టీవీ సీరియల్‌లో బిగ్ బీ
‘‘భారతీయ సినిమా వయసు వందేళ్లు. ఈ వందేళ్లల్లో సినిమా ఎంతో ఎదిగిన విషయం తెలిసిందే. వెండితెర అంత వయసు బుల్లితెరకు లేకపోయినా.. దాని ఎదుగుదల మాత్రం బ్రహ్మాండంగానే ఉంది. ముఖ్యంగా గత పదిహేను, ఇరవై ఏళ్లల్లో సినిమా వసూళ్లను సైతం తగ్గించే స్థాయికి బుల్లితెర ఎదిగింది’’ అంటున్నారు అమితాబ్ బచ్చన్. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ గేమ్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అమితాబ్ ఇప్పుడో ధారావాహికలో నటిస్తున్నారు. ‘యుద్ధ్’ పేరుతో రూపొందుతున్న ఈ సీరియల్‌లో అమితాబ్ పాత్ర పేరు ‘యుధిష్ఠిర్’.
ఈ ధారావాహిక గురించి బిగ్ బీ చెబుతూ -‘‘ఎప్పటి నుంచో ఓ సీరియల్‌లో నటించాలనుకున్నా. ‘యుద్ధ్’ కథాంశం, పాత్ర నచ్చడంతో నటించాలనుకున్నా. దర్శకుడు అనురాగ్ కశ్యప్ విభిన్న తరహాలో ఈ సీరియల్ చేస్తానని మాటిచ్చారు. ఆ మాటను నిజం చేస్తూ, అద్భుతంగా తీస్తున్నారు’’ అని చెప్పారు.
ఈ సీరియల్‌లో నటించడమే కాదు.. యశ్‌రాజ్ ఫిలింస్‌తో కలిసి దీన్ని ఆయన నిర్మిస్తున్నారు కూడా. ఓ వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవితంలో ఆరోగ్యం, ఇతర విషయాలపరంగా అతను ఎదుర్కొనే సమస్యలు, కుటుంబంతో అతని అనుబంధం నేపథ్యంలో ఈ సీరియల్ సాగుతుంది. అతని జీవితమే ఓ యుద్ధంలాంటిది కాబట్టే, ‘యుద్ధ్’ అని టైటిల్ పెట్టారు.