కల్లు తాగిన ఈత చెట్టు | Punakamu as Culture Barn syndromes | Sakshi
Sakshi News home page

కల్లు తాగిన ఈత చెట్టు

Published Mon, May 2 2016 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

కొండ ముంజులూరు గ్రామంలోని ఈత చెట్టు అసలు చిత్రం

కొండ ముంజులూరు గ్రామంలోని ఈత చెట్టు అసలు చిత్రం

చేతబడి
చెట్టు కల్లు తాగడమేంటి వింతగా మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం వాలిపోయి రాత్రి పూట నిలబడుతుందంటే... తాగినట్టే కదా? ఈత కల్లు తాగితే మనుషులు వాలతారు కానీ చెట్టు వాలడమేంటి? అయితే ఏదో పూనే ఉంటుందిలే! గత ఏడాది వెంకమ్మ నిప్పార్పుకోవడానికి బావిలో దూకి చచ్చిపోయింది. ఆమే పూనిందంటావా? అయితే ఏం చేయాలి? శాంతి చేయాలి... కొద్దిగా ఖర్చవుద్ది. ఇదండీ వరస... మూఢనమ్మకాలతో మనుషులు కూడా కల్లు తాగిన కోతుల్లా మాట్లాడుకుంటున్నారు.
 
‘ఎవరమ్మా నువ్వు?’
జుట్టు విరబోసుకుని తలను, కళ్లను వలయాకారంగా తిప్పుతూ ఊగిపోతున్న వెంకమ్మను అడిగింది సుశీలమ్మ. ‘ఎవరని అడగొద్దు... చెప్పేది వినండి’ ఊగిపోతూనే బదులిస్తోంది వెంకమ్మ. బదులివ్వడం అనేకంటే ఆదేశిస్తోందనడమే కరెక్ట్. ‘అలాగే వింటాం’ అంటూ చుట్టూ ఉన్న వాళ్లంతా తలలూపి వెంకమ్మ ఏం చెప్తుందోనని ఆసక్తిగా చెవులు రిక్కించారు. ‘పోలేరమ్మ చీర కాలింది, అమ్మ ఒంటికి సెగ తగిలింది. ఒళ్లు మంటలు తగ్గడానికి బావిలో దిగింది పోలేరమ్మ.

బావిలో నుంచి వచ్చి సేద దీరడానికి ఈ చెట్టు మీద వాలింది. ఊరిని సల్లంగ సూడమని బ్రహ్మంగారిని మొక్కుతోంది. అదుగో చెట్టు తల అటుగా వాలింది. ఆ ఎదురుగా అత్తిచెట్టు తొర్రలో బ్రహ్మంగారి పావుకోళ్లున్నాయి’ అంటూ మాట పూర్తయేలోపు కూలబడి స్పృహ తప్పి పోయింది వెంకమ్మ. ఆమె మీద నీళ్లు చల్లి సాంత్వన చేకూర్చడానికి ముందుకొచ్చారు ఇద్దరు మహిళలు.
 
‘నిజమే పోయిన్నెలలో గుళ్లో వెలుగుతున్న దీపానికి అమ్మవారి చీర కొంగు తగిలి నిప్పంటుకుంది. అప్పుడే అనుకున్నాం ఏదో అనర్ధానికేనని’ సుబ్బమ్మ చెవిలో గుసగుసలాడుతోంది కనకమ్మ. ‘చెట్టు వంగుతోందని ముందు ఎవరు చూశారో’ సందేహాన్ని ఆశ్చర్యంతో మేళవించింది సుబ్బమ్మ. ‘ఇది సుబ్బారావు పొలం కదా, రోజూ మోటార్‌సైకిల్ ఈ చెట్టు కిందనే ఆపుతాడు. నెలా పదిహేను రోజుల వెనక ఓ రోజు బండి తీయబోయే సరికి సీటు మీద ఈతమట్టలు వాలి ఉన్నాయిట’.
   
కొండ ముంజులూరు గ్రామం మీదుగా ఓ ట్రాక్టర్ వెళ్తోంది. దాని నిండుగా మహిళలున్నారు. కూలి పనులకు పొరుగూరికి వెళ్తున్నారంతా. ఊరి బయటి ఈత చెట్టు మీదుగా వెళుతుండగా హఠాత్తుగా నదియా బేగం లేచి ఊగిపోసాగింది. అందరిలో ఒకటే ఆందోళన. అంత ఆందోళనలోనూ అంతకు మించిన ఆసక్తి. ‘అమ్మోరు పూనింది. ఏం చెబుతుందో’ అని ఆత్రంగా చూస్తున్నారు. అరకిలోమీటరు వెళ్లగానే మనసు మార్చుకున్నారంతా. ట్రాక్టర్ వెనక్కు తిరిగి బొప్పూడి దారి పట్టింది.

ముంజులూరు దాటుతుండగా మరొక మహిళకు పూనకం వచ్చింది. ‘‘అమ్మాయికి పూనకం వస్తే పోలేరమ్మకు పొంగలి పెట్టించకుండా తీసుకెళ్తారా’’ అంటూ రంకెలు వేసింది. అంతే... ట్రాక్టర్ ఈత చెట్టు ముందు ఆగింది. నిమిషాల్లో పొంగలి దినుసులు సమకూరాయి. నదియా ఈతచెట్టుకు దగ్గరలోనే ఉన్న పోలేరమ్మకు, ఈతచెట్టుకు పొంగలి పెట్టింది. అంతా భక్తిగా పోలేరమ్మను తలుచుకుంటూ చెట్టుకు మొక్కారు. ఊరిని చల్లంగా చూడమని వేడుకున్నారు.
   
నెలరోజులు గడిచాయి. వంగుతున్న ఈతచెట్టుకు భక్తుల రద్దీ ఎక్కువైంది. వందల వాహనాలు బారులు దీరుతున్నాయి. కొబ్బరిచిప్పల రాసి పెరిగింది. మొక్కుల సందడి పెరిగింది. హుండీలో డబ్బులు గలగలమంటున్నాయి. ఈ ప్రదేశం మహిమాన్వితం అవబోతోందని ఇప్పటికే విశ్వాసం మొదలైంది. ఎండాకాలం కావడంతో భక్తుల సౌకర్యార్థం మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ స్వచ్ఛందంగా జరుగుతోంది. చిట్కా వైద్యాలతో కాలం గడిపే మాయలోళ్లు జరిగేదంతా చూస్తున్నారు. ‘శాంతి చేయించుకుంటే మంచిది’ అనే సర్వసాధారణ ప్రచారమూ మొదలైంది.

శాంతి ఎవరు చేయించాలి - శాంతి చేయించకపోతే అశాంతి ఎవరికి, ఏ పూజ చేస్తే అమ్మవారు శాంతిస్తుంది- ఆ పూజ ఎలా చేయించాలి... వంటి సందేహాలకు ఆస్కారం కలిగించేశారు లౌక్యంగా. వాటికి సమాధానం రూపంలో ఒక వ్యవస్థీకృతమైన చట్రం తయారవసాగింది. కానీ ‘చెట్టు వంగడం కంటే దృష్టాంతం మరింకేం కావాలి’ అని భక్తిగా మొక్కేవారికి కొదవలేదు.
 
విశ్వాసం ముసుగులో మోసాలకు బీజం వేయడానికి మొలక కట్టడం షురూ అయినట్లే ఉంది. మోసాల వలలో పడొద్దని చెవినిల్లు కట్టుకుని పోరే వాళ్ల మాట పెడచెవిన పెట్టడమే జరిగిందిప్పటి వరకు. మన పూర్వికులు ‘చెట్టు కొట్టి గోడ కట్టరాదు’ అంటూ చెట్టును రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను చెప్పారు. గుడికంటే ముందు ఆ చెట్టును రక్షించుకోవాలి. చెట్టును బతికించుకోవడానికి కొబ్బరి నీళ్లు కాదు, బావి నీళ్లు పోయాలి.
 
అదంతా రేగడి మట్టి వల్లనే...
ఇది ఫిజియోలాజికల్ ప్రాసెస్. సాధారణంగా ఏ చెట్టుకైనా ముఖ్యంగా ఎండాకాలంలో పగలు ఆకులు వాలిపోతాయి, రాత్రికి పుంజుకుంటాయి. భూగర్భంలో నీటి నిల్వలు, వాతావరణంలో తేమ వంటి అంశాలన్నీ ఇందులో ముడివడి ఉంటాయి. నేల విషయంలో... ఇసుక నేల అయితే తేమను త్వరగా విడుదల చేస్తుంది. రేగడి మట్టి తేమను నెమ్మదిగా, కొద్ది కొద్దిగా విడుదల చేస్తుంది. ఎండాకాలంలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఆ పైన, రాత్రి ఉష్ణోగ్రత 25-26 డిగ్రీలు ఉంటోంది. దాదాపు పదిహేను డిగ్రీల తేడా ఉంటోంది. అంత వేడి కారణంగా పగలు మట్టి పొడిబారి వదులు కావడంతో వేళ్ల మీద ఒత్తిడి పెరిగి చెట్టు ఒరిగిపోతోంది. రాత్రికి తేమను పీల్చుకుంటూ తిరిగి యథాస్థితికి చేరుతోంది.
 
నీళ్లు పోస్తే నిలబడుతుంది!
ప్రకాశం జిల్లా, జె.పంగులూరు మండలం, కొండ ముంజులూరులో పగలు వంగుతున్న ఈతచెట్టును చూశాను. అది బావి ఒడ్డున మొలిచింది. నిటారుగా 90 డిగ్రీల కోణంలో పైకి పెరగలేదు. ఏటవాలుగా 45 డిగ్రీల కోణంలో పెరిగింది. పగలు 18 డిగ్రీల కోణంలో వంగుతోంది. అలా వంగినప్పుడు మట్టలు నేలను తాకుతున్నాయి. అయితే ఇలా చెట్టు వంగడం కొత్తేమీ కాదు. ఖమ్మం జిల్లా చంద్రగొండ మండలం, గుంపెన గ్రామంలో 2002లో ఇలాగే జరిగింది. అక్కడ వేపచెట్టు పగలు నేలకు వంగుతూ రాత్రికి లేచి నిలబడేది. ఈతచెట్టుకి చేస్తున్నట్లు... అక్కడా వేపచెట్టుకు పూజలు చేశారు.

గుడి కట్టాలని మూడు లక్షల డబ్బు కూడా జమచేశారు. నిజానికి చెట్టు అలా వంగడానికి ఎండలు, నీటి కొరతే కారణం. అలాగే కొనసాగితే ఆరు నెలల్లో చెట్టు చనిపోతుందని అప్పుడు ఖమ్మంలో  చెప్పాం. అన్నట్లే జరిగింది కూడా. గడచిన రెండేళ్లుగా ప్రకాశం జిల్లాలో సరైన వర్షాల్లేవు. బోర్లు కూడా ఎండిపోయాయి. ఈ ఏడాది కూడా వర్షాలు పడకపోతే ఈ ఈత చెట్టు మనుగడ కష్టమే. అయితే ఈ లోపు పాదు చేసి నీరు పోస్తుంటే చెట్టు వంగదు. నిటారుగా నిలబడి, బతుకుతుంది.
- డాక్టర్ కె. రఘుచంద్,జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు
 
పూనకమూ రోగమే!
పూనకాలు ‘కల్చర్ బార్న్ సిండ్రోమ్స్’ అనే మానసిక రుగ్మతలలో ఒక రకం. పూనకం వచ్చిన వారిని దేవతగా ప్రత్యేక సపర్యలు, గౌరవాలు అందుతుండడంతో సబ్‌కాన్షియస్‌గానే పూనకాన్ని నేర్చుకుంటారు. సాధారణంగా ఇది ఒకరి నుంచి మరొకరికి వస్తుంటుంది. మన దేశంలోనే కాదు... చాలా దేశాలలో అక్కడి సాంస్కృతిక నేపథ్యాన్ని బట్టి ఈ కల్చర్ బార్న్ సిండ్రోమ్ చాలా రకాలుగా వ్యక్తమవుతుంటుంది. దీనివల్ల లబ్ధి చేకూరనప్పుడు పూనకాలు వాటంతవే తగ్గుతాయి. అవిద్య, పేదరికం, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్న సమూహాలలో పూనకాలు వస్తుంటాయి. తమ ప్రయోజనాలను సాధించుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తే పూనకాలు తగ్గిపోతాయి.
- డాక్టర్ ఎస్‌ఆర్‌ఆర్‌వై శ్రీనివాస్,సైకియాట్రిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement