University of Manchester
-
కేజీతండా వాసికి అరుదైన అవకాశం
జఫర్‌గఢ్: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం రేగడి తండా శివారు ఖాజనగండి (కేజీ తండా)కు చెందిన లకావత్ బాలాజీకి లండన్‌లోని మాన్చెస్టర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే అరుదైన అవకాశం లభించింది. మిట్యనాయక్, సత్తమ్మ దంపతుల నాలుగో కుమారుడు బాలాజి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రాథమిక విద్యను జఫర్‌గఢ్‌లో, అలాగే 8, 9, 10వ తరగతులను ఆలేరులోని ఎస్టీ హాస్టల్ ఉండి పూర్తి చేశాడు. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ సాధించి హైదరాబాద్‌లోని అరబిందో జూనియర్ కళాశాలలో ఉచిత ప్రవేశం పొందాడు. ఇంటర్ అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఐదేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తి చేశాడు. తర్వాత లండన్‌లోని కార్డి యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తయిన తర్వాత మాన్చెస్టర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించాడు. మారుమూల ప్రాంతానికి చెందిన బాలాజీ లండన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులతో పాటు తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. -
సమయానికి తగు ఆహారమే మేలు..
లండన్ : మీ ప్లేట్లో ఆహార పదార్ధాలు ఏమి ఉన్నాయనే దాని కంటే ఏ సమయంలో వాటిని తీసుకుంటున్నారనేదే ప్రధానమని తాజా అధ్యయనం స్పష్టంచేసింది. ఆహారం తీసుకునే సమయాన్ని బట్టి జీవగడియారంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి, జీవక్రియలు, జీర్ణశక్తిపై ప్రభావం గురించి శాస్త్రవేత్తలు పరీక్షించారు. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ శాస్త్రవేత్తలు ఎలుకలపై సాగించిన పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మనం ఆహారం తీసుకున్న సమయంలో మన శరీరం విడుదల చేసే ఇన్సులిన్ జీవగడియారంపై, కణాలన్నీ కలిసి పనిచేయడంపై ప్రభావాన్ని ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అర్ధరాత్రి ఆహారం తీసుకుంటే అపసవ్య సమయంలో శరీరం ఇన్సులిన్‌ను విడుదల చేయడం ద్వారా శరీరతత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడైంది. సూర్యాస్తమయంలోపే శరీరానికి అవసరమైన 75 శాతం ఆహారాన్ని తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. జీవగడియారం లయ తప్పడంతోనే డయాబెటిస్, స్ధూలకాయం, జీవక్రియల లోపాలు, గుండె సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఆధునిక జీవితంలో ఉద్యోగుల షిఫ్ట్ సమయాలు, నిద్ర లేమి వంటివి మన జీవగడియారాలను విచ్ఛిన్నం చేస్తున్నాయని అధ్యయనంలో పాలుపంచుకున్న వర్సిటీ సీనియర్ లెక్చర్ డాక్టర్ డేవిడ్ బెక్ వెల్లడించారు. -
అలాంటి జాబ్ కంటే నిరుద్యోగమే బెటర్
లండన్: చాలీచాలని వేతనాలు, తీవ్ర ఒత్తిడితో చేసే ఉద్యోగాలతో ఆరోగ్యం దెబ్బతినటం ఖాయమని ఓ తాజా అధ్యయనంలో తేలింది. అలాంటి ఉద్యోగుల కన్నా నిరుద్యోగులులే ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని సర్వేలో తేలింది. యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు 2009-2010లో 35-75 ఏళ్ల వయసు వారిని వెయ్యి మందిని తీసుకున్నారు. వారి వారి వృత్తి వివరాలు, సంతృప్తి స్థాయిలు, వారి ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు, ఒత్తిడి స్థాయిలు, హార్మోన్లు, తదితర అంశాలు పరిశీలించాక ఈ విషయం ఇటీవల రూఢీ చేసుకున్నారు. ఈ పరిశోధకుల బృందంలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ తరణి చందోలా కూడా ఉన్నారు. ఆమె దీనిపై మాట్లాడుతూ.. ఏ పనీ చేయకుండా ఉండే యువత కంటే చిన్న చిన్న జాబ్‌లు చేసేవారే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తమ అధ్యయనాల్లో రుజవయిందన్నారు. అదే మంచి ఉద్యోగాలు చేసే వారిలో ఆరోగ్య స్థాయిలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. తగిన వేతనాలు, తక్కువ ఒత్తిడిలో పనిచేసే వారు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. చేసే పనికి, ఆరోగ్యానికి ఉన్న సంబంధం విడదీయరానిదని స్పష్టం చేశారు. ఈ అధ్యయన ఫలితాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడమియోలజీ ఇటీవల ప్రచురించింది. -
స్కాలర్షిప్
యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీ.. ఎంఎస్సీ విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌లకు భారతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: ఎంఎస్సీ సోషల్ రీసెర్చ్ మెథడ్స్ అండ్ స్టాటిస్టిక్స్ స్కాలర్‌షిప్‌ల సంఖ్య : 5 స్కాలర్షిప్: 6,000 యూరోలు వ్యవధి: ఫుల్‌టైమ్ 12 నెలలు, పార్ట్‌టైమ్ 24 నెలలు దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 2016 జూన్ 2 వెబ్సైట్: www.manchester.ac.uk -
లండన్ రైలు ప్రమాదంలో కానూరు విద్యార్థి మృతి
పెనమలూరు : లండన్‌లో ఎంఎస్ చదివేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు. కానూరులో ఉంటున్న ఇంజినీర్ దేవభక్తుని వినయ్‌కుమార్ కుమారుడు సుజిత్ ఈ నెల 21వ తేదీన లండన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. అక్కడినుంచి నివాసమండే రూమ్‌కు వెళ్లడానికి 22వ తేదీ సాయంత్రం లోకల్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఫోన్ మాట్లాడుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో సుజిత్ మృతి చెందాడు. అతడు ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చేశాడు. సుజిత్ భౌతికకాయాన్ని సోమవారం వీరులపాడులో ఉంటున్న తాత దేవభక్తుని రామమోహనరావు ఇంటికి తీసుకొస్తారని కుటుంబసభ్యులు తెలిపారు.