
అమ్మో!
బురిడీ బాబాలు దేశం నలుమూలలా ఉన్నారు. వారు ధరించేది కాషాయ వస్త్రాలు, వల్లించేది ఆధ్యాత్మిక ప్రవచనాలు... చక్కబెట్టేవి రాచకార్యాలు... సాగించేవి రాసలీలలు... రహస్య కెమెరాలకు చిక్కనంత కాలం దైవసమానులుగా వెలుగుతారు.. బండారం బట్టబయలయ్యాక కేసుల్లో చిక్కుకుని, కోర్టుల చుట్టూ తిరుగుతారు... కాలం, కర్మం కలసి రాకపోతే కటకటాలనూ లెక్కపెడతారు... ఇలాంటి బురిడీ బాబాలు మన పవిత్ర దేశ జనులకు కొత్తేమీ కాదు... అయినా, వాళ్ల చుట్టూ గుమిగూడే భక్తబృందాలు తక్కువేమీ కాదు...
ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా మారిన మాతామయి శ్రీ రాధే గురుమా... తన 23వ ఏట ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కాదు గానీ... ఆధ్యాత్మిక గురువుగా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. పొట్టి దుస్తులు ధరించిన ఫొటోలు ‘నెట్’ఇంట రచ్చకెక్కడంతో ఇప్పుడామె వివాదాస్పదురాలిగా మారింది...ఆ ఫొటోలు మాత్రమే కాదు, మరిన్ని లీలలూ వెలుగులోకి వస్తున్నాయి.
అకస్మాత్తుగా వార్తల్లో వ్యక్తిగా మారిన ఈ రాధే మా ఎవరు..? ఆమె నేపథ్యం ఎట్టిది..? ఆమెను చుట్టుముడుతున్న ఆరోపణలేమిటి..? ఆశ్రమ జీవితంలో ఆమె ‘ఆధ్యాత్మికత’పై చెలరేగిన వివాదాలేమిటి..? ఈ వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా..?
అయితే, చిత్తగించండి...
అవతారం ఆకర్షణీయం
రాధే మా... భక్తజనులకు శ్రీ రాధే గురుమా... ఆమె అవతారం అత్యంత ఆకర్షణీయం. ఆశ్రమంలో సర్వాలంకార భూషితయై, నిండైన వస్త్రధారణతో, చేత త్రిశూలం ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. మోడర్న్ మాత కదా! మేకప్పు మెరుగులూ తక్కువేమీ కాదు. కనుబొమల మధ్యగా తలకట్టు వరకు పొడవాటి ఎర్రని తిలకనామం. భుజాల వరకు కత్తిరించుకుని, నడినెత్తిపై పఫ్‌తీసి వదిలేసిన హెయిర్‌స్టైల్. కళ్లకు ఐలైనర్ మెరుగులు. కనురెప్పలకు ఐ షాడో పూత. పెదవులకు ఎర్రని లిప్‌స్టిక్ మెరుపు. కోటేరులాంటి ముక్కుకు రవ్వల ముక్కెర. మెడనిండుగా వజ్రాల హారం, ఒంటి నిండుగా ఎర్రని జరీచీర. స్థూలంగా చెప్పాలంటే... సన్యాసినికి ఎక్కువ... సెలబ్రిటీకి తక్కువ ఆహార్యం ఆమెది. ఆశ్రమంలో భక్తులతో కలసి ఆమె నిర్వహించే సత్సంగ్ కార్యక్రమాలు పబ్బుల్లో కనిపించే సల్సా, రాక్ ఎన్ రోల్ సందడికి ఏమాత్రం తీసిపోవు. తన్మయత్వంతో నర్తించే భక్తులతో కలసి హుషారుగా చిందులేస్తుంది. వాళ్లు ఆలపించే భజనగీతాలతో గొంతు కలుపుతుంది. చెంత చేరే భక్తులను బిగికౌగిట్లో బంధించి, వారిని ముద్దాడి మరీ ఆశీర్వదించడం రాధే మా ప్రత్యేకత.
ఇదీ పూర్వాశ్రమం
పూర్వాశ్రమంలో రాధే మా లౌకిక నామధేయం సుఖ్వీందర్ కౌర్. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దోరాంగలా గ్రామంలో పుట్టింది. పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్లుగా ఆమెకు బాల్యం నుంచే ఆధ్యాత్మిక అభినివేశం మెండుగా ఉండేదట. చిన్నారి వయసులోనే గ్రామంలోని కాళికాలయంలో గంటల తరబడి గడిపేదట. ఆమె బాల్యం గురించి ఇలాంటి వివరాలే కొన్ని ఆమె వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అయితే, ఆమె స్వగ్రామ ప్రజలు మాత్రం ఇవన్నీ ‘తూచ్’ అంటున్నారు. పదిహేడేళ్ల వయసులో ఆమెకు హోషియార్‌పూర్ జిల్లాకు చెందిన మోహన్‌సింగ్‌తో పెళ్లి జరిగింది. మోహన్‌సింగ్ చిన్నా చితకా పనులు చేసుకుంటూ ఉండేవాడు. వేన్నీళ్లకు చన్నీళ్లుగా సుఖ్వీందర్ బట్టలు కుట్టేది. వాళ్లకు ముగ్గురు పిల్లలు కలిగారు. ఉపాధి కోసం మోహన్‌సింగ్ దోహాకు వలస వెళ్లాడు. అప్పటికే ఆమె భర్తతో గొడవ పడి విడిపోయింది. ఒంటరిగా మిగిలిన సుఖ్వీందర్ తన 23వ ఏట ఆధ్యాత్మికత వైపు మళ్లింది. హోషియార్‌పూర్‌లోని బాగ్‌దేరా ముఖేరియా మహంత్ రామ్ దీన్‌దాస్ వద్ద శిష్యురాలిగా చేరింది. ఆయన వద్ద దీక్ష పొంది ‘రాధే మా’గా అవతరించింది.
సెలబ్రిటీ శిష్యులు
రాధే మాగా కొన్నాళ్లు హోషియార్‌పూర్ పరిసర ప్రాంతాల్లో సత్సంగ్‌లు నిర్వహించేది. కొన్నాళ్లకు మెల్లగా ముంబైకి మకాం మార్చింది. ముంబైలోని ప్రముఖ మిఠాయి వర్తకుడు ‘ఎంఎం మిఠాయివాలా’ చైర్మన్ మన్మోహన్ గుప్తా ఆమెకు శిష్యుడిగా మారాడు. ఆమె కోసం విలాసవంతమైన ఆశ్రమం ఏర్పాటు చేశాడు. భారీ బిల్‌బోర్డులతో విస్తృత ప్రచారం సాగించాడు. అక్కడితో రాధే మా దశ తిరిగింది. భక్తుల రద్దీ, శిష్యగణం విపరీతంగా పెరిగింది. ఆమె శిష్యగణంలో ఇండోపాప్ గాయకుడు దలేర్ మెహందీ, సంగీత దర్శకుడు బప్పీ లహిరి, నటుడు రవికిషన్, గజేంద్ర చౌహాన్, నటి రాఖీసావంత్, దర్శకుడు సుభాష్ ఘయ్ వంటి వారు చేరడంతో ఆమె సెలబ్రిటీ మాతాజీ స్థాయికి ఎదిగింది.
వివాదాలూ... కేసులు
కురచ దుస్తులతో ఉన్న రాధే మా ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాకెక్కడంతో జాతీయ మీడియా ఆమెపై దృష్టి సారించింది. అంతవరకు ఆమె గురించి పంజాబ్, ముంబై ప్రాంతాల్లో మినహా జనాలకు పెద్దగా తెలియదు. బాలీవుడ్ శృంగార నటి సన్నీలియోన్‌కు రాధే మా వీరాభిమాని అని, అందుకే, ఆమె తన అభిమాన తార తరహాలో దుస్తులు ధరించి ముచ్చట తీర్చుకుందని కథనాలు వచ్చాయి. వాటిపై చాలా వ్యాఖ్యలు, విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఇదొక్కటే కాదు, రాధే మా చుట్టూ మరికొన్ని వివాదాలూ ఉన్నాయి. ఇటీవలి వార్తల ఫలితంగా ఇంకొన్ని వివాదాలు కూడా ఆమెను తాజాగా చుట్టుముడుతున్నాయి.
ముంబైలోని బొరీవెలీ ప్రాంతంలో రాధే మా ఆశ్రమ నిర్వహణ చూసుకుంటున్న మన్మోహన్ గుప్తా కోడలు నిఖీ గుప్తా నెల్లాళ్ల కిందట ఆమెకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్నం కోసం తనకు వ్యతిరేకంగా అత్తింటివారిని ఉసిగొల్పడమే కాకుండా, తనపై వేధింపులకు పాల్పడిందని ఆమె ఆరోపించింది. పెళ్లికి ముందు తనకు బంగారు నగలు కానుకగా ఇవ్వాలని డిమాండు చేసినట్లుగా కూడా ఆరోపించింది. ఈ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు రాధే మాపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఫిర్యాదు తర్వాత మరికొందరు కూడా రాధే మాకు వ్యతిరేకంగా కేసులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. గుజరాత్‌లోని ఏడుగురు సభ్యుల ఓ కుటుంబం ఆత్మహత్యకు రాధే మానే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే, కచ్‌లోని ఒక కుటుంబం నుంచి రాధే మా కోట్లాది రూపాయలు గుంజిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కుటుంబానికి చెందిన నలుగురు పెద్దలు తమ ముగ్గురు పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు దాఖలైంది. వివిధ ప్రాంతాల్లో రాధే మాకు వ్యతిరేకంగా వరుసగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ముంబై పోలీసులు ఆగస్టు 6న ఆమెపై ‘లుకౌట్’ నోటీసులు జారీ చేశారు. ఈ కలియుగ దేవత పట్టుబడితే కటకటాల దేవతగా మిలుగుతుందని వారు అంటున్నారు. అయితే, తాజాగా బాంబే హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. రెండు వారాల పాటు ఆమెను అరెస్టు చేయకూడదని తెలిపింది.
- సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
మీడియా బాధ్యత పెరగాలి!
‘నీలోనే శక్తి దాగి ఉంది’, ‘నిన్ను నువ్వు తెలుసుకోవడమే అసలైన ఆధ్యాత్మికత’ అని చెప్పి, సమాజాన్ని చైతన్యవంతం చేయవలసింది పోయి, అమాయకుల జేబులను కొల్లగొట్టేవారు ఆధ్యాత్మికవేత్తలు ఎలా అవుతారు? ఇలాంటివారు ఇంకా ఇంకా పుట్టుకొస్తూనే ఉండటం బాధాకరం. ఇటువంటి సంఘటనలతో అయినా మీడియా బాధ్యత మరింత పెరగాలని కోరుకుంటున్నాను.
-‘భారతీయం’ సత్యవాణి, ఆధ్యాత్మిక బోధకురాలు
మానసిక బలహీనత...
మనిషి అనుకున్న పని ఏదైనా కానప్పుడు తన బలం మీద నమ్మకం కోల్పోయి, దేవుణ్ని వేడుకుంటాడు. కనిపించని దేవుడికి-మనిషికి మధ్య ఉండేది మాతాలు, బాబాలే అని వీరిని నమ్ముతారు. బాబాలు, మాతలు మనిషి బలహీనతను క్యాష్ చేసుకుంటారు.
- డా.శేఖర్‌రెడ్డి, సైకియాట్రిస్ట్
అవగాహన ముఖ్యం
బాబాలు, మాతలు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు. గ్రామం నుంచి అంతర్జాతీయం వరకు ఎంతోమంది బాబాలు, మాతలు ఉన్నారు. ఇలాంటి వారిపై ముఖ్యంగా యువత, బాలల్లో వికాసం కలిగించడానికి సదస్సులు నిర్వహిస్తున్నాం. - రమేష్, జనవిజ్ఞాన వేదిక