
ఇద్దరు వాదులాడుకుంటుంటే జనాలంతా గుమిగూడి చోద్యం చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి సైలెంట్‌గా అక్కడ టీ స్టాల్ ఓపెన్ చేసేస్తే అతను కేరళకు చెందినవాడని నిర్ధారించుకోవచ్చట. స్పేస్‌లో మనిషి జాడ కనపడగానే అక్కడా ఓ దుకాణం వెలుస్తుందట. అది కచ్చితంగా మలయాళీదే అయ్యుంటుందిట! ఇలాంటివన్నీ కేరళైట్స్ మీద జోక్స్‌లా కొట్టిపారేయొద్దు. వాళ్ల శ్రమతత్వానికి, వేగవంతమైన ఆలోచనలకు, ముందుచూపులకు నిదర్శనం ఇవి. ఈ వాస్తవానికొక నిదర్శనమే కేరళకు చెందిన సారమ్మ థామస్. కానీ ఇప్పుడు ఆమె ఉంటోంది సౌదీ అరేబియాలో. దమ్మమ్‌లోని జుబైల్ కింగ్ అబ్దుల్ అజిజ్ నావల్ బేస్ మిలిటరీ హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తోంది సారమ్మ.
తొలి భారతీయ మహిళ
విషయం ఏంటంటే.. కిందటేడు అంటే 2017, సెప్టెంబర్‌లో సౌదీ కింగ్ సల్మాన్ .. అక్కడి మహిళలు డ్రైవింగ్ చేయొచ్చు అని చట్టాన్ని సడలించాడు.. సవరించాడు. అది కిందటి నెల (జూన్) 24 నుంచి అమల్లోకి వచ్చింది. అలా సవరించగానే ఇలా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి భారతీయురాలే ఈ సారమ్మ థామస్. ఈ జూన్ 28న ఆమె సౌదీ డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకుంది. ట్యాక్సీ నడపడమూ మొదలుపెట్టింది. లేడీ టీచర్లను తీసుకెళ్లే బస్సులకు, గర్ల్స్ స్కూల్ బస్సులకు మహిళా డ్రైవర్లనే నియమించే ప్రయత్నం చేస్తోంది సౌదీ ప్రభుత్వం. అంతేకాదు మహిళా ట్యాక్సీలకు, కార్ రెంటల్ సర్వీసులకూ అనుమతులు ఇచ్చింది. మహిళా డ్రైవర్లకు శిక్షణనివ్వడం కోసం మహిళా శిక్షకులకే అవకాశం ఇస్తోందట. దీని కోసం సౌదీలో అయిదు ప్రధాన ప్రాంతాల్లో శిక్షణా సంస్థల్ని కూడా ప్రారంభించింది. అయితే వీటన్నిటికీ కేరళ స్త్రీల క్యూనే ఎక్కువగా ఉందట. నిజానికి సౌదీ ప్రభుత్వమూ మలయాళీ మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందట. ఏకాగ్రత, సహనం, సౌదీ చట్టాల పట్ల వాళ్లకున్న అవగాహన, గౌరవం, బాధ్యత వీటన్నిటి దృష్ట్యా మలయాళీలకే ప్రాముఖ్యం దొరుకుతోందని అంటున్నారు సౌదీలోని భారతీయులు. అందుకే మలయాళీల మీద జోకులు ఆపి వాళ్లలో ఉన్న కష్టపడే తత్వాన్ని నేర్చుకుంటే మంచిదేమో!
Comments
Please login to add a commentAdd a comment