కేన్సర్‌కు అందుబాటులో ఉన్న చికిత్సల్లో రేడియో ధార్మికత ఒకటి. ఈ పద్ధతితో వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందన్న మాట నిజమైనప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. కేన్సర్ కణాలతోపాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా రేడియో ధార్మికత కారణంగా నాశనం కావడం దీనికి కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు స్పెయిన్‌కు చెందిన సీఎన్‌ఐఓ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మన పేగుల్లోని ఒక ప్రొటీన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా రేడియోధార్మికత దుష్ప్రభావాల నుంచి రక్షణ పొందవచ్చునని వీరు అంటున్నారు. ఎలుకలపై తాము జరిపిన పరిశోధనలు దీనికి రుజువని చెబుతున్నారు. ఈ పద్ధతి కేన్సర్ రోగులకు మాత్రమే కాకుండా అణు ప్రమాదాల బాధితులు, భవిష్యత్తులో సుదూర గ్రహాలకు వెళ్లే వ్యోమగాములకూ ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆల్ముడెనా ఛావెజ్ ప్రెజ్ తెలిపారు.
రేడియోధార్మికత కారణంగా నాశనమైన పేవు కణాలతోపాటు యుఆర్‌ఐ ప్రొటీన్ ఎక్కువగా కనిపించిన నేపథ్యంలో తాము దానిపై పరిశోధనలు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ ప్రొటీన్ ఉత్పత్తిని నియంత్రించిన ఎలుకలను, సాధారణమైన వాటిని తీసుకుని రెండింటినీ రేడియోధార్మికతకు గురిచేసినప్పుడు మొదటి రకం ఎలుకలు 70 శాతం మరణించాయని, ఎక్కువ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసిన ఎలుకలన్నీ చికిత్సను తట్టుకోగలిగాయని వివరించారు. పేగు మూలల్లో ఉన్న మూలకణాలను ప్రేరేపించడం ద్వారా ఈ ప్రొటీన్ కణాలకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. కేన్సర్‌కు కొత్త, నిరపాయకరమైన చికిత్సలు అందించేందుకు తమ పరిశోధన ఉపకరిస్తుందని.. వివరాలు సైన్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయని ప్రెజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment