హోమియో కౌన్సెలింగ్
మా నాన్నగారి వయసు 65. ఆయనకు చాలా సంవత్సరాలుగా ఆస్తమా ఉంది. చలికాలం వస్తే ఆయన బాధలు చెప్పనలవి కాదు. దీనికి హోమియోలో ఏమైనా చికిత్స ఉంటే చెప్పగలరు.
- పి.శశాంక్, చీరాల
వాతావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, ఘాటైన వాసనలు, పెంపుడు జంతువులు, వాటి వెంట్రుకలు, విసర్జకాలు, పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, మస్కిటో రిపెలెంట్స్, వివిధ రకాల స్ప్రేలు, శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్స్, జన్యు సంబంధిత కారణాలు ఉబ్బసం రావడానికి కారణమవుతున్నాయి. ఆస్తమా ఎవరిలో చూడవచ్చంటే.. ఆస్తమా ముఖ్యంగా అలర్జీతో బాధపడేవారిలో ఎక్కువగా వస్తుంది. కానీ చాలా వరకు ఈ సమస్య చిన్న వయసులోనే ప్రారంభమవుతుంది. కుటుంబసభ్యులలో ఎవరైనా ఆస్తమాతో బాధపడుతుంటే వారి పిల్లలలో కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
లక్షణాలు: శ్వాసనాళాలు సంకోచానికి గురికావడం వలన గాలి రవాణాకు ఆటంకం కలిగి దగ్గు, ఆయాసం, ఛాతి బరువుగా ఉండడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడడం, పిల్లికూతలు తదితర లక్షణాలుగా గుర్తించాలి.
పిల్లల్లో ఆస్తమా గుర్తు పట్టడం ఎలా?
పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆయాసం ఉంటుంది. పడుకున్నప్పుడు పిల్లికూతలు వస్తుంటాయి. రాత్రివేళ దగ్గు ఉంటుంది. పరిగెత్తినప్పుడు ఎక్కువగా ఆయాసపడతారు. మాట్లాడినప్పుడు ఆయాసపడడం గమనించవచ్చు.
నిర్ధారణ: సి.బిపి. ఇ.ఎస్.ఆర్, అబ్‌సల్యూట్ ఇసినోఫిల్-కౌంట్, ఎక్స్‌రే చెస్ట్, సీటీ స్కాన్, స్పిరోమెట్రి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మొదలైనవి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :పెంపుడు జంతువులకు, దుమ్మూ, ధూళికి దూరంగా ఉండటం, శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్‌లు తినకపోవడం, ఇంటి పరిసరాలలో ఉండే పార్థినియం మొక్కలను తొలగించి పుప్పొడికి దూరంగా ఉండాలి.
హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ఎలాంటి ఎలర్జీలకు సంబంధించిన ఏ వ్యాధికైనా చికిత్స చేస్తారు. అధునాతన జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలియం ద్వారా అసమతుల్యతకు గురైనటువంటి రోగ నిరోధక శక్తిని సరిచేస్తారు. సమర్థవంతంగా తట్టుకునేలా ఇమ్యూన్ సిస్టమ్‌ను సరిచేసి అన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తారు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్
హోమియోకేర్ ఇంటర్నేషనల్,
హైదరాబాద్
పల్మనాలజీ కౌన్సెలింగ్
నా వయసు 36 ఏళ్లు. చాలా ఎక్కువ ఒత్తిడికి గురిచేసే రంగంలో పనిచేస్తున్నాను. చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ వల్ల సిగరెట్ కాల్చడం అలవాటైంది. ఇప్పుడు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సిగరెట్లు కాల్చుతున్నాను. రోజూ రెండు మూడు ప్యాకెట్ల వరకూ సిగరెట్స్ కాల్చుతుంటాను. ఇటీవల నాకు తీవ్రంగా ఆయాసం, దగ్గు వస్తోంది. దాంతోపాటు సరిగా నిద్రపట్టడం లేదు. సాధారణ సమస్యే కదా, అదే తగ్గిపోతుందిలే అని పట్టించుకోలేదు. ఇప్పుడు ఉపశమనం కోసం ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. దగ్గు, ఆయాసం తగ్గకపోగా రోజురోజుకూ మరింత పెరుగుతోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- మధు, హైదరాబాద్
సిగరెట్లు కాల్చడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సరదాగా ప్రారంభమయ్యే అలవాటు వదులుకోలేని వ్యసనంగా మారి మీ సంతోషాలతో పాటు, మీ ఆరోగ్యాన్నీ సర్వనాశనం చేస్తుంది. మీరు రోజుకు మూడు పాకెట్ల వరకూ సిగరెట్లు కాల్చుతారని తెలిపారు. అంత ఎక్కువగా సిగరెట్లు కాల్చడం మీ ఆరోగ్యంపై చాలా తీవ్రమైన దుష్ర్పభావం చూపుతుంది. ఊపిరితిత్తులు ప్యాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతుక్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలూ వచ్చే అవకాశం ఉటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే సిగరెట్లు కాల్చడం మరీ ప్రమాదకరం. కాబట్టి మీరు వెంటనే సిగరెట్లు కాల్చడం మానేసి వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొగతాగడం మానేస్తే మీ ఆరోగ్యానికి అంత మంచిది.
డా. పి. నవనీత్‌సాగర్‌రెడ్డి సీనియర్ పల్మునాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
సోమాజీగూడ
హైదరాబాద్
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా వయసు 26 ఏళ్లు. ఈ నెలలోనే సంతాన సాఫల్యం కోసం చికిత్స తీసుకున్నాను. నాకు కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్’ అని చెప్పి పెయిన్‌కిల్లర్స్ ఇచ్చారు. దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలొస్తాయా?
- లత, హైదరాబాద్
సంతాన సాఫల్యం కోసం చికిత్స తీసుకుంటున్న సమయంలో శరీరం దానికి అతిగా ప్రతిస్పందించడాన్ని ‘ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్’గా పేర్కొనవచ్చు. మీ విషయంలో డాక్టర్ ఏ రకమైన చికిత్స ప్రక్రియను అవలంబించారు అన్న విషయం మీ లేఖలో లేదు. సాధారణంగా గొనాడోట్రాఫిన్ అనే ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంటుంది. కొందరిలో క్లోమిఫీన్ అనే మందులు వాడుతున్నప్పుడూ ఇలా జరగవచ్చు. కొందరిలో మందు మోతాదు ఎక్కువైనా ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్ జరగవచ్చు. సాధారణంగా సన్నగా ఉన్నా లేదా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నా ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సమస్య వచ్చిన మహిళల్లో పొత్తికడుపులో నొప్పి, కడుపు ఉబ్బినట్లుగా కనిపించడం, వాంతులు వంటివి ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్‌లో సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు. ఈ పరిస్థితి కనిపించినప్పుడు చాలామందిలో ఔట్‌పేషెంట్‌గానే ఉంచి, దీన్ని ఎదుర్కొనవచ్చు. అయితే కొంతమంది మహిళలకు మాత్రం ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి రావచ్చు. దీనికి పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల కూడా కొన్ని ‘రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే ‘థ్రాంబోఎంబోలిజమ్’ అనే పరిస్థితి ఏర్పడవచ్చు. మీలాంటి పరిస్థితి వచ్చిన వారిలో వారి బరువు, స్కానింగ్, రక్తపరీక్షల రిపోర్టులు పరిశీలించాల్సి వస్తుంది. చాలామందికి చిన్నపాటి చికిత్సలతోనే పరిస్థితి చక్కబడుతుంది. అయితే సంతాన సాఫల్య చికిత్స తీసుకున్నవారిలో ఇలాంటి సమస్య వస్తే... అది మళ్లీ మళ్లీ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువే. కాబట్టి డాక్టర్ మీరు తీసుకునే మందు మోతాదును అడ్జెస్ట్ చేస్తారు. ఒకవేళ మీకు ఐవీఎఫ్ జరుగుతున్నప్పుడు ఈ సమస్య వస్తే మీలో పిండం అభివృద్ధి చెందే అన్ని చికిత్సలనూ ఆపివేసి, చికిత్సను మరో విడత చికిత్సకు (నెక్స్‌ట్ సైకిల్‌కు) సర్దుబాటు చేయాల్సి రావచ్చు. ఒకవేళ ఈసారే మీకు గర్భం వచ్చి ఉంటే మీ హైపర్‌స్టిమ్యులేషన్ తీవ్రత ఎక్కువవైనా, మీ గర్భం నార్మల్‌గానే కంటిన్యూ అవుతుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
డాక్టర్ కె. సరోజ
సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్,
నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్,
రోడ్ నెం. 1, బంజారాహిల్స్,
హైదరాబాద్
సంతాన సాఫల్య చికిత్సకు అతిగా స్పందిస్తే...
Published Sun, Nov 29 2015 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM
Advertisement
Advertisement