మీ అమ్మలా కావద్దు! | School admission denied to daughter of Bindu | Sakshi
Sakshi News home page

మీ అమ్మలా కావద్దు!

Published Wed, Jan 9 2019 1:01 AM | Last Updated on Wed, Jan 9 2019 10:13 AM

School admission denied to daughter of Bindu - Sakshi

బిందు తెలుసుకదా. జనవరి 1న శబరిమల అయ్యప్పను దర్శించుకుని వచ్చిన ఇద్దరు మహిళల్లో ఒకరు. (ఇంకొకరు కనకదుర్గ). దళిత్‌ యాక్టివిస్ట్‌. నిజానికి ఆమె అక్టోబర్‌ నెలలోనే  శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించారు. కాని నిరసనకారులు అడ్డుకోవడంతో వెనక్కి తిరిగారు. ఆ నిరసన ఆమెకు దైవర్శనం కానివ్వకుండా అడ్డుకోవడం వరకే ఆగలేదు. బిందు ఇంటిదాకా, ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేవరకూ వెంటాడింది. తొలిసారి దర్శనానికి వెళ్లి విఫలమై వచ్చినప్పటి నుంచే బిందు సంప్రదాయవాదుల వేధింపులను ఎదుర్కొంటూ ఉన్నారు. బిందు కుటుంబం కోళికోడ్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసముంటోంది. ఆ ఇంటి యజమాని ముందస్తు సమాచారం, తగిన సమయం ఇవ్వకుండా అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయించారు.

చేసేదిలేక ఫ్రెండ్‌ ఇంట్లో తలదాచుకుంటుంటే అక్కడా వేధింపులు తప్పలేదు. అక్కడినుంచీ ఆమె వెళ్లిపోయేలా చేశారు. బిందుకు పదకొండేళ్ల కూతురు ఉంది. ఆ అమ్మాయి ప్రస్తుతం అగాలీ ఒకేషనల్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్లో చదువుతోంది. వచ్చే యేడాది కోసం కూతురిని విద్యావనమ్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్లో చేర్పించాలనుకున్నారు బిందు. దాని తాలూకు ఇంటర్వ్యూ, పేరెంట్స్‌ మీటింగ్‌నూ పూర్తి చేశారు. అమ్మాయికి అడ్మిషన్‌ ఇస్తున్నాం అని కూడా స్కూల్‌ యాజమాన్యం కూడా చెప్పింది. మొన్న సోమవారం.. అంటే జనవరి ఎనిమిదో తారీఖున అడ్మిషన్‌కు సంబంధించిన ఫార్మాలిటీస్‌ పూర్తిచేసుకోవాల్సి ఉంది.  బిందు స్కూల్‌కి వెళ్లారు.‘‘నా కూతురితో స్కూల్లోకి అడుగుపెట్టాను.


అక్కడ దాదాపు అరవై మంది గుమిగూడి ఉన్నారు. వాళ్లంతా స్థానికులు, మగ వాళ్లు. మమ్మల్ని ఏమీ అనలేదు. ప్రిన్సిపల్‌ రూమ్‌లోకి వెళ్తుంటే కూడా ఏమీ అడ్డుకోలేదు. తీరా లోపలికి వెళ్లాక చూస్తే.. ప్రిన్సిపలే వింతగా ప్రవర్తించారు. ‘‘నేను మీలాగా యాక్టివిస్ట్‌ని కాను. కాని ఎడ్యుకేషనల్‌ యాక్టివిస్ట్‌ని’’ అంటూ సందర్భంలేకుండా మాట్లాడారు. నేను వెళ్లింది మా అమ్మాయి అడ్మిషన్‌ ఫార్మాలిటీస్‌ కంప్లీట్‌ చేయడం కోసం. ఆ ఊసెత్తకుండా ప్రిన్సిపల్‌ ఏవేవో మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది. చివరకు ‘‘మీ అమ్మాయికి అడ్మిషన్‌ ఇచ్చి ఈ స్కూల్‌ వాతావరణాన్ని పాడు చేయదలచుకోలేదు మేము’’ అంటూ అసలు సంగతి చెప్పారు.

గది నుంచి స్కూల్‌ ఆవరణలోకి వస్తుంటే ఓ టీచర్‌ చెప్పారు అక్కడున్న అరవై మంది మగవాళ్లను చూపిస్తూ ‘‘మీ అమ్మాయికి అడ్మిషన్‌ ఇవ్వద్దని వీళ్లంతా ప్రొటెస్ట్‌ చేయడానికి వచ్చారు’’ అని. పాత స్కూల్లో కూడా టీచర్స్‌ మా అమ్మాయితో ‘‘నువ్వు మీ అమ్మలా కావద్దు’’అంటున్నారట. మా అమ్మాయి క్లాస్‌లోని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు మా అమ్మాయితో మాట్లాడొద్దని, డిస్టెన్స్‌ మెయిన్‌టైన్‌ చేయమని వాళ్ల పిల్లలకు చెప్తున్నారట. ఈ అవమానంతో మా అమ్మాయి ఇప్పుడా స్కూల్‌కి వెళ్లడానికే ఇష్టపడట్లేదు’’ అని చెప్పారు బిందు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement