మంచిపనికి రిటైర్మెంట్ ఉండదు | Retirement is not good to work | Sakshi
Sakshi News home page

మంచిపనికి రిటైర్మెంట్ ఉండదు

Published Wed, Aug 19 2015 11:12 PM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM

మంచిపనికి రిటైర్మెంట్ ఉండదు - Sakshi

మంచిపనికి రిటైర్మెంట్ ఉండదు

మనిషికి వ్యాపకం అవసరం.
ఫ్రీ టైమ్ ఉంటే ఇంకా ఎక్కువ అవసరం.
తోటపని చేస్కోవచ్చు... పూలతో మాట్లాడుకోవచ్చు...
పుస్తకాల కాగితాలపై విహరించవచ్చు... లేదా
మనంత అదృష్టం లేని వాళ్లను ఆదుకోవచ్చు.
పిల్లలు సెటిలై బాధ్యతలు తీరాక
జీవితాన్ని ఒక్కసారిగా శూన్యం ఆవరిస్తుంది.
ఆ శూన్యంలో బతికే బదులు
‘కొత్త పిల్లల్ని’ వెతుక్కుంటే ఎలా ఉంటుంది?
శారదమ్మ అదే చేసింది.
వయసుమళ్లిన వాళ్లని చిన్న పిల్లల్లా చూసుకుంటోంది.

 
నుదుటన అర్థరూపాయకాసంత బొట్టుతో చూడగానే ఆప్యాయంగా పలకరించే శారదమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. చేస్తున్న పని చిన్నదే అయినా సమాజంలో తనకంటూ ఓ ముద్ర వేసుకుంటున్నారీవిడ. వేకువజామునే లేచి, చేతిలో కర్ర పట్టుకొని, నిదానంగా ఆశ్రమంలోని ఒక్కొక్కరి బాగోగులను పలకరిస్తూ దైనందిన జీవనాన్ని మొదలుపెడతారు శారదమ్మ. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో పదకొండేళ్ల క్రితం శారదమ్మ ఏర్పాటుచేసిన ఆ ఆశ్రమం పాతికమంది వృద్ధ మహిళలకు, బాలికలకు నీడనిస్తోంది. ప్రతిఫలాపేక్ష లేకుండా శేషజీవితాన్ని పరులకోసం ఉపయోగపడేలా మలుచుకోవాలన్న శారదమ్మ... వయసుపై బడిన వారికి ఓ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వివరాలు ఆమె మాటల్లో...      
 
 అమ్మను చూసుకుంటున్నా....
 ‘‘చిన్నపుడే అమ్మను కోల్పోయి బంధువుల వద్ద పెరిగాను. తోబుట్టువులు లేరు. అయినవారు లేకుండా పరాయివారి మీద ఆధారపడే బతుకు ఎంత కష్టమైనదో ఆ బాధ నాకు తెలుసు. నా భర్త రాజన్న జిల్లా జడ్జిగా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్నారు. పిల్లలిద్దరు వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. మిగిలిన ఈ జీవితంలో ఇంకా చేయాల్సింది ఏముంది? అని ఆలోచించాను. నలుగురికి ఉపయోపడి పనిచేస్తే అంతే చాలు కదా అనుకునేదాన్ని. కానీ, ఆ పని ఏంటో, ఎలా మొదలుపెట్టాలో తెలిసేది కాదు. ఎవరూ లేని అనాథల పరిస్థితి ఏంటి అని ఓ రోజు ఆలోచన వచ్చింది. నా చిన్ననాటి పరిస్థితులు గుర్తుకువచ్చి కళ్లలో నీళ్లు ఉబికాయి. అయినవారికి దూరమై ముదిమి వయసులో కష్టాలు పడుతున్నవారికి సేవ చేస్తే, మా అమ్మకు చేసినట్టే కదా అనిపించింది. ఇదే విషయం మా వారికి చెప్పినప్పుడు చాలా సంతోషించారు. ఇద్దరు అబ్బాయిలు, ఒకమ్మాయి. వాళ్లు వారి జీవితంలో స్థిరపడ్డారు. పిల్లలూ నా ఆలోచన సరైనదన్నారు. తమ వంతూ సాయం చేస్తామన్నారు. ఆ విధంగా పదకొండేళ్ల క్రితం వృద్ధాశ్రమాన్ని స్థాపించాను. ఆ తర్వాత ఎవరూ లేని ఓ బాలిక మా నీడన చేరింది. అప్పటి నుంచి బాలికలకు కూడా ఆశ్రమంలో చోటు ఇవ్వాలని ఇంకాస్త మెరుగుపరిచాను.
 
శివారులో...
 ఆశ్రమం స్థాపించాలంటే అందుకు పెద్ద స్థలం, ఇళ్లు కావాలి. కామారెడ్డి పట్టణ శివారులోని సామాజిక వేత్త, విశ్రాంత ఉప విద్యాధికారి భద్రయ్యను నేనూ, మా వారు సంప్రదించాం. ఆయన పెద్ద మనసుతో ఆశ్రమ నిర్వహణ కోసం తన పొలం వద్ద ఇంటిని నిర్మించారు. ఆ ఇంటిని ఎలాంటి అద్దె లేకుండా ఇచ్చారు. మంచి పని చేయాలని మనం ఓ అడుగు వేస్తే, మరో పది అడుగులైనా మనతో పాటు కలుస్తాయని పెద్దలు చెప్పిన మాటలు ఆ క్షణాన నాకు అక్షరాల నిజం అనిపించాయి. ముందుగా పాతికమంది ఆశ్రమంలో ఉండడానికి అవసరమైన మంచాలు, దుప్పట్లు, భోజనసామగ్రి... మొదలైన ఏర్పాట్లన్నీ చేశాను. ఇద్దరితో మొదలై పాతికమందికి, అక్కణ్ణుంచి ఈ పదేళ్లలో వంద మంది దాకా ఇక్కడ ఆశ్రయం పొందారు. వయసు పైబడిన వారు అనారోగ్యంతో మంచాన పడుతుంటారు. వారికి ఈ చేతులతో సేవలు చేస్తుంటాను. ఆఖరి క్షణంలో వారికి చేసే సేవ మా అమ్మకే అనిపిస్తుంటుంది. వారు మరణించాక కామారెడ్డి శివారులోనే అంత్యక్రియలు నిర్వహిస్తుంటాను.  

 ఆరోగ్యం సహకరించడం లేదు...
 పిల్లలున్నా చూసుకునేవారు లేక రోడ్డున పడ్డ మస్తానమ్మ, ఎవరూ లేక అనాథగా మిగిలిన రాణెమ్మ.. ఇలా బంధాలు వదిలేస్తే వచ్చి చేరిన పాతికమంది ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. అందరమూ ఒకేసారి కూర్చొని, కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చే స్తాం. ఉదయం కాఫీ, టీ ల దగ్గర నుంచి రాత్రి భోజనాల వరకు సమాజంలో జరిగే మంచి చెడులు మా మధ్య దొర్లుతుంటాయి. నాకు కాళ్ల నొప్పులు. అందుకే చేతికర్రలేకుండా సరిగా నడవలేకపోతున్నాను. నాతో పాటు ఇంకొందరు ముసలివాళ్లకూ నడవడం చేతకాదు. కళ్లు కనిపించనివారూ ఉన్నారు. రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారూ ఉన్నారు. కొందరు దాతలు, స్వచ్చంద సంస్థల సహకారంతో వారికి వైద్య సేవలు అందిస్తుంటాను.

 దాతల సహకారంతో...
 కొంతమంది దాతలు వచ్చి వృద్ధులకు అవసరమైన బట్టలు, దుప్పట్లు, పాత్రలు ఇచ్చి వెళ్తుంటారు. మరికొందరు ఉప్పు, పప్పు, బియ్యం, ఇతర వంటసామాగ్రి పట్టుకొస్తారు. ఇటీవలి కాలంలో కొందరు తమ పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలప్పుడు ఏదో ఒక సాయం అందిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు చనిపోయిన వారు వారి స్మారకార్థం సేవా కార్యక్రమాలు చేపట్టి అవి వృద్ధులకు అందేలా చూస్తున్నారు.

నా భర్త పెన్షన్ డబ్బులతో కొంత, నా పిల్లలు అందించే ప్రోత్సాహంతో మరికొంత, చుట్టూ ఉండే వారి సహృదయంతో ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నాను. ప్రభుత్వం నుంచి నేటికీ ఎలాంటి సాయం అందుకోలేదు. ‘నలుగురికి ఈ సాయం చేస్తున్నాను మీరు దయతలచండి’ అని ఎన్నడూ ఎవరికీ చెప్పుకున్నదీ లేదు. నలుగురికి తలా ఓ పిడికెడు మెతుకులు పెట్టి, ఇంత నీడ కల్పించే భాగ్యం ఆ దేవుడు బతికినన్నాళ్లూ నాకు ఇలా కల్పిస్తే అంతే చాలు అని రోజూ దండం పెట్టుకుంటాను.’’
 - వేణుగోపాల్‌చారి, సాక్షి, కామారెడ్డి, నిజామాబాద్
 
కన్నీళ్లను తుడవడం కనీస ధర్మం

నెల్లూరు జిల్లా మాగుంట లేఅవుట్ వాస్తవ్యులైన తుమ్మల కృష్ణారెడ్డి ఉన్నంతలో నలుగురికి సాయం చేయాలనే నిబద్ధత కలిగిన వ్యక్తి. చేసిన సాయం సరిపోదు అనుకుంటే ఇతర దాతలనుంచి విరాళాలు సేకరించి అవసరంలో ఉన్నవారికి అందించడం ఆయన లక్ష్యం. హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో కృష్ణారెడ్డి చేస్తున్న సేవలు ఈ ప్రాంతంలో ప్రతిఒక్కరికీ సుపరిచితమే. 76 ఏళ్ల వయసులో ఇతరులకు సేవ చేయడానికి నిత్యం యువకుడిలా పరుగులు తీస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...
 
తోడుగా హెల్పింగ్ హ్యాండ్...
 ‘‘ఓ ప్రైవేట్ కంపెనీలో పి.ఆర్‌గా పనిచేసి రిటైరయ్యాను. నాలో ఈ సేవాబీజం వేసింది నా భార్య సుదర్శనమ్మ వృత్తిరీత్యా టీచర్. ఆమె నిరుపేద విద్యార్థ్ధుల సాధకబాధకాలను తెలుసుకుంటూ వారికి తగిన సాయం అందించేది. ఆరేళ్ల క్రితం తనే ఈ ‘హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థను స్థాపించింది. రెండేళ్లక్రితం ఆవిడ చనిపోయింది.   ముగ్గురు బిడ్డలు స్థిరపడ్డారు. మిగిలిన ఈ జీవితం నలుగురికి ఉపయోగపడితే చాలు అనుకున్నాను. అర్హులైన వారికి ఎలా చేయూతనివ్వాలి అని ఆలోచనల్లో పడ్డ నాకు మీడియా ఒక దారి చూపింది. పత్రికల్లో, టీవీల్లో సాయం కోసం అర్థించేవారు, అభాగ్యులు.. వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి చేతనైనంతవరకు ఆదుకోవడం మొదలుపెట్టాను.  

పెన్షన్ల పంపిణీ...
 మొదట్లో గవర్నమెంట్ నుంచి వృద్ధులకు, వికలాంగులకు రూ.200 పెన్షన్ మాత్రమే వచ్చేది. మరో మూడు వందల రూపాయలు కలిపి ప్రతినెలా 120 మందికి ఇస్తూ వచ్చాను. ఇప్పుడు కారాగారాల్లో ఉంటున్న ఖైదీల కుటుంబాలకు నెలకు రూ.500 చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నాం.

వార్తా కథనాలకు స్పందిస్తూ...
వార్తాపత్రికలు, టీవీల్లో వచ్చే అభాగ్యుల కథనాలకు చూసినప్పుడు వారికి ఎంతో కొంత సాయం అందించేవరకు మనసు కుదుట పడదు. సాక్షి టీవీలో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.6 లక్షలు అవసరమని ఓ కథనం ప్రసారమైంది. నా వంతుగా పాతికవేలు అందజేశాను. కానీ, అవి ఏ మూలకు అనిపించింది. దాతలను సంప్రదించి, మరింత మొత్తాన్ని ఆ బాలికకు అందజేశాను. ఇటీవల సాక్షి దినపత్రిక ఫ్యామిలీపేజీలో అనంతపురానికి చెందిన వికలాంగులపై ప్రచురించిన ‘ప్రేమపాఠం’పై స్పందించి, వారి వివరాలను నెల్లూరు నుంచే కనుక్కున్నాను. నా సొంతంగానే కాకుండా దాతల నుంచి సేకరించి పాతికవేల రూపాయలు పంపించాను.

మా దగ్గర మునిసిపల్ స్కూల్ ఉంది. ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడి విద్యార్థులు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో నిల్చోడం చూసి చలించిపోయాను. అమెరికాలో ఉన్న నా చిన్నకూతురు సహకారంతో లక్షా పదివేల రూపాయలతో విద్యార్థులందరకీ షూస్ అందచేసాను. సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఇటీవల ఇండియన్ థియోలాజికల్ మినిస్ట్రీస్ -హైదరాబాద్ నాకు గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది. కుల, మత, ప్రాంతీయ, వర్గాలకు అతీతంగా కన్నీళ్ళను తుడిచే చేతులుగా నిలవాలన్నదే మా ‘హెల్పింగ్ హ్యాండ్స్’ ఆశయం. నిరుపేదలకు, అవసరం ఉన్నవారికి సాయం చేయడంలో ఉన్న ఆనందం ఇన్నేళ్లలో నాకెన్నడూ కలగలేదు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేందుకు స్పందించే హృదయం, వారి కన్నీళ్లను తుడిచే హస్తాలు అలసిపోవు. తుది శ్వాసవరకు నలుగురి జీవితాలకు చేయూతనిచ్చే ఈ సేవను వదులుకోను.’’
 - గంటా థామస్ మౌంట్‌బాటన్,
 సాక్షి, ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement