ముఖ కాంతికి... బియ్యం నీళ్లు!
మచ్చలు, మొటిమలు సమస్య ఉంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి ముఖారవిందాన్ని కాంతిమంతంగా మార్చుకోవచ్చు.
♦ 3 టేబుల్ స్పూన్ల పిండిలో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కొబ్బరి నూనె, టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అర గంట లేదంటే పూర్తిగా ఆరేదాకా ఉంచి శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు రోజూ కూడా ఈ ప్యాక్‌ను వేసుకోవచ్చు.
♦ బియ్యాన్ని నానబెట్టి, బాగా కడిగి.. ఆ నీటిని వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి, మెడకు రాస్తూ మృదువుగా మసాజ్ చేయాలి. ఎండవేడికి నిస్తేజంగా మారిన చర్మం తాజాగా మారుతుంది. చర్మం ముడతలు పడటం కూడా తగ్గుతుంది.
♦ మొటిమలు, యాక్నె సమస్య ఉన్నవారు దాల్చిన చెక్కను పొడి చేసి, దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. యాక్నె సమస్య తగ్గుతుంది. చర్మం కాంతిమంతం అవుతుంది.
♦ టీ స్పూన్ తేనె, సగం అరటిపండు , పావు కప్పు పెరుగు కలిపి మెత్తటి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి, మృదువుగా రుద్ది, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.