Kaun Banega Karodpati
-
కౌన్ బనేగా కరోడ్‌పతిలో మరో క్రికెట్ ప్రశ్న.. ఈసారి 3 లక్షల 20 వేలకు..!
బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో వరుసగా రెండో ఎపిసోడ్లో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. సెప్టెంబర్ 19న ప్రసారమైన ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్‌ను భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 10కి 10 వికెట్లకు సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొనగా.. నిన్న (సెప్టెంబర్ 20) ప్రసారమైన ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్ వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొన్నాడు. 19వ తారీఖున ప్రసారమైన ఎపిసోడ్లో కుంబ్లేకు సంబంధించిన ప్రశ్నకు ప్రైజ్‌మనీ 12 లక్షల 50 వేల రూపాయలు కాగా.. సెప్టెంబర్ 20న సెహ్వాగ్ గురించిన ప్రశ్నకు ప్రైజ్‌మనీ 3 లక్షల 20 వేల రూపాయలుగా ఉంది. ఇంతకీ ప్రశ్న ఏంటంటే..? వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో తాను చేసిన ఏకైక డబుల్ సెంచరీని ఏ స్టేడియంలో చేశాడు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌గా బారాబతి స్టేడియం, కటక్.. ఈడెన్ గార్డెన్స్ కోల్‌కతా.. హోల్కర్ స్టేడియం, ఇండోర్.. బ్రబోర్న్ స్టేడియం, ముంబైలను ఇచ్చారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గత ఎడిసోడ్లోని ప్రశ్న ఏంటంటే..? భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు (పాక్‌పై) తీసినప్పుడు బౌలర్ ఎండ్‌లో ఉన్న అంపైర్ ఎవరు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌గా పిలూ రిపోర్టర్, ఎస్ వెంకట్రాఘవన్, డేవిడ్ షెపర్డ్, ఏవీ జయప్రకాశ్ పేర్లు ఇచ్చారు. ఇదిలా ఉంటే, వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో తాను చేసిన ఏకైక డబుల్ సెంచరీ 2011లో వెస్టిండీస్‌పై చేశాడు. నాటి మ్యాచ్‌లో వీరూ 149 బంతుల్లో 25 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 219 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ (67), సురేశ్ రైనా (55) కూడా అర్ధసెంచరీలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటై 153 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్ ప్రశ్న.. జవాబుకు 12 లక్షల 50 వేలు
నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ప్రముఖ టీవీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్న భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేకు సంబంధించింది. ఈ ప్రశ్న నిన్న (సెప్టెంబర్ 19) ప్రసారమైన ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ ఎదుర్కొన్నాడు. ప్రశ్న ఏమిటంటే..? భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు (పాక్‌పై) తీసినప్పుడు బౌలర్ ఎండ్‌లో ఉన్న అంపైర్ ఎవరు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌గా పిలూ రిపోర్టర్, ఎస్ వెంకట్రాఘవన్, డేవిడ్ షెపర్డ్, ఏవీ జయప్రకాశ్ పేర్లు ఇచ్చారు. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. #OnThisDay in 1999, #TeamIndia spin legend @anilkumble1074 became the first Indian bowler and second overall to scalp all the 10 wickets in a Test innings. 👏👏 Watch that fantastic bowling display 🎥👇 pic.twitter.com/OvanaqP4nU — BCCI (@BCCI) February 7, 2021 కాగా, 1999 ఫిబ్రవరిలో పాక్‌తో జరిగిన ఢిల్లీ టెస్ట్‌లో కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీశాడు. యాదృచ్చికంగా ఆ 10 మంది ఔటైన సమయంలో బౌలర్ ఎండ్‌లో ఏవీ జయప్రకాశ్ అంపైర్‌గా ఉన్నాడు. ఆ మ్యాచ్‌ను టీమిండియా 212 పరుగుల తేడాతో గెలుపొంది, 2-2తో సిరీస్‌ను డ్రా చేసుకుంది. టెస్ట్‌ల్లో కుంబ్లే కాకుండా మరో ఇద్దరు మాత్రమే ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు పడగొట్టారు. కుంబ్లేకు ముందు జిమ్ లేకర్ (ఇంగ్లండ్), ఇటీవలికాలంలో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, కుంబ్లే భారత తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా కెరీర్‌ను ముగించిన విషయం తెలిసిందే. అతను భారత్ తరఫున 132 టెస్ట్‌లు ఆడి 619 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 35 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుంబ్లే నాలుగో స్థానంలో ఉన్నాడు. అతనికి ముందు జేమ్స్ ఆండర్సన్ (690), షేన్ వార్న్ (708), ముత్తయ్య మురళీథరన్ (800) మాత్రమే ఉన్నారు. -
బాలీవుడ్ దిగ్గజం.. ఆయనకు గుర్తింపు అంత ఈజీగా రాలేదు
బాలీవుడ్ దిగ్గజం, బిగ్ బి అమితాబ్ బచ్చన్ పరిచయం అక్కర్లేని పేరు. ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌లోనూ బిగ్ బీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత సినీ చిత్ర పరిశ్రమ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించారు. బాలీవుడ్లోనే కాకుండా సౌత్ ఇండియాలోనూ ఆయనకు పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో పుట్టిన అమితాబ్ 90వ దశకంలో ఓ రేంజ్లో స్టార్‌గా మారిపోయారు. ఇవాళ (అక్టోబర్ 11) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ ఆయన కెరీర్‌పై ఓ లుక్కేద్దాం. కెరీర్లో ఒడుదొడుకులు: బాలీవుడ్ సినిమా పాటలకు స్టెప్పులెయ్యాలన్నా.. ప్రతి ఒక్కరికి అమితాబ్‌నే ఆదర్శంగా తీసుకోవాల్సిందే. చిన్న పిల్లాడిలా ఒదిగిపోవాలన్నా పెద్దమనిషిలా తీర్పులు చెప్పాలన్నా ఈ తరం కుర్రాడిలా స్టెప్పులెయ్యాలన్నా ఒక్క బిగ్ బీకే సాధ్యమైంది. ఈ విలక్షణమైన నటుడు సినిమాల్లోకి అంతా ఈజీగా రాలేదు. ఆయన కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. ఈ వయసులో కూడా ఆయన కోసం సినిమా ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. 80 పదుల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిలా...: ఆయనకు 80 వసంతాలు పూర్తి చేసుకున్నా కూడా.. ఇప్పటికీ నవ యువకుడిలా కనిపిస్తూ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ వయసులోనూ యువ నటులతో పోటీపడుతూ ఎంతో ఫిట్‌గా ఉంటున్నారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నారు. (చదవండి: బిగ్‌బీ అమితాబ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ) ఆయన సినీ ప్రస్థానం..: అద్భుతమైన గాత్రంతో, డ్యాన్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న అమితాబ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రపంచంలో తన ప్రయాణం ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్ సాత్ హిందుస్థాన్‌లో అన్వర్ అలీగా మొదలైన సినీ ప్రస్థానంతో ఆ తర్వాత వరుస హిట్లను అందుకున్నారు. ఆయన సినీ ప్రస్థానం తర్వాత మొదట్లో చాలామంది హేళన చేశారు. ఓ సారి నీ మొహం అద్దంలో చూసుకో అని అన్నా వాటన్నింటినీ పట్టించుకోలేదు బిగ్ బీ. వాటినే సవాల్‌గా స్వీకరించి తనదైన నటనతో అందరిని అవాక్కయ్యేలా చేశారు. ఊహించని ప్రమాదం...: బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయనకు ఓ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంతో చావు అంచుల దాకా వెళ్లివచ్చారు. ఆరోగ్యం విషయంలో ఎన్నో సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా.. తిరిగి పుంజుకున్నారు. టీబీ, లివర్ సంబంధిత వ్యాధులు, కరోనా బారిన పడినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇక అప్పటి నుంచి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన డైట్లో సాధారణ భోజనానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఉదయం యోగా, వాకింగ్ చేయడం తప్పనిసరి చేసుకున్నారు. అందుకే బిగ్ బీ ఈ వయసులోనూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. (చదవండి: ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన అమితాబ్.. ధరెంతంటే?) బిగ్ బీని వరించిన అవార్డులు...: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మొదటి సినిమా పెద్దగా సక్సెక్ కాకపోయినా.. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. 1973లో ఆయన జంజీర్ మూవీ సాంప్రదాయ పాత్రలను అధిగమించిన భారతీయ సినిమా యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా మారడానికి దోహదపడింది. 1984లో భారత్ ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. 2001లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ అందుకున్నారు. 2007లో ఫ్రెంచ్ ప్రభుత్వం అతనికి నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ అవార్డును అందజేసింది. ఆనంద్, దీవార్, షోలే, అమర్ అక్బర్ ఆంటోనీ, త్రిశూల్, నిశ్శబ్ద్, అగ్నిపథ్, పికు, పింక్ అతని నట జీవితంలో కొన్ని మైలురాళ్లు. తాజాగా గుడ్‌బై సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఆయనకు విషెస్ చెప్పేందుకు ముంబైలోని ఆయన నివాసం వద్దకు వచ్చిన అభిమానుల కోసం ఇంటి బయటకు వచ్చి అందరినీ కలిశారు. అభిమానులతో కలిసి సందడి చేశారు. కెరీర్లో ఎంత ఎత్తు ఎదిగినా.. చాలా సింప్లీసిటీగా కనిపించడం ఆయన సొంతం. #WATCH | Actor #AmitabhBachchan greets his fans who have gathered outside his residence 'Jalsa', in Mumbai, on his 80th birthday today. pic.twitter.com/eMahx6uOWi — ANI (@ANI) October 11, 2022 -
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం
ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) షో ప్రోమో కోసం అమితాబ్ బచ్చన్ షూటింగ్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై అమితాబ్ స్పందించారు ‘‘అవును.. నేను షూటింగ్లో పాల్గొన్నాను. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. నిజానికి మేం రెండు రోజుల షూటింగ్‌ను ప్లాన్ చేశాం. కానీ ఒక్క రోజులోనే పూర్తి చేశాం. లాక్డౌన్ తర్వాత షోను ఏ విధానంలో నిర్వహించాలనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎప్పటిలాగే మంచి వ్యూయర్షిప్తో సాగుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు’’ అని అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఒక్కరోజు జరిగిన ఈ షూటింగ్లో అమితాబ్ దాదాపు 12 వీడియోల్లో నటించారట. ఇందులో కేవలం కేబీసీ షోకు సంబంధించిన వీడియోలే కాకుండా కరోనా చికిత్స కోసం పోరాడుతున్న డాక్టర్లు, నర్సులను ప్రోత్సహించే వీడియోలు కూడా ఉన్నాయని సమాచారం. -
రాధిక శరత్‌కుమార్ సరికొత్త అవతారం..
మహిళల కోసం ప్రత్యేకంగా ఓ గేమ్ షోను కలర్స్ తమిళ చానల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ షోలో విజేతగా నిలిచే వారికి రూ. కోటి చెక్కును పరిచయం చేస్తూ నటి రాధికా శరత్‌కుమార్, కలర్స్ చానల్ తమిళ్ బిజినెస్ హెడ్ అనూప్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ ఈనెల 23వ తేది రాత్రి 8 గంటలకు కలర్స్ తమిళ టీవీ చానల్లో నటి రాధికా వ్యాఖ్యాతగా (హోస్ట్‌గా) వ్యవహరించనున్న కోటీశ్వరి గేమ్ షో కార్యక్రమం ప్రారంభమవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ షో ప్రసారం అవుతుంది. కలర్స్ తమిళ టీవీచానల్, స్టూడియో నెక్ట్స్ సంయుక్తంగా నిర్వహించనుంది. నిపాన్ పెయింట్స్, అరుణ్ ఏఎక్స్సెల్లో, కోటక్ మహేంద్ర బ్యాంక్, తమిళ్ మేట్రిమోని యాప్ ఈ కార్యక్రమానికి కో ప్రకటన దారులుగా ఉన్నారు. ఈ విషయంగా కలర్స్ చానల్ వ్యాపారాధ్యక్షుడు అనూప్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మహిళల ప్రతిభకు అద్దంపట్టే రీతిలో కోటీశ్వరి గేమ్ షో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాధికా శరత్ కుమార్ 15 ప్రశ్నలు వేస్తారని, వాటికి రూ. 1000 నుంచి రూ. 1 కోటి బహుమతి ఉంటుందని అన్నారు. పోటీదారులు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే రూ. కోటి బహుమతి గెలుచుకోవచ్చని తెలిపారు. గేమ్ ఆడే సమయంలో పోటీ దారులు 50కి 50 శాతం, ఆడియన్స్ పోల్, ఆస్క్ ది ఎక్స్‌పోల్ (నిపుణుల వద్ద సమాధానాలు కోరడం), ప్లిప్ (కొన్ని సమాధానాలలో ఒకదాన్ని ఎంపిక చేయడం) వంటి నాలుగు విధాలైన హెల్ప్లైన్లు ఉంటాయని వివరించారు. ఈ గేమ్‌షోలో పాల్గొనడం కోసం ఇప్పటి వరకు 3,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. -
‘అనుష్కా.. నీవు కోహ్లి కోసమే క్రికెట్ చూస్తావా?’
-
అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి
ప్రజలకు గవర్నర్ దీపావళి శుభాకాంక్షలు..రాజ్‌భవన్‌లో వేడుకలు హైదరాబాద్: దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. దీపావళిని పురస్కరించుకుని శుక్రవారం రాజ్‌భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సరదాగా నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో గవర్నర్ దంపతులు పాల్గొని సందడి చేశారు. ఉద్యోగులు, వారి పిల్లలకు ఆటపాటల పోటీలు నిర్వహించారు. గవర్నర్ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పాల్గొన్నారు. -
సానుకూల దృక్పథమే...సాధించేలా చేసింది!
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి అనారోగ్యం అడ్డంకి కాదని నిరూపించారు ఓ మహిళ. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో మునుపెన్నడూ లేనివిధంగా ఓ క్యాన్సర్ బాధితురాలు కోటి రూపాయలు సొంతం చేసుకున్నారు. తన తెలివితేటలతో, తెగువతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆవిడ పేరు... మేఘా పాటిల్. సాక్షి ఆమెను పలుకరించినప్పుడు, కేబీసీలో తను సాధించిన ఈ విజయం గురించి ఇలా ముచ్చటించారు! మీ బ్యాగ్రౌండ్ గురించి చెప్తారా..? మాది ముంబైకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఠాణే జిల్లాలోని వసాయి పట్టణం. మావారు దీపక్ పాటిల్ కేంద్ర ప్రభుత్వాధికారి. మాకు ఇద్దరు పిల్లలు. బాబు సంకేత్ ముంబై ఐఐటీలో ఇంజినీరింగ్ చేస్తున్నాడు. పాప సిద్ధి ఇంటర్ చదువుతోంది. మీకు క్యాన్సర్ సోకిందని ఎప్పుడు తెలిసింది? 2006లో నాకు రొమ్ము కాన్యర్ ఉన్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ వార్త నాతోపాటు మా కుటుంబ సభ్యులందరినీ ఆందోళనకు గురి చేసింది. నన్ను రక్షించుకోవడానికి మావారు, పిల్లలు ఎంతో తపన పడ్డారు. అయితే నేను మాత్రం ఎప్పుడూ దైర్యం కోల్పోలేదు. మావారు, మా కుటుంబసభ్యులు చూపించిన ప్రేమాభిమానాలు నన్ను బలహీనపడనివ్వలేదు. అంతవరకూ చేసినట్టుగానే అన్ని పనులూ చేసుకో సాగాను. మొదట్నుంచీ చెప్పినట్టే పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పసాగాను. నాకేమీ కాదు అన్న సానుకూల దృక్పథంతోనే ఎప్పుడూ ఉన్నాను. అసలు కేబీసీకి వెళ్లాలని ఎందుకు అనుకున్నారు? చిన్నప్పటి నుంచి నేను పుస్తకాలు బాగా చదివేదాన్ని. ఇంగ్లీష్ మీడియంతో డిగ్రీ పూర్తి చేసిన నాకు ఇంటర్ నెట్ ద్వారా పలు రకాల విషయాలను తెలుసుకోవడం కూడా అలవాటు. పైగా పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పేదాన్నేమో... వీటన్నిటి వల్లా నాకు జనరల్ నాలెడ్జి కాస్త ఎక్కువే. కౌన్ బనేగా కరోడ్‌పతి చూస్తున్నప్పుడు అమితాబ్ ప్రశ్న అడగ్గానే హాట్ సీట్లో ఉన్నవాళ్లకంటే ముందు నేను జవాబు చెప్పేసేదాన్ని. అవన్నీ కరెక్ట్ అవ్వడం చూసి... నన్నూ కేబీసీకి వెళ్లమని మా అబ్బాయి, అమ్మాయి ప్రోత్సహించారు. దాంతో ప్రిపరేషన్ మొదలుపెట్టా. మొదటి ప్రయత్నంలోనే ఎంపికయ్యారా? లేదు. మొదటిసారి ఆడిషన్స్ వరకూ వెళ్లాను కానీ సెలెక్ట్ కాలేదు. ఈ యేడు మళ్లీ ప్రయత్నించాను. ఫాస్టెస్ట్ ఫింగర్లో గెలవగానే చెప్పలేనంత సంతోషం వేసింది. అక్టోబరు నాలుగవ తేదీన హాట్ సీట్‌పై కూర్చోగానే నాలో ఒక రకమైన భయం! కానీ అమితాబ్ తనదైన శైలిలో మాట్లాడుతూ నా భయాన్ని, అయోమయాన్ని చాలావరకూ పోగొట్టారు. తర్వాత ఆట ప్రారంభమైంది. మెల్లగా ఒక్కో ప్రశ్నకూ సమాధానం చెబుతూ వెళ్లాను. కోటి రూపాయలు గెల్చుకోగానే ఏమనిపించింది? మొదట నమ్మలేకపోయాను. మహా అయితే రూ. 25 లక్షల వరకు గెలుస్తాననుకున్నాను. కోటి రూపాయల కోసం ప్రశ్న వేసినప్పుడు కొంత అయోమయానికి కూడా గురయ్యా. ఒకే ఒక్క లైఫ్ లైన్ ఉంది... ఫోనో ఫ్రెండ్. దాన్ని వినియోగించుకున్నాను. మా అబ్బాయి సంకేత్‌కు ఫోన్ కలిపిచ్చిన తర్వాత తను నా సమాధానం నూరుశాతం కరెక్ట్ అని చెప్పాడు. అయినా ఆ ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. చివరికి కోటి రూపాయలు గెల్చుకున్నానని అమితాబ్ ప్రకటించారు. నమ్మలేక కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయా! ఈ డబ్బులతో ఏం చేయాలనుకుంటున్నారు? నా రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం మావారు చాలా ఖర్చు పెట్టారు. ఇప్పుడు క్యాన్సర్ లివర్‌కు కూడా పాకింది. టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. ఇప్పటికే నా వైద్యం కోసం తీసుకున్న అప్పులు చాలా ఉన్నాయి. అవన్నీ తీర్చాలి. కొంత సొమ్ము మా పిల్లలిద్దరి కోసం కూడా వినియోగిస్తాను. మీలాంటి వారికి మీరిచ్చే సందేశం ఏమిటి? ఎలాంటి సందర్భంలోనైనా సరే, పాజిటివ్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఆరోగ్యం బాగాలేదని ఇంట్లో కూర్చుంటే ఏది కాదు. పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇదీ... మేఘా పాటిల్ అంతరంగం. కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న మేఘ, త్వరలోనే క్యాన్సర్‌పై కూడా గెలుపు సాధించాలని కోరుకుందాం! - గుండారపు శ్రీనివాస్; ఫొటోలు: పిట్ల రాము -
ఔర్.. యే బన్‌గయా కరోడ్‌పతీ!!
-
7 కోట్ల జాక్‌పాట్!
కేబీసీ 8లో గెలుచుకున్న ఢిల్లీ సోదరులు ముంబై: అచిన్ నరులా, సార్థక్ నరులా.. ఢిల్లీకి చెందిన ఈ అన్నదమ్ములిద్దరూ నిన్న మొన్నటి వరకూ చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వీరిద్దరూ సెలబ్రిటీలైపోయారు. కారణం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)’ టీవీ షో. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కేబీసీ 8వ సీజన్ సోనీ టీవీలో ప్రసారమవుతుండడంతెలిసిందే. ఈ కార్యక్రమంలో తొలిసారి రూ. ఏడు కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకుని నరూలా బ్రదర్స్ చరిత్ర సృష్టించారు. నాలుగు లైఫ్ లైన్ల సాయంలో 14 ప్రశ్నలనూ కరెక్ట్‌గా చెప్పి రికార్డు స్థాయి ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగ్, ట్విట్టర్లో వెల్లడించారు. విజేతలకు చెక్కును ఇస్తున్న ఫొటోను సైతం పోస్ట్ చేశారు. కేబీసీ ప్రారంభించిన తర్వాత ఈ స్థాయిలో ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నది వీరిద్దరే కావడం గమనార్హం. అచిన్ ఢిల్లీలో మార్కెటింగ్ మేనేజర్. సార్థక్ ఓ విద్యార్థి. అచిన్ పదేళ్లుగా కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నించి ఇప్పటికి సఫలమయ్యాడు. ‘‘ఈ రాత్రి ప్రపంచం తల్లకిందులైంది. ఇందుకు కేబీసీనే కారణం. అద్భుతమైన క్షణాలివి. ఏం మేథస్సు. ఎంత అద్భుతంగా ఆడారు. ఇది కేబీసీ వల్లే సాధ్యమైంది. నమ్మశక్యం కాని క్షణాలివీ’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు బిగ్‌బీ. -
విముక్తి గీతం
ప్రసిద్ధ టీవి కార్యక్రమం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ఇటీవల ఇరవై అయిదు లక్షల బహుమతి గెలుచుకున్నారు బీహార్ మహిళ ఫాతిమా ఖైతూన్. నిజానికి, అంతకంటే విలువైన బహుమతిని ప్రశంసల రూపంలో సొంతం చేసుకున్నారు ఆమె. తన కార్యక్రమంలో ఫాతిమాను వేనోళ్ల పొగిడారు ‘బిగ్ బి’. రాణీ ముఖర్జీ అయితే ‘‘ఫాతిమా ఆడపిల్ల కాదు. మగరాయుడు’’ అంటూ, తన తాజా సినిమా ‘మర్దాని’లోని కథానాయిక పాత్రతో ఫాతిమాను పోల్చారు. నిజానికి, మగరాయుళ్లు చేయలేని పని కూడా ఫాతిమా చేసి చూపించారు. మృత్యువుకు ఎదురొడ్డి నిలిచి ఎందరో మహిళల జీవితాలను చీకటి నుంచి విముక్తి చేశారు. విముక్తి గీతానికి గొంతుకయ్యారు. బీహార్‌లోని అరరియా జిల్లా ఫోర్బెస్గంజ్ ప్రాంతలో పుట్టిన ఫాతిమాకు తొమ్మిది సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల వ్యక్తితో వివాహం అయింది. ఇదే ఒక విషాదం అనుకుంటే, మరో విషాదం చాలామంది అమ్మాయిలను తన భర్త వ్యభిచార కూపంలోకి దింపడం. భర్త తరపున బంధువులందరికీ ఈ పాపంలో భాగస్వామ్యం ఉంది. వీళ్లందరూ కలిసి వేశ్యావాటికను నిర్వహించేవారు. ఎదిరించినప్పుడల్లా ఫాతిమాను తీవ్రంగా కొట్టేవాళ్లు. నాలుగు సార్లు తప్పించుకొని పారిపోయారు ఫాతిమా. కానీ, స్వయంగా ఆమె తల్లిదండ్రులే జుట్టీడ్చుకుంటూ లాక్కొచ్చేవారు. ‘‘ఇది మనకేమీ కొత్త కాదు. మన బంధువులలో చాలామంది చేస్తున్నారు’’ అని కూడా చెప్పేవారు. ఎటు చూసినా ఎడారి! ఆత్మీయత, ఓదార్పు అనే పచ్చదనం ఎక్కడా కనిపించలేదు. ఎందరో ముక్కుపచ్చలారని పిల్లలను చూశారు ఫాతిమా. వాళ్లను చూసి ఏడవడం తప్ప ఏం చేయగలదు? ఏదో ఒకరోజు ఈ దారుణంపై పోరాడాలని అనుకున్నారు. ఏ అమ్మాయికీ అన్యాయం జరగకూడదని నిర్ణయించుకున్నారు. ఒకసారి తన భర్తను- ‘‘మనకు ఈ పాపపు పని అవసరమా?’’ అని అడిగారు ఫాతిమా. సమాధానంగా ఆమె చెంప చెళ్లుమంది. అంతమాత్రాన ఆమె బెదిరి పోలేదు. వీలునప్పుడల్లా నాలుగు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించేవారు. తన భర్త మాత్రమే కాదు, వ్యభిచార దందాను నిర్వహిస్తున్న వాళ్లలో ఒక్కరూ మారేలా లేరనే విషయం ఆమెకు ఆలస్యంగా అర్థమైంది. ఆడపిల్లలను వ్యభిచార కూపం నుంచి విముక్తి చేస్తున్న ‘అప్నే ఆప్ వుమెన్ వరల్డ్‌వైడ్’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను కలుసుకోవడం ఫాతిమా జీవితాన్ని మార్చేసింది. తన మనసులోని బాధనంత వెళ్లగక్కారు. వాళ్లు ఆమెకు ధైర్యం చెప్పారు. ‘‘అండగా నిలుస్తాం’’ అని హామీ ఇచ్చారు. విషయం తెలిసి భర్త అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ‘‘చంపేస్తాను’’ అని పళ్లు నూరాడు ‘‘నేను ఎప్పుడో చచ్చిపోయాను’’ అని గట్టిగా అరిచారు ఫాతిమా. ఈ మాట ఆమెలో గూడుకట్టుకున్న బాధను తెలియజేస్తుంది. ఫాతిమా ఆగ్రహానికి జడిసి భర్త రెండు మెట్లు దిగి నచ్చజెప్పబోయాడు. ‘‘మనకు ఆరుగురు పిల్లలు, వాళ్లు ఎలా బతకాలి చెప్పు? నీ వల్ల పిల్లలు అడుక్కుతినాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించాడు. అయితే భర్త బెదిరింపులు, హెచ్చరికలకు లొంగలేదు. తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. వ్యభిచార కూపంలో దిగకుండా చాలామంది అమ్మాయిలకు కౌన్సెలింగ్ చేశారు. వ్యభిచార కూపంలో బతుకీడుస్తున్న అమ్మాయిలకు అందులో నుంచి బయటపడడానికి తగిన సహకారం అందించారు. ఇప్పుడిక భర్త, బంధువుల నుంచి మాత్రమే కాదు, వ్యభిచారాన్ని నిర్వహించే ఇతరుల నుంచి కూడా ఫాతిమాకు బెదిరింపులు మొదలయ్యాయి. కొందరు దాడులు చేయడానికి కూడా ప్రయత్నించారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న విషయం అర్థమవుతున్నా... వెనక్కి తగ్గలేదు. మడమ తిప్పలేదు. ‘‘పరిస్థితిలో మార్పు తేవడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాను’’ అంటారు ఆమె. మార్పు తన ఇంటి నుంచే మొదలు కావాలనుకున్నారు. తన నలుగురు కూతుళ్లను స్కూల్లో చదివిస్తున్నారు. స్థానిక సెక్స్‌వర్కర్ల పిల్లలను కూడా స్కూల్లో చేర్పిస్తున్నారు. చదువు ప్రాముఖ్యతను వారికి తెలియజేస్తున్నారు. ‘‘వ్యభిచార కూపంలో చిక్కుకున్న, చిక్కుకోబోతున్న ఎందరో మహిళలను రక్షించాను. వారికి కొత్త జీవితం అంటే ఏమిటో చూపాను. ఇదంతా నీ వల్లే అని వారు అన్నప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉంటుంది’’ అంటున్నారు ఫాతిమా. ‘‘ఫాతిమా తొలిసారిగా మమ్మల్ని కలిసిప్పుడు... ఆమె కళ్లలో బాధతోపాటు మార్పు కోసం ఏదో ఒకటి చేయాలనే తపన కనిపించింది. చాలామందికి ఇలాంటి తపన ఉన్నప్పటికి పరిస్థితుల ప్రభావం వల్ల మధ్యలోనే జారిపోతారు, మళ్లీ ఎప్పుడూ కనిపించరు. ఫాతిమా మాత్రం అలా కాదు. మొదట్లో చూపిన పట్టుదల ఇప్పటికీ అలాగే ఉంది. యుద్ధాన్ని తన ఇంటి నుంచి మొదలు పెట్టింది. భర్త నుంచి ఎన్ని రకాలుగా సమస్యలు ఎదురైనా...తన ఇంట్లో వ్యభిచారం జరగకుండా అడ్డుకుంది. భర్తను అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉంచడంలో విజయం సాధించింది’’ అన్నారు ‘ఆప్నే ఆప్’ వ్యవస్థాపక అధ్యక్షురాలు రుచిర గుప్త. తనకు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ద్వారా లభించిన 25 లక్షల మొత్తాన్ని వ్యభిచారం నుంచి విముక్తి అయిన మహిళల సంక్షేమానికి ఉపయోగించాలనుకుంటున్నారు ఫాతిమా.‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి కోసం అమితాబ్‌బచ్చన్‌ను కలుసుకున్నాను. అంత పెద్దాయనను కలవడానికి నిజానికి భయమేసింది. ఆయన మాత్రం చాలా బాగా మాట్లాడారు. నా గురించి అడిగి తెలుసుకున్నారు. నీకు ఇంత ధైర్యం, శక్తి ఎలా వచ్చాయి? అని ఆశ్చర్యంగా అడిగారు’’ అని అమితాబ్‌తో తన సమావేశాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు ఫాతిమా. బిగ్ బి...మాత్రమే కాదు, చాలా మంది అడిగే ప్రశ్న- ‘‘అంత ధైర్యం, శక్తి ఎక్కడ నుంచి వచ్చాయి?’’ ఫాతిమా చెప్పకపోయినా...ఆమె కన్నీళ్ల నుంచి వచ్చాయి అని గట్టిగా చెప్పవచ్చు. -
చదువుల భారం చేస్తాడట దూరం!
విద్య అనేది విజ్ఞానాన్ని పెంచాలి. కానీ నేటి విద్య... ఒత్తిడిని పెంచుతోంది. వీపు మీద పుస్తకాల బరువును పెంచుతోంది. టెక్స్ట్ బుక్స్ బట్టీ పట్టాలి. వర్క్బుక్కులతో కుస్తీ పట్టాలి. హోమ్‌వర్కులు, స్లిప్ టెస్టులు... ఉరుకులు, పరుగులు. ఇదీ నేటి విద్యావిధానం. ఒత్తిడి పెంచే ఈ తరహా చదువులు అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ ఏ ఒక్కరైనా దీనికి పరిష్కారాన్ని ఆలోచించారా? కమలేష్ జపాడియా ఆలోచించాడు. ఓ టీవీ కార్యక్రమం స్ఫూర్తితో మన దేశంలోని విద్యావిధానాన్నే మార్చేయాలని చూస్తున్నాడు. మార్చి తీరుతానని సవాల్ చేస్తున్నాడు. పొద్దున్న పది గంటలకు బడికెళ్లి, మూడింటి వరకూ పాఠాలు విని, ఆపైన ఓ గంట ఆటలాడి, నాలుగింటికి ఇంటికొచ్చేసేవాళ్లు ఒకప్పుడు విద్యార్థులు. కానీ ఇప్పుడు పొద్దున్న ఏడింటికల్లా బడిలో ఉండాలి. సాయంత్రం వరకూ పాఠాలు వింటూనే ఉండాలి. బడి అయ్యాక మళ్లీ అదనపు తరగతులు. ఆడుకోవడానికి ఓ అరగంట సమయం కూడా చిక్కదు. ఇది పిల్లల మనసులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని బాధపడ్డాడు కమలేష్. ఈ పరిస్థితి కారణం వారికి ఏర్పరచిన సిలబస్. ముందు దాన్ని మార్చాలి అనుకున్నాడు. అందుకుగాను ఎవ్వరూ ఊహించని ఓ సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. టీవీ షో స్ఫూర్తితో... గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన కమలేష్ జపాడియా (35) ప్రైమరీ స్కూల్ టీచర్. అందరు ఉపాధ్యాయుల్లాగే పిల్లలకు పాఠాలు బోధించినా... అందరిలాగా నేటి విద్యావిధానాన్ని అంగీకరించలేకపోయాడు కమలేష్. చదువుల పేరుతో పిల్లల అందమైన బాల్యాన్ని హరిస్తున్నామంటూ వేదన చెందేవాడు. ఓసారి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ చూస్తుండగా ఓ ఆలోచన వచ్చింది. ‘పిల్లల పాఠాలన్నీ ఆ ప్రోగ్రామ్లోలాగా బిట్ ఫార్మేట్లోకి మార్చేస్తే’... అనుకున్నాడు. తన ఆలోచన తనకే గొప్పగా అనిపించింది. కానీ ఇతరులు మాత్రం నవ్వారు. ‘పాఠాలన్నీ బిట్స్లాగా ఎలా మారుస్తాం, అదేమైనా చిన్న పనా’ అంటూ ఎగతాళి చేశారు. కానీ కమలేష్ ఫీలవలేదు. అనుకున్నది చేసి తీరాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగాడు. కమలేష్ ఉండే చోట అందుబాటులో ఇంటర్నెట్ లేదు. దాంతో రోజూ ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి ఇంటర్నెట్ కేఫ్‌కు వెళ్లేవాడు. తన ఆలోచనను అమలు చేసే పనుల్లో మునిగిపోయేవాడు. ఎట్టకేలకు ‘ఎడ్యుసఫర్’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించాడు. 1 నుంచి 10వ తరగతి వరకూ అన్ని సబ్జెక్టులనూ బిట్స్ రూపంలోకి మార్చేసి, తన వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. వాటిని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించాడు. త్వరలో ఒక ‘ఆప్’ని కూడా రూపొందించబోతున్నాడు. కమలేష్ పట్టుదల చూసి మొదట నవ్వినవారే ఇప్పుడు శభాష్ అంటున్నారు. అహ్మదాబాద్ ఐఐటీ కమలేష్ వెబ్‌సైట్‌ని చూసి ప్రశంసలు కురిపించింది. గుజరాత్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అతడిని సన్మానించింది. అయితే తనకు కావాల్సింది సన్మానాలు, ప్రశంసలు కాదంటాడు కమలేష్. ‘నా మెటీరియల్‌ని మన దేశంలోని అన్ని పాఠశాలలూ వినియోగించాలి. ఒత్తిడి లేని చదువుని పిల్లలకు అందించిననాడు నా శ్రమకు తగిన ఫలితం దక్కినట్టే’ అంటాడు కమలేష్.నిజమే. కమలేష్ ఆలోచన చాలా గొప్పది. దాన్ని అమలు చేసిన రోజున మన దేశంలోని విద్యా విధానం మారిపోతుంది. చదువుల భారం తగ్గి మన పిల్లల బాల్యమూ వికసిస్తుంది. -
టీవీ సీరియల్లో బిగ్ బీ
‘‘భారతీయ సినిమా వయసు వందేళ్లు. ఈ వందేళ్లల్లో సినిమా ఎంతో ఎదిగిన విషయం తెలిసిందే. వెండితెర అంత వయసు బుల్లితెరకు లేకపోయినా.. దాని ఎదుగుదల మాత్రం బ్రహ్మాండంగానే ఉంది. ముఖ్యంగా గత పదిహేను, ఇరవై ఏళ్లల్లో సినిమా వసూళ్లను సైతం తగ్గించే స్థాయికి బుల్లితెర ఎదిగింది’’ అంటున్నారు అమితాబ్ బచ్చన్. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ గేమ్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అమితాబ్ ఇప్పుడో ధారావాహికలో నటిస్తున్నారు. ‘యుద్ధ్’ పేరుతో రూపొందుతున్న ఈ సీరియల్లో అమితాబ్ పాత్ర పేరు ‘యుధిష్ఠిర్’. ఈ ధారావాహిక గురించి బిగ్ బీ చెబుతూ -‘‘ఎప్పటి నుంచో ఓ సీరియల్లో నటించాలనుకున్నా. ‘యుద్ధ్’ కథాంశం, పాత్ర నచ్చడంతో నటించాలనుకున్నా. దర్శకుడు అనురాగ్ కశ్యప్ విభిన్న తరహాలో ఈ సీరియల్ చేస్తానని మాటిచ్చారు. ఆ మాటను నిజం చేస్తూ, అద్భుతంగా తీస్తున్నారు’’ అని చెప్పారు. ఈ సీరియల్లో నటించడమే కాదు.. యశ్‌రాజ్ ఫిలింస్‌తో కలిసి దీన్ని ఆయన నిర్మిస్తున్నారు కూడా. ఓ వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవితంలో ఆరోగ్యం, ఇతర విషయాలపరంగా అతను ఎదుర్కొనే సమస్యలు, కుటుంబంతో అతని అనుబంధం నేపథ్యంలో ఈ సీరియల్ సాగుతుంది. అతని జీవితమే ఓ యుద్ధంలాంటిది కాబట్టే, ‘యుద్ధ్’ అని టైటిల్ పెట్టారు. -
బుల్లితెర వ్యాఖ్యాతగా..?
సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ బుల్లితెరపై చేసిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ కార్యక్రమం ప్రేరణతో చాలామంది అగ్రహీరోలు బుల్లితెరపైకి అడుగుపెట్టి రకరకాల షోలు చేశారు. తెలుగులో కూడా నాగార్జునలాంటి అగ్రహీరో అలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తే బావుంటుందనేది కొందరి అభిప్రాయం. నాగ్‌కి కూడా బుల్లితెరపై ఓ ప్రత్యేక అభిమానం ఉంది. ఆయన సారథ్యంలో పలు టీవీ సీరియల్స్ కూడా రూపొందాయి. అయితే ఆయన అక్కడితోనే ఆగిపోవాలనుకోవడం లేదు. ‘‘ఓ టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించాలని ఉంద’’ని ఫేస్ బుక్‌లో పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత కాలంలో టీవీ ఓ ముఖ్యమైన మాధ్యమం అయిపోయింది. ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ కావడానికి ఇదొక మంచి సాధనం’’ అని నాగ్ వ్యాఖ్యానించారు. ఈ మాటలను బట్టి చూస్తే త్వరలో నాగ్ బుల్లితెరపై ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లాంటి స్పెషల్ ప్రోగ్రామ్‌లో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. -
రిటైరయ్యే వయసులో రియల్ హీరో అయ్యాడు
పేరు చెప్పక్కర్లేదు. బిగ్ బి అంటే చాలు!. ఆయన నటన గురించి ఎందరు చెప్పినా... ఏం చెప్పినా... తక్కువే!. అలాంటి అమితాబ్‌కు రిటైర్మెంటు వయసులో వచ్చాయి కష్టాలు. అందరూ హాయిగా విశ్రాంత జీవితం గడపటానికి రెడీ అయ్యే సమయంలో ఆయన తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. నష్టాల్లో కూరుకుపోయిన సొంత కంపెనీ ఏబీసీఎల్... ఆయన్నూ కష్టాల్లోకి నెట్టేసింది. ఇల్లు కూడా అమ్మాల్సిన పరిస్థితి తలెత్తింది. మళ్లీ జీరో దగ్గర జీవితాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. సినిమాల్లో మాదిరే జీవితంలో కూడా అమితాబ్ హీరోలానే నిలబడ్డారు. కష్టాలకు ధైర్యంగా ఎదురొడ్డారు. కష్టాలనుంచి బైటపడ్డారు. కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షోతో నిజంగానే మళ్లీ కరోడ్‌పతి అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్‌నూ సక్సెస్ చేసి చూపించారు. ఒకప్పుడు దివాలా పరిస్థితి ఎదుర్కొన్న అమితాబ్ బచ్చన్ వ్యక్తిగత సంపద ప్రస్తుతం రూ.500 కోట్లపైనే ఉంటుందని అంచనా. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. 2013లో ఆయన ఆదాయం సుమారు రూ.147 కోట్లు. 70 ఏళ్లు దాటినా అదే ఉత్సాహంతో ఎడాపెడా సిని మాలు, ప్రకటనలు, టీవీ షోలూ చేస్తూనే ఉన్నారు బిగ్ బి. పెట్టుబడుల్లో వైవిధ్యం... అమితాబ్ తన పెట్టుబడుల్ని ఏ ఒక్క రంగానికో, ఏ ఒక్క సాధనానికో పరిమితం చేయలేదు. వైవిధ్యాన్ని పాటించారు. కొన్నాళ్ల కిందట వెల్లడించిన వివరాల ప్రకారం... బ్యాంకుల్లో ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ సుమారు రూ.92 కోట్లు. సేకరించిన కళాకృతుల విలువ సుమారు రూ.3 కోట్లు, బంగారం.. ఆభరణాలు మొదలైన వాటి విలువ దాదాపు రూ.25 కోట్లు. వ్యవసాయ.. వ్యవసాయేతర భూముల విలువ సుమారు రూ.30 కోట్లు. ఇక రియల్టీలో పెట్టుబడుల విలువ దాదాపు డెభ్బై కోట్ల పైనే ఉంటుంది. ఒకప్పుడు తనను నిలువునా ముంచిన ఏబీసీఎల్ కంపెనీని పునరుద్ధరించి ఏబీ కార్ప్‌గా మార్చారు అమితాబ్. పా లాంటి విజయవంతమైన సినిమాలూ తీశారు. అంతేకాక స్టాక్‌మార్కెట్లలోనూ ఇబ్బడిముబ్బడిగా ఇన్వెస్ట్ చేశారు. జస్ట్ డయల్ వంటి కంపెనీల షేర్లలో రూ.6 లక్షలు పెడితే.. ఆ విలువ ప్రస్తుతం రూ.10 కోట్లకు చేరింది. ఏతావాతా అమితాబ్ స్టోరీ చెప్పేదేంటంటే.. సంపాదించడమే కాదు. దాన్ని భద్రంగా చూసుకోవటమూ ముఖ్యమే. ఆ విషయాన్ని లేటుగా గుర్తించినా.. తగిన ప్రణాళికతో ముందుకెళ్లారు అమితాబ్. అందర్నీ గుడ్డిగా నమ్మకూడదని గుర్తించారు. డబ్బంతా ఒకేచోట ఇన్వెస్ట్ చేయకుండా రియల్టీ, ఎఫ్డీలు, బంగారం, కళాకృతులు ఇలా వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా తీర్చిదిద్దుకున్నారు.