క్వీన్ రానియా
బ్రిటన్ రాచకుటుంబానికి చెందిన క్వీన్ ఎలిజబెత్, కేట్ మిడిల్టన్, మేఘన్ మార్కెల్ లా.. క్వీన్ రానియా చాలామందికి తెలియకపోవచ్చు. విద్య, స్త్రీ సాధికారత, మధ్య ఆసియా దేశాల శరణార్థులు స్థితిగతుల గురించి ఆసక్తి ఉన్నవారికి మాత్రం ఈ పేరు బాగా పరిచయం. ఎందుకంటే క్వీన్ రానియా ఈ సామాజికాంశాల కోసమే పాటుపడుతూ దేశవిదేశాల్లో తన ప్రసంగాలతో అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారు. క్వీన్ రానియా జోర్డాన్ రాజు అల్ అబ్దుల్లా బిన్ అల్–హుస్సేన్ భార్య. 1970 ఆగష్టు 31 న కువైట్‌లో పాలస్తీనా దంపతులకు జన్మించారు. అమెరికన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలు అయ్యాక, అక్కడి సిటీబ్యాంక్‌లోని మార్కెటింగ్ విభాగంలో కొంతకాలం పనిచేశారు. తరువాత జోర్డాన్ రాజధాని అమ్మన్ లో ‘ఆపిల్’ సంస్థలో చేరారు. ఆపిల్‌లో పనిచేస్తున్నప్పుడే ఒక విందులో జోర్డాన్ యువరాజు అల్ అబ్దుల్లా బిన్ అల్–హుస్సేన్ పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్యా ప్రేమ అంకురించింది. 1993లో వివాహం చేసుకున్నారు. పెళ్లినాటికి ఆమె వయసు 23 ఏళ్లు. అప్పటికి రాజుగా ఉన్న కింగ్ హుస్సేన్ 1999లో మరణించడంతో ఆమె భర్త సింహాసనాన్ని అధిష్టించాడు. వెంటనే రానియాను రాణిగా ప్రకటించాడు. అప్పటినుండి రానియా క్వీన్ హోదాలో ప్రపంచ విద్యకు, సమాజ సాధికారతకు కృషి చేస్తున్నారు.
మధ్య ఆసియా దేశాలనుంచి ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారిపై ప్రపంచదేశాలకు కనికరం కలిగించేందుకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ‘‘వలస వచ్చే వాళ్లు యుద్ధ ప్రభావాల మూలంగా వాళ్ల ఇళ్లను, అయినవాళ్లను పోగొట్టుకుని మానసికంగా, శారీరకంగా కుంగిపోయి ఏ దిక్కూ తోచని వాళ్లే అయి ఉంటారు. అలాంటి వాళ్లను మనం చిన్న చూపు చూస్తే వాళ్లు ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉంది. దానికంటే కూడా వాళ్లు గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించి, వాళ్లకు ఒక దారి చూపిస్తే బాధ్యత గల పౌరులు అవుతారు’’ అని చెబుతుంటారు క్వీన్ రానియా. ఆమె రచయిత్రి కూడా. ముఖ్యంగా చిన్న పిల్లల మానసిక వికాసం కోసం పుస్తకాలు రాశారు. ది కింగ్స్ గిఫ్ట్, ఎటర్నల్ బ్యూటీ, మహా ఆఫ్ ది మౌంటైన్స్, ది శాండ్విచ్ స్వాప్ వాటిలో ముఖ్యమైనవి. నేటితో నలభై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రానియా.. ‘ఏంటి! ఈ యువతికి ఇంత వయసు ఉంటుందా!’ అనిపించేలా ఉంటారు. ఓప్రా విన్‌ఫ్రే చేసిన ఒక ఇంటర్వ్యూలో ‘‘ఇంత అందంగా ఉన్నారు, ప్రపంచంలోని ఇన్ని అంశాల గురించి పాటుపడుతున్నారు. అసలు మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి?’’ అన్నప్పుడు ‘చాక్లెట్’ అని సమాధానమిచ్చారామె.– రేఖ పర్వతాల
ది శాండ్విచ్ స్వాప్ : పిల్లల కోసం రానియా రాసిన పుస్తకం
Comments
Please login to add a commentAdd a comment