
సాక్షి, మహేంద్రగఢ్ : మండువేసవిలో ఉక్కపోత, శీతాకాలంలో భరించలేని చలి ఎవరికైనా అనుభవమే. అయితే హరియాణాలోని మహేంద్రగఢ్‌లో సంత్రామ్ అనే వ్యక్తి మాత్రం దీనికి సరిగ్గా వ్యతిరేకం. సంత్రామ్‌కు వేసవిలో చలి, శీతాకాలంలో వేడిగా అనిపిస్తుంటుందని చెబుతున్నాడు. భానుడు భగభగ మండే ఏప్రిల్, మే నెలల్లో ఆయన దుప్పట్లు లేకుండా ఉండలేడట. పైగా చలి మంటలు సైతం వేసుకుని ఊరట పొందుతానంటాడు.
ఇక శీతాకాలం ఎముకలు కొరికే చలిలో సంత్రామ్‌కు ఉక్కపోతగా ఉంటుందట. చలికాలంలో వేడిని తట్టుకునేందుకు ఆయన ఎంచక్కా ఐస్‌క్రీంలు లాగిస్తానని చెబుతున్నాడు. సంత్రామ్ నివసించే డెరోలి గ్రామస్తులు సైతం ఆయన చిన్నప్పటి నుంచీ ఇలాగే ఉండేవాడని అంటున్నారు.