కునుకుతీస్తె మెదడులోన చురుకు పుడతది...
పరిపరి శోధన
‘కునుకుతీస్తె మనసు కాస్త కుదుట పడతది’ అని మనసుకవి ఏనాడో చెప్పాడు. మనసు కుదుటపడటమే కాదు, కాస్తంత కునుకు వల్ల మెదడుకు చాలానే ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆధునిక పరిశోధకులు. మంచి నిద్ర వల్ల మెదడు ఆరోగ్యకరంగా ఉంటుందని, అలసి సొలసిన వేళల్లో కాస్తంత కునుకు తీశాక మరింత చురుకుగా పనిచేస్తుందని చెబుతున్నారు.
మధ్యాహ్నం వేళ మూడుగంటల కునుకు తీసిన తర్వాత జ్ఞాపకశక్తి ఇరవై శాతం మేరకు మెరుగుపడుతుందని కాలిఫోర్నియా వర్సిటీ సైకాలజీ విభాగం శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది. మధ్యాహ్నం కునుకు తీయని వారి కంటే, మూడు గంటలు కునుకు తీసిన వారు జ్ఞాపకశక్తి పరీక్షలో ఇరవై శాతం మేరకు అదనపు మార్కులు సాధించగలిగారని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మాథ్యూ వాకర్ వెల్లడించారు.