బనారంగ్
అరచేతిలోకి సూర్యుణ్ణి తీసుకుని రుద్దితే దాన్ని తీసుకెళ్లి చంద్రుడికి అద్దితే ఆకాశం కొత్తగా ఉండదూ! బనారస్ చీరల రంగులు వేడివేడిగా... చల్లచల్లగా... హృదయాన్ని తాకుతాయి. ఈ రంగుల రంగేళీయే... బనారంగ్ వేర్ ట్రెడిషన్ బ్రేక్స్ ట్రెడిషన్. సంప్రదాయంలోంచి పుట్టుకొచ్చిన కొత్తరంగులివి.
మొఘలుల కళ
మగ్గం మీద ఒక్క నాణ్యమైన బనారస్ పట్టు చీర నేయాలంటే కనీసం 15 రోజుల నుంచి ఆరు నెలల కాలం పడుతుంది. 14వ శతాబ్దికి ముందు గుజరాత్ నుంచి వలస వెళ్లిన చేనేతకారులు బనారస్‌లో చీరలు నేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రాంతం పేరుమీదుగా బనారస్ ఫ్యాబ్రిక్‌కు ఆ పేరు వచ్చింది. మొఘలుల కాలంలో ఈ చీరల నేతలో ఎన్నో మార్పులు వచ్చాయి. 19వ శతాబ్ది మొదట్లో బనారస్ పట్టు స్థానంలో జరీ, బ్రొకేడ్ వెలుగు చూసింది. అలాగే, పట్టులోనే బ్రొకేడ్ మెరుపులు 17వ శతాబ్దిలో పరిచయం అయ్యాయి. వీటిల్లో ప్యూర్ బనారస్ సిల్క్, జార్జెట్, ఆర్గంజా, జరీ, సిల్క్‌లు ప్రవేశించాయి. టిష్యూ, బుటీదార్, కట్‌వర్క్, టంచోయి, జంగల్.. వంటివీ పరిచయం అయ్యాయి. దీంతో డిజైనర్ శారీస్ అంటే బెనారస్ ఫ్యాబ్రిక్ అనే పేరు స్థిరపడిపోయింది. పువ్వులు, పండ్ల నుంచి తీసిన నేచురల్ కలర్స్ రంగులు సిల్కు దారాలకు ఇంకేలా చర్యలు తీసుకొని, ఆ తర్వాత ఫ్యాబ్రిక్‌గా మెరిపిస్తారు. అందుకే ఈ కళకు సహజమైన ప్రత్యేకత ఇమిడి ఉంటుంది.
డిజైనర్ల మొట్టమొదటి ఎంపిక
భారతీయ డిజైనర్లు ఎంపిక చేసుకునే మొట్టమొదటి ఫ్యాబ్రిక్ బనారస్. భారతీయ వివాహ వేడుకలలో ప్రధానంగా కనిపించే వస్త్రం బనారస్. అన్ని మతాలకు నప్పే ఏకైక వస్త్రంగా చరిత్ర నిలుపుకున్నది బనారస్. మన గొప్ప సంస్కృతికి కళాత్మక చిహ్నమైన ఈ ఫ్యాబ్రిక్ వేల ఏళ్లుగా తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. బనారస్ ఫ్యాబ్రిక్‌లోని రంగులు, జరీ వెలుగులు చూపుతిప్పుకోనివ్వవు. ప్రతి భారతీయ మహిళ తప్పని సరిగా తన వార్డ్‌రోబ్‌లో బనారస్ చీర ఒక్కటైనా ఉండాలని ముచ్చటపడతారంటే అతిశయోక్తి కాదు.
ఇండో వెస్ట్రన్
బనారస్ చీరలలో బ్రొకేడ్, ఫైన్ సిల్క్, మెత్తటి జరీ ఎప్పుడూ హైలైట్. ఇది రాయల్ ఫ్యాబ్రిక్ అవడంతో దుస్తుల్లో ఏదైనా ఒక అంశంగా తీసుకోవాలని ముచ్చపడేవారే ఎక్కువ. దీంతో జాకెట్లు, ట్రౌజర్లు, చీరలు డ్రెస్సుల అంచులు, ట్రెడిషనల్ ఇండియన్ ఔట్‌ఫిట్స్.. గా బెనారస్ ఫ్యాబ్రిక్ ఇమిడిపోయింది. బ్రైడల్ లెహంగా లేదా ఫెస్టివ్ లెహంగా ఏదైనా ఈ తరం అమితంగా ముచ్చటపడి ఎంచుకునే లెహంగా బనారస్ ఫ్యాబ్రిక్. ఏ ఫ్యాబ్రిక్‌తో చేసిన డ్రెస్ అయినా భనారస్ దుపట్టా వేసుకుంటే చాలు ఒక గ్రాండ్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. బనారస్ ట్యునిక్స్, కుర్తాలను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ధరించవచ్చు. స్ట్రెయిట్ ట్రౌజర్ లేదా లెహంగా మీదకు బనారస్ కుర్తా వేసుకుంటే నాటికీ- నేటికీ అద్దం పట్టే ఒక ఫ్యుజన్ స్టైల్ వస్తుంది.