అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి అనారోగ్యం అడ్డంకి కాదని నిరూపించారు ఓ మహిళ. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో మునుపెన్నడూ లేనివిధంగా ఓ క్యాన్సర్ బాధితురాలు కోటి రూపాయలు సొంతం చేసుకున్నారు. తన తెలివితేటలతో, తెగువతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆవిడ పేరు... మేఘా పాటిల్. సాక్షి ఆమెను పలుకరించినప్పుడు, కేబీసీలో తను సాధించిన ఈ విజయం గురించి ఇలా ముచ్చటించారు!
మీ బ్యాగ్రౌండ్ గురించి చెప్తారా..?
మాది ముంబైకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఠాణే జిల్లాలోని వసాయి పట్టణం. మావారు దీపక్ పాటిల్ కేంద్ర ప్రభుత్వాధికారి. మాకు ఇద్దరు పిల్లలు. బాబు సంకేత్ ముంబై ఐఐటీలో ఇంజినీరింగ్ చేస్తున్నాడు. పాప సిద్ధి ఇంటర్ చదువుతోంది.
మీకు క్యాన్సర్ సోకిందని ఎప్పుడు తెలిసింది?
2006లో నాకు రొమ్ము కాన్యర్ ఉన్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ వార్త నాతోపాటు మా కుటుంబ సభ్యులందరినీ ఆందోళనకు గురి చేసింది. నన్ను రక్షించుకోవడానికి మావారు, పిల్లలు ఎంతో తపన పడ్డారు. అయితే నేను మాత్రం ఎప్పుడూ దైర్యం కోల్పోలేదు. మావారు, మా కుటుంబసభ్యులు చూపించిన ప్రేమాభిమానాలు నన్ను బలహీనపడనివ్వలేదు. అంతవరకూ చేసినట్టుగానే అన్ని పనులూ చేసుకో సాగాను. మొదట్నుంచీ చెప్పినట్టే పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పసాగాను. నాకేమీ కాదు అన్న సానుకూల దృక్పథంతోనే ఎప్పుడూ ఉన్నాను.
అసలు కేబీసీకి వెళ్లాలని ఎందుకు అనుకున్నారు?
చిన్నప్పటి నుంచి నేను పుస్తకాలు బాగా చదివేదాన్ని. ఇంగ్లీష్ మీడియంతో డిగ్రీ పూర్తి చేసిన నాకు ఇంటర్ నెట్ ద్వారా పలు రకాల విషయాలను తెలుసుకోవడం కూడా అలవాటు. పైగా పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పేదాన్నేమో... వీటన్నిటి వల్లా నాకు జనరల్ నాలెడ్జి కాస్త ఎక్కువే. కౌన్ బనేగా కరోడ్‌పతి చూస్తున్నప్పుడు అమితాబ్ ప్రశ్న అడగ్గానే హాట్ సీట్‌లో ఉన్నవాళ్లకంటే ముందు నేను జవాబు చెప్పేసేదాన్ని. అవన్నీ కరెక్ట్ అవ్వడం చూసి... నన్నూ కేబీసీకి వెళ్లమని మా అబ్బాయి, అమ్మాయి ప్రోత్సహించారు. దాంతో ప్రిపరేషన్ మొదలుపెట్టా.
మొదటి ప్రయత్నంలోనే ఎంపికయ్యారా?
లేదు. మొదటిసారి ఆడిషన్స్ వరకూ వెళ్లాను కానీ సెలెక్ట్ కాలేదు. ఈ యేడు మళ్లీ ప్రయత్నించాను. ఫాస్టెస్ట్ ఫింగర్‌లో గెలవగానే చెప్పలేనంత సంతోషం వేసింది. అక్టోబరు నాలుగవ తేదీన హాట్ సీట్‌పై కూర్చోగానే నాలో ఒక రకమైన భయం! కానీ అమితాబ్ తనదైన శైలిలో మాట్లాడుతూ నా భయాన్ని, అయోమయాన్ని చాలావరకూ పోగొట్టారు. తర్వాత ఆట ప్రారంభమైంది. మెల్లగా ఒక్కో ప్రశ్నకూ సమాధానం చెబుతూ వెళ్లాను.
కోటి రూపాయలు గెల్చుకోగానే ఏమనిపించింది?
మొదట నమ్మలేకపోయాను. మహా అయితే రూ. 25 లక్షల వరకు గెలుస్తాననుకున్నాను. కోటి రూపాయల కోసం ప్రశ్న వేసినప్పుడు కొంత అయోమయానికి కూడా గురయ్యా. ఒకే ఒక్క లైఫ్ లైన్ ఉంది... ఫోనో ఫ్రెండ్. దాన్ని వినియోగించుకున్నాను. మా అబ్బాయి సంకేత్‌కు ఫోన్ కలిపిచ్చిన తర్వాత తను నా సమాధానం నూరుశాతం కరెక్ట్ అని చెప్పాడు. అయినా ఆ ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. చివరికి కోటి రూపాయలు గెల్చుకున్నానని అమితాబ్ ప్రకటించారు. నమ్మలేక కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయా!
ఈ డబ్బులతో ఏం చేయాలనుకుంటున్నారు?
నా రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం మావారు చాలా ఖర్చు పెట్టారు. ఇప్పుడు క్యాన్సర్ లివర్‌కు కూడా పాకింది. టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. ఇప్పటికే నా వైద్యం కోసం తీసుకున్న అప్పులు చాలా ఉన్నాయి. అవన్నీ తీర్చాలి. కొంత సొమ్ము మా పిల్లలిద్దరి కోసం కూడా వినియోగిస్తాను.
మీలాంటి వారికి మీరిచ్చే సందేశం ఏమిటి?
ఎలాంటి సందర్భంలోనైనా సరే, పాజిటివ్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఆరోగ్యం బాగాలేదని ఇంట్లో కూర్చుంటే ఏది కాదు. పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయాలి.
ఇదీ... మేఘా పాటిల్ అంతరంగం. కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న మేఘ, త్వరలోనే క్యాన్సర్‌పై కూడా గెలుపు సాధించాలని కోరుకుందాం!
- గుండారపు శ్రీనివాస్; ఫొటోలు: పిట్ల రాము
సానుకూల దృక్పథమే...సాధించేలా చేసింది!
Published Sun, Oct 19 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM
Advertisement
Advertisement