
రోమాంచిత దర్శనం
ఒంటి మీద రోమాలు ఉన్న ఈ మూర్తిని దర్శించుకోవడం ఒక రోమాంచిత పారవశ్యం.చుట్టూ కొండలు... నలుదిశలా పచ్చదనంతో కళకళలాడే మల్లూరు గుట్టపై వెలిశాడు ఈ శ్రీ హేమాచల లక్ష్మీనృసింహుడు. హేమాచలుడు వెలిశాడు కనుక ఈ క్షేత్రాన్ని హేమాద్రి అని కూడా అంటారు. వరంగల్‌కు 126 కిలోమీటర్ల దూరాన మల్లూరు గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో అర్ధచంద్రాకారంలో కనిపించే గుట్టపై ఉన్న ఈ క్షేత్రం నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రఖ్యాతి పొందింది. స్వామిని దర్శించుకుంటే సమస్త దోషాలు, అనారోగ్య బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
శాతవాహన ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామి కలలో కనిపించి, ఇక్కడి గుహాంతర్భాగాన ఉన్నట్లు సెలవిచ్చారట. మహారాజు సైన్యంతో అక్కడకు చేరుకుని, స్వామిని వెలికితీసేందుకు గుహను తవ్వించడం మొదలుపెట్టాడు. సైనికులు గుహను తవ్వుతుండగా ఒక గునపం స్వామివారి నాభికి గుచ్చుకుందట. ఇప్పటికీ స్వామి విగ్రహానికి నాభి నుంచి ద్రవం వెలువడుతూనే ఉంటుంది. అందుకే పూజారులు రోజూ స్వామి విగ్రహం నాభి వద్ద గంధం పెడుతూ ఉంటారు. నాభి నుంచి వెలువడే ద్రవంతో తడిసిన ఈ గంధాన్నే భక్తులకు ప్రసాదంగా అందిస్తుంటారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించిన దంపతులకు త్వరలోనే సంతానం కలుగుతుందని, దీర్ఘ వ్యాధులతో బాధపడే వారికి ఆ వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. ఈ నమ్మకంతోనే నాభి చందనాన్ని స్వీకరించేందుకు ప్రతి శని, ఆది, సోమవారాల్లో భక్తులు పెద్దసంఖ్యలో ఇక్కడకు తరలి వస్తుంటారు. ఇక్కడి స్వామివారి విగ్రహానికి మరో విశేషమేమిటంటే, ఈ విగ్రహాన్ని ఎక్కడ తాకి చూసినా, మానవ శరీరాన్ని తాకినట్లే మెత్తగా అనిపిస్తుంది. విగ్రహానికి ఛాతీపై రోమాలు ఉండటం మరో విశేషం. ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేతంగా వెలసిన ఈ నరసింహ క్షేత్రానికి క్షేత్రపాలకులుగా పంచముఖాంజనేయ స్వామి, శిఖాంజనేయ స్వామి ఉన్నారు. హేమాద్రి క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాలస్వామి ఆలయం, తూర్పున కోనేరు ఉన్నాయి.
తిలతైలాభిషేకం
దేశంలో ఎక్కడా లేని స్వయంభువుగా వెలిసిన శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామికి నువ్వుల నూనెతో ప్రతి శని, ఆది, సోమ వారాల్లో తిలతైలాభిషేక పూజలు నిర్వహించి, నూతన పట్టు వస్త్రాలతో అలంకరించడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారికి తిలతైలాభిషేకం జరిపించి, పట్టువస్త్రాలను సమర్పించుకున్న భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు.
భక్తుల విడిది ప్రాంతం
ఆలయానికి వచ్చే భక్తులు విడిది చేసేందుకు 18వ శతాబ్దంలో అప్పటి జమీందారు రాజ మొదలియార్ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాన్ని(ఎద్దుముక్కు) నిర్మించారు. ఇక్కడ భూమి నుంచి పైకి ఉబికి వచ్చే నీరు భక్తుల దాహార్తి తీరుస్తోంది. ఎద్దుముక్కు ఆకారం కలిగిన రాయి నుంచి నీరు ధారగా పడుతుంది.
వనదేవత దైత అమ్మవారు
గుట్టపైకి చేరుకునే భక్తులకు ఆలయ ప్రాంగణంలో గల వనదేవత దైత అమ్మవారు ముందుగా దర్శనమిస్తారు. స్వామివారిని దర్శిచుకున్న భక్తులు దైత అమ్మవారి వద్ద విడిది ఏర్పాటు చేసుకుని కోళ్ళు, మేకలను అమ్మవారికి బలిస్తారు. మహిళలు అమ్మవారికి చీర, రవికె, గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడే వంట, భోజనాలు కానిచ్చి సాయంత్రం వరకు సేదతీరి తిరుగు ప్రయాణమవుతారు.
నాలుగువేల ఏళ్ల నాటి గుహలు
మల్లూరు గుట్ట చుట్టూ సుమారు 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో దట్టమైన అడవి ఉంది. శాతవాహనుల పూర్వీకులు ఈ గుట్ట ప్రాంతంలో నివసించిన ఆనవాళ్ళుగా రాతిగుహలు, సమాధులు, చెరువులు, శిధిలమైన ఐదు ద్వారాల కోటలు కనిపిస్తాయి. ఇక్కడ కాకతీయ రాజులు.. కోనేరు, అర్ధమండపం, గుర్రపు శాలలు, రాక్షస గుహలు నిర్మించి శత్రురాజ్యాలతో యుద్ధం చేయడానికి వ్యూహరచనలు చేసేవారనే కథనాలు కూడా ఉన్నాయి. స్వామివారి ఆలయం పక్కనగల దారి గుండా కిలోమీటరు దూరం వెళితే రాతి కట్టడాలతో నిర్మించిన మూడు పురాతన చెరువులు కనిపిస్తాయి. ఇక్కడకు సమీపంలో గుట్టపై నుంచి వెలువడే జలపాతం కనువిందు చేస్తుంది. ఈ జలపాతానికి కాకతీయ పాలకురాలు రుద్రమదేవి ‘చింతామణి జలపాతం’ అని నామకరణం చేసినట్లు ప్రతీతి. ఈ జలపాతం వద్ద పురాతనమైన మహాలక్ష్మిదేవి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి, నవగ్రహ మండపం, గోదాదేవి మందిరాలు కూడా ఉన్నాయి.
ఆలయానికి ఘజనీ కానుకలు
ఓరుగల్లు ప్రాంతంలో కాకతీయులు నిర్మించిన ఆలయాలన్నింటినీ ధ్వంసం చేసిన ఘజనీ మహ్మద్ సేనలు హేమాద్రి ఆలయం జోలికి రాకపోవడం విశేషం. పైగా ఈ ఆలయానికి ఘజనీ బంగారు బిస్కట్లు కానుకగా సమర్పించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ క్షేత్రం ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధచంద్రాకారంలో ఉన్నందునే ఘజనీ సేనలు దీనిపై దాడి చేయకపోయి ఉండవచ్చని భావిస్తారు.
ఓషధుల వనం...
దట్టమైన కొండలు, వృక్షాలు గల ఈ క్షేత్రంలో ఎటుచూసినా పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం మనసుకు హాయిగొలుపుతుంటుంది. ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడున్న చింతామణి జలపాతం. దీని నుంచి ఔషధ వృక్షాలను తడుపుతూ వెలువడే ధారలను అక్కధార-చెల్ల్లిధారగా పిలుస్తారు. గంగా జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవని, వందరోజుల పాటు ఈ జలాలను సేవిస్తే సర్వరోగాలు నయమవుతాయని నమ్ముతారు.ఇక్కడి నీరు చల్లగా, రుచికరంగా ఉండటమే కాకుండా మండు వేసవికాలంలోనూ చల్లగా ఉండటం విశేషం. ఎన్నేళ్లు ఈ నీటిని నిల్వ ఉంచినా పాడవకపోవడం మరో విశేషం. హిమాలయాల మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు.
వైశాఖ శుద్ధ పౌర్ణమిలో బ్రహ్మోత్సవాలు
ప్రతి ఏటా వైశాఖ శుద్ధపౌర్ణమి సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు వైభవోపేతంగా జరుగుతాయి. ఈ ఏడాది మే 20 నుంచి 26 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మే 21 శనివారం మధ్యాహ్నం 12:20 నిమిషాలకు లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం జరుగనుంది. - ధర్మపురి శ్రీనివాస్, సాక్షి, మల్లూరు, (మంగపేట)
ఇలా చేరుకోవాలి రవాణా మార్గం...
విమానమార్గం ఎంచుకున్న వారు హైదరాబాద్‌లో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హేమాద్రికి రావాల్సి ఉంటుంది. హైదరాబాద్‌కు ఇది 272 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు మార్గంలో వచ్చేవారు వరంగల్‌లో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రావచ్చు. వరంగల్‌కు ఇది 126 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఖమ్మం, హన్మకొండ, భద్రాచలం పట్టణాల నుంచి కూడా మునుగూరు మీదుగా కూడా రోడ్డుమార్గంలో ఇక్కడకు రావచ్చు. ఇక్కడ బస చేయడానికి యాత్రికులకు ఎలాంటి వసతి సౌకర్యాలు లేవు. వసతి సౌకర్యాల కోసం వరంగల్ లేదా ఏటూరునాగారంపై ఆధారపడాల్సిందే.