‘హిచ్‌కీ’ చిత్రం సక్సెస్ వేడుకల్లో రాణీ ముఖర్జీ
‘ఉద్యోగ సంతృప్తి’ని పొందేవారు నిజంగా అదృష్టవంతులు. చేస్తున్న పనిలో అపరిమితమైన సంతోషాన్ని అనుభవిస్తారు వాళ్లు. కొందరికి ఏ ఉద్యోగమూ సంతృప్తినివ్వదు. వాళ్లను దురదృష్టవంతులు అనలేం కానీ, స్థిరంగా ఒక చోట ఉండలేరు వాళ్లు. మారడంలోనే వాళ్లకు జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్! ప్రపంచంలో ఎక్కడైనా ప్రధానంగా ఈ రెండు రకాల ఉద్యోగులే ఉంటారు. అయితే రాణీ ముఖర్జీ మాత్రం తను తనకిష్టమైన జాబ్ చెయ్యడానికే పుట్టానని అంటున్నారు. ఆమెకు ఇష్టమైన జాబ్.. యాక్టింగ్. ఆ విషయం రాణీ ముఖర్జీకి 24వ యేట తెలిసిందట. 2002లో మణిరత్నం చిత్రం ‘సాథియా’ షూటింగ్‌లో తనకు ఈ ఫీలింగ్ కలిగిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.
ఆ తర్వాత రాణీ చాలా సినిమాలు చేశారు. అవన్నీ సూపర్‌హిట్ కాకపోయినా, అన్నిట్లోనూ రాణీ యాక్షన్ హిట్టు, సూపర్‌హిట్టే. అంతలా ఆమె తన ప్రొఫెషన్‌ని ప్రేమించారు. రాణి లేటెస్ట్ చిత్రం ‘హిచ్‌కీ’.. ఆమెకు చాలా మంచి పేరు తెచ్చింది. అంతకుముందు ‘మర్దానీ’లోనూ ఆమెది మర్చిపోలేని యాక్టింగ్. అయితే నటిగా ఇంత పేరు వచ్చినా.. రాణీ మాత్రం ఒక మనిషిగానే గుర్తింపును కోరుకుంటున్నారట! ముందు మనిషిగా ఉండటం గొప్ప. ఆ తర్వాతే మిగతా గొప్పలు అని ఆమె అంటున్నారు. ‘నటన కోసమే నేను పుట్టాను’ అని ఆమె అనడంలోనే మనిషిగా ఆమె ఔన్నత్యం తెలుస్తోంది. వృత్తిని ప్రేమించేవారు, వృత్తిని ఆరాధించేవారు.. వారి హోదా చిన్నదైనా, పెద్దదైనా వాళ్లంతా గొప్పవాళ్లే.
Comments
Please login to add a commentAdd a comment