ఆ మేకప్‌ని తుడిచేద్దాం : అమల | Sakshi Special Interview With Akkineni Amala | Sakshi
Sakshi News home page

అద్దంలో అందం లేదు

Published Sun, Apr 14 2019 2:55 AM | Last Updated on Sun, Apr 14 2019 10:10 AM

Sakshi Special Interview With Akkineni Amala

అద్దం ముందు నిలబడితే మనం కనపడతాం.అది మనం కాదు.. మనం ప్రతిబింబం కాదు..మనం ప్రకృతికి ప్రతిరూపం.. సహజంగా ఉందాం..మనస్సు మీద ఉన్న మేకప్‌ని తుడిచేద్దాం..అంటున్నారు అమల.

‘హై ప్రీస్టెస్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి స్పెషల్‌ రీజన్‌ ఏంటి?
అమల: పుష్పా (‘హై ప్రీస్టెస్‌’ దర్శకురాలు) నా ఫ్రెండ్‌. ‘ఓ సిరీస్‌ రాశాను. చేయాలి’ అని అడిగింది. స్క్రిప్ట్‌ చదివాను. చాలా నచ్చింది. చేసేశాం. బడ్జెట్, నిడివి అన్నీ పరిగణనలోకి తీసుకుంటే సినిమాలో కొన్ని కథలు మాత్రమే చెప్పగలం. వెబ్‌ షోకి ఆ ప్రాబ్లమ్‌ లేదు. ప్రేక్షకులు కూడా డిఫరెంట్‌ మీడియమ్స్‌ ద్వారా కొత్త కొత్త కంటెంట్‌ చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. అది మంచి పరిణామం.

ఇది మీకు ఫస్ట్‌ వెబ్‌ సిరీస్‌ కాదేమో?
అవును. బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ ఖాన్‌గారు అమేజాన్‌ ప్రైమ్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ తీశారు. అందులో చిన్న పాత్ర చేశాను. ఆ సిరీస్‌ను 27 భాషల్లో రిలీజ్‌ చేయబోతున్నారు. అంటే దాని స్కేల్‌ ఏంటో ఊహించుకోవచ్చు. మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్‌ వెబ్‌ మీడియమ్‌ వైపు వెళ్లాను. మా స్టూడెంట్స్‌ (అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్‌) కూడా వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నారు. 
     
‘హై ప్రీస్టెస్‌’ ‘సూపర్‌ న్యాచురల్‌ ఎలిమెంట్స్‌ చుట్టూ తిరిగే కథలా కనిపిస్తోంది. సూపర్‌ న్యాచురల్‌ పవర్‌ని మీరు నమ్ముతారా? 
మనందర్నీ ఓ పవర్‌ నడిపిస్తుంది, ఓ సూపర్‌ పవర్‌ ఉందనే విషయాన్ని నేను నమ్ముతాను. ప్రతి దానికీ ఓ కారణం ఉంటుంది. అలాగే సమాధానం కూడా ఉంటుందని నమ్ముతాను. 

‘రాజుగారి గది’లో నాగార్జునగారు ఇలాంటి పాత్ర చేశారు. మైండ్‌ని చదివే పాత్ర అది..
ఆయన చాలా స్టైలిష్‌గా చేశారది (నవ్వుతూ). 

ఫ్యూచర్‌ తెలుసుకోవడానికి, గైడెన్స్‌ కోసం ‘ట్యారో రీడింగ్‌’ని ఫాలో అవుతారా? 
ఫాలో అవ్వడం కాదు కానీ ఓ గైడెన్స్‌లాగా మనం ఓ ప్రశ్న అడగాలి. మీరు ఇది చేయండి అనే సమాధానం దొరకదు. కానీ మీరు చేయాల్సింది చేస్తూ ఇవిగో ఈ జాగ్రత్తలు తీసుకోండి అని సూచిస్తుంది. సాధారణంగా మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అప్పుడున్న మానసిక పరిస్థితిని బట్టి తీసుకుంటాం. ఎమోషనల్‌గానో, కోపంగానో ఇలా ఏవేవో కారణాలతో. అప్పుడే తప్పులు జరుగుతాయి. అందుకే పెద్దలు ఆలోచించి చేయండి అంటారు కదా? ట్యారో రీడింగ్‌ కూడా అలాంటిదే. 

ఇంట్లో అందరూ ఒకే ప్రొఫెషన్‌. ఇంట్లో కూడా సినిమానే డిస్కస్‌ చేస్తుంటారా? 
అన్నీ చర్చించుకుంటాం. కానీ సినిమా కొంచెం ఎక్కువ. తండ్రీ కొడుకులు మాత్రం ఎక్కువ సినిమాల గురించే మాట్లాడుకుంటారు. 
     
మీరు మళ్లీ సినిమా చేయాలని వాళ్లు అనడంలేదా? 
నేను సినిమాలకు దూరంగా లేను. అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్‌ చూసుకుంటున్నాను. అయితే ప్రేక్షకులకు మాత్రం స్క్రీన్‌ మీద కనిపిస్తేనే కనిపించినట్టు లెక్క...మాది సినిమాకు సంబంధించిన ఫ్యామిలీ. స్టూడియో ఉంది, యాక్టర్స్‌ ఉన్నాం. మావయ్యగారు (అక్కినేని నాగేశ్వరరావు) నటుడు, నిర్మాత. ఆయన పోయిన తర్వాత అన్నపూర్ణ స్కూల్‌ బాధ్యతను నాకు అప్పగించారు. అందులో 350 మంది స్టూడెంట్స్‌ ఉన్నారు. వాళ్ల ఫ్యూచర్‌ గురించి ఆలోచించాలి. ప్రతి నిమిషం సినిమా గురించే ఆలోచిస్తున్నాను. కెమెరా ముందున్నా వెనకున్నా సినిమాల్లో ఉన్నట్లుగానే భావిస్తాను. 

శ్రీదేవిగారు చనిపోయినప్పుడు ‘అతిలోక సుందరి’ అంటూ ఆమె అందం గురించే ఎక్కువగా వినిపించింది. అదే సమయంలో మీరు ‘అందం అశాశ్వతం.. జీవితంలో శాశ్వతమైనవి చాలా ఉన్నాయి..’ అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. అందానికి ప్రాధాన్యం ఇవ్వకూడదా?
ప్రతి ఒక్కరూ అందం.. అందం అనే అడుగుతారు. మన అభిప్రాయాలు, ఆలోచనలు అడగరా? ఎప్పుడూ లుక్స్‌ గురించే మాట్లాడటం నాకు చాలా నిరుత్సాహంగా ఉంటుంది. పైకి కనిపించే అందం గురించి ఎందుకు? ఒక మనిషి లోపల ఎంతో ఉంటుంది. వాటి గురించి మాట్లాడ్డానికి ఎవరూ ఆసక్తి చూపరు. ‘ఏం వంట చేస్తారు? ఏం తింటారు? అని ఎప్పుడూ అడుగుతారు. ఒక్కోసారి అందం టాపిక్‌ తప్ప ఇంకేం లేదా? ఇదేనా అనిపిస్తుంటుంది. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ గురించి మాట్లాడొచ్చు. చరిత్ర గురించి మాట్లాడొచ్చు. సోషల్‌ ఇష్యూస్‌ గురించి డిస్కస్‌ చేయొచ్చు. మన ఆలోచనలను పంచుకోవచ్చు. పైకి కనిపించేది మాత్రమే కాదు. జీవితం అంటే చాలా ఉంటుంది.

అందుకే అందం గురించి అడిగితే థ్యాంక్స్‌ ఫర్‌ ది కాంప్లిమెంట్‌. నెక్ట్స్‌ ఏంటి? అంటాను. సంభాషణ అందం దగ్గరే తిరగకూడదు కదా. అది మైండ్‌లో పెట్టుకునే ఆ రోజు ఫేస్‌బుక్‌లో అలా రాశాను. యాక్చువల్లీ ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా ఉంటే అదే అందం అంటారు..ఎగ్జాట్లీ. హెల్దీగా ఉండాలి. ఫిట్‌గా ఉండాలి. ఫిట్‌గా ఉంటే ఎక్కువ పని చేసుకోవచ్చు. నా విషయానికే వస్తే.. పొద్దున 9కి నా వర్క్‌ స్టార్ట్‌ అయి, సాయంత్రం 6 వరకూ కంటిన్యూ అవుతుంది. వారంలో ఆరు రోజులూ పని చేస్తాను. షూటింగ్‌కు వెళ్తే మార్నింగ్‌ సెవన్‌ టు నైట్‌ టెన్‌. అలా పని చేయాలంటే ఫిట్‌గా ఉండాలి కదా? అన్‌ఫిట్‌గా, అనారోగ్యంగా ఉంటే కుదరదు. ఇలా హెల్త్‌ గురించి మాట్లాడమంటే ఎంతైనా మాట్లాడతాను. గాసిప్స్, జడ్జిమెంట్స్‌ అనేది ఒక్క లెవల్‌ వరకే. మెచ్యూరిటీ వస్తే అవన్నీ చిన్నగా అనిపిస్తాయి. మిగతావేంటి అని ఆలోచిస్తాం.

ఓకే.. మీరు యాక్టివ్‌గా ఉండటానికి గల కారణాల్లో ఒకటి చెబుతారా?
మా అన్నపూర్ణ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 102 మెట్లు ఉన్నాయి. లిఫ్ట్‌లో వెళ్లను. ఆ 102 మెట్లు ఎక్కు తాను.. దిగుతాను. ఒక్కసారి కాదు.. రోజుకి నాలుగుసార్లు. అది కూడా స్లోగా కాదు. చాలా ఫాస్ట్‌గా.

సోషల్‌ మీడియా వల్ల లుక్స్‌ని జడ్జ్‌ చేయడం ఎక్కువ అయిపోయింది. ఈ విషయం గురించి?
మన లుక్స్‌ని అవతలి వాళ్లు జడ్జ్‌ చేస్తున్నారు. అందం విషయంలో ప్రతి ఒక్కరికీ ఒక్కో యాంగిల్, అభిప్రాయం ఉంటుంది. సోషల్‌ మీడియా అనేది వెరీ పవర్‌ఫుల్‌ టూల్‌. ఇంతకు ముందు టీవీ, వార్తా పత్రికల ద్వారానే సమాచారం తెలుసుకునేవాళ్లం. కానీ సోషల్‌ మీడియా రావడంతో ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్రం వచ్చింది. వాళ్లకు ఏది అనిపిస్తే దాన్ని డైరెక్ట్‌గా చెప్పొచ్చు. అలా అని ఎలా పడితే అలా అంటాం అంటే కుదరదు. సంస్కారం, క్రమశిక్షణ ఉండాలి. అయితే చాలామందికి అది లేదు. ఈ స్వాతంత్య్రంతో పాటు బాధ్యత కూడా రావాలి. మేం తీసుకున్న నిర్ణయాలను ఫాలో అవుతూ ముందుకు వెళ్లాలంటే వెనక ఎవరేం అంటున్నారో పట్టించుకోకూడదు. ఆ కామెంట్స్‌ అన్నింటినీ పట్టించుకుంటే ముందడుగు వేయలేం. 

అయితే మీలో ఓ ‘స్పిరిచ్యుల్‌ బ్యూటీ’ కనిపిస్తోంది. అంటే.. ఆధ్యాత్మిక బాటలో ఉన్నవారిలో కనిపించే ఓ ప్రశాంతమైన అందం. మీరు ఆ దారిలో ఉన్నారా?
నేను చెన్నైలోని ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌ ‘కళాక్షేత్ర’లో భరతనాట్యం నేర్చుకున్నాను. అక్కడ అన్ని మతాలు, అన్ని భాషల వాళ్లు ఉంటారు. కానీ ఆ తేడా చూపించరు. టీచింగ్స్‌ అన్నీ స్పిరిచ్యువల్‌ వేలో ఉంటాయి. యూనివర్సల్‌ ప్రేయర్స్‌ చేసేవాళ్లం. కళాక్షేత్రలో అడుగుపెడితే చాలు.. ఎంతో క్రమశిక్షణ, సంస్కారం అలవడతాయి. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత విపాసన మెడిటేషన్‌ నేర్చుకున్నాను. అక్కడ ఆధ్యాత్మికతను ఓ సైన్స్‌లా నేర్పిస్తారు. బుద్ధుడు పాటించినవి చెబుతారు.

మనుషులంటే దుఃఖం  కామన్‌. ఇది అర్థం చేసుకోవాలి. శరీరానికి వయసు అయిపోతుంది. మన జీవిత ప్రయాణంలో నచ్చింది జరగదు. జబ్బులు, మరణాలు.. ఎవరూ తప్పించుకోలేరు. అయితే దుఃఖంలో ఉన్నప్పుడు దాన్నుంచి బయటకు వచ్చే దారి కూడా ఉంటుంది. అది విపాసనలో చాలా అద్భుతంగా నేర్పిస్తారు. అది మన లోపల ఓ నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. ఎంత కష్టాన్నైనా దాటగలం అనే ధైర్యం, నమ్మకం వస్తుంది. మనకు ధైర్యం రావడమే కాకుండా మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా గైడ్‌ చేయవచ్చు. 

చిన్నప్పటి నుంచి స్పిరిచ్యు్యవల్‌ దారిలో వెళ్లే వాళ్ల లైఫ్‌ సక్రమంగా ఉంటుందంటారా? 
సక్రమంగా అనేది ఒక అభిప్రాయం.. అంతే. అప్స్‌ అండ్‌ డౌన్స్‌ అందరి జీవితాల్లో కామన్‌. నాకు జరిగినవి మీకు తెలియదు. మీకు జరిగినవి నాకు తెలియదు. అయితే ఆ ఆటుపోటులను దాటగలిగే ధైర్యం వస్తుంది. కానీ ఈ మధ్య స్పిరిచ్యువాలిటీ కూడా ఓ బిజినెస్‌ అయింది. ఆ తేడా మనం తెలుసుకోగలగాలి. మన ఇన్నర్‌ వాయిస్‌ని డెవలప్‌ చేసుకోవాలని చెబుతాను. మన లోపల ధైర్యం ఉంటే దేన్నైనా ఎదుర్కోవచ్చు.

ఇలా ఆలోచించడంవల్ల మన ఓటములు నుంచి వచ్చే బాధ చిన్నగా అనిపిస్తుందా? 
కచ్చితంగా. ఇదో ఫేజ్‌ అని దాటేయగలిగే శక్తి వస్తుంది.

ఓకే.. బ్లూ క్రాస్‌తో ట్రావెల్‌ అవుతుంటారు. ఎన్నో ఏళ్లుగా మూగజీవాల సంరక్షణ చూస్తున్నారు కాబట్టి వాటి ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోగలరా? అలాగే మనుషుల ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోగలుగుతారా?
మూగజీవాల ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోగలుగుతాను. అలాగే మనుషుల ఫీలింగ్స్‌ని కూడా అర్థం చేసుకోగలను. కొన్ని సందర్భాల్లో ఎదుటివారు చెప్పడానికి ఇబ్బందిపడే విషయాలను అర్థం చేసుకోగలను. ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు చెప్పలేని విషయాలు ఉంటాయి. ఆ సమయంలో నేను అక్కడ ఉంటే అర్థం చేసుకోగలను. అక్కడ సంరక్షణ వాతావరణ లేదని అర్థం అవుతుంది. 

ఆ సందర్భాల్లో ఎలా రియాక్ట్‌ అవుతారు?
నా రియాక్షన్‌ గురించి పక్కన పెడదాం. ఇవాళ మనకు (స్త్రీలకు) ఏదైనా జరిగితే షీ టీమ్స్‌ ఉన్నాయి. భరోసా టీమ్స్‌ ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. 

వేధింపుల గురించి బయటకు చెప్పడం మంచిదే అంటారా? 
చాలా మంచిది. మనసులో పెట్టుకుని దాచుకుంటే ఉపయోగం లేదు. అయితే మనం నమ్మే వ్యక్తికి చెప్పాలి. చట్టాలు, సిస్టమ్‌ ఉన్నప్పుడు దాచుకోనక్కర్లేదు. భయపడటంలో అర్థమే లేదు.

మీరు హీరోయిన్‌గా ఉన్న సమయంలో ఇండస్ట్రీ ఎలా ఉంది? ఇబ్బందులేమైనా?
టాలెంట్‌ ఉంటే ఏదీ అవసరం లేదు. టాలెంట్, సక్సెస్‌ లేదంటే ఎవరైనా భయపెట్టి అడ్వాంటేజ్‌ తీసుకునే అవకాశం ఉండొచ్చు. టాలెంట్‌ ఉండి మనం ఏం చేయాలో అనే క్లారిటీ ఉంటే పని చేసుకోవడానికి ఇది గ్రేట్‌ ప్రొఫెషన్‌. 

అంటే.. టాలెంట్‌ ఉంటే ఎవ్వరూ మన జోలికి రారు. ‘అడ్జెస్ట్‌మెంట్‌’ గురించి అడగరు అనుకోవచ్చా? 
అలా అనడంలేదు. ప్రతి మనిషిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎవ్వరమూ అంచనా వేయలేం. టాలెంట్, సక్సెస్‌ ఉన్నా తేడాగా ప్రవర్తించేవాళ్లు ఉంటారు. అటువంటి సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. ‘వాట్‌ నాన్సెన్స్‌’ అని చెప్పి అక్కడి నుంచి బయటకు రావచ్చు. కంప్లయింట్‌ ఇవ్వొచ్చు. మనం ఎక్కడ పని చేస్తున్నాం అని కాదు. మనల్ని ఎవరైనా వేధిస్తున్నారు అనుకుంటే కంప్లయింట్‌ చేయొచ్చు. ప్రతి ఆర్గనైజేషన్‌ ఓ ఇంటర్నల్‌ కంప్లయింట్‌కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ వెంటనే సమస్యలను పరిష్కరించాలి. వేధించినవాళ్లను బయటకు పంపించాలి. సీరియస్‌ కేస్‌ అయితే పోలీసుల దగ్గరకు వెళ్లాలి. ఇవన్నీ మా సమయంలో లేవు. కానీ ఇప్పుడు ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. ధైర్యంగా ఉమెన్‌ పని చేసుకోవచ్చు. ఇది వండర్‌ఫుల్‌ టైమ్‌ అని చెప్పుకోవచ్చు. 

మీ ఇంట్లో ఇద్దరు అబ్బాయి (నాగచైతన్య, అఖిల్‌) లకు స్త్రీని గౌరవించాలని చెబుతుంటారా?
పిల్లలు వాళ్ల నాన్న (నాగార్జున)ని చూస్తారు కదా. అక్కినేని కుటుంబానికి లేడీ ఫ్యాన్స్‌ ఎక్కువ. ఆడవాళ్లను చాలా గౌరవిస్తారు. ఇంట్లో భార్యను గౌరవంగా చూస్తారు. పిల్లలకు మనం చెప్పేదాని కంటే మనం ఆచరించే విషయాలను వాళ్లు ఎక్కువగా ఫాలో అవుతారు. చెప్పి ప్రయోజనం ఉండదు. అందుకే మన బిహేవియర్‌ బాగుండాలి. 

ఇంటికి వచ్చిన కొత్త కోడలు సమంత, మీరు చాలా క్లోజ్‌గా ఉంటారనిపిస్తోంది... 
సమంత వండర్‌ఫుల్‌ ఆర్టిస్ట్‌. చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తుంది. సెల్ఫ్‌ మేడ్‌ పర్సన్‌. తనంటే చాలా గౌరవం నాకు. 



ఫైనల్లీ.. మళ్లీ ఫీచర్‌ ఫిల్మ్‌లో ఎప్పుడు కనిపిస్తారు?
మా ఫ్యామిలీ అందరూ చేస్తున్నారు కదా. ప్రస్తుతానికి అయితే ఏదీ లేదు. ఇంకో వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఒక తల్లి పాత్ర చేయడానికి ఆ పనులన్నీ ఆపేసి వెళ్లాలంటే కష్టం. ఇవన్నీ పక్కన పెట్టి వెళ్లాలంటే ఆ క్యారెక్టర్‌ ఎంత ఆసక్తిగా ఉండాలి. 
– డి.జి. భవాని


►ఈ మధ్య హీరోయిన్స్‌కు స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌ రాస్తున్నారు అనుకుంటున్నాం. ఆ తేడా మీరు గమనించారా? ఒక్క ఫీమేల్‌ క్యారెక్టర్స్‌లో మాత్రమే కాదు... తెలుగు సినిమా చాలా దూరం వచ్చింది. కొత్త స్టోరీలు, అప్రోచ్‌ అన్నింట్లో చాలా మార్పు వచ్చింది. మంచి ట్రైనింగ్‌ తీసుకుని వచ్చి సినిమాలు చేస్తున్నారు. యాక్టర్స్‌ కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఉన్నారు. ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది. ఆ విషయంలో చాలా గర్వంగా అనిపిస్తోంది. 

►ఆర్గానిక్‌ బ్యూటీ, ఇన్‌ఆర్గానిక్‌ బ్యూటీ అని రెండు రకాలుగా అందంగా గురించి మాట్లాడితే మిమ్మల్ని ఆర్గానిక్‌ బ్యూటీ అనాలి. అంటే.. గంపెడు మేకప్‌ లేకుండా సింపుల్‌గా ఉంటారు..
(నవ్వేస్తూ).. అది కూడా కళా క్షేత్ర ట్రైనింగే అనిపిస్తుంటుంది. డ్యాన్సర్‌గా పెరిగాను. ఓ క్లాసికల్‌ డ్యాన్స్‌ కోసం స్టేజి మీదకు రావాలంటే బోలెడంత అలంకారం చేసుకోవాలి. ఆ పాత్ర నిర్వహిస్తున్నాను కాబట్టి తప్పదు. అందుకే మిగతా సమయాల్లో మామూలుగానే ఉంటాను. రిహర్సల్, రియల్‌ లైఫ్‌ నార్మల్‌. పర్ఫార్మెన్స్‌ డిఫరెంట్‌. సినిమాల్లో కూడా షూటింగ్‌ అప్పుడు మేకప్‌ మిగతా సమయాల్లో నార్మల్‌.

►సినిమాల కంటే వెబ్‌ సిరీస్‌లకు ఆడియన్స్‌లో రీచ్‌ ఎక్కువ ఉంటుందనుకుంటున్నారా?ప్రతీ దానికీ ఓ రీచ్‌ ఉంటుంది. ఏ మీడియమ్‌ రీచ్‌ దానిది. ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ లేని వాళ్లు లేరు. మొబైల్‌లోనే సినిమాలు, సిరీస్‌లు చూసున్నారు. అఖిల్‌ ఫస్ట్‌ సినిమా తర్వాత ఏదో మారుమూల ప్రాంతానికి వెళ్లాను. నేను సినిమాల్లో కనిపించి చాలా కాలం అయిపోయింది. నన్ను ఎవరూ గుర్తు పట్టరులే అనుకున్నా. కానీ గుర్తుపట్టారు. అంటే.. సినిమాకి ఎంత రీచ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్‌ మీడియమ్‌ రీచ్‌ని కూడా తక్కువ చేయలేం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement