Jungle Book
-
వందేళ్లనాటి అడవి కథ.. ఇప్పటికీ చూడాల్సిందే!
అదో దట్టమైన అడవి, అందులో.. మోగ్లీ అనే కుర్రాడి సాహసాలు చూసి ‘శెభాష్’ అనుకుంటాం షేర్ ఖాన్ క్రూరత్వం చూసి ‘కోపం’తో రగిలిపోతాం. తోడేలు తల్లి బాధకి గుండె కరిగిపోతుంది. భగీర గొప్ప మనసుకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. భల్లూ అల్లరి వేషాలకు నవ్వకుండా ఉండలేం. చివరికి అడవిని కాపాడటానికి ఏనుగులు చేసే ప్రయత్నం అదుర్స్ అనిపించకమానదు. పిల్లల నుంచి పెద్దల దాకా.. ముఖ్యంగా నైంటీస్ జనరేషన్‌కి అదొక ఫేవరెట్ సబ్జెక్ట్.. అదే జంగిల్ బుక్. ఆదివారం వచ్చిందంటే దిగ్గజ రచయిత గుల్జార్ రాసిన ‘జంగిల్ జంగిల్ బాత్ చలీ హై..’ లౌడ్ సౌండ్‌తో మారుమోగేది. అంతలా ఆదరించబట్టే.. ఈ కల్పిత గాథకి రూపం ఏదైనా ఆదరణ మాత్రం తగ్గట్లేదు. సాక్షి, వెబ్‌డెస్క్: చిన్నతనంలో పెద్దపులి దాడిలో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అవుతాడు ఓ చిన్నారి. ఆ పెద్దపులి బారినపడకుండా తోడేళ్లు ఆ పిల్లాడిని కాపాడుతుంటాయి. చివరికి ఆ పిల్లాడే పులిని చంపడంతో కథ సుఖాంతం అవుతుంది. సింపుల్‌గా ఇది రుడ్యార్డ్ కిప్లింగ్ కథ. ఈ కథ మొత్తం జంతువుల ప్రవర్తన నేపథ్యంలో సాగుతుంది. అయితే, అంతర్లీనంగా ఉన్న థీమ్ వేరు. డార్విన్ ‘మనుగడ’ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ.. మనిషి–జంతువుల మధ్య సంబంధాలను చూపించాడు. అదే విధంగా చట్టం–న్యాయం, అధికారానికి గౌరవం ఇవ్వడం, విధేయత, శాంతి స్థాపన, అడవుల నరికివేత, అడవి– ఊరు అనే రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య సంఘర్షణ... ఇలాంటి విషయాలెన్నో చర్చించాడు. ప్రకృతిపై మనిషి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడో అనే పాయింట్ విమర్శకులకు సైతం బాగా నచ్చింది. అసలు కథ... షేర్ ఖాన్ అనే పెద్దపులి ఆ అడవికి రాజు. ఒకరోజు ఫారెస్ట్ అధికారుల క్యాంపెయిన్‌పై దాడిచేసి అధికారిని, అతని భార్యను చంపేస్తుంది. ఆపై అధికారి కొడుకుని చంపే ప్రయత్నం చేస్తుంది. కానీ, తోడేళ్ల రాజు ఆ పిల్లాడిని రక్షిస్తుంది. మోగ్లీ అని పేరు పెట్టి తోడేళ్ల మందలో కలిపేస్తుంది. అంతే కాకుండా తమ సరిహద్దుల్లో ఉన్నప్పుడు మోగ్లీపై దాడి చేయకూడదని షేర్ ఖాన్‌కి నిబంధన పెడతాయి. చిన్నతనంలో ఓ రోజు ఆడుకుంటూ మోగ్లీ సరిహద్దు దాటుతాడు. షేర్ ఖాన్ మోగ్లీని చంపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, తోడేలు రాజు తన ప్రాణాలు పణంగా పెట్టి మోగ్లీని కాపాడుతుంది. తర్వాత రక్ష(ఆడ తోడేలు) మోగ్లీ తల్లిగా తన పిల్లలతో పెంచుకుంటుంది. భగీర(నల్ల చిరుత) మోగ్లీకి చెట్లు ఎక్కడం, వేటాడటంపై శిక్షణ ఇస్తుంది. భల్లు(ఎలుగు బంటి) తోడేళ్లకు విద్యాబుద్ధులు, అడవి చట్టాల్ని బోధిస్తుంటుంది. ఈ ఇద్దరి శిక్షణలో మోగ్లీ రాటు దేలతాడు. తర్వాత కొన్నేళ్లకు అనివార్య పరిస్థితుల్లో మోగ్లీ అడవి దాటాల్సి వస్తుంది. అప్పుడు షేర్ ఖాన్ మోగ్లీపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, నిప్పుని ఆయుధంగా చేసుకుని మోగ్లీ తప్పించుకుంటాడు. పొరుగున ఉన్న ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ ఓ జంట మోగ్లీని దత్తత తీసుకుంటుంది. చిన్నతనంలో ఆ జంట బిడ్డని కూడా పులి ఎత్తుకుపోతుంది. మోగ్లీ పశువుల్ని కాస్తుంటాడు. అయితే, ఈ విషయం షేర్ ఖాన్‌కి తెలుస్తుంది. తోడేళ్ల మందలోని వేగుల సాయంతో మోగ్లీ చంపాలని ప్రయత్నిస్తుంది. కానీ, మోగ్లీ అగ్గి సాయంతో షేర్ ఖాన్ని చంపేస్తాడు. అయితే ఊళ్లోవాళ్లు మాత్రం మోగ్లీని మంత్రగాడిగా అనుమానించి.. వెళ్లగొడతారు. దీంతో మోగ్లీ తిరిగి అడవికి చేరి తన తోడేలు కుటుంబంతో హాయిగా నివసిస్తుంటాడు. ఇది మొదటి పుస్తకం కథ. రెండో పుస్తకంలో జంగిల్ బుక్ సీక్వెల్. అప్పటికే ఆ ఊరి గ్రామస్తులు అడవిని నాశనం చేస్తుంటారు. అదే సమయంలో కరువుతో గ్రామస్తులు చనిపోతుంటారు. అయితే, మోగ్లీ చేతబడి చేయటంతోనే తమ ప్రాణాలు పోతున్నాయని ప్రజలంతా నమ్ముతారు. మోగ్లీ్కి ఆశ్రయం ఇచ్చారన్న కారణంతో ఆ జంటను చంపేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తుంటారు. ఈ విషయం స్నేహితురాలి ద్వారా మోగ్లీ తెలుసుకుంటాడు. వెంటనే మోగ్లీ జంతువులతో ఊరిపై దాడి చేయించి వారిని రక్షిస్తాడు. ఇది ఆసరాగా చేసుకుని ఎర్ర తోడేళ్లు మనుషులపై దాడి చేయాలనుకుంటాయి. కానీ, మోగ్లీ తన తోడేలు కుటుంబం సాయంతో ప్రజల్ని రక్షిస్తాడు. మోగ్లీ మానవత్వానికి కరిగిపోయిన అతని తల్లి.. మనుషులతో ఉండాలా? జంతువులతో అడవిలోనే నివసించాలా? అన్న నిర్ణయాన్ని మోగ్లీకే వదిలేస్తుంది. అలా మోగ్లీ ఆలోచిస్తుండగానే కథ ముగుస్తుంది. అయితే తర్వాత రుడ్ యార్డ్ కిప్లింగ్ రాసిన ‘ది స్పింగ్ రన్నింగ్’ పుస్తకంలోనూ మోగ్లీ సంఘర్షణకు ముగింపు ఇవ్వకపోవటం విశేషం. జంగిల్ బుక్ పుట్టుక నిజానికి జంగిల్ బుక్ కథ కంటే ముందే కీలక పాత్ర మోగ్లీ పుట్టింది. ఇంగ్లండ్ ఆర్టిస్ట్ జాన్ లాక్వుడ్ కిప్లింగ్. భారత దేశ చరిత్రపై కొన్నాళ్ల పాటు అధ్యయనం చేశాడు. ఆ సమయంలో భారత్‌లో పర్యటించిన ఆయన.. మోగ్లీ, మరికొన్ని పాత్రలను స్కెచ్ వేశాడు. మోగ్లీ అంటే కప్ప అని అర్థం. ఆ తర్వాత లాక్వుడ్ కొడుకు రుడ్యార్డ్ కిప్లింగ్ ఆ క్యారెక్టర్లతోనే జంగిల్ బుక్ రచన మొదలుపెట్టాడు. రుడ్యార్డ్ ముంబైలో పుట్టాడు. మధ్యప్రదేశ్(అప్పుడు మధ్యభారతం)లోని సియోని ప్రాంతంలోని ‘పెంచ్’ అడవి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఓ ఇంగ్లిష్ ఫారెస్ట్ అధికారికి సహకరించే గిరిజన చిన్నారే మోగ్లీ. అలా చిన్న చిన్న కథలు రాశాడు. ఆ కథలన్నింటినీ సంపుటిగా చేసి ‘ఇన్ ది రుఖ్’ పేరిట సంకలనం చేశాడు. ఆ మరుసటి ఏడాది అంటే 1894లో ది జంగిల్ బుక్‌గా పుస్తకం అచ్చయ్యింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మోగ్లీ–షేర్ ఖాన్ కథ ఆ పుస్తకంలోనిదే. ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంతో ముడిపెట్టి రెండో పుస్తకం రాశాడు రుడ్యార్డ్. ఈ రెండు పుస్తకాల్ని కలిపి 1907లో ఒకే పుస్తకంగా అచ్చేయించాడు. 1933లో అది కాస్త ‘ఆల్ ది మోగ్లీ స్టోరీస్’ పేరుతో ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎంతో మంది రచయితలు, దర్శకులు తమ వర్షన్లను జంగిల్ బుక్కి అన్వయించారు. ఎన్ని కథలోచ్చినా ఆ క్రెడిట్ మాత్రం కిప్లింగ్కే కట్టబెడుతుంటారు. తెరపై భారీ విజయాలు జంగిల్ బుక్ మీద యానిమేటెడ్ సిరీస్‌లు.. చిత్రాలు బోలెడన్ని వచ్చాయి. అవన్నీ బంపర్ హిట్లే. జపాన్‌కు చెందిన నిప్పోన్, డోరో టీవీ మర్చండైజింగ్ స్టూడియోలు సంయుక్తంగా జంగిల్ బుక్–షోనెన్ మోగ్లీని 52 ఎపిసోడ్లతో కార్టూన్‌గా తెరకెక్కించాయి. దానిని భారత్‌లో ది జంగిల్ బుక్: ది అడ్వెంచర్స్ ఆఫ్ మోగ్లీ గా అనువదించారు. భారత్‌లో 90వ దశకంలో ఊపు ఊపిన యానిమేటెడ్ సిరీస్ అదే. తర్వాత వీడియో గేమ్‌గా జంగిల్ బుక్ ఆదరణ పొందింది. ఇవన్నీ ఒక ఎత్తయితే జాన్ ఫావ్రూ డైరెక్షన్లో 2016లో రిలీజ్ అయిన ది జంగిల్ బుక్ చిత్రం. వాల్ట్ డిస్నీ బ్యానర్లో 3డీ లైవ్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రం యానిమేటెడ్ చిత్రాల చరిత్రను తిరగరాసింది. ఈ సినిమాలో ఒకే ఒక్క హ్యుమన్ క్యారెక్టర్. ‘మోగ్లీ’ పాత్రలో ఏషియన్–అమెరికన్ సంతతికి చెందిన నీల్ సేథి నటించాడు. సంకల్ప్ వాయుపుత్ర అనే కుర్రాడు తెలుగు డబ్బింగ్ వెర్షన్లో మోగ్లీ పాత్రకి డబ్బింగ్ చెప్పాడు. బిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. భారత్‌లోనూ వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. -
యాక్షన్ ఎడ్వెంచర్ చిత్రంగా ఆల్ఫా
తమిళసినిమా: సూపర్ యాక్షన్ ఎడ్వెంచర్ చిత్రంగా ఆల్ఫా హాలీవుడ్ చిత్రం భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మానవుడు, జంతువు అనే అసాధారణ స్నేహబంధంతో ఇంతకు ముందు వచ్చిన జంగిల్‌బుక్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే విధంగా అలాంటి మరో కోణంలో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం ఆల్ఫా. ఇది చారిత్రక యాక్షన్ ఎడ్వెంచర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు. ఇది ఒక యువకుడు, తోడేలు మధ్య మిత్రత్వం, వారు ఎదుర్కొనే సాహసాలు ఇతివృత్తంగా సాగే కథా చిత్రం. 20 వేల సంవత్సరాల క్రితం అడవి ప్రాంతాల్లో నివశించే జాతికి చెందిన కొందరు వారి జీవనాధారమైన వేటకు వెళతారు. అందులో ఒక కుర్రాడు తప్పిపోతాడు. ఆ కుర్రాడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. అదే పరిస్థితిలో ఉన్న తోడేలు ఆ కుర్రాడికి తారస పడడం వారి మధ్య స్నేహబంధం ఏర్పడడం, అనంతరం ఎదురైన సమస్యలను ఎలా కలిసి ఎదుర్కొన్నారు? లాంటి పలు ఆసక్తికరమైన, ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో సాగే చిత్రం ఆల్ఫా. నాయకుడు లేనప్పుడు నువ్వే నాయకుడిగా మారాలి అన్న తండ్రి మాటల ప్రభావంతో తప్పిపోయిన ఆ కుర్రాడు ఎలా శత్రువులను ఎదుర్కొన్నాడు? లాంటి సాహసోపేతమైన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కొడి స్మిత్ మెక్ఫీ, లెఓనర్ వరేలా, జెన్స్హల్టెన్, జోహన్స్ హక్కర్ జోహన్సన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, సహ నిర్మాత, దర్శకత్వం బాధ్యతలను ఆల్బర్ట్ హగ్స్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, ఆంగ్లం భాషల్లో సోనీ పిక్చర్స్ సంస్థ 24న భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తోంది. -
‘మోగ్లీ’ ట్రైలర్ విడుదల
-
జంగిల్ బుక్ కథతో మరో సినిమా
జంగిల్ బుక్ సినిమా ఇండియన్ స్క్రీన్‌పై సృష్టించిన ప్రభంజనం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం ఇండియాలోనే 250 కోట్ల వరుకు వసూళ్లు సాధించి సత్తా చాటింది ఈ సినిమా. గ్రాఫిక్స్, జంతువులు, చిన్న పిల్లాడు చేసే విన్యాసాలు ఈ సినిమా పట్ల ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమా మల్టిప్లెక్స్‌లో భారీ కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం జంగిల్‌బుక్ తరహాలోనే ‘మోగ్లీ’ సినిమా రాబోతోంది. టార్జన్ కాన్సెప్ట్‌తో ఇది వరకే ఎన్నో సినిమాలు వచ్చాయి. అడివినే ప్రపంచంగా బతికే బాలుడు జన సంచారంలోకి వస్తే ఏవిధమైన కష్టాలు పడాల్సి వస్తుంది. అరణ్యంలో జంతువులతో ఏర్పడే ప్రేమానురాగాలు, వీటన్నింటికి తోడు మరో అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లే గ్రాఫిక్స్ మాయాజాలంతో మన ముందుకు రాబోతోంది ‘మోగ్లీ’. వార్నర్ బ్రదర్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఆండీ సెర్కిస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రోహణ్ చంద్ మోగ్లీగా నటిస్తుండగా జంతువుల పాత్రలకు క్రిస్టీన్ బాలే, కేట్ బ్లాంచెట్, నోమీ హేరిస్లు గాత్రధానం చేస్తున్నారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేం ఫ్రిదా పింటో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జంగిల్ బుక్ ఆధారంగా తెరకెక్కించినా గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మరింత సీరియస్‌గా ఉండనుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు. -
జుమాంజీ సీక్వెల్ వస్తోంది!
తమిళసినిమా: హాలీవుడ్ చిత్రాల్లో ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే కథా ఇతివృత్తాలతో కూడిన చిత్రాలకు విశేష ఆదరణ ఉంటుంది. ఈ మధ్య వచ్చిన జంగిల్‌బుక్ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1995 వచ్చిన అమెరికన్ ఫాంటసీ ఎడ్వెంచర్ చిత్రం జుమాంజీ సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత దానికి సీక్వెల్‌గా 2006లో జతువా ఏ స్పేస్ ఎడ్వెంచర్ పేరుతో ఒక చిత్రం వచ్చింది. తాజాగా జుమాంజీ వెల్కమ్ టూ జంగిల్ పేరుతో సూపర్ థ్రిల్లర్ ఎడ్వెంచర్ చిత్రం త్వరలో ఆంగ్లం, తమిళం, తెలుగు భాషల్లో తెరపైకి రానుంది. 1995లో వచ్చిన జుమాంజీ చిత్రానికి అసలు సీక్వెల్ ఇదేనంటున్నారు చిత్ర యూనిట్. కొలంబియా పిక్చర్స్ సమర్పణలో మట్ట్ టోల్మచ్, సెవన్ బక్స్ ప్రొడక్షన్ సంస్థలు నిర్మించిన ఈ భారీ థ్రిల్లర్ ఎడ్వెంచర్ చిత్రంలో దాయ్నే జాన్సన్, జాక్బ్లక్స్, మెన్హర్ట్, కరిన్గిలాన్, మార్గన్డర్నర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది నలుగురు పాఠశాల విద్యార్థుల ఇతి వృత్తంగా సాగే పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగే కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపారు. ఆ విద్యార్థులకు ఒక పాత వీడియో గేమ్ లభిస్తుందన్నారు. అది వారిని ఎలాంటి పరిణామాలకు గురి చేసిందనేదే చిత్ర ప్రధాన ఇతివృత్తం అని చెప్పారు. చిత్రంలో థ్రిల్లింగ్‌తో కూడిన పలు ఎడ్వెంచర్ సన్నివేశాలు పిల్లల నుంచి పెద్దల వరకూ అలరిస్తాయంటున్నారు. -
మోగ్లీ గర్ల్ మచ్చికవుతోంది
జంగిల్ బుక్ ఎంత పాపులరో అందరికీ తెలుసు కదా! ఆ పుస్తకాన్ని, సినిమాను చదివి ఎంజాయ్ చెయ్యని చిన్నారులే కాదు, పెద్దలు కూడా ఉండరేమో బహుశా! అచ్చం ఆ పుస్తకంలోని మోగ్లీ బాయ్ క్యారక్టర్ లాగే ఇటీవలే కోతులతో ఆడుకుంటూ పోలీసుల కంట పడింది ఓ మోగ్లీ గర్ల్. దాదాపు ఏడెనిమిదేళ్ల వయసున్న ఆ బాలిక కోతుల గుంపుతో కలిసి జీవిస్తూ, వాటిలాగే ఆహారం తీసుకుంటూ ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిన్ అడవిలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఎస్సై సురేష్ యాదవ్ రెండు నెలల క్రితం మోతీపూర్ పరిధిలోని కర్ణిఘట్ అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో ఆ పాప కోతుల గుంపులో తాను కూడా కలిసిపోయి, వాటితో ఎంతో సహజంగా ఆడుకుంటూ కనిపించింది. సురేష్‌కుమార్‌కు ఆ పాపను ఎలాగైనా రక్షించాలనిపించింది. అతికష్టం మీద ఆ కోతుల గుంపును అక్కడినుంచి చెదరగొట్టి, ఆ పాపను వాటినుంచి వేరు చేసి జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. రెండునెలలుగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఈ కోతిపిల్లను మామూలు మనిషిగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో కొంత మేరకు సక్సెస్ అయ్యారు. దాంతో పత్రికలకు ఓ వారం క్రితమే ఈ పాపకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. అచ్చం జంగిల్ బుక్ స్టోరీలోని మోగ్లీ అనే కుర్రాడితో పోలి ఉన్నందువల్ల ఆసుపత్రిలోని వారు ఈ పాపను ముద్దుగా మోగ్లీ గర్ల్ అని పిలుస్తూ, ఎంతో ఓపిగ్గా చికిత్స చేస్తున్నారు. చేతులతో కాకుండా నేరుగా నోటితో ఆహారం తీసుకోవడం, జంతువులానే నాలుగు కాళ్లతో నడవడం, తనకు కొంతకాలంగా అలవాటయిన వాళ్లు గాక కొత్తవాళ్లెవరయినా కంటపడితే చాలు బెదిరిపోయి, మంచం కింద దాక్కోవడం, ఎక్కడ ఉంటే అక్కడే మలమూత్ర విసర్జన చేయడం, కోతుల్లాగే పళ్లికిలించడం, తనకు నచ్చిన వస్తువులేమైనా ఎదుటి వారి చేతిలో కనిపిస్తే గభాల్న లాగేసుకోవడం వంటి కోతి చేష్టలను మాత్రం ఈ పాప ఇంకా మానుకోలేకపోతోంది. ఇప్పుడిప్పుడే నిల» డేందుకు ప్రయత్నం చేస్తోంది. అసలు ఈ పాప ఎక్కడినుంచి అడవిలోకి వచ్చింది, తప్పిపోయిందా లేక ముందరే లోపాలతో ఉన్న పాపను ఎలాగైనా వదిలించుకోవాలని తల్లిదండ్రులే ఆమెను సమీపంలోని అడవిలో కావాలనే వదిలిపెట్టారా... వంటి సమాధానాలు లేని సందేహాలు అందరి బుర్రలనూ తొలిచేస్తున్నాయి. కాగా, ఎంతోకాలంగా తమతో కలిసి ఉన్న తమ నేస్తాన్ని చూసేందుకు, ఆమెతో ఆటలాడుకునేందుకు మర్కట నేస్తాలు ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో తచ్చాడుతున్నాయట. పాపం! చుట్టుపక్కల ఉన్నవారెవరైనా కనిపించకపోతేనో, ఉన్నట్టుండి మాయం అయిపోతేనో మనలా వదిలేసి ఊరుకోవవి, వాటి ప్రేమ స్వచ్ఛమైనది మరి! -
రోజుకు 40 గుడ్లు, రెండు కేజీల చికెన్
రోజుకు 40 కోడిగుడ్లు, రెండు కిలోల కోడి మాంసం ఆహారంగా తీసుకుంటున్నాడంటే అతనెవరో బకాసురుడి వారసుడనుకుంటున్నారా? కాదండి బాబు మన కథానాయికల ఇష్టుడు, నటుడు ఆర్య అంటే ఆశ్చర్యపోతారా? మీరు ఎలా అయిపోయినా అలాంటి ఆహారాన్ని నిత్యం ఒక పట్టుపడుతోంది మాత్రం ఆర్య. ఈయన ఇప్పుడు అడవి మనిషిగా మారిపోయారు. జంగిల్‌బుక్‌లో మౌగ్లీలా చెట్లు, పుట్టలపై గెంతేస్తున్నారు. ఆర్యకు ఇటీవల సరైన హిట్ లేదనే చెప్పాలి. అందుకోసం ఆయన ఇప్పుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి అధిక కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగానే రోజుకు 40 కోడిగుడ్లు, రెండు కిలోల కోడిమాంసం భుజించేస్తున్నారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రానికి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ తమిళనాడు, కేరళలోని అడవి ప్రాంతాలలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ అనుభవాలను ఆర్య తెలుపుతూ ఈ చిత్రంలో నటించడం తనకు వినూత్న అనుభవంగా పేర్కొన్నారు. ఇందులో తన పాత్ర గాని, గెటప్గాని చాలా వైవిధ్యంగా ఉంటాయన్నారు. అడవి మనిషిగా కనిపిస్తానన్నారు. ఇందుకోసం రోజు ఉదయం రెండు గంటలు ఎక్సర్సైజులు చేస్తున్నానన్నారు. సాయంత్రం గంట సేపు ఎత్తై ప్రాంతాలను ఎక్కి దిగుతున్నానని చెప్పారు. అడవుల్లో షూటింగ్ కావడంతో తన కసరత్తులు పరికరాలకు ప్రత్యేకంగా ఒక వ్యాన్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. అడవి ప్రాంతాలలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నానని అయినా తనకు ఏమి కాలేదని చెప్పారు. ఇలా ఈ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా ఆర్య పేర్కొన్నారు. -
మోగ్లీ... మన హైదరాబాదీ!
హాలీవుడ్ ‘జంగిల్‌బుక్’కీ, హైదరాబాద్‌కీ సంబంధం ఏంటి? లేదనుకోకండి... ఉంది. తెలుగు, తమిళ, హిందీల్లోకి కూడా అనువాదమై వస్తున్న ఈ చిత్రంలో అడవిలో పెరిగిన పసిబాలుడు మోగ్లీ పాత్రే హీరో. భారత సంతతికి చెందిన నీల్ సేథీ ఆ పాత్ర పోషించారు. విశేషం ఏమిటంటే, తెలుగులో వాయిస్ ఇచ్చింది అక్షరాలా మన హైదరాబాద్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థి - పదేళ్ల సంకల్ప్. హాలీవుడ్ సంస్థ డిస్నీ వరల్డ్ నిర్మించిన ఈ మోగ్లీ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చాలామంది పోటీపడ్డారు. చెన్నై సహా పలు ప్రాంతాల్లోని చిన్నారుల వాయిస్‌ను ఆడిషన్ చేశారు. చివరకు క్యాలిఫోర్నియా దాకా వెళ్ళి, సంకల్ప్ వాయిస్ పోటీలో గెలిచింది. సీనియర్ డబ్బింగ్ కళాకారుడైన నాగార్జున వాయుపుత్ర కుమారుడే సంకల్ప్. ఈ పిల్లాడి వాయిస్ మోగ్లీ పాత్రకు బాగా సూట్ అయిందట. దాంతో, చెన్నై దాకా వెళ్ళి డబ్బింగ్ చెప్పారు. యాక్టర్ అవ్వాలని యాంబిషన్‌తో పాటు సంగీతం, డ్రాయింగ్ నేర్చుకుంటున్న సంకల్ప్ ‘‘తొలిసారిగా డబ్బింగ్ చెబుతున్నా, సంకల్ప్ గొంతు బాగుంది. మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు’’ అని డిస్నీవరల్డ్ ప్రశంసించడం విశేషం. తండ్రి బాటలో నడుస్తున్న ఈ పసివాడికి ఆల్‌ది బెస్ట్. అన్నట్లు ఈ శుక్రవారమే ‘జంగిల్ బుక్’ తెలుగు వెర్షన్ రిలీజ్. -
హాలీవుడ్ తెరపై మరో భారతీయుడు
డిస్నీ సంస్థ ప్రస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న జంగిల్ బుక్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. కేవలం ఒకే ఒక్క హ్యూమన్ క్యారెక్టర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిగతా అన్ని పాత్రలు యానిమేషన్ ద్వారా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోగ్లీ పాత్రలో భారతీయ సంతతి చెందిన పదేళ్ల నీల్ సేథి నటిస్తుండటం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన జంగిల్ బుక్ కార్టూన్ సీరీస్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐరన్ మేన్ ఫేం జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇతర యానిమేషన్ పాత్రలకు హాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, స్కార్లెట్ జాన్సన్, బిల్ ముర్రే, బెన్ కింగ్స్లే, క్రిస్టోఫర్ వాకెన్ లు గాత్రదానం చేస్తున్నారు. -
జంగిల్ బుక్‌లో...
‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంతో హాలీవుడ్లో పాగా వేసిన భారతీయ అందాల నటి ఫ్రీదా పింటో. ఇప్పటికే పలు క్రేజీ హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటించిన ఫ్రీదాను మరో అవకాశం వరించింది. వార్నర్ బ్రదర్స్ నిర్మించనున్న ‘జంగిల్ బుక్’ చిత్రం కోసం ఆమెను ఓ కీలక పాత్రకు ఎంపిక చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యానిమేటెడ్ రూపంలో చిన్నారులను అలరించిన ఈ చిత్రం వెండితెరపైకి రానుంది. హాలీవుడ్ నటుడు ఆండీ సెర్కిస్ తొలిసారిగా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా 2016 అక్టోబర్ 6న విడుదల కానుంది.