తలుపులు లేని చెంగాళమ్మ గుడి | sakshi god special | Sakshi
Sakshi News home page

తలుపులు లేని చెంగాళమ్మ గుడి

Published Tue, Oct 25 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

తలుపులు లేని చెంగాళమ్మ గుడి

తలుపులు లేని చెంగాళమ్మ గుడి

కలత తీర్చే తల్లి ఒడి

 

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కాళంగి నదీ తీరాన వెలసిన చల్లని తల్లి చెంగాళమ్మ. గ్రామశక్తిగా వెలసిన ఈ తల్లి తన కరుణతో మహిమతో దక్షిణ కాళీమాతగా ఆంధ్ర-తమిళనాడు భక్తుల ఆరాధ్యదైవంగా నేడు విరాజిల్లుతోంది. చోళరాజుల కాలంలో శుభగిరి అనే చిన్నగ్రామమే నేటి సూళ్లూరుపేట. ఓసారి కొందరు శుభగిరి గ్రామస్తులు పశువులు మేపుకుని సాయంత్రం ఇంటికెళుతూ కాళంగినది వద్ద ఆగి స్నానానికి దిగారు. ఇంతలో ఓ యువకుడ్ని సుడి ఆవరించి నీటి అడుగుభాగానికి తీసుకెళ్లింది. అతడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆసరాగా చేతులు కదిలించగా ఓ పెద్ద బండరాయి దొరికింది. దానిని పట్టుకుని ఊతంగా తీసుకోవడంతో సుడి వెళ్లిపోయి ఒడ్డుకు పడగలిగాడు. ఈ విషయాన్ని అతడు తోటి కాపరులకు  చెప్పగా అందరూ కలిసి బండరాయి కోసం వెతికి దానిని గట్టుకు తీసుకొచ్చి చూశారు. తీరా చూస్తే అది బండరాయి కాదు. ఓ స్త్రీమూర్తి విగ్రహం.

అష్టభుజాలతో వివిధ రకాల ఆయుధాలను ధరించి వామపాదం కింద ఓ రాక్షసుణ్ణి తొక్కిపట్టి చేతిలోని త్రిశూలంతో పొడిచి చంపుతున్న రూపంలో ఉన్న అద్భుతమైన విగ్రహమది. దానిని చూసిన కాపరులు నది ఒడ్డున ఉన్న రావిచెట్టు కింద పడుకోబెట్టేసి గ్రామంలోకి వచ్చేశారు. జరిగిన విషయాన్ని విన్న గ్రామస్తులు మరుసటి రోజు వచ్చి చూసేసరికి  విగ్రహం దక్షిణాభిముఖంగా లేచి నిలబడి ఉంది. దానిని మరోచోటకు తరలించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎంతమంది కలసి కదిపేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఆ రాత్రి గ్రామ పెద్దరెడ్డికి అమ్మవారు కలలో కనిపించి తనను అక్కడ నుంచి కదిలించవద్దని, తాను స్వయంభువుగా వెలిశానని చెప్పడంతో గుడి నిర్మించి పూజించుకుంటూ వచ్చారనే కథనం ప్రచారంలో ఉంది. దక్షిణాభి ముఖంగా ఉండటంతో తమిళులు అమ్మను ‘తెన్ కాళియమ్మ’ అని పిలువగా కాలక్రమంలో ‘చెంగాళమ్మ’గా మారిందని పెద్దలు చెబుతుంటారు.

 
తలుపులు లేని ఆలయం ఇదే

రాష్ర్టంలో ఎక్కడా తలుపులు లేని ఆలయాలు లేవు. కాని తలుపులు లేకుండా ఉన్న ఏకైక ఆలయం చెంగాళమ్మ గుడి మాత్రమే. దీనికి ఒక కథ ప్రచారంలో ఉంది. అప్పట్లో చెంగాళమ్మ ఆలయంలోకి ఒక దొంగ వచ్చాడు.  ఆవరణలో భక్తులు నిద్రిస్తుండగా అమ్మవారికి చెందిన నగలు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే అలికిడికి భక్తులు లేవడంతో దొరికిపోయాడు. దీంతో దొంగలు పడకుండా ఉండటానికి ఆలయానికి తలుపులు ఏర్పాటు చేయాలని పెద్దలు నిర్ణయించారు. వెంటనే వడ్రంగిని పిలిపించి పని అప్పగించారు. వారు దీనికి కావాల్సిన కొయ్యలను తీసుకొచ్చి పని ప్రారంభించారు. తలుపులకని తెచ్చిన చెక్కలు పక్కనే ఉన్న చెట్టుకు ఆనించి వెళ్లారు.  ఉదయానికి అవి చెట్టులో కలిసి పోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ సందర్భంలో ఓ మహిళను ఆవహించిన అమ్మవారు ‘ఈ మార్గంలో నిరంతరం ప్రయాణించే ప్రయాణికులు అన్ని వేళలా దర్శనం చేసుకునేలా నా గుడి ఉండాలే కానీ దానికి తలుపులు పెడతారా’ అని  చెప్పడంతో నేటికీ తలుపులు పెట్టలేదు.

 
ఏడేళ్లకు ఒకసారి బ్రహ్మోత్సవాలు

ఆంధ్రా, తమిళనాడు భక్తులకు ఆరాధ్య దైవమైన సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి బ్రహ్మోత్సవాలను ఏడేళ్లకు ఒకసారి నిర్వహిస్తుంటారు. వీటికి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నలు మూలల నుంచి భక్తులు వస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ‘సుళ్లు ఉత్సవం’ జరుగుతుంది. అమ్మవారు కాళంగినది సుడుల్లో నుంచి పుట్టారు కాబట్టి ప్రతిరోజు సుళ్లు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సుళ్ల ఉత్సవం మీదనే ఈ ఊరికి సూళ్లురు పేట అనే పేరు వచ్చింది.

 
మహిషాసురమర్థనం అంటే..
చెంగాళమ్మ తిరునాళ్లలో మరో ముఖ్యఘట్టం మహిషాసుర మర్దనం. ఇందుకోసం అమ్మవారిని సింహవాహంపై అలంకారం చేసి ఆలయం బయటకు ఊరేగింపుగా తీసుకొస్తారు. అమ్మవారి పక్కనే ఆలయ ధర్మకర్త అమ్మవారి ప్రతినిధిగా రెండుమూరల కత్తితో సిద్ధంగా ఉంటాడు. మహిషాసురుడి విగ్రహం దగ్గరకు రాగానే ధర్మకర్త చేతిలోని కత్తితో విగ్రహం శిరస్సు ఖండిస్తాడు. అలా ఎనిమిది పర్యాయాలు మాయా అవతారాలతో (బొమ్మ తలలతో) వచ్చినమహిషాసురుడి తలను ఖండించాక తొమ్మిదో పర్యాయం దున్నపోతు బొమ్మతలతో అమ్మవారి ముందుకు వస్తాడు. అప్పుడు శిరస్సును ఖండించడంతో మహిషాసురమర్దన ఉత్సవం ముగుస్తుంది. ఆ తరువాత భారీ ఎత్తున బాణాసంచా వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇదే కావడం విశేషం.

 

తెప్పోత్సవం
మహిషాసురుణ్ణి చంపిన ఆనందంతో అమ్మవారు సంతోషంగా విహరించే ఉత్సవాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వాటంబేడుకు చెందిన మత్స్యకారులు ప్రత్యేకంగా తెప్పను తయారు చేసి తెప్పోత్సవానికి అందజేస్తారు.  ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు కాళంగినదిలో కిక్కిరిసినట్టుగా కనిపిస్తారు. తెప్పోత్సవం అనంతరం సుమారు రెండు గంటలపాటు బాణాసంచా వేడుకలను నిర్వహిస్తారు.

 
అమ్మవారి మహిమలు

ఈ ప్రాంతంలో చిన్నారులకు జ్వరం, వాంతులు, విరేచనాలు వస్తే చాలామంది అమ్మవారి ఆలయంలో నిద్రించి తెల్లవారుజామున చీటాకు కట్టించుకుని వెళుతుంటారు. రోగాలు, రుగ్మతలు పోగొట్టుకోవడానికి ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఆరుబయటే నిద్రిస్తారు.సినీ కళాకారులు, తమిళనాడు, ఆంధ్రాకు చెందిన ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా తరచు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. కోటి, వాణిశ్రీ, రంభ, జయప్రద తదితరులు చెంగాళమ్మ భక్తులు. తమిళనటుడు సత్యరాజ్ తరచూ అమ్మ దర్శనానికి వస్తాడు. షార్‌లో రాకెట్ ప్రయోగం జరిగిన ప్రతిసారి రాకెట్ నమూనాతో వచ్చి పూజలు చేయడం పరిపాటిగా మారింది. అలాగే ఇక్కడ ఉన్న సంతానవృక్షానికి ఊయల ముడుపు కడితే పిల్లలు పుడతారని నమ్మకం.
 

 
నిత్యాన్నదానం

చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి (అప్పట్లో దండుబాట) పక్కనే చిన్న ఎరుపురంగు దేవాలయంగా వెలసిన చెంగాళమ్మ ఆలయం నేడు ఎంతోమంది దాతల సాయంతో కల్యాణమండపం, కాటేజీలు ఇతర సౌకర్యాలతో అభివృద్ధి చెందింది. కోరిన కోర్కెలు తీరడంతో చాలామంది ముందుకొచ్చి భూరి విరాళాలిచ్చి అమ్మవారికి స్వర్ణాభరణ, కిరీటాలు, త్రిశూలాలు, వెండి పల్లకి, పలు రకాలు బంగారు ఆభరణాలు ఏర్పాటు చేశారు. 2011లో చైర్మన్‌గా ఉన్న బద్దెపూడి వేణుగోపాల్‌రెడ్డి  దాతల సాయంతో నిత్య అన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకానికి పలువురు ముందుకొచ్చి రూ.1.30 కోట్లు విరాళాలిచ్చారు. నిత్యం వందమందికి అన్నదానం చేస్తున్నారు. - మొలకల రమణయ్య, సాక్షి ప్రతినిధి, సూళ్లూరుపేట

 

ఎలా చేరుకోవాలి?
చెంగాళమ్మ క్షేత్రం ఏసియన్ హైవే 45 (ఎన్‌హెచ్ 5) మీద ఉంది. ఇది చెన్నై నుంచి 68 కి.మీ, తిరుపతి నుంచి 74 కి.మీ, నెల్లూరు నుంచి 108 కి.మీ దూరంలో ఉంది. సూళ్లూరు పేటలో రైల్వే స్టేషన్ ఉంది. చెన్నై నుంచి సూళ్లురు పేటకు ప్రతి గంటకు సబర్బన్ రైళ్లు ఉన్నాయి.

 

సుళ్లు ఉత్సవమంటే..
చెంగాళమ్మ తిరునాళ్లులో మొదటి మూడురోజులు ప్రత్యేకంగా సుళ్లు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. కాళంగినది సుడిగుండంలో అమ్మవారు విగ్రహం లభ్యమైంది. దీన్ని స్మరించుకుంటూ తిరునాళ్లల్లో ప్రత్యేకంగా సుళ్లు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పాలవెల్లిని సుడిమాను చక్రానికి బిగించి భక్తుల సమక్షంలో మొదట తిప్పుతారు. ఆ తర్వాత వడిబాలు, నల్లమేకపిల్ల, పూలమాల, మనిషి నమస్కారం చేసే బొమ్మ, రోలును ఒక్కోసారి ఒక్కోదాన్ని కట్టి ఒక్కో చుట్టు తిప్పుతారు. దీన్ని సుళ్లు ఉత్సవమని అంటారు. సుళ్లు ఉత్సవాన్ని తిలకించేందుకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు వస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement