
మనకంటే పెద్దగా అలవాటు లేదుగానీ.. టైమైపోయినా.. ఆఫీసుల్లోనే ఉండిపోవడం, పనిచేయడం జపాన్‌లో చాలా ఎక్కువ. ఇటీవల జరిపిన ఒక సర్వే ప్రకారం.. చాలామంది ఉద్యోగులు నెలకు 80 గంటల దాకా ఎక్స్‌ట్రా వర్క్ చేస్తున్నారట. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఇక లాభం లేదనుకున్నాయి ... బిల్డింగ్స్ కట్టే తైసీ, డ్రోన్లు తయారు చేసే బ్లూ ఇన్నొవేషన్స్ కంపెనీలు. కొంచెం వినూత్నంగా ఆలోచించి.. ఉద్యోగులు రాత్రి పొద్దుపోయే వరకూ ఆఫీసుల్లోనే ఉండిపోకుండా డ్రోన్లను వాడటం మొదలుపెట్టాయి. ఒక్కో ఉద్యోగి ఆఫీసుకు ఏ సమయంలో వస్తాడన్నది ఎలాగూ తెలుసు కాబట్టి, నిర్దిష్ట సమయం పూర్తి అయిన వెంటనే... ఈ డ్రోన్లు ఆ ఉద్యోగి డెస్క్ దగ్గరకు చేరుకుంటాయి.
జోరుజోరుగా సంగీతం వినిపించడం మొదలుపెడతాయి. ఎంచక్కా మ్యూజిక్‌ను ఎంజాయ్ చేద్దామనుకుంటే కుదరదు. మీరు ఆఫీసు వదిలిపెట్టే వరకూ రొదపెడుతూనే ఉంటాయి. ఎవరైనా ఆగంతకులు గానీ, కంపెనీ ఉద్యోగులుగానీ... రాత్రివేళ రహస్యంగా లోపలికి జొరబడినా ఈ డ్రోన్లు వారిని గుర్తించి, వీడియోలను నిక్షిప్తం చేసుకుంటాయి. లేదంటే దగ్గరలో ఉన్న క్లౌడ్ సర్వర్‌కు పంపేస్తాయి. దీని ద్వారా సెక్యూరిటీ సిబ్బంది శ్రమ కూడా కొంచెం తగ్గుతుందని అంచనా. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానున్న ఈ డ్రోన్ ఖరీదు దాదాపు రెండున్నర లక్షల రూపాయల దాకా ఉంటుంది!
Comments
Please login to add a commentAdd a comment