రేవనిక్ ఓల్మీ
‘మమ్మల్నెవరూ చూడకుండా చీకటి పడ్డాక, ఆఖరి బస్సెక్కాం.’ కొడుకులైన తొమ్మిదేళ్ల స్టాన్, స్టాన్ సవితి తమ్ముడైన కెవిన్‌ని వెంటబెట్టుకుని– పేరుండని ఊరి నుంచి, అజ్ఞాతమైన ఊర్లో ఉన్న సముద్రతీరానికి బయల్దేరుతుంది ‘ఆమె.’ ఫ్రెంచ్ రచయిత్రి రేవనిక్ ఓల్మీ రాసిన ‘బిసైడ్ ది సీ’ నవలికలో– ‘అది పిల్లల ఆఖరి ప్రయాణమని ఆమెకు తెలుసు’.
‘ఉన్న డబ్బంతా మార్చి చిల్లర’ తెచ్చుకుంటుంది. తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోదు. ‘నా ఊడిన పళ్ళ వల్ల నోటికి చెయ్యడ్డం పెట్టుకోకుండా నవ్వలేను’ అనే ఆమె– కలుసుకునే సామాజిక కార్యకర్త, ఆస్పత్రి ప్రస్తావన వంటి స్వల్ప సూచనలు తప్ప, ఆమె నేపథ్య వివరాలేమీ ఉండవు. పేరు తెలియని మానసిక రోగానికని మందులు తీసుకుంటుంటుంది. వాటినీ పట్టుకెళ్లదు.
‘‘పొద్దున్నే పిల్లల్ని స్కూల్లో దింపే ఓపిక నాకుండదు. ‘స్టాన్ నన్ను తీసుకెళ్తే నాకెప్పుడూ ఆలస్యం అవదు,’ అంటాడు కెవిన్. తిన్న ప్రతిసారీ పళ్ళు తోముకోవాలని తన టీచర్ చెప్పిందంటాడు స్టాన్. వాడికి ఆత్మవిశ్వాసం ఎక్కువవుతోంది. క్రూరమైన లోకంలో ఇమిడిపోతున్నాడు. నా మినహా, సమర్థవంతుడెలా అవుతున్నాడు?’’ అనుకునే ఆమెకు అభద్రత కలుగుతుంది. ప్రయత్నించినాగానీ, మానసిక పొందిక చేతనవదు.
పిల్లలకు ‘విశేషమైన చివరి రోజు’ అందించేందుకు– ఉన్మాదిలా, అలిసిపోయేవరకూ వాళ్ళను తిప్పుతుంది. హాట్ చాక్లెట్, భోజనం కొనడం కూడా కష్టమైన పనామెకు. చివర్న, తిరునాళ్ళలో ‘గంటల మ్రోత ఆగడం లేదు. ఎంత వానో, ఎంత శబ్దమో, ఎన్ని లైట్లో! అన్ని దిక్కులనుండీ జనాలు వచ్చేస్తున్నారు. అన్నీ కొనేయగలంత డబ్బెక్కడ నుండి వచ్చింది వారికి?’ అనడుగుతుంది. ‘ఇక ఇంటికి పోదాం’ అని స్టాన్ మృదువుగా చెప్తాడు.
లోకం చీకటితో నిండి ఉందనీ, జీవించేందుకు అనుకూలమైనది కాదనీ ఆమె ఏర్పరచుకున్న అభిప్రాయం గట్టిపడుతుంది. కొడుకులు పెద్దయితే, తనకి ఎదురయిన నిరాశ, ఒంటరితనమే వారూ అనుభవిస్తారని ఊహించుకుంటుంది. వారిని కాపాడుకోవాలనుకుంటుంది.
హోటెల్లో, వారికి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ‘నాకైతే చనిపోయిన పిల్లలిద్దరున్నారు. వాళ్ళకేముంది! దుప్పట్లు, కంబళ్ళ మధ్య దాగున్న వారి శరీరాలను చూడ్డానికి నిలుచున్నాను. కెవిన్ శరీరం బంతిలా ముడుచుకునుంది. స్టాన్‌ది జాచుకొనుంది. కెవిన్ మొహం గోడవైపు తిరిగి ఉంది, స్టాన్‌ది కిటికీ వైపు. మరణం యందు కలిసే ఉంటారనుకున్నాను. నేనిది ఊహించలేదు.’ ఆ ఆరవ అంతస్తు కిటికీ బయటకి చూసి, ‘వాన నాకింద ఉన్నవారికోసం కురుస్తోంది. నేను వీటన్నిటికీ పైన ఉన్నాను’ అంటుంది.
చైతన్య స్రవంతిలో సాగే వాడుక భాష కథనం, ఆమె చదువుకున్నది కాదని సూచిస్తుంది. తల్లి ప్రేమకుండే శక్తికీ, తల్లి బాధ్యతలు నిర్వర్తించలేకపోయే పర్యవసానాలకీ మధ్యనుండే సంఘర్షణను ఎత్తి చూపుతుంది నవలిక.
‘పిల్లలకు తిరునాళ్ళలో చిప్స్ తినిపించి, చంపేసిన తల్లి’ అన్న వార్తాపత్రిక శీర్షిక చదివిన తరువాత, ‘పిచ్చితనం’ వంటి సాధారణీకరణాలని పట్టించుకోకుండా– ఏ ఆలోచనా రుగ్మత, సొంత పిల్లల ప్రాణాలను సైతం తీయడానికి ప్రేరేపిస్తుందో అని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ– నాటకకర్తా, రచయిత్రీ అయిన ఓల్మీ యీ పుస్తకం రాశారు. ‘ఇలాంటి విషాదాలని అరికట్టాలంటే, మానసిక అనారోగ్యపు సంక్లిష్టతలను అర్థం చేసుకోవాలి’ అంటారామె. 120 పేజీల యీ నవలికను, యేడ్రియానా హంటర్ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. దీన్ని 2010లో ప్రచురించినది ప్రిరనీ ప్రెస్. తొలి ప్రచురణ 2001లో.
ఫ్రెంచ్‌లో ‘బార్డ్ డె మేర్’ పేరుతో వచ్చిన యీ పుస్తకం ఎన్నో యూరోపియన్ భాషల్లోకి అనువదించబడింది. ఇంగ్లిష్‌లోకి ప్రచురించడానికి మాత్రం చాలాకాలం ఎవరూ ముందుకు రాలేదు. యీ అనువాదానికి అనువాదకురాలు ‘స్కాట్ మోన్క్రీఫ్’ బహుమానం పొందారు.
కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment