ఎ గర్ల్ లైక్ దట్, తనాజ్ భాతేనా
సౌదీ అరేబియా, జెడ్డాలో – పదహారేళ్ళ జరీన్ వాడియా, ఆమె స్నేహితుడైన 18 ఏళ్ల పోరస్ – రహదారిపై కారు ప్రమాదంలో చనిపోతారు. ఇద్దరూ చేతులు పట్టుకుని గాల్లో తచ్చాడుతుండగా, తనాజ్ భాతేనా తొలి నవలైన ‘ఎ గర్ల్ లైక్ దట్’ మొదలవుతుంది.
వారి ఆత్మలు – కింద గుమిగూడిన వారిని గమనిస్తుంటాయి. ‘జీవితంలో ఎంత అపఖ్యాతి పాలయిందో, మరణంలోనూ అలాగే ఉన్న’ అమ్మాయి జీవితం గురించి ఆమె స్నేహితులూ, బంధువులూ, పోలీసులూ– తమ తమ అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతుంటారు.
‘పిన్ని ఏడుస్తున్న విధానం మనస్సును కలిచివేస్తోంది. తను నన్నొకసారి పిలిచినట్టు ‘తన అక్క గర్భం నుండి వచ్చిన పరాన్నజీవి’ని కాకుండా నేను తనకే పుట్టిన కూతుర్ని అన్నట్టుగా ఏడుస్తోంది’ అని వ్యంగ్యం కనబరుస్తుంది జరీన్. ‘సహోదరుడూ, భర్తా కాని మగవాడితో ఒకమ్మాయి ఉండటం కన్నా సౌదీ అరేబియా పోలీసులను ఇబ్బంది పెట్టేదీ మరేదీ ఉండదు’ అంటుంది.
యీ సంఘటన తరువాత, నవల ఏ కాలక్రమాన్నీ పాటించక, గతానికి మళ్ళుతుంది.
జరీన్ ముంబయిలో పుడుతుంది. బార్ డాన్సర్ అయిన ఆమె తల్లి పార్సీ. ముఠాకోరుడైన తండ్రి హిందూ. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడే వారు చనిపోతారు. పిన్ని, బాబాయి– జరీన్‌ను దత్తత తీసుకుని, తమతోపాటు జెడ్డా తీసుకెళ్తారు. పిన్నికి మానసిక అస్వస్థత ఉన్నప్పటికీ, జరీన్ తల్లిదండ్రులకు పెళ్ళవలేదని దెప్పే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోదు. జరీన్‌ను కొడుతుంది. అబ్బాయిలను దూరంగా ఉంచేందుకు జరీన్‌కు ప్యాంట్లు తొడుగుతుంది. జుట్టు పొట్టిగా కత్తిరిస్తుంది. పినతండ్రి భార్యావిధేయుడు. వీటన్నిటిపట్లా తిరగబడిన జరీన్ తనకు 14 ఏళ్ళు వచ్చేటప్పటికే, అబ్బాయిలతో కార్లలో తిరగడం, వాళ్ళను ముద్దు పెట్టుకోవడం, వాళ్ళ సిగరెట్లు పంచుకోవడం మొదలుపెడుతుంది. అయితే వారెవరికీ మానసికంగా దగ్గరవకుండా తన ఉదాసీనతను కవచంలా వాడుకుంటుంది. పరుషమైన భాష ఉపయోగిస్తుంది. జీవితంలోనూ, ఆన్‌లైన్‌లోనూ కూడా వేధింపులకు గురవుతుంది.
‘అలాంటి పిల్ల’కి దూరంగా ఉండమని అబ్బాయిల తల్లిదండ్రులు, కొడుకులను హెచ్చరిస్తుంటారు. ఆమెకి స్వతహాగా ఉన్న తెలివి, తిరగబడే లక్షణం, స్వయం ప్రతిపత్తి గమనించిన స్కూలు పిల్లలు, పుకార్లు పుట్టిస్తుంటారు. సౌదీ సమాజంలో– పురుషులకుండే, స్త్రీలకు లేని హక్కుల లాంటి ద్వంద్వ ప్రమాణాలు జరీన్‌కు విసుగు పుట్టిస్తాయి. ఆడవాళ్ళను ఆటవస్తువులుగా చూసే బోయ్‌ఫ్రెండ్స్ చిరాకు తెప్పిస్తారు. ‘నువ్వు తప్పని, చెడ్డదానివని– సంవత్సరాలుగా అనేకమంది అనేకసార్లు చెప్పినప్పుడు, వాళ్ళను నమ్మడం ప్రారంభిస్తావు. మొహం దాచుకోవడం ప్రారంభిస్తావు. వాళ్ళు నిన్ను జడ్జ్ చేస్తున్నారనుకుంటావు. బతికేటందుకు అసలు జీవితానికే విలువైనా ఉందా! అని ఆలోచించే స్థితికి చేరతావు’ అంటుంది.
చిన్ననాటి స్నేహితుడైన ‘పోరస్ దుమాసియా’ జెడ్డాలో పని చేస్తూ, ఆమె జీవితంలోకి తిరిగి ప్రవేశిస్తాడు. ముంబయి పార్సీ ‘కామా’ కాలనీ నివాసి అతను. జరీన్‌కు ఉండే ‘జాగ్రత్తయిన చిరునవ్వులూ, సిగ్గుగా ఊపే చేతులూ’ గుర్తు చేస్తాడు. గుజరాతీ ధారాళంగా మాట్లాడతాడు. ఆమెకు ఇంటిని గుర్తుకు తెస్తాడు. గమ్యం లేకుండా, గంటల తరబడి పోరస్‌తో కార్లో తిరుగుతుంది జరీన్.
ఆమె అంత్యక్రియల మీదకన్నా, ఆమె మరణానికి ముందేమి జరిగిందన్న వివరాల మీదే నవల కేంద్రీకృతమవుతుంది. బహుళ దృక్పథాలతో సాగే కథనం– తమ సొంత భావోద్వేగాలనూ, మారుతున్న శరీరాలనే అర్థం చేసుకోలేకపోయే టీనేజీ పిల్లలను చెదిరిన కుటుంబ బంధాలు మరింత గాయపరుస్తాయని చెబుతుంది. కిశోరావస్థలో ఉండే పిల్లల అతిరిక్త ప్రవర్తనకు అవి మూలకారణాలు అవుతాయంటుంది.
లింగ అసమానత్వం, మానసిక అస్వస్థత, మతం గురించి మాట్లాడే ఈ నవల్లో– మానభంగపు ప్రయత్నం కూడా ఉంటుంది. ఫరార్, స్ట్రౌస్, జిరూ బుక్స్ దీన్ని 2018లో ప్రచురించింది. భాతేనా ఇండియాలో పుట్టి– సౌదీ అరేబియాలోనూ, కెనడాలోనూ పెరిగారు. ఈ నవల 2019 ఒలా(ఒంటారియో లైబ్రరీ అసోసియేషన్) వైట్ పైన్ అవార్డుకి షార్ట్ లిస్ట్ అయింది.
-కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment