Biological Clock
-
జీవ గడియారం... ఆరోగ్యానికీ సూచికే
వాషింగ్టన్: విదేశాల నుంచి విమానంలో వచ్చినవారు రెండు మూడు రోజుల దాకా జెట్‌లాగ్‌తో ఇబ్బంది పడడం తెలిసిందే. వారి శరీరంలోని జీవగడియారం అస్తవ్యస్తం కావడమే ఇందుకు కారణం. ఇది మన ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఒక క్రమపద్ధతి, క్రమశిక్షణకు శరీరం అలవాటు పడుతుంది. అందులో హఠాత్తుగా మార్పు వస్తే శరీరం వెంటనే ఆ మార్పును అందిపుచ్చుకోలేదు. ఫలితంగా జీవ క్రియలు దెబ్బతింటాయని, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జీవగడియారాన్ని సిర్కాడియన్ రిథమ్ అని పిలుస్తారు. మెదడు మధ్యభాగానికి సమీపంలో హైపోథాలమస్ ఉంటుంది. ఇందులోని 20,000 న్యూరాన్లతో జీవగడియారం ఏర్పడుతుంది. ఊపిరి పీల్చడం, శరీరంలో రక్త ప్రసరణ వంటి అసంకల్పిత చర్యలను సమన్వయం చేసే బాధ్యత హైపోథాలమస్దే. చాలామంది భావిస్తున్నట్లు జీవ గడియారం కేవలం మనుషుల్లోనే కాదు.. జంతువులు, పక్షులు, మొక్కలు, ఫంగస్, బ్యాక్టీరియాలోనూ ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో కొన్ని రకాల జీవులు చురుగ్గా ఉండడానికి, నిర్దేశిత సమయాల్లో మొగ్గలు పువ్వులుగా వికసించడానికి వాటిలోని జీవగడియారమే కారణం. హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతే.. మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే వారిలో జీవగడియారం చక్కగా పనిచేయాలి. రోజువారీగా ఆహారం, కాంతి వంటి వాటికి శరీర భౌతిక, మానసిక, ప్రవర్తనాపరమైన మార్పులను జీవగడియారమే నిర్దేశిస్తుంది. వయసు పెరుగుతున్నకొద్దీ జీవగడియారం పనితీరు సైతం మందగిస్తుంది. సిర్కాడియన్ క్లాక్ జీన్స్‌లో మ్యుటేషన్ల వల్ల నిద్రపట్టకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. రాత్రిపూట పనిచేసేవారిలో సిర్కాడియన్ రిథమ్ సక్రమంగా ఉండదు. ఫలితంగా స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్, క్యాన్సర్, కార్డియో వాస్క్యులర్ వ్యాధులు, భౌతిక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. మెదడులోని పినియల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. చీకటి పడిన తర్వాత నిద్ర ముంచుకు రావడానికి ఈ హార్మోన్ దోహదపడుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే నీలిరంగు కాంతి వల్ల మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. చివరకు నిద్రకు అంతరాయం కలుగుతుంది. అందుకే నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆకలిని నియంత్రించే హార్మోన్ లెప్టిన్. సరైన నిద్ర ఉంటేనే లెప్టిన్ ఉత్పత్తి చక్కగా ఉంటుంది. రోజూ ఒకే సమయంలో ఆహారం తీసుకోవడం, నిద్రించడం వం అలవర్చుకుంటే శరీరం సానుకూలంగా ప్రతిస్పందిస్తుందని, జీవగడియారం పనితీరు మెరుగవుతుందని, శారీరక, మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయని పరిశోధకులు వెల్లడించారు. క్యాన్సర్ కీమోథెరఫీ, యాంటీ–ఒబేసిటీ చికిత్సలకు జీవగడియారం పనితీరు చాలా కీలకమని తెలియజేశారు. సిర్కాడియన్ క్లాక్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరగుతున్నాయి. దీనిపై తెలుసుకోవాల్సిన సమాచారం ఇంకా చాలా ఉందని ఉందని అంటున్నారు. -
సమయానికి తగు ఆహారమే మేలు..
లండన్ : మీ ప్లేట్లో ఆహార పదార్ధాలు ఏమి ఉన్నాయనే దాని కంటే ఏ సమయంలో వాటిని తీసుకుంటున్నారనేదే ప్రధానమని తాజా అధ్యయనం స్పష్టంచేసింది. ఆహారం తీసుకునే సమయాన్ని బట్టి జీవగడియారంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి, జీవక్రియలు, జీర్ణశక్తిపై ప్రభావం గురించి శాస్త్రవేత్తలు పరీక్షించారు. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ శాస్త్రవేత్తలు ఎలుకలపై సాగించిన పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మనం ఆహారం తీసుకున్న సమయంలో మన శరీరం విడుదల చేసే ఇన్సులిన్ జీవగడియారంపై, కణాలన్నీ కలిసి పనిచేయడంపై ప్రభావాన్ని ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అర్ధరాత్రి ఆహారం తీసుకుంటే అపసవ్య సమయంలో శరీరం ఇన్సులిన్‌ను విడుదల చేయడం ద్వారా శరీరతత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడైంది. సూర్యాస్తమయంలోపే శరీరానికి అవసరమైన 75 శాతం ఆహారాన్ని తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. జీవగడియారం లయ తప్పడంతోనే డయాబెటిస్, స్ధూలకాయం, జీవక్రియల లోపాలు, గుండె సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఆధునిక జీవితంలో ఉద్యోగుల షిఫ్ట్ సమయాలు, నిద్ర లేమి వంటివి మన జీవగడియారాలను విచ్ఛిన్నం చేస్తున్నాయని అధ్యయనంలో పాలుపంచుకున్న వర్సిటీ సీనియర్ లెక్చర్ డాక్టర్ డేవిడ్ బెక్ వెల్లడించారు. -
జీవితాన్నే మార్చిన ఐడియా..
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు.. బెంగళూరు కుర్రాడు సమయ్ గోధిక ఇప్పుడు ఇదే అనుకుంటూ ఉంటాడు.. ఎందుకంటే పదహారేళ్ళ ఈ నేషనల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి ఐడియా కోట్ల రూపాయల బహుమతి తెచ్చి పెట్టింది మరీ. ఎలాగంటారా... ‘బ్రేక్ త్రూ జూనియర్ చాలెంజ్ ’పేరుతో నిర్వహించిన ఒక అంతర్జాతీయ పోటీలో సమయ్ తొలి స్థానంలో నిలిచాడు. జీవ, భౌతిక శాస్త్రాల్లో కొత్త, వినూత్న ఐడియాలను సులువైన భాషలో అందరికీ అర్థమయ్యేలా 3 నిముషాల వీడియో తీసి పంపడం ఈ పోటీ లక్ష్యం. సమయ్.. 24 గంటల మనిషి జీవితంలో గడియారానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన ఆలోచనను వీడియోగా పంపారు. మెచ్చిన న్యాయ నిర్ణేతల బృందం సమయ్కు రెండు లక్షల యాభై వేల డాలర్ల (రూ.1.8 కోట్ల) బహుమతి ప్రకటించింది. అంతేకాకుండా సమయ్ సైన్స్ టీచర్ ప్రమీల మీనన్‌కి రూ.36 లక్షలు, పాఠశాలలో పరిశోధనశాల ఏర్పాటుకు రూ.కోటి అందించారు. ఇంతకీ సమయ్ దేని గురించి వీడియో పంపాడో తెలుసా.. మన జీవగడియారానికి పార్కిన్సన్స్ వ్యాధికి ఉన్న సంబందంపై వీడియో రూపొందించి పంపాడు. -
జీవగడియారం గుట్టు తెలిపే రక్తపరీక్ష
లండన్ : మనం ఏ సమయంలో ఏం చేయాలనే విషయాలను ఎప్పటికప్పుడు నిర్ధేశించే జీవగడియారం ఆనుపానులు తెలిసే ఆవిష్కరణకు బీజం పడింది. శరీరం లోపలి గడియారాన్ని 90 నిమిషాల్లో కొలిచే సులువైన రక్తపరీక్షను రూపొందించామని నార్త్‌వెస్ర్టన్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. భవిష్యత్తులో వ్యక్తుల వారీగా వైద్య చికిత్సలు అందించేందుకు ఇది దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శరీరంలోని సమస్త కణాలను నిర్ధేశించే సర్కాడియన్ రిథం ఎన్నో ఏళ్ల నుంచి పరిశోధనలకు కేంద్రంగా మారింది. మనం నిద్రించే సమయంలో, ఆకలి వేసే సమయంలో, వ్యాది నిరోధక వ్యవస్ధ చురుకుగా ఉన్నప్పుడు, రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు..ఇలా మన శరీరంలో అన్ని జీవ ప్రక్రియల్లోనూ జీవగడియారం శరీర విధులను నియంత్రిస్తుందని నార్త్‌వెస్ర్టన్ యూనివర్సిటీ బయోస్టాటిస్టిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోస్‌మేరీ బ్రాన్ పేర్కొన్నారు. జీవగడియారం శరీర విధులను సరిగ్గా నియంత్రించలేని సమయంలో అల్జీమర్స్, గుండెసమస్యలు, మధుమేహం వంటి వ్యాధులకు దీనితో నేరుగా సంబంధం ఉందని గుర్తించామన్నారు. ఈ అథ్యయనం కోసం తాము 73 మంది నుంచి 1100 రక్తనమూనాలను సేకరించామని, ప్రతి రెండు గంటలకు శాంపిల్స్ తీసుకుని రోజు మొత్తంలో జన్యువుల కదలికల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది పరిశీలించామని పరిశోధకులు తెలిపారు. ఈ రక్తపరీక్షలో వ్యక్తి శరీర గడియారం రోజులో సమయాన్ని కచ్చితంగా నిర్ధారించగలిగామని వెల్లడించారు. -
మన 'శరీరం' దాని చేతిలోనే
తెల్లవారుతుండగానే ఒళ్లంతా చైతన్యం నింపుకొంటుంది. మళ్లీ రాత్రవుతుందంటే కళ్లు బరువెక్కుతాయి. నిద్ర తన్నుకు వస్తుంది. మనుషుల్లోనే కాదు అన్ని జీవుల్లోనూ సమయాభేదంతో ఈ లక్షణం కనిపిస్తుంటుంది. మన శరీరంలోని జీవ గడియారమే (సిర్కాడియమ్ రిథమ్) దీనికి కారణం. అన్ని రకాల జీవజాలంలో ఉండే ఈ జీవ గడియారం.. వాటికి అవసరమైన సమయాలను బట్టి ప్రతిస్పందిస్తుంటుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది, ఏ జన్యువు, ప్రొటీన్ల పాత్ర ఏమిటనేది కొన్నేళ్ల కిందటి వరకు తెలియదు. శాస్త్రవేత్తలు జెఫ్రీ సి.హాల్, మైకేల్ రోస్బాష్, మైకేల్ డబ్ల్యూ.యంగ్లు తమ ప్రయోగాల ద్వారా ఆ జీవ గడియారం గుట్టు విప్పారు. ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ దక్కించుకున్న వారి పరిశోధన ప్రాముఖ్యత, వివరాలేమిటో తెలుసుకుందాం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ జీవ గడియారం గుట్టు తేల్చేందుకు జెఫ్రీ సి.హాల్, మైకేల్ రోస్ బాష్, మైకేల్ డబ్ల్యూ.యంగ్లు సాధారణ ఈగలపై ప్రయోగాలు నిర్వ హించారు. అవి నిద్రించే సమయం, చురుగ్గా మారే సమయాల్లో వాటి శరీరంలో జరుగుతున్న మార్పులకు కారణాలను అన్వేషించారు. ఒక జన్యువు ఈ గడియారం మొత్తాన్ని నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. ఆ జన్యువు ఉత్పత్తి చేసే ఒక ప్రొటీన్ రాత్రిపూట మనం నిద్రపోయేప్పుడు కణాల్లో నిల్వ అవుతూ ఉంటుందని.. అదే పగటిపూట మాత్రం క్రమేపీ నశించిపోతూ ఉంటుందని గమనించారు. ఆ జన్యువుతో పాటు కొన్ని ఇతర ప్రొటీన్ భాగాలు కణం లోపల జీవగడియారం పనిచేసేందుకు ఉపయోగపడుతున్నట్లు తేల్చారు. ఇది ఎంతో కచ్చితం.. శరీర కణాల్లోని గడియారం మన భౌతిక అవసరాలకు తగ్గట్టుగా తనను తాను సరిచేసు కుంటూ పనిచేస్తూ ఉంటుంది. ఏ సమయంలో నిద్ర నుంచి మేల్కోవాలి, హార్మోన్ల మోతాదు ఎంత ఉండాలి, జీవక్రియలు జరిగే వేగం, శరీర ఉష్ణోగ్రత తీరు వంటి అంశాలన్నింటినీ జీవ గడియారం నియంత్రిస్తుంటుంది. ఉక్క పోయడం వల్ల రాత్రి నిద్ర పట్టకపోయినా, అర్ధరాత్రి, అపరాత్రి ఇష్టమొచ్చినట్లు ఆహారం తీసుకున్నా అందుకు తగ్గట్టుగా ఈ గడియారం పనితీరుపై ప్రభావం పడుతుంది. ఉదయం లేవగానే చికాకుగా ఉండటం జీవ గడియారం పనితీరు మారిందనే దానికి ఉదాహరణ. మొత్తంగా బయటి పరిస్థితులకు, జీవ గడియారం పనితీరుకు మధ్య తేడాలు వస్తే.. శరీరం అనారోగ్యానికి లోనయ్యే అవకాశాలు పెరుగుతాయి. మొక్కల్లో 18వ శతాబ్దంలోనే.. పరిసరాల్లోని మార్పులను ఊహించి అందుకు తగ్గట్టుగా జీవక్రియల్లో మార్పులు చేసే కణ గడియారాన్ని తొలుత మొక్కల్లో గుర్తించారు. 18వ శతాబ్దంలోనే జీన్ జాక్వెస్ డోర్టస్ అనే ఖగోళ శాస్త్రవేత్త ‘మిమోస’ అనే మొక్కల ఆకులు పగటిపూట విచ్చుకుని, రాత్రిపూట వాలిపోయి ఉండటాన్ని గమనించి.. పరిశోధన చేశారు. అసలు వెలుతురే లేకపోతే ఈ మొక్కలు ఎలా ప్రతిస్పందిస్తాయో చూద్దామని.. కొన్ని మొక్కలను చీకట్లో ఉంచి పరిశీలించారు. చిత్రంగా మొక్కల్లోని కణ గడియారం సమయానికి తగినట్లుగా జీవ క్రియలను ఉత్తేజితం చేసింది. కానీ ఆ తర్వాత చీకటి పరిస్థితికి అనుగుణంగా పనితీరు మారిపోయింది. అనంతరకాలంలో జంతువుల్లోనూ జీవ గడియారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు స్పష్టతకు వచ్చారు. కానీ ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్నది మాత్రం ఇటీవలి వరకూ మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రొటీన్లే కారణం.. 1970 సమయంలో సెమ్యూర్ బెంజర్ అనే శాస్త్రవేత్త తన విద్యార్థి రొనాల్డ్ కోనోప్కతో కలసి చేసిన కొన్ని ప్రయోగాలు జీవ గడియారాన్ని గుర్తించేందుకు బీజం వేశాయి. ఈగలపై వారు చేసిన ప్రయోగాల్లో ఒక జన్యువులో మార్పులు చేయడంతో కణ గడియారం దెబ్బతిన్నట్లు గుర్తించి.. ఆ జన్యువుకు ‘పీరియడ్’ అని పేరు పెట్టారు. కానీ ఆ జన్యువు జీవ గడియారాన్ని ఎలా నియంత్రిస్తుందన్న అంశాన్ని 1984లో జెఫ్రీ హాల్, మైకేల్ రోస్బాష్ అనే శాస్త్రవేత్తలు తేల్చారు. పీరియడ్ జన్యువు ఉత్పత్తి చేసే ప్రొటీన్‌ను వారు గుర్తించారు. ఇక జీవ గడియారం నియంత్రణకు మరికొన్ని ప్రొటీన్లు కూడా అవసరమని 1994లో మైకేల్ యంగ్ అనే శాస్త్రవేత్త తేల్చారు. దాంతో మొత్తంగా జీవ గడియారం వ్యవస్థకు సంబంధించిన అంశాలపై స్పష్టత వచ్చింది. నోబెల్ వరించింది.. మానవుడు, జంతువులతో పాటు ఇతర జీవుల్లో నిద్రపోయే, మేల్కొనే సమయాలను నియంత్రించే జీవ గడియారం (సిర్కాడియమ్ రిథమ్) రహస్యాన్ని శోధించినందుకు గాను అమెరికాకు చెందిన ముగ్గురు జన్యు శాస్త్రవేత్తలు జెఫ్రీ సి.హాల్, మైకేల్ రోస్బాష్, మైకేల్ డబ్ల్యూ.యంగ్లు వైద్య రంగంలో నోబెల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు నోబెల్ అవార్డులు–2017లో భాగంగా తొలుత వైద్య రంగానికి సంబంధించిన నోబెల్ అవార్డును నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. అలాగే ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు 1.1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.7 కోట్లు)ను సంయుక్తంగా పంచుకోనున్నారు. ‘భూమిపై నివసించే ప్రతి జీవి భూ పరిభ్రమణానికి అనుగుణంగా జీవిస్తుందని గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే జీవుల్లో రోజువారీ క్రియలైన నిద్ర, ఆహార అలవాట్లు, హార్మోన్స్ విడుదల, శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించే సిర్కాడియమ్ క్లాక్ పనితీరును శరీరంలోని కణాలు ఏవిధంగా తమ అధీనంలో ఉంచుకుంటా యో ప్రస్తుతం ఈ ముగ్గురు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు’అని నోబెల్ కమిటీ తెలిపింది. అలాగే మానవులు, జంతువులు, మొక్కలు జీవన గమనం (బయోలాజికల్ రిథమ్)కు ఇమిడిపోయే విధానాన్ని పరిశోధకులు వివరించారు. సిర్కాడియమ్ క్లాక్ సరిగ్గా పనిచేయని సందర్భాల్లో ఒత్తిడి, బైపోలార్ డిజార్డర్‌లతోపాటు కొన్ని రకాల నాడీ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిపారు. షిఫ్ట్‌ల వారీగా ఉద్యోగం చేసేవారిలో రోజువారీ జీవక్రియలు, సిర్కాడియమ్ క్లాక్ మధ్య వ్యత్యాసం ఏర్పడి ప్రాణాంతక వ్యాధులైన కేన్సర్, జీవక్రియ రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు తేలింది. మొత్తంగా బయటి వాతావరణానికి, జీవ గడియారం మధ్య ఏర్పడే వ్యత్యాసం వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదమున్నట్లు తెలిపారు. మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకుగాను మాలిక్యులార్ మెకానిజమ్ ద్వారా సిర్కాడియమ్ రిథమ్‌ను కంట్రోల్ చేసే విధానాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. పీరియడ్ అనే జన్యువు విడుదల చేసే ప్రొటీన్‌తో పాటు మరికొన్ని ప్రొటీన్లు జీవ గడియారాన్ని నియంత్రిస్తాయని వారు కనుగొన్నారు. ప్రతీ ఏడాది తొలుత వైద్య రంగంలో నోబెల్‌ను ప్రకటిస్తారు. ఇక మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి విభాగాల్లో నోబెల్ అవార్డులను నిర్వాహకులు ప్రకటించనున్నారు. -
త్వరలో... జెట్‌లాగ్‌కు చుక్కల మందు!
పరిపరిశోధన జెట్‌లాగ్‌ను తగ్గించే చుక్కల మందును రూపొందించే పనిలో ఉన్నారు స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడింబర్గ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. కళ్లలో కాస్త చుక్కల మందు వేయడం ద్వారా బయలాజికల్ క్లాక్‌ను సరిచేసి, జెట్లాగ్ అనర్థాలను తగ్గించవచ్చని వారు పేర్కొంటున్నారు. వెలుతురు రాగానే నిద్రలేవడం, చీకటి పడ్డ తర్వాత నిద్రకు ఉపక్రమించడం అన్నది మన జీవగడియారంలో మనం స్వాభావికంగా సెట్ అయి ఉండటం వల్ల సాధ్యపడుతోందన్న విషయం తెలిసిందే. ఇలా లయబద్ధంగా నిద్రలేవడం, నిద్రరావడాన్ని సర్కాడియన్ రిథమ్‌గా పేర్కొంటాం. మనకు రాత్రీ, విదేశాల్లో పగలు ఉండే దేశాలకు వెళ్లినప్పుడు లేదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు జీవగడియారంలో సెట్ అయిన ప్రోగ్రామ్ అయిన సర్కాడియన్ రిథమ్‌కు విఘాతం కలుగుతుంది. ఫలితంగా రాత్రిళ్లు నిద్రలేకపోవడం లేదా పగటివేళ నిద్రముంచుకురావడం వంటి అనర్థాలు కలుగుతుంటాయి. దీన్నే జెట్లాగ్గా అభివర్ణిస్తారు. కళ్లలో వేసే ఈ మందు... మెదడులో జీవగడియారం ఉండే ప్రాంతంలోని కణాలతో అనుసంధానితమై జెట్లాగ్ నివారిస్తుందని పేర్కొంటున్నారు ఎడింబర్గ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. అంతేకాదు... ఈ చుక్కల మందు పరిజ్ఞానాన్ని భవిష్యత్తులో రాత్రివేళల్లో పనిచేయాల్సి రావడం వల్ల పగలు ఇబ్బంది పడేవారికీ ఉపయోగించవచ్చునని పరిశోధకులు పేర్కొంటున్నారు. -
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చు!
లండన్: భవిష్యత్తు గురించే కాదు మరణం ఎప్పుడు సంభవిస్తుందో కూడా తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనిషి డీఎన్ఏలో రసాయన మార్పులను బట్టి అవయవాల పనితీరు, వాటి వయసును తెలిపే జీవగడియారాన్ని ఎడిన్‌బరో వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా మనిషి జీవిత కాలాన్ని గుర్తించవచ్చని వారు అంటున్నారు. ఈ జీవ గడియారం వయసుకు మనిషి వయసుకు మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి వారు ఓ నమూనా తయారు చేశారు. 5 వేల మంది వృద్ధుల జీవన విధానాన్ని 14 ఏళ్ల పాటు గమనించి దీన్ని రూపొందించారు. దీని ప్రకారం జీవగడియారం వయసుతో సమానంగా ఉన్న వారితో పోలిస్తే వ్యక్తి వయసు కన్నా జీవగడియారం వయసు ఎక్కువగా ఉన్న వారు మరణానికి దగ్గరగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. దీంతో పాటు ధూమపానం, మధుమేహం, హృద్రోగ వ్యాధుల ద్వారా సంభవించే మరణాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. జీవన విధానం, జన్యు కారకాల్లో ఏది జీవ గడియార వయసును ప్రభావితం చేస్తుందో స్పష్టంగా తెలియరాలేదని మారియోని అనే శాస్త్రవేత్త తెలిపారు.