జానపద చంద్రిక
జానపద నృత్యాలు చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటోంది చిన్నారి శతాక్షి. ఐదవ తరగతిలో చేరే నాటికే దాదాపు 500ల ప్రదర్శనలు ఇచ్చింది. అవధేశ్‌శర్మ, సీతాశర్మల కుమార్తె శతాక్షి. వీరిది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరం. ప్రస్తుతం నల్గొండజిల్లా చిట్యాలలో ఉంటున్నారు. శతాక్షి తండ్రి స్థానికంగా మార్బుల్స్ గ్రానైట్ కంపెనీ మేనేజర్‌గా, తల్లి బ్యుటీషియన్ పనిచేస్తున్నారు. నార్కెట్‌పల్లిలోని శ్రీవిద్యాపీఠంలో ఐదవ తరగతి చదువుతున్న శతాక్షి చిన్నప్పటి నుంచి టీవీల్లో వచ్చే నృత్య ప్రదర్శనలు ఆసక్తిగా తిలకించడమే కాదు, అందుకు అనుగుణంగా నృత్యం చేసేది. అప్పుడు ఆలవాటైన ఆ నృత్య కదలికలు ఇప్పుడు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఫస్ట్ క్లాసులో ఉన్నప్పుడు పాఠశాల వార్షికోత్సవంలో జానపద నృత్యం చేసి అందరినీ ఆకట్టుకుంది. మొదటి బహుమతి కూడా గెలుచుకుంది. ఈ నృత్యం ఎంత గుర్తింపు తెచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా శతాక్షి ‘జానపద నృత్యం’ తప్పనిసరిగా ఉండేది.
ఇటీవల రవీంద్రభారతి వేదికపై ‘ కైకలూరి సిన్నదాన్ని’ అనే జానపద పాటకు అనుగుణంగా రయ్ రయ్ అంటూ నృత్యం చేస్తుంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. చప్పట్ల హోరుతో హాలు మార్మోగిపోయింది. ‘‘అమ్మో... చిన్నారి కాదు... పిడుగు... జింక పిల్లలా నృత్యం చేస్తుంటే చూడడానికి అందంగా... ఆనందంగా ఉంది’’ అని రాష్ట్ర సాంస్కృతికశాఖ సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్ ఆనందంతో ఆశ్చర్యపోతే, ‘‘జానపద నృత్యకారిణిగా శతాక్షి భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరుకుంటుంది’’ అని దూరదర్శన్ డెరైక్టర్ శైలజా సుమన్ కితాబు ఇచ్చారు.
2011లో కొత్తగూడెంలో బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన రాష్ట్ర స్థాయి జానపద నృత్య పోటీల్లో ప్రథమ బహుమతి సొంతం చేసుకున్న శతాక్షి కేవలం జానపద నృత్యాల్లోనే కాకుండా సినిమా పాటలు, వెస్ట్రన్ మ్యూజిక్‌కి అనుగుణంగా నృత్య ప్రదర్శన చేయటంలో ప్రావీణ్యత సాధించింది. చదువుకు ఆటంకం రాకుండా సెలవు రోజుల్లో నాట్యగురువు వీరునాయుడు దగ్గర మెలకువలు నేర్చుకుంటున్న శతాక్షి ‘‘అంతర్జాతీయ ఫోక్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది, నృత్య ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తాను’’ అంటోంది. చిన్నారి శతాక్షి కోరిక నెరవేరాలని కోరుకుందాం.
- కోన సుధాకర్‌రెడ్డి