సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లి వేరు, దేవత వేరు కాదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి అని సీఎం చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంస్కృతి, సాంప్రదాయాలను తీసుకొచ్చామని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా అని ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పర్వదినం. తెలంగాణ ఏర్పాటు పునాది పడిన రోజు. అమరుల త్యాగాలకు అనుగుణంగా సోనియా తెలంగాణ ప్రకటన చేశారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా నెరవేర్చారు.
ఇదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహంపై రేవంత్ ప్రకటన చేశారు. రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి అంటే భావోద్వేగం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. మనల్ని లక్ష్యసాధన వైపు నడిపించిన తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ నేల స్వేచ్చ కోసం పిడికిలి బిగించిన ఉజ్వల జ్వాల. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంస్కృతి, సాంప్రదాయాలను తీసుకొచ్చాం.
మెడకు కంటె, గుండు పూసల హారంతో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. పత్రీ ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలి. సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ స్పూర్తితో విగ్రహం.
ఏ తల్లికి కిరీటం ఉండదు. దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుంది. తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా. చేతిలో వరి, జొన్నలు, సజ్జలతో తెలంగాణ తల్లి విగ్రహం. పుట్టుక నీది, చావు నీది అన్న కాళోజీ మాటల స్పూర్తితో యువత ఉద్యమించింది. అగ్నికీల్లలో దేహాలు మండినా తెలంగాణ సాధన కోసం యువత వెనకడుగు వేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment