దేవునికి సమర్పించేది నైవేద్యం, కాని దాన్ని తినేది మాత్రం మనిషే. మనుషుల ఆహార అలవాట్లే దేవునికి ఆపాదించబడ్డాయన్నది వాస్తవం. ఆచారాల్లో నిమగ్నం చేయడం వల్ల మనుషులను మంచి కర్మల వైపు మల్లించవచ్చునన్న భావనతో వేదకాలంలో వచ్చిన యజ్ఞయాగాదులు,పశుబలి,సూరాపానం పూర్వ మీమాంస ( prior study ) పద్దతి. దీని కర్త వేద వ్యాసుని శిష్యుడైన జైమిని అంటారు.
ఆనాటి సమాజంపైనున్నబౌద్ధమత ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్వ మీమాంస కూడదని హైందవ పూజా విధానాన్ని 'ఉత్తరమీమాంస' ( posterior study) వైపు అనగా శాఖాహర క్రతువు వైపు, గోవధ నుండి గోసంరక్షణ వైపు మల్లించినవాడు శంకరాచార్యుడు.
ఈ దెబ్బతో దైవపూజ యజ్ఞయాగాల్లో జరిగే పశుబలితో పాటు సూరాపానం /కల్లు వంటి మద్యపానాలను కూడా పక్కకు పెట్టినట్లయింది.అయితే గ్రామ దేవతల ఆరాధనలో కల్లు వినియోగం 'కల్లుసాక'గా ఇప్పటికీ విరివిగా జరుగుతున్నదే.
ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం కల్లుగీత చెట్ల నుండి తీయబడుతున్న ప్రకృతి సహజమైన పానీయం 'నీరా' వాడకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో ప్రారంభించిన ఔట్లెట్లో దాని పేరు 'వేదామృతం 'గా పెట్టడం వివాదాస్పదం అయింది.
► నీర ఎంత మధురమైనదైనా అది మద్య సంబంధమైందే, దానికి 'వేద' పదాన్ని జోడించడం అపచారం అంటూ వాదిస్తున్నారు కొన్ని బ్రాహ్మణ సంఘాలవారు.
► అమృతం రుచి ఎలా ఉంటుందో దేవతలకే తెలుసు, మనుషులకు తెలిసింది మహా రుచికరమైంది, పైగా బోలెడన్ని ఔషద గుణాలున్నది నీరా కావాలంటే కాస్త తాగి చూడండి అంటున్నారు గౌడ సంఘాలవారు.
ఈ గొడవలన్నీ దేనికి నీరా చెట్లు గీయడం ద్వారానే కదా లభిస్తున్నది దానికి 'గీతామృతం 'అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది కదా!అని నాబోటి వారు సలహా ఇస్తే అందులో కూడా మతాన్ని చూసే మహానుభావులున్నారు అంటూ వారు 'వేద' వాక్కునే వల్లిస్తున్నారు. అయ్యా! ఏ పెరైనా పెట్టుకొండి మాకు కావాల్సింది నీరా,మీరు స్వచ్ఛమైన నీరా అందిస్తే అదే మహాభాగ్యం!అంటున్నారు భాగ్యనగరవాసులు.
-వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ నుంచి
Comments
Please login to add a commentAdd a comment