తనను మోసం చేసి వెళ్లిపోయిన ప్రేయసిని గుర్తుచేసుకుంటూ ఓ భగ్న ప్రేమికుడు పాడుకునే పాట ఇది. ఎంతో లోతైన భావాన్ని అతి సరళమైన పదాలతో అల్లి... ఆ ప్రేమికుడి మనోభావాన్ని వ్యక్తపరచడంలో ఆరుద్రగారు తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు.
గతం గతంలా ఉన్నప్పుడు... గడిచిపోయింది కదా అని మరచిపోవచ్చు. కాని అదే గతం నడుచుకుంటూ కళ్ళ ముందుకు వచ్చి జ్ఞాపకాలు అనే శూలాలతో గుండెల్లో పొడుస్తూంటే... ఆ ప్రేమికుడు పడే నరకయాతన ఎలా ఉంటుందో, పదాలతో కూర్చి, వాక్యాలుగా అమర్చి ఓ పాటలా మార్చినట్టుగా ఈ రచన మనకు అనిపిస్తుంది.
చేయి జారిన మణిపూస చెలియ నీవు/ తిరిగి కంటికి కనబడతావు గాని చూపు చూపున తొలినాటి శోకవన్నె రేపుచున్నావు... ఎంతటి శాపమే... అనే వాక్యాలలో తనను కోరుకున్న హృదయం ఎంత విలవిలలాడుతుంద న్నది సాకీలో తన కలం ద్వారా ఆ బాధ స్వరాన్ని వినిపించారు కవి.
‘చూపు చూపున తొలినాటి శోకవన్నె రేపుచున్నావు’ అనే పద ప్రయోగమే ఆ బాధకు సాక్ష్యం. ఇక్కడ చేజారిన ప్రేయసిని మణిపూసతో పోల్చి ఆరుద్ర తన సాహిత్య బలాన్ని నిరూపించుకున్నారు.
మరుమల్లియకన్నా తెల్లనిది/ మకరందం కన్నా తియ్యనిది/ మన ప్రణయం అనుకొని మురిసితిని/ అది విషమని చివరకు తెలిసినది... అనే పల్లవిలో మల్లెపువ్వు కన్నా తెల్లనైనదనుకున్న తన ప్రేమ, మకరందం కన్న తీయనైనదనుకున్న తన ప్రేమ, హలాహలం కన్నా చేదైనది అని తెలుసుకుని ఆ ప్రేమికుడు పడే వేదనేంటో ఈ పాట పల్లవిలో మనకు కనిపిస్తుంది. ప్రేమనేది తొలిచూపులో పుట్టినప్పటికీ అది ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా అందులోని మాధుర్యాన్ని ప్రేమికులకు పంచుతూ ఉత్తేజపరుస్తుంది. అలాగే అది వికటించినప్పుడు కూడా ఒక్కసారిగా కాకుండా విషంలా నెమ్మదిగా నరనరాల్లో ప్రవహించి క్షణక్షణం, ఆ హృదయాన్ని క్షీణింపజేసి మృత్యుతీరానికి తరలిస్తుంది. అందుకే ‘మన ప్రేమ విషమని చివరకు తెలిసినది’ అనే పదప్రయోగాన్ని కవి ఉపయోగించారు.
ఒకసారి జతపడ్డ హృదయం ఎదుటివారు ఎంత వంచించినా, మోసం చేసినా సరే తనలోని ప్రేమని చంపుకోలేదు. ఇన్నాళ్ళ తమ సాంగత్యాన్ని ఓ తీయని జ్ఞాపకంగానో లేదా ఓ చేదు అనుభవంగానో గుర్తుచేసుకుంటూనే ఉంటుంది. అది ‘విడనాడుట నీకు సులభం/ నిను విడవదులే నా హృదయం’ అని కవి మొదటి చరణంలో రాసిన వాక్యంలో స్పష్టమౌతోంది. సిరిసంపదల మీద మోజుతో ప్రేయసి తనను మరిచిపోయి వెళ్ళిపోయినా...
తన హృదయం మాత్రం... ఆమెను ఎప్పటికీ మరచిపోదు అని ప్రియుడి భావాన్ని ఆరుద్ర ఈ చరణంలో వ్యక్తపరిచారు.
ఎంతో ఇష్టంగా అర్పించిన తన హృదయానికి బదులుగా ఆ ప్రేయసి కన్నీటిని బహుమానంగా ఇస్తే ఆ ప్రియుడు పడే వేదన అనంతం. అతని విరహపు హృదయానికి ఓదార్పు దొరకకపోయినా... నిట్టూర్పు మాత్రం మిగులుతుందని కవి ఈ చరణంలోనే వ్యక్తపరిచారు.
మనిషికి మరణం ఉంటుంది కాబట్టి ఒక్కసారి తను మరణిస్తే అక్కడితో అతను అంతమైపోతాడు. కానీ మనసుకు మరణం ఉండదు. అందుకే అది తనువుని వీడినా, తనలోని ప్రేమను వీడదు. ఆ ప్రేమ ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. బహుశా ఈ తాత్పర్యాన్ని వివరించడానికే చెలి చేసిన గాయం మానదులే/ చెలరేగే జ్వాల ఆరదులే అనే వాక్యాన్ని ఆరుద్ర ఉపయోగించి ఉంటారని నా అభిప్రాయం.
ఎన్నో కోట్ల ప్రేమ హృదయాలకు ఈ రచన ఓ కానుక... మరెన్నో కోట్ల కవి హృదయాలకు ఈ రచన ఓ స్ఫూర్తి.
- సంభాషణ: నాగేశ్
భాషాశ్రీ స్వస్థలం విజయవాడ. చిన్నప్పటి నుండి సినిమా పాటలు వింటూ పెరిగారు. నీతోడుకావాలి (2002) చిత్రంలో అన్ని పాటలను రాసి తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. మీసాల గోపాల రారా రారా, నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్లను నమ్మొద్దు, ఇంతకూ నువ్వేవరూ, ప్యార్ మే పడిపోయా మై... వంటి హిట్ పాటలను రాసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.