సెనెగల్ | Senegal world view | Sakshi
Sakshi News home page

సెనెగల్

Published Sun, Mar 29 2015 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

సెనెగల్

సెనెగల్

ప్రపంచ వీక్షణం
 
డకార్ సెనెగల్ దేశానికి రాజధాని నగరం. నగరం బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ జనాభా చాలా ఎక్కువ. నగరం చుట్టూ అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఉద్యోగాల సంఖ్య ఎక్కువ. అయితే పర్యాటకులకు ఆనందాన్ని కలిగించేది నగరం ఒడ్డుననే ఉన్న అట్లాంటిక్ సముద్రపు నీలి ఆకుపచ్చ నీళ్ల సౌందర్యం. నగరంలోనూ చూడదగిన ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఈ నగరాన్ని క్రీ.శ. 1444లో పోర్చుగల్ రాజులు నిర్మించారు. నగరంలో చూడదగినవి డకార్ క్యాథడ్రల్, డకార్ గ్రాండ్ మాస్క్, ఐఫాన్ మ్యూజియం, ఆఫ్రికన్ రినేసెన్స్ మాన్యుమెంట్, పార్క్ డిహన్ లెపోల్డ్ సెడార్ అంతర్జాతీయ విమానాశ్రయం, డకార్ విశ్వవిద్యాలయ భవనం, జాతీయ అసెంబ్లీ భవనం, 1776లో నిర్మింపబడిన బానిసల భవనం ఇప్పటికీ మనం చూడవచ్చు. నగరమంతా చక్కని రోడ్డు, రైలు వ్యవస్థ కలిగి ఉంది. అయితే పర్యాటకులకు స్థానిక టాక్సీల వల్ల కొంత ఇబ్బందే ఉంటుంది. కొత్త వాళ్లని నమ్మడం కొంత కష్టం.
 
నైసర్గిక స్వరూపం
 
ఖండం: ఆఫ్రికా
వైశాల్యం:  1,96,712 చదరపు కిలోమీటర్లు
జనాభా:  1,36,35,927 (తాజా అంచనాల ప్రకారం)
రాజధాని: డకార్
ప్రభుత్వం: సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్
కరెన్సీ: సిఎఫ్‌ఎ ఫ్రాంక్
భాషలు: ఫ్రెంచి అధికార భాష, ఇతర ఆఫ్రికన్ భాషలు
మతం: 90 శాతం ముస్లిములు, 6 శాతం క్రైస్తవులు, 3 శాతం ఇతర తెగలు
వాతావరణం: జనవరిలో 18 నుండి 26 డిగ్రీలు, సెప్టెంబర్‌లో 24 నుండి 32 డిగ్రీలు
పంటలు: వరి,జొన్న, గోధుమ, మొక్కజొన్న, వేరుశనగ.
పరిశ్రమలు: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పెట్రోలియం శుద్ధి, ఎరువుల తయారీ, దుస్తులు, మత్తుపానీయాలు, సిమెంటు పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్.
ఎగుమతులు: పెట్రోలియం ఉత్పత్తులు, చేపలు, ఎరువులు, నూలుదుస్తులు,
 స్వాతంత్య్రం: జూన్ 20, 1960.
సరిహద్దులు: మారిటానియా, మాలి, గినియా, గియియాబిసావు, అట్లాంటిక్  మహాసముద్రం.
 
 చరిత్ర

 సెనెగల్ అనేది సెనెగల్ నది పేరు వల్ల వచ్చింది. 7వ శతాబ్దానికి పూర్వం వివిధ రాజులు దీనిని పరిపాలించారు. 9వ శతాబ్దంలో టక్రూర్ రాజులు, 13,14 శతాబ్దాలలో నమన్‌దిరు, జొలోఫ్ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. దేశ తూర్పు భాగం ఒకప్పుడు ఘనాదేశ పరిపాలనలో ఉండేది. టోకోలీర్, సోనింకే రాజుల పాలనా కాలంలో దేశంలో ఇస్లాం మతం సహారా అలోల్మోరావిద్ రాజుల సహకారంతో ఈ దేశంలో ప్రవేశించింది. 13-19 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతం సెనెగాంబియా ప్రాంతంగా పిలువబడేది. 14వ శతాబ్దంలో జోలోఫ్ రాజు క్రమంగా బలం పుంజుకుని సమీపంలో ఉండే కేయర్, బావోల్, సెనై, సాలోమ్, వాలో, ఫుటా టూరో బాంబోక్ లాంటి చిన్న చిన్న రాజ్యాలను తన అధీనంలోకి తెచ్చుకొని పరిపాలన చేశారు. 15వ శతాబ్దం మధ్యలో పోర్చుగీసు రాజులు ఈ దేశంలో ప్రవేశించి వ్యాపారం ఆరంభించారు. ఆ తర్వాత ఫ్రెంచివారు వచ్చారు. క్రీ.శ. 1677లో ఫ్రెంచివారు సెనెగల్ దేశంమీద పూర్తి ఆధిపత్యాన్ని సాధించి తమ పాలనను ఆరంభించారు. చివరికి 1960లో సెనెగల్ స్వాతంత్య్రాన్ని పొందింది.

 పరిపాలనారీతులు

 దేశాన్ని రాష్ట్రపతి పాలిస్తాడు. పూర్తి అధికారాలు రాష్ట్రపతివే. పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 14 రీజియన్‌లుగా విభజించారు. ఒక్కొక్క రీజియన్‌ను రీజినల్ కౌన్సిల్ పరిపాలిస్తుంది. ఈ రీజియన్లు తిరిగి 45 డిపార్ట్‌మెంట్‌లుగా, వాటిని 103 అర్రోన్‌డిస్సెమెంటులుగా విభజించారు.

ప్రజలు-సంస్కృతి

దేశ ప్రజల్లో అత్యధిక శాతం ముస్లిములే. దేశంలో అన్ని ఇతర తెగల ప్రజలలో ఇతరులను గౌరవించడం ‘కెర్పా’ మంచిమర్యాదలు ‘తెగిన్’, సహాయ సహకారాలు ‘టెర్రాంగ’ ఈ మూడు గుణాలు అధికంగా ఉన్నాయి.

మహిళలు వ్యవసాయ పనులు చేస్తారు. వీరు తలకు రుమాలు చుట్టుకుంటారు. పొడవాటి లుంగీ లేదా పొడవాటి స్కర్టు సాధారణంగా ధరిస్తారు. జొన్నలు, గోధుమ, పత్తి, వరి, చెరకు, వేరుశనగ అధికంగా పండుతాయి. భోజనం చేసిన తర్వాత టీ తాగడం ఇక్కడి ప్రజలకు చాలా ఇష్టం.
     
చూడదగిన ప్రదేశాలు

దేశంలో చాలా పొడవైన సముద్ర తీరం ఉన్నందున ఎన్నో బీచ్‌లు ఉన్నాయి. ఈ దేశానికి ఎక్కువగా ఫ్రెంచ్, అమెరికా దేశాలనుండి పర్యాటకులు వస్తుంటారు. దేశంలో గోరీ ఐలాండ్ యునెస్కో సంస్థ ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపిక చేయబడింది. దేశంలో ఏడు జాతీయ పార్కులున్నాయి. ఇక్కడ కొన్నింటిని పరిశీలిద్దాం.

 గోరీ ద్వీపం

 ఇది రాజధాని డికార్ భూభాగం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ సముద్రంలో ఉంది. ఇది 45 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ద్వీపంలో జనాభా దాదాపు 11 వందలు. ఈ మొత్తం ద్వీపం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడింది. శతాబ్దాల క్రితం ఈ ద్వీపం బానిసల మార్కెట్‌కు బాగా ప్రసిద్ధి. ఇక్కడి నుండి ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది బానిసలను కొనుక్కొని ఓడల మీద ఇతర దేశాలకు త రలించే వారు. 18వ శతాబ్దం ప్రారంభంలో ఈ బానిస తరలింపు తగ్గిపోయింది. ఇదొక నౌకాశ్రయంగా వృద్ధి చెందింది. పోర్చుగీసు వాళ్లు యూరోపియన్లు, నెదర్లాండ్ వాళ్లు ఈ ద్వీపాన్ని ఒకప్పుడు తమ స్వంత ప్రదేశంగా ఉపయోగించుకున్నారు. 1664లో ఈ ద్వీపానికి రాబర్ట్ హోమ్స్ ఈ ద్వీపానికి గొరీ ఐలాండ్‌గా నామకరణం చేశాడు. ప్రస్తుతం ఈ ద్వీపంలో ఉన్న పురాతన భవనాలన్నీ హోటళ్లుగా మారి, పర్యాటకులకు ఆకర్షణగా నిలిచాయి. అప్పటి కట్టడాలన్నీ ఎలా ఉన్నవి అలాగే ఉన్నాయి. ఈ ద్వీపంలో బానిసల గృహం, విలియం పాంటీ స్కూల్, మారిటైమ్ మ్యూజియం, ఫోర్ట్‌డి ఎస్ట్రీస్ సెనెగల్ మ్యూజియం, గవర్నమెంట్ ప్యాలస్, గోరి క్యాజిల్, 17వ శతాబ్దపు పోలీస్ స్టేషన్ భవనం... ఇలా అనేక కట్టడాలు గత శతాబ్దాలవి నేటికీ అలాగే ఉన్నాయి. ఈ ద్వీపం మొత్తం సముద్రాన్ని చుట్టి ఉంటుంది. పర్యాటకులకు ఇదొక స్వర్గధామంగా నిలిచింది.

సెయింట్ లూయిస్

సెయింట్ లూయిస్ దేశానికి ఉత్తర ప్రాంతంలో ఉన్న పెద్ద నగరాలలో ఒకటి. నగరం సెనెగల్ నది ముఖ ద్వారం దగ్గర ఉంది. రాజధాని నగరం నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ నగరం క్రీ.శ.1659లో ఫ్రెంచ్ వ్యాపార వేత్తలు నిర్మించారు. ఆ కాలంలో సెయింట్ లూయిస్‌ను ఎన్‌డార్ అని పిలిచేవారు. ఈ నగరంలో శతాబ్దాల క్రితం నాటి చారిత్రక కట్టడాలు నేటికీ నిలిచి ఉన్నాయి.    ఈ నగరంలో నిలిచి వున్న సెయింట్ లూయిస్ రీసెర్చ్ సెంటర్, మ్యూజియంలో సెనెగల్ దేశశతాబ్దాల చరిత్ర, అప్పటిదుస్తులు, పరికరాలు, ఇతర ఎన్నోవస్తువులను భద్రంగా దాచి ఉంచారు. వీటిని చూస్తుంటే ఆ కాలం నాటి మనుషులు, చరిత్ర కళ్లముందు కనబడతాయి. నగరంలో ఉన్న గవర్నర్ పాలెస్, పార్క్ ఫెదర్ బే, గ్రాండి మాస్క్, ఫెదర్ బే  బ్రిడ్జి ఇలా అనేక ఆనాటి కట్టడాలు నేడు దర్శనమిస్తాయి. నగరంలో ఇళ్లన్నీ దాదాపు రెండంతస్తులుగా ఉంటాయి. వీధులన్నీ ఎంతో సుందరంగా ఉంటాయి. మొదటి ప్రపంచ యుద్ధ స్మారకం అందర్నీ ఆకర్షిస్తుంది. ఈ నగరం సముద్ర మట్టానికి దాదాపు సమాన ఎత్తులో ఉండటం ప్రత్యేకత. సముద్రం ఏ మాత్రం ఉప్పొంగినా నీళ్లు నగరాన్ని ముంచెత్తుతాయి.
 
ఎమ్‌బోర్

ఈ నగరం రాజధాని డకార్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరాన్ని అక్కడి వాళ్లు చేపలు పట్టే నగరంగా పిలుచుకుంటారు. సముద్ర తీరంలో ఉండడం వల్ల నగరమంతా బీచ్‌లతో నిండివుంటుంది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే చేపలు పట్టే వారు అప్పటికప్పుడే చేపలు పట్టి అమ్ముతుంటారు. బీచ్ పొడవునా చేపల మార్కెట్లు విస్తరించి ఉన్నాయి. ఇక్కడే దేశంలోని అతిపెద్ద ఓడరేవు ఉంది. నగరం సమీపంలో టైటానియం గనులు ఉన్నాయి. ఇక్కడ చేపలు పట్టే వాళ్ళకోసం ప్రత్యేకంగా ఒక గ్రామం ఉంది. నగరంలో ఉన్న సెంట్రల్ మార్కెట్ ప్రదేశం అత్యంత పురాతనమైన ప్రాంతం. ఈ నగరం పర్యాటకుల పాలిట ఒక గొప్ప అనుభూతిని కలిగించే నగరం. 15వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని బవోల్ రాజకుటుంబం పరిపాలించేది. నగరంలో ప్రస్తుతం దాదాపు రెండు లక్షల జనాభా ఉంటుంది. నగరానికి సమీపంలో జోయల్ ఫెడియోత్, బండియా నేషనల్ పార్కు, లాసమోనోలు ఉన్నాయి.

కావోలాక్ నగరం

ఈ నగరం సాలోమ్ నది తీరంలో ఉంది. ఈ నగరంలో ఉన్న జనాభా మొత్తం ముస్లిములే ఉన్నారు. ఈ నగరంలో ఉన్న మదీనా మసీదు మొత్తం సెనెగల్ దేశంలోనే అతి పెద్ద మసీదు. ఒకప్పుడు ఈ నగరం సాలోమ్, కహకీనే రాజకుటుంబాల పరిపాలనలో ముఖ్యనగరంగా వెలుగొందింది. సాలోమ్ నదీ తీర ప్రాంతంలో ఉప్పు తయారు చేసే మడులు అనేకం ఉంటాయి. ఇక్కడ బాదం పలుకుల, బాదం నూనె, ఉప్పు తయారీ అధికంగా జరుగుతుంది. నగరమంతా ఇస్లాం వాతావరణంతో నిండి ఉంటుంది. ఇస్లామిక్ విద్య నేర్చుకోవడానికి ఇక్కడికి ఎన్నో దేశాల నుండి విద్యార్థులు వస్తారు. జనాభాలో దాదాపు 50 శాతం మంది ఏదో ఒక వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతారు. సాలోమ్ నది ఇక్కడి నుండి ముందుకు ప్రవహించి సముద్రంలో కలుస్తుండడంతో ఓడలు, పడవల ప్రయాణాలు ఎక్కువగా దర్శనమిస్తాయి. ఈ నది గుండా ఓడలు సముద్రంలోకి ప్రవేశిస్తాయి. అందువల్ల తమ ఎగుమతులను ఇక్కడి నుండే తీసుకువెళ్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement