కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 52 ఏళ్లు. నేను తరచూ మాంసాహారం తీసుకుంటూ ఉంటాను. ఇది గుండెకు అంత మంచిది కాదనీ, ఆ ఆహార అలవాట్ల వల్ల గుండె దెబ్బతింటుందని కొందరు చెబుతున్నారు. ఇది నిజమేనా? మాంసాహారంతో గుండెజబ్బులు వస్తాయా? దయచేసి వివరించండి.
- షరీఫ్, హైదరాబాద్
గుండెజబ్బులకు కొలెస్ట్రాల్ ఒక కచ్చితమైన రిస్క్‌ఫ్యాక్టర్. మాంసాహారం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఫాస్ట్‌ఫుడ్స్‌లో ఇది ఎక్కువ. కొలెస్ట్రాల్ రెండు రకాలు. గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్‌ను ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రొటీన్) అనీ, మేలు చేసేదాన్ని హెచ్‌డీఎల్ (హై డెన్సీటీ లైపోప్రొటీన్) అని అంటారు. మన రక్తంలో ఎల్‌డీఎల్ 100 కంటే తక్కువగానూ, హెచ్‌డీఎల్ 40 కంటే ఎక్కువగానూ ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరానికి రెండు రకాలుగా అందుతుంది. మొదటిది ఆహారం ద్వారా, రెండోది కాలేయం పనితీరు వల్ల.
శిశువు పుట్టినప్పుడు శరీరంలో 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు, నరాల వ్యవస్థ ఇలా శిశువు పూర్తిగా ఎదగడానికి రెండేళ్ల వయసు వచ్చే వరకు కొలెస్త్రాల్ ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది. రెండేళ్ల తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే వ్యక్తుల్లోని జన్యుతత్వాన్ని బట్టి కూడా మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి ఎక్కువ/తక్కువగా అవుతుంటుంది. మాంసాహారం మాత్రమేగాక... వేపుళ్లు, బేకరీ పదార్థాలు, నెయ్యి లాంటి వాటిని పరిమితి కంటే మించి ఎక్కువగా తీసుకుంటే ఆహారం కాస్తా కొవ్వుగా మారుతుంది.
అది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, దాన్ని పరిమితిలో ఉంచుకోడానికి మందులు వాడుతుంటే, వాటిని మధ్యలో మానేయకూడదు. మీరు మాంసాహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ కొవ్వులు తక్కువగా ఉండే చికెన్ తీసుకోవచ్చు. అయితే చికెన్ కంటే కూడా చేపలు మరికాస్త మేలైనవి.
- డాక్టర్ అనుజ్ కపాడియా
సీనియర్ కార్డియాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
మాంసాహారంతో గుండెకు చేటా?
Published Sat, Sep 3 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
Advertisement
Advertisement