విముక్తి గీతం | Redemption Song | Sakshi
Sakshi News home page

విముక్తి గీతం

Published Mon, Sep 8 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

విముక్తి గీతం

విముక్తి గీతం

ప్రసిద్ధ టీవి కార్యక్రమం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ఇటీవల  ఇరవై అయిదు లక్షల బహుమతి గెలుచుకున్నారు బీహార్ మహిళ ఫాతిమా ఖైతూన్. నిజానికి, అంతకంటే విలువైన బహుమతిని ప్రశంసల రూపంలో సొంతం చేసుకున్నారు ఆమె. తన కార్యక్రమంలో ఫాతిమాను వేనోళ్ల పొగిడారు ‘బిగ్ బి’. రాణీ ముఖర్జీ అయితే ‘‘ఫాతిమా ఆడపిల్ల కాదు. మగరాయుడు’’ అంటూ, తన తాజా సినిమా ‘మర్దాని’లోని కథానాయిక పాత్రతో ఫాతిమాను  పోల్చారు. నిజానికి, మగరాయుళ్లు చేయలేని పని కూడా ఫాతిమా  చేసి చూపించారు. మృత్యువుకు ఎదురొడ్డి నిలిచి ఎందరో మహిళల జీవితాలను చీకటి నుంచి విముక్తి చేశారు. విముక్తి గీతానికి గొంతుకయ్యారు.
 
బీహార్‌లోని అరరియా జిల్లా ఫోర్బెస్‌గంజ్ ప్రాంతలో పుట్టిన ఫాతిమాకు తొమ్మిది సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల వ్యక్తితో వివాహం అయింది. ఇదే ఒక విషాదం అనుకుంటే, మరో విషాదం చాలామంది అమ్మాయిలను తన భర్త వ్యభిచార కూపంలోకి దింపడం. భర్త తరపున బంధువులందరికీ ఈ పాపంలో భాగస్వామ్యం ఉంది. వీళ్లందరూ కలిసి వేశ్యావాటికను నిర్వహించేవారు.
 ఎదిరించినప్పుడల్లా ఫాతిమాను తీవ్రంగా కొట్టేవాళ్లు.
 నాలుగు సార్లు తప్పించుకొని పారిపోయారు ఫాతిమా. కానీ, స్వయంగా ఆమె తల్లిదండ్రులే జుట్టీడ్చుకుంటూ లాక్కొచ్చేవారు.
 ‘‘ఇది మనకేమీ కొత్త కాదు. మన బంధువులలో చాలామంది చేస్తున్నారు’’ అని కూడా చెప్పేవారు. ఎటు చూసినా ఎడారి!
 ఆత్మీయత, ఓదార్పు అనే పచ్చదనం ఎక్కడా కనిపించలేదు.
 
ఎందరో ముక్కుపచ్చలారని పిల్లలను చూశారు ఫాతిమా. వాళ్లను చూసి ఏడవడం తప్ప ఏం చేయగలదు? ఏదో ఒకరోజు ఈ దారుణంపై పోరాడాలని అనుకున్నారు.  ఏ అమ్మాయికీ అన్యాయం జరగకూడదని నిర్ణయించుకున్నారు.
 ఒకసారి తన భర్తను- ‘‘మనకు ఈ పాపపు పని అవసరమా?’’ అని అడిగారు ఫాతిమా. సమాధానంగా ఆమె చెంప చెళ్లుమంది. అంతమాత్రాన ఆమె బెదిరి పోలేదు. వీలునప్పుడల్లా నాలుగు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించేవారు.
 తన భర్త మాత్రమే కాదు, వ్యభిచార దందాను నిర్వహిస్తున్న వాళ్లలో ఒక్కరూ మారేలా లేరనే విషయం ఆమెకు ఆలస్యంగా అర్థమైంది.

ఆడపిల్లలను వ్యభిచార కూపం నుంచి విముక్తి చేస్తున్న ‘అప్నే ఆప్ వుమెన్ వరల్డ్‌వైడ్’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను కలుసుకోవడం ఫాతిమా జీవితాన్ని మార్చేసింది. తన మనసులోని బాధనంత వెళ్లగక్కారు. వాళ్లు ఆమెకు ధైర్యం చెప్పారు. ‘‘అండగా నిలుస్తాం’’ అని హామీ ఇచ్చారు.
 విషయం తెలిసి భర్త అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు.
 ‘‘చంపేస్తాను’’ అని పళ్లు నూరాడు
 ‘‘నేను ఎప్పుడో చచ్చిపోయాను’’ అని  గట్టిగా అరిచారు ఫాతిమా. ఈ మాట ఆమెలో గూడుకట్టుకున్న బాధను తెలియజేస్తుంది. ఫాతిమా ఆగ్రహానికి జడిసి భర్త రెండు మెట్లు దిగి నచ్చజెప్పబోయాడు.
 ‘‘మనకు ఆరుగురు పిల్లలు, వాళ్లు ఎలా బతకాలి చెప్పు? నీ వల్ల  పిల్లలు అడుక్కుతినాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించాడు.
 అయితే భర్త బెదిరింపులు, హెచ్చరికలకు లొంగలేదు.
 తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. వ్యభిచార కూపంలో దిగకుండా చాలామంది అమ్మాయిలకు కౌన్సెలింగ్ చేశారు. వ్యభిచార కూపంలో బతుకీడుస్తున్న అమ్మాయిలకు అందులో నుంచి బయటపడడానికి తగిన సహకారం అందించారు. ఇప్పుడిక భర్త, బంధువుల నుంచి మాత్రమే కాదు, వ్యభిచారాన్ని నిర్వహించే ఇతరుల నుంచి కూడా ఫాతిమాకు బెదిరింపులు మొదలయ్యాయి. కొందరు దాడులు చేయడానికి కూడా ప్రయత్నించారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న విషయం అర్థమవుతున్నా... వెనక్కి తగ్గలేదు. మడమ తిప్పలేదు. ‘‘పరిస్థితిలో మార్పు తేవడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాను’’ అంటారు ఆమె.
 మార్పు తన ఇంటి నుంచే మొదలు కావాలనుకున్నారు. తన నలుగురు కూతుళ్లను స్కూల్లో చదివిస్తున్నారు. స్థానిక సెక్స్‌వర్కర్‌ల పిల్లలను కూడా  స్కూల్లో  చేర్పిస్తున్నారు. చదువు ప్రాముఖ్యతను వారికి తెలియజేస్తున్నారు.
 ‘‘వ్యభిచార కూపంలో చిక్కుకున్న, చిక్కుకోబోతున్న ఎందరో మహిళలను రక్షించాను. వారికి కొత్త జీవితం అంటే ఏమిటో చూపాను. ఇదంతా నీ వల్లే అని వారు అన్నప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉంటుంది’’ అంటున్నారు ఫాతిమా.
 ‘‘ఫాతిమా తొలిసారిగా మమ్మల్ని కలిసిప్పుడు... ఆమె కళ్లలో బాధతోపాటు మార్పు కోసం ఏదో ఒకటి చేయాలనే తపన కనిపించింది. చాలామందికి ఇలాంటి తపన ఉన్నప్పటికి పరిస్థితుల ప్రభావం వల్ల మధ్యలోనే జారిపోతారు, మళ్లీ ఎప్పుడూ కనిపించరు. ఫాతిమా మాత్రం అలా కాదు. మొదట్లో చూపిన పట్టుదల ఇప్పటికీ అలాగే ఉంది. యుద్ధాన్ని తన ఇంటి నుంచి మొదలు పెట్టింది. భర్త నుంచి ఎన్ని రకాలుగా సమస్యలు ఎదురైనా...తన ఇంట్లో వ్యభిచారం జరగకుండా అడ్డుకుంది. భర్తను అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉంచడంలో విజయం సాధించింది’’ అన్నారు ‘ఆప్నే ఆప్’ వ్యవస్థాపక అధ్యక్షురాలు రుచిర గుప్త. తనకు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ద్వారా లభించిన 25 లక్షల మొత్తాన్ని వ్యభిచారం నుంచి విముక్తి అయిన మహిళల సంక్షేమానికి ఉపయోగించాలనుకుంటున్నారు ఫాతిమా.‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి కోసం అమితాబ్‌బచ్చన్‌ను కలుసుకున్నాను. అంత పెద్దాయనను కలవడానికి నిజానికి భయమేసింది. ఆయన మాత్రం చాలా బాగా మాట్లాడారు. నా గురించి అడిగి తెలుసుకున్నారు. నీకు ఇంత ధైర్యం, శక్తి ఎలా వచ్చాయి? అని ఆశ్చర్యంగా అడిగారు’’ అని అమితాబ్‌తో తన సమావేశాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు ఫాతిమా.
 బిగ్ బి...మాత్రమే కాదు, చాలా మంది అడిగే ప్రశ్న-
 ‘‘అంత ధైర్యం, శక్తి ఎక్కడ నుంచి వచ్చాయి?’’
 ఫాతిమా చెప్పకపోయినా...ఆమె కన్నీళ్ల నుంచి వచ్చాయి అని గట్టిగా చెప్పవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement