రాణిగారి పాదాలు
గ్రౌండ్ అప్ ఈవారం విశేషాల రౌండప్
తొంభై ఏళ్ల బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్‌కు కొత్త కొత్త దుస్తులన్నా, కొత్త షూలు అన్నా మహా ప్రీతి. మామూలే! ప్రతి మహిళకూ ఉండే ఇష్టాలే. కానీ కొత్త షూలకు గానీ, కొత్త చెప్పులకు గానీ... రాణిగారి పాదాలకు, సాధారణ మహిళ పాదాలకు మధ్య తేడా తెలీదు. ఇద్దరి పాదాలను వివక్ష లేకుండా సమానంగా కొరికేస్తాయి. ‘షూ బైట్’ అన్నమాట! అందుకే... ఎలిజబెత్ మహారాణికి షూ బైట్ సమస్య లేకుండా రాజప్రాసాదం గత వారం ఒక ‘ఫుట్ ఉమన్’ని నియమించింది. ఆమె పని... రాణిగారి పాదాలకు సదుపాయంగా, సౌకర్యవంతంగా ఉండేలా కొత్త షూలను మెత్త బరచడం. అంటే ముందు ఈవిడ తొడుక్కుని వాటిని కరకుదనం పోగొట్టాక, రాణిగారు తొడుక్కుంటారు. వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 21) మహారాణి బర్త్ డే. రాణిగారి పుట్టిన రోజు వేడుకలకు బ్రిటన్‌తో పాటు, రాణిగారూ సిద్ధం అవుతున్నారు. కొత్త షూలను కూడా అందుకోసమే కొన్నారా అన్నది తెలీదు.
ఒక అన్న... ఒక చెల్లి
యు.ఎస్.లోని ఆహియో ప్రాంతంలో తూర్పుపాలస్తీనా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఉన్నారు. అన్నకు 8 ఏళ్లు. చెల్లికి 4 ఏళ్లు. చెల్లికి బర్గర్ తినాలనిపించింది. అన్నయ్యకు చెప్పింది. ‘మెక్‌డొనాల్డ్స్’లో బర్గర్ బాగుంటుందన్నయ్యా’ అని కూడా చెప్పింది. మెక్డీ... వాళ్లింటికి దగ్గర్లో లేదు. కొంచెం దూరంలో ఉంది. అన్నయ్య ఆలోచించాడు. ‘పద వెళ్దాం’ అన్నాడు. పోర్టికోలో కారు ఉంది. అమ్మానాన్న నిద్రపోతున్నారు. పోర్టికో లోంచి మెల్లిగా కారు బయటికి తీసాడు అన్నయ్య. పక్క సీట్లో చెల్లినికూర్చోబెట్టుకున్నాడు. కారు స్టార్ట్ చేశాడు. మెక్‌డీ వైపు డ్రైవ్ చేశాడు. ఒకటిన్నర కిలోమీటరు దూరం వెళ్లాడు. మధ్యలో నాలుగు క్రాసింగులు ఉన్నాయి. రైల్ రోడ్డు ట్రాకులు ఉన్నాయి. వాటినీ దాటేశాడు. తర్వాత రెండు రైట్‌లు, ఒక లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. ఈ మలుపుల దగ్గర ఎవరో... కారు లోపల ఉన్న అన్నాచెల్లెళ్లను చూసి వెంటనే పోలీసులకు అప్పగించారు. తెలిసిన వాళ్లెవరో వచ్చి విడిపించుకెళ్లారు. విశేషం ఏమిటంటే.. ఈ అన్నగారు ఎక్కడా రోడ్డు రూల్స్ అతిక్రమించలేదనీ, స్పీడ్‌లిమిట్ దాట లేదని ట్రాఫిక్ పోలీసులు మురిసిపోతున్నారు. యు.ఎస్. రూల్స్ ప్రకారం బాల నేరస్థుల పేర్లను బయటపెట్టరు, కాబట్టి వీళ్ల పేర్లు తెలీవు. ఒక అన్న. ఒక చెల్లి. అంతే.
పేపర్ బాయ్
‘ది లీడర్ హెరాల్డ్’ అనే పత్రిక సర్క్యులేషన్ 7,500. మధ్యాహ్నపు దిన పత్రిక. న్యూయార్క్ లోని గ్లోవర్స్‌విల్ ప్రాంతంలో ప్రింట్ అవుతుంది. సర్క్యులేషన్ తక్కువే కానీ బాగా పేరున్న పేపర్. అందులో పని చేస్తున్న మెల్ రూలిసన్ అనే ఒక సాధారణ ఉద్యోగి కారణంగా ఈ పత్రిక ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ మెల్ ఏం చేశాడు? పని చేశాడు. ఏ ఉద్యోగి అయినా పనే కదా చేస్తాడు. అందులో విశేషం ఏముంటుంది? మెల్ పదవీ విరమణ చేశాడు. ఉద్యోగం అన్నాక ఎప్పుడో ఒక రోజు రిటైర్ కావలసిందే కదా? ఇందులో వింతేముంది? ఉంది. వింతా, విశేషం కాదు కానీ... అంకితభావం ఉంది. మెల్ రూలిసన్ 57 ఏళ్లుగా ఆ పేపర్‌కు రూట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యేనాటికి... ఈ 57 ఏళ్లలో మెల్ 50 లక్షల కాపీలు డెలివరీ చేశాడని పత్రిక యాజమాన్యం అభినందించింది. రోజుకు అతడు 220 నుంచి 300 కాపీలు డెలివరీ చేసేవాడట. సో... ‘ది లీడర్ హెరాల్డ్’ లో పని చేసిన ‘లీడర్ హెరాల్డ్’ అన్నమాట మన హీరో ఎంప్లాయి. లీడర్ హెరాల్డ్ అంటే ముందుండి నడిపినవాడు. ఇలాంటి సిబ్బంది ఉంటే కంపెనీలే కాదు, దేశం కూడా ‘హీరో ఆఫ్ ద నేషన్స్’ అవుతుంది. అభినందనలు మెల్ రూలిసన్.
రెండో ఉద్యోగం
ఒక ఉద్యోగి ఒక ఉద్యోగమే చెయ్యాలి. అది నియమం. అది నిబంధన. అది నీతి. అయితే కొందరు రెండో ఉద్యోగమూ చేస్తుంటారు. అది మానవ నైజం. యు.ఎస్. నేవీలో ‘సీల్’ అనే విభాగం ఉంది. అందులో ఉద్యోగం అంటే.. మాటలు కాదు. ఆటలు కాదు. పాటలు కాదు. సినిమా కూడా కాదు. అంత సీరియస్! అయితే అందులో చీఫ్ స్పెషల్ వార్‌ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న జోసెఫ్ ష్మిట్ కొన్నాళ్లుగా ఎవరికీ తెలియకుండా, అందరికీ తెలిసేలా రెండో ఉద్యోగం చేసేస్తున్నాడు! అది బయటపడి ఆయనపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. జోసెఫ్ చేస్తున్న రెండో ఉద్యోగం.. పోర్న్ చిత్రాల్లో నటించడం. ‘జే ఊమ్’ పేరుతో ఇప్పటికి ఆయన 29 సెక్స్ చిత్రాల్లో నటించాడు. ఆ వీడియోలు చూసిన వాళ్లెవరో సీల్‌కి ఉప్పందించారు. ఏడేళ్లుగా జోసెఫ్ ఈ రెండో ఉద్యోగం చేస్తున్నాడట. ఆయన భార్య జెవెల్స్ జేడ్ ఆల్రెడీ ఓ పోర్న్ స్టార్. ఆ సంగతి కూడా యు.ఎస్.నేవీ అధికారులకు ఇప్పుడే తెలిసింది! భార్యాభర్తలిద్దరూ కలిసి నటించినవి కూడా ఈ చిత్రాలలో ఉన్నాయట! జోసెఫ్‌గారి రెండో ఉద్యోగం.. మొదటి ఉద్యోగానికే ముప్పుతెచ్చేలా ఉందిప్పుడు.
చికెన్ చిన్నయ్య
యు.ఎస్.లోని నెవాడలో ఉంటున్న 16 ఏళ్ల కార్టర్ విల్కెర్‌సన్‌కు ఇప్పుడు కోటీ 80 లక్షలు కావాలి! అంత మొత్తాన్నీ సంపాదిస్తే అతడు ఒక ఏడాదంతా ఉచితంగా చికెన్ ముక్కలు తినేయొచ్చు. నాలుగు రాళ్ల కోసం కొండనే తవ్వాలా? రోజుకు రెండు ముక్కల చికెన్ కోసం అన్ని డాలర్లు పోగేసుకోవాలా?! ఇదేనా మీ డౌటు? అసలు విషయం ఏంటంటే.. కోటీ 80 లక్షలు అన్నవి డాలర్లు కాదు. రీ ట్వీట్‌లు! కార్టర్ విల్కెర్‌సన్ రోజూ వెళ్లి ఇష్టంగా చికెన్ తింటున్న వెండీస్ రెస్టారెంట్‌లో (మన వెంకీస్ రెస్టారెంట్‌లా ఉంది కదా) ఒక ఆఫర్ ఉంది. కస్టమర్లు ఎవరైనా కోటీ 80 లక్షల రీట్వీట్‌లు సంపాదించగలిగితే 365 రోజుల పాటు ఫ్రీగా వెండీస్‌లో చికెన్ నగెట్స్ లాగించేయొచ్చు. ఈ ఆఫర్ కార్టర్ నోరు ఊరించింది. వెంటనే పనిలో పడిపోయాడు. ఫ్రీ ఆఫర్ గురించి రెస్టారెంట్‌లో మేనేజర్‌కీ, తనకు జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ఏ్ఛ p ఝ్ఛ p ్ఛ్చట్ఛ, ్చ ఝ్చn n్ఛ్ఛఛీటజిజీటnuజజటఅని పెట్టి, ఈ ట్వీట్‌కు, రీ–ట్వీట్ పంపండి అని అభ్యర్థించాడు. ఇది జరిగి వారం కావస్తోంది. ఇంత వరకు కార్టర్ ఏమీ మాట్లాడలేదంటే.. అనుకున్నన్ని రీట్వీట్‌లు రావడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉంది.
పది లక్షలు చోరీ
ఆస్ట్రియా రాజధాని వియన్నాకు దక్షిణం వైపున ఉన్న ఎబ్రీస్‌డార్ఫ్ అనే చిన్న గ్రామంలో పెద్ద చోరీ జరిగింది. ఏప్రిల్ 11న దొంగలొచ్చి నలభై పెట్టెల్ని పట్టుకుపోయారు. వాటిలో ఏముంది? మణులున్నాయా? మాణిక్యాలున్నాయా? యూరోలున్నాయా? రోమన్ కాలం నాటి బంగారు నాణేలు ఉన్నాయా? అంతకంటే విలువైనవే ఉన్నాయి. హార్స్›్టఅనే రైతు పెంచుకుంటున్న పది లక్షల తేనెటీగలు ఉన్నాయి! తేనెటీగలతో పాటు, వాటిల్లోని రాణి తేనెటీగల్నీ, తేనె సీసాల్నీ దుండగులు పట్టుకుపోయారని హార్స్›్ట లబోదిబోమంటున్నాడు. దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు ఇప్పుడు వియన్నాలోని చెట్టూపుట్టా గాలిస్తున్నారు.
తిక్క.. తిరిగొచ్చింది
చెక్కు మీద ఏం ఉంటుంది? అమౌంట్ ఉంటుంది. చెక్కు ఎవరికి ఇవ్వాలో వాళ్ల పేరు ఉంటుంది. డేట్ ఉంటుంది. చెక్కు ఇచ్చిన వారి సంతకం ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా స్కాట్ డియాన్ అనే ఆయన ఇంటి పన్ను కోసం ఇచ్చిన 48 వేల రూపాయల (745 డాలర్లు) చెక్కు వాపస్ వచ్చింది! ‘నా అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయి కదా! చెక్కు ఎందుకు బౌన్స్ అయింది?’ అని స్కాట్ బోలెడంత ఆశ్చర్యపోయాడు. ‘అకౌంట్‌టో డబ్బులు ఉంటే సరిపోదు, నీక్కొంచెం బుద్ధి కూడా ఉండాలి’ అని లోకల్ ట్రెజరీ అధికారి నుంచి సమాధానం వచ్చింది! విషయం ఏంటంటే.. చెక్కు మీద ఉండే మెమో లైన్‌లో స్కాట్ గారు ‘ఆస్తి పన్నుకోసం’ అని కాకుండా, ‘ఫర్ సెక్సువల్ ఫేవర్స్’ అని రాసి పంపారు. (మీరిచ్చిన సుఖానికి ప్రతిఫలంగా అని), దాంతో ఆ చెక్ పాస్ చేసేవాళ్ల కోపం నషాళానికి అంటింది. స్కాట్.. యు.ఎస్.లోని మాంటానా నివాసి. అతడి చెక్కులు ఎప్పుడూ అలాగే ఉంటా యని చుట్టుపక్కల వాళ్లు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారట.