లండన్ : మీ ప్లేట్‌లో ఆహార పదార్ధాలు ఏమి ఉన్నాయనే దాని కంటే ఏ సమయంలో వాటిని తీసుకుంటున్నారనేదే ప్రధానమని తాజా అధ్యయనం స్పష్టంచేసింది. ఆహారం తీసుకునే సమయాన్ని బట్టి జీవగడియారంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి, జీవక్రియలు, జీర్ణశక్తిపై ప్రభావం గురించి శాస్త్రవేత్తలు పరీక్షించారు. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ శాస్త్రవేత్తలు ఎలుకలపై సాగించిన పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
మనం ఆహారం తీసుకున్న సమయంలో మన శరీరం విడుదల చేసే ఇన్సులిన్ జీవగడియారంపై, కణాలన్నీ కలిసి పనిచేయడంపై ప్రభావాన్ని ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అర్ధరాత్రి ఆహారం తీసుకుంటే అపసవ్య సమయంలో శరీరం ఇన్సులిన్‌ను విడుదల చేయడం ద్వారా శరీరతత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడైంది. సూర్యాస్తమయంలోపే శరీరానికి అవసరమైన 75 శాతం ఆహారాన్ని తీసుకోవాలని పరిశోధకులు సూచించారు.
జీవగడియారం లయ తప్పడంతోనే డయాబెటిస్, స్ధూలకాయం, జీవక్రియల లోపాలు, గుండె సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఆధునిక జీవితంలో ఉద్యోగుల షిఫ్ట్ సమయాలు, నిద్ర లేమి వంటివి మన జీవగడియారాలను విచ్ఛిన్నం చేస్తున్నాయని అధ్యయనంలో పాలుపంచుకున్న వర్సిటీ సీనియర్ లెక్చర్ డాక్టర్ డేవిడ్ బెక్ వెల్లడించారు.