వెన్ను బ్యాలెన్స్ తప్పితే... సరి చేయవచ్చు!
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 64 ఏళ్లు. కొద్ది రోజులుగా నేను నడుమునొప్పితో పాటు కాళ్లలో నొప్పులు, తిమ్మిర్లతో బాధపడుతున్నాను. కాళ్లు మొద్దుబారడం, కూర్చున్నా నిల్చున్నా నడుమునొప్పి రావడం జరుగుతోంది. దీనికి కారణాలు, చికిత్స తెలపండి.
– సుధాకర్‌రావు, తెనాలి
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు స్పాండిలోసిస్థెసిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. స్పాండిలోసిస్థెసిస్ వచ్చినప్పుడు వెన్నుపూసలు నరాల మీద ఒత్తిడి కలిగించి నడుము నొప్పితో పాటు కాళ్లలో నొప్పులు, తిమ్మిర్లు ప్రారంభమవుతాయి. దీనితో బాధపడుతున్నవారు నడిస్తే చాలు... కాళ్లలో నొప్పి రావడం మొదలవుతుంది. కాళ్లు బరువెక్కుతాయి. కొంచెం దూరం కూడా నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆగిపోతే నొప్పి తగ్గుతుంది. తిరిగి నడిస్తే మళ్లీ నొప్పి. దీన్నే వైద్య పరిభాషలో క్లాడికేషన్ అంటారు. ఈ దశలోనే ఆ ప్రాంతంలో నడుము సమతౌల్యం తప్పుతుంది.
దీని తర్వాత నడుము మొత్తంగా ఒక పక్కకి గానీ ముందుకు గానీ ఒంగిపోతుంది. దీన్ని గ్లోబల్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అంటారు. కొంచెం సేపు నిల్చున్నా, కొంచెం దూరం నడిచినా నడుము, పిరుదుల భాగం, తొడ ఎముక భాగాల్లో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి క్రమంగా తీవ్రమై మంచం మీద నుంచి బాత్‌రూమ్ వరకు నడవలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటివారు వెంటనే డాక్టర్‌ను కలిసి వెన్ను బ్యాలెన్స్ తప్పుతున్న కండిషన్‌ను సరిచేయించుకోవచ్చు. లక్షణాలు కనిపించగానే చికిత్స చేయించుకోవడం ఎంతైనా అవసరం. ఈ తరహా సమస్యలను స్పైనల్ డికంప్రెషన్ అండ్ స్టెబిలైజేషన్ సర్జరీ అనే శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. వెన్ను శస్త్రచికిత్సలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ బ్యాలెన్స్‌ను దృష్టిలో ఉంచుకోవాలి. బ్యాలెన్స్ సరిచేయకపోతే వెన్ను సమస్యలు పూర్తిగా తగ్గవు.
బొటనవేలి నొప్పి తగ్గాలంటే..?
లైఫ్ స్టైల్ కౌన్సెలింగ్
నేను స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటాను. ఈమధ్య నా బొటనవేలు చాలా నొప్పిగా ఉంటోంది. నొప్పి తగ్గడానికి ఏం చేయాలి?
– వినయ్‌కుమార్, హైదరాబాద్
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు బ్లాక్‌బెర్రీ థంబ్ లేదా గేమర్స్ థంబ్ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. దీన్నే వైద్యపరిభాషలో డీ–క్వెర్‌వెయిన్ సిండ్రోమ్ అంటారు. మనం మన స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే సమయంలో బొటనవేలిని మాటిమాటికీ ఉపయోగిస్తుంటాం. దాంతో బొటనవేలి వెనకభాగంలో ఉన్న టెండన్ ఇన్‌ఫ్లమేషన్‌కు గురై వాపు వస్తుంది. మళ్లీ అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మానక మళ్లీ మళ్లీ గాయం తిరగబెడుతుంది. ఫలితంగా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. అవి...
టైపింగ్ లేదా టెక్ట్స్ మెటీరియల్ పంపడం కోసం ఒక బొటన వేలినే కాకుండా ఇతర వేళ్లను కూడా ఉపయోగిస్తూ బొటనవేలిపై పడే భారాన్ని తగ్గించడం.మణికట్టును రిలాక్స్‌గా ఉంచి వీలైనంత వరకు మణికట్టుపై భారం పడకుండా చూడటం. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒళ్లో పెట్టుకొని ఉండకుండా, కాస్త ఛాతీ భాగం వద్ద ఉండేలా చూసుకోవాలి. ఒళ్లో పెట్టుకోవడం వల్ల కంటి మీద, ఒంగి స్క్రీన్ చూస్తూ ఉండటంతో మెడ మీద భారం పడుతుంది. అదే ఫోన్‌ను ఛాతీ వద్ద పెట్టుకుంటే అన్నివిధాలా సౌకర్యంగా ఉంటుంది. ఫోన్‌ను శరీరానికి ఏదో ఒక వైపున ఉంచకుండా మధ్యన ఉంచడం వల్ల శరీరం అసహజ భంగిమలో ఒంగకుండా బ్యాలెన్స్‌తో ఉంటుంది.ఫోన్ ఉపయోగించే సమయాన్ని సాధ్యమైనంతగా తగ్గించడం.
పొడవు వాక్యాలు కాకుండా అర్థమయ్యేరీతిలో షార్ట్‌కట్స్ వాడుతూ వేలి వాడకాన్ని తగ్గించడం. దీనివల్ల మీ బొటనవేలు, ఇతర వేళ్లు, మణికట్టుపై భారం తగ్గుతుంది. ‘ఐ యామ్ ఇన్ మీటింగ్’ లాంటి కొన్ని రెడీమేడ్ వాక్యాలు ఉంటాయి. వాటిని ఉపయోగిస్తే టైపింగ్ బాధ తగ్గడంతో పాటు, సమయం కూడా ఆదా అవుతుంది.అదేపనిగా ఫోన్ ఉపయోగించే వారు... ప్రతి 15 నిమిషాల్లో కనీసం 2–3 నిమిషాల పాటు మీ బొటనవేలికి విశ్రాంతినివ్వాలి. అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించండి.
– సుధీంద్ర ఊటూరి, లైఫ్‌స్టైల్ నిపుణులు,
కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్
పాపకు తల మీద ర్యాష్...
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా పాపకు ఆరు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. మా డాక్టర్‌గారికి చూపించాం. మొదట తగ్గిందిగానీ, కొన్నాళ్లకు మళ్లీ వచ్చింది. పాపకు తలలోని కొన్నిప్రాంతాల్లో జుట్టు సరిగా రావడం లేదు. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఏదైనా సూచనా? – సుహాసిని, విజయవాడ
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో కూడా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది.
ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్.పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనక భాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు.
ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న కీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్ల తప్పనిసరిగా వీళ్లకు నయమవుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం. ఇదేమీ భవిష్యత్తు వ్యాధులకు సూచన కాదు. మీరు ఒకసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఈ సమస్య తప్పక తగ్గిపోతుంది.
– డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్