మోగ్లీ గర్ల్ మచ్చికవుతోంది
జంగిల్ బుక్ ఎంత పాపులరో అందరికీ తెలుసు కదా! ఆ పుస్తకాన్ని, సినిమాను చదివి ఎంజాయ్ చెయ్యని చిన్నారులే కాదు, పెద్దలు కూడా ఉండరేమో బహుశా! అచ్చం ఆ పుస్తకంలోని మోగ్లీ బాయ్ క్యారక్టర్ లాగే ఇటీవలే కోతులతో ఆడుకుంటూ పోలీసుల కంట పడింది ఓ మోగ్లీ గర్ల్. దాదాపు ఏడెనిమిదేళ్ల వయసున్న ఆ బాలిక కోతుల గుంపుతో కలిసి జీవిస్తూ, వాటిలాగే ఆహారం తీసుకుంటూ ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిన్ అడవిలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఎస్సై సురేష్ యాదవ్ రెండు నెలల క్రితం మోతీపూర్ పరిధిలోని కర్ణిఘట్ అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు.
ఆ సమయంలో ఆ పాప కోతుల గుంపులో తాను కూడా కలిసిపోయి, వాటితో ఎంతో సహజంగా ఆడుకుంటూ కనిపించింది. సురేష్‌కుమార్‌కు ఆ పాపను ఎలాగైనా రక్షించాలనిపించింది. అతికష్టం మీద ఆ కోతుల గుంపును అక్కడినుంచి చెదరగొట్టి, ఆ పాపను వాటినుంచి వేరు చేసి జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. రెండునెలలుగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఈ కోతిపిల్లను మామూలు మనిషిగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో కొంత మేరకు సక్సెస్ అయ్యారు. దాంతో పత్రికలకు ఓ వారం క్రితమే ఈ పాపకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. అచ్చం జంగిల్ బుక్ స్టోరీలోని మోగ్లీ అనే కుర్రాడితో పోలి ఉన్నందువల్ల ఆసుపత్రిలోని వారు ఈ పాపను ముద్దుగా మోగ్లీ గర్ల్ అని పిలుస్తూ, ఎంతో ఓపిగ్గా చికిత్స చేస్తున్నారు.
చేతులతో కాకుండా నేరుగా నోటితో ఆహారం తీసుకోవడం, జంతువులానే నాలుగు కాళ్లతో నడవడం, తనకు కొంతకాలంగా అలవాటయిన వాళ్లు గాక కొత్తవాళ్లెవరయినా కంటపడితే చాలు బెదిరిపోయి, మంచం కింద దాక్కోవడం, ఎక్కడ ఉంటే అక్కడే మలమూత్ర విసర్జన చేయడం, కోతుల్లాగే పళ్లికిలించడం, తనకు నచ్చిన వస్తువులేమైనా ఎదుటి వారి చేతిలో కనిపిస్తే గభాల్న లాగేసుకోవడం వంటి కోతి చేష్టలను మాత్రం ఈ పాప ఇంకా మానుకోలేకపోతోంది. ఇప్పుడిప్పుడే నిల» డేందుకు ప్రయత్నం చేస్తోంది. అసలు ఈ పాప ఎక్కడినుంచి అడవిలోకి వచ్చింది, తప్పిపోయిందా లేక ముందరే లోపాలతో ఉన్న పాపను ఎలాగైనా వదిలించుకోవాలని తల్లిదండ్రులే ఆమెను సమీపంలోని అడవిలో కావాలనే వదిలిపెట్టారా... వంటి సమాధానాలు లేని సందేహాలు అందరి బుర్రలనూ తొలిచేస్తున్నాయి.
కాగా, ఎంతోకాలంగా తమతో కలిసి ఉన్న తమ నేస్తాన్ని చూసేందుకు, ఆమెతో ఆటలాడుకునేందుకు మర్కట నేస్తాలు ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో తచ్చాడుతున్నాయట. పాపం! చుట్టుపక్కల ఉన్నవారెవరైనా కనిపించకపోతేనో, ఉన్నట్టుండి మాయం అయిపోతేనో మనలా వదిలేసి ఊరుకోవవి, వాటి ప్రేమ స్వచ్ఛమైనది మరి!