ్ఞానంతోపాటు, సమకాలీన అవగాహన, భావ వ్యక్తీకరణలకు ప్రాధాన్యం పెరిగిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రస్తుత సమయంలో విద్యార్థులకు అనుకూలించే చిట్కాలు..

ప్రతి అంశంలోని మూల భావనలను, ముఖ్యాంశాలను నోట్స్ రూపంలో పొందుపరచుకోవాలి.

వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే అవకాశమున్న అంశాలను గుర్తించి, వాటికి సంబంధించి సమకాలీన పరిణామాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి.

సైన్స్, మ్యాథమెటిక్స్‌లలో ఒక భావన లేదా సూత్రం ఆధారంగా ఉండే ప్రశ్నలకు పలు ప్రత్యామ్నాయ సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి.

లాంగ్వేజెస్‌లో గ్రామర్‌తోపాటు భావ వ్యక్తీకరణ పొందేలా ప్రాక్టీస్ చేయాలి. మార్కులకు దోహదం చేసే చక్కటి చేతిరాతపైనా దృష్టి పెట్టాలి.

ప్రతి సబ్జెక్ట్‌లోనూ కనీసం రెండు మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ఈ ప్రక్రియను మార్చి 15లోపు ముగించడం మేలు.
 
 సీబీఎస్‌ఈకి ప్రత్యేకంగా
 
సీబీఎస్‌ఈ పరీక్షల్లో గత రెండు మూడేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్‌లలో ఇల్లస్ట్రేషన్ ఆధారిత ప్రశ్నల ప్రాధాన్యం పెరుగుతోంది. దీన్ని గుర్తించి సొంత భావ వ్యక్తీకరణ నైపుణ్యం సాధించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.

పాఠ్యాంశాల్లోని అన్ని విభాగాలు, ఉప-విభాగాలకు సమ ప్రాధాన్యం ఉంటోంది. కాబట్టి పుస్తకంలోని అన్ని అంశాలపై పట్టు సాధించాలి.

లాంగ్ ఆన్సర్ ప్రశ్నల సంఖ్య కొంత పెరుగుతోంది. కాబట్టి ముఖ్యమైన పాయింట్లతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి.
 
ఈసారి సీబీఎస్‌ఈ అందుబాటులోకి తెచ్చిన ప్రీ-ఎగ్జామినేషన్ ఆన్‌లైన్ ట్యూషన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. తద్వారా ఆయా సబ్జెక్ట్‌ల నిపుణులు, ప్రిన్సిపాల్స్ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
 
 టైం మేనేజ్‌మెంట్

 
ప్రిపరేషన్‌లో టైం మేనేజ్‌మెంట్ పాటించేలా చూసుకోవాలి.  
 
ముందుగా అందుబాటులో ఉన్న రోజుల్ని, ప్రతిరోజు తాము గరిష్టంగా చదవగలిగే సమయం ఆధారంగా అన్ని సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా టైం టేబుల్ రూపొందించుకోవాలి.

ఒక రోజు ఒకే సబ్జెక్ట్‌కు పరిమితమైతే బోర్ కొట్టే ఆస్కారముంది. కాబట్టి ప్రతి రోజు తప్పనిసరిగా కనీసం మూడు సబ్జెక్ట్‌లు చదివే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

మ్యాథమెటిక్స్‌కు ప్రతి రోజు ప్రత్యేక సమయం కేటాయించడం తప్పనిసరి.

పరీక్షలు ప్రారంభయ్యే తేదీకి వారం రోజుల ముందునాటికే రివిజన్ పూర్తి చేసుకునేలా ప్రిపరేషన్ సాగించాలి.
 
ఇంటర్మీడియెట్, +2 సాగాలిలా
 
ఇంటర్మీడియెట్, +2 విషయానికొస్తే.. మారిన సిలబస్, అడుగుతున్న ప్రశ్నల శైలిని గమనిస్తే అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రశ్నలకు ప్రాధాన్యం పెరుగుతోంది.

ప్రతి సబ్జెక్ట్‌లో ముఖ్య ఫార్ములాలను గుర్తించి వాటి అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు/సమస్యలను సాధన చేయాలి.

ఎంసెట్, జేఈఈ, ఇతర పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కు విరామమివ్వాలి.

ప్రాక్టీస్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు ప్రాధాన్యమివ్వాలి.

గ్రూప్ సబ్జెక్ట్‌ల్లో బలహీనంగా ఉన్న వాటి విషయంలో ప్రత్యేక సమయం కేటాయించాలి.

మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల సబ్జెక్టులకు ప్రాక్టీస్ తప్పనిసరి. కేవలం రీడింగ్ ఆధారిత ప్రిపరేషన్ సరికాదు.

ఇంటర్మీడియెట్, +2 విద్యార్థులు కనీసం రెండు ప్రీ-ఫైనల్ టెస్ట్‌లు, రెండు మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి.
 
పరీక్ష హాల్లో చూపిన ప్రతిభే కీలకం
 
క్లాస్ రూం, సెల్ఫ్ లెర్నింగ్ పరంగా ఎంత కృషి చేసినా.. పరీక్ష హాల్లో అనుసరించే తీరే ఫలితాల్లో కీలకం.

పరీక్షకు లభించే మొత్తం సమయంలో మొదటి పది నిమిషాలు కచ్చితంగా ప్రశ్నపత్రం ఆసాంతం చదవడానికి కేటాయించాలి.
 
ముందుగా సులభంగా ఉన్న ప్రశ్నలను, తర్వాత ఓ మోస్తరు ప్రశ్నలను, చివరగా మాత్రమే కష్టంగా ఉన్న ప్రశ్నలవైపు దృష్టి పెట్టాలి.

మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వంటి ప్రాబ్లమ్ బేస్డ్ పరీక్షల్లో.. ముందుగానే ప్రశ్న పత్రం పరిశీలన ఆధారంగా ప్రశ్నలకు లభించే సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ సాగాలి.

 
సమస్యను సాధించే క్రమంలో లభించే సగటు టైమ్ కంటే ఎక్కువ సమయం పడుతోందనిపిస్తే వెంటనే మరో ప్రశ్న వైపు దృష్టి పెట్టాలి.

థియరీ సబ్జెక్ట్‌లు (పదో తరగతిలో సోషల్ స్టడీస్, లాంగ్వేజెస్; ఇంటర్మీడియెట్‌లో హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ తదితర) విషయంలోనూ బ్యాలెన్స్‌డ్ అప్రోచ్ అనుసరించాలి. లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్‌కు వాటికి కేటాయించిన మార్కులకు అనుగుణంగా సమాధాన నిడివిని నిర్ణయించుకోవాలి.

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో ఈసారి కొత్త విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో ముందుగా 15 నిమిషాలు ప్రశ్నపత్రం అవగాహనకు కేటాయించారు. తద్వారా తమకు బాగా వచ్చిన అంశాలను ముందుగానే గుర్తించే అవకాశం లభిస్తుంది.
 
నిపుణులేమంటున్నారు..!
 
గ్రేడ్‌లు, వెయిటేజ్‌ల గురించి మర్చిపోవాలి

 
 వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఫలితాలు, లభించే గ్రేడ్‌లు, వెయిటేజ్‌ల ఆలోచనను మైండ్‌లోంచి తొలగించాలి. పరీక్షల ఒత్తిడిని అధిగమించే క్రమంలో మొదటి సాధనం ఇది. ఎగ్జామ్ టెన్షన్ పోవడానికి ప్రతిరోజూ ప్రత్యేకంగా వ్యవహరించాలి. ముందుగా తమకు ఇష్టమైన సబ్జెక్ట్‌లతో ప్రిపరేషన్ మొదలుపెట్టి తర్వాత వేరే సబ్జెక్ట్స్‌కు మళ్లాలి. తద్వారా ప్రిపరేషన్ సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని జయించొచ్చు.
 - సీతామూర్తి, ప్రిన్సిపాల్, సిల్వర్ ఓక్స్ స్కూల్
 
గ్రూప్ సబ్జెక్టులపై గురి

 
ఇంటర్మీడియెట్ విద్యార్థులు ప్రస్తుత సమయంలో గ్రూప్ సబ్జెక్ట్స్‌పై పట్టు సాధించేలా కృషి చేయాలి. తద్వారా పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపొచ్చు. ఆ దిశగానే విద్యార్థి ప్రిపరేషన్ ప్రణాళిక ఉండాలి. ప్రతి విద్యార్థి తనకు అనుకూలమైన రీతిలో షార్ట్‌కట్ మెథడ్స్‌తో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్ సమయంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.      - పి.వి.ఆర్.కె.మూర్తి, శ్రీ గాయత్రి అకాడమీ
 
సొంత శైలి అవసరం

 
 పదో తరగతిలో మారిన సిలబస్ ప్రకారం సొంత శైలికి ప్రాధాన్యం పెరిగింది. కాబట్టి అకాడమీ పుస్తకానికో, మరే ఇతర మెటీరియల్‌కో పరిమితమవడం సరికాదు. సొంత ఆలోచన, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. అదే విధంగా సమయస్ఫూర్తి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగిన అన్ని కోణాలపై అవగాహన పెంచుకోవాలి.- పి.నీలకంఠం, బయాలజీ టెక్ట్స్‌బుక్ రచయిత
 
సోషల్.. సమకాలీన నైపుణ్యం
 
పదో తరగతి సోషల్ స్టడీస్ పేపర్‌లో మంచి మార్కులకు సమకాలీన అంశాలపై అవగాహన తప్పనిసరిగా మారింది. స్వీయ భావ వ్యక్తీకరణ, విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడిగే అవకాశముంది. ఇది విద్యార్థులకు మేలు చేసే అంశమే. ముఖ్యంగా లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్‌లో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు, డేటా ఆధారిత ప్రశ్నలు. పాఠ్యాంశం నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానం తెలియకపోతే.. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు, డేటా ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.
     - సురేశ్‌కుమార్, పదో తరగతి సోషల్ టెక్ట్స్‌బుక్ రచయిత
 
మ్యాథమెటిక్స్ మేడ్ ఈజీ

 
కొత్త సిలబస్‌లో మ్యాథమెటిక్స్‌కు సంబంధించి దాదాపు 50 శాతం ప్రశ్నలు భావనల ఆధారిత దత్తాంశాల రూపంలో ఉండటం బాగా అనుకూలించే అంశమే! ఆయా భావనలపై పట్టు సాధిస్తే సులువుగా మంచి మార్కులు సాధించొచ్చు. గతంలో మాదిరిగా డెరైక్ట్ కొశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉండవు. ఇప్పటివరకు చదివిన అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ మ్యాపింగ్ వంటి టెక్నిక్స్ ద్వారా పునశ్చరణ చేయాలి.  
 - ఎ.రాజేంద్రప్రసాద్, జడ్‌పీహెచ్‌ఎస్, చౌటుప్పల్
 
ప్రాక్టీస్, కంపేరిటివ్  అప్రోచ్‌కు ప్రాధాన్యం
 

సీబీఎస్‌ఈ విద్యార్థులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. కంపేరిటివ్ అప్రోచ్‌తో ముందుకు సాగాలి. +2 స్థాయిలో ఎలక్టివ్స్‌తోపాటు లాంగ్వేజెస్‌కు కూడా ప్రిపరేషన్‌లో సముచిత సమయం కేటాయించాలి.
     - ఆదిలక్ష్మి, ప్రిన్సిపాల్,
 ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement