శాకంబరీ ఉత్సవాల ఓరుగల్లు భద్రకాళి | Shakambari Festival Ogghalal Bhadrakali | Sakshi
Sakshi News home page

శాకంబరీ ఉత్సవాల ఓరుగల్లు భద్రకాళి

Published Tue, Jun 27 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

శాకంబరీ ఉత్సవాల ఓరుగల్లు భద్రకాళి

భద్రకాళి అమ్మవారు
పుణ్య తీర్థం


వసంత, శరదృతువుల్లోని వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికే భక్తులు శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. శాకంబరీదేవి దేహం నుండి ఉద్బవించిన వనమూలికలతో కూడిన పలువిధాలైన చెట్లు, గడ్డలు, దుంపలు, తీగలు, ఆకులు, పండ్లు, పూలు, లతలు, మొక్కలు మొదలైన వాటిని స్వీకరించిన మనుషులు, జంతువులు ప్రాణాలు దక్కించుకోవడమేకాక రోగాల్ని, ముసలితనాన్ని జయించి ముక్తిని పొందారని పురాణ కథనాలున్నాయి.

సుందర మైన ప్రకృతి ఒడిలో స్వయంవ్యక్తమై వెలిసిన చల్లటితల్లి శ్రీభద్రకాళీదేవి ఆషాఢమాసం సందర్భంగా శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్నారు. వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవాలయంలో ఆదివారం నాడు అత్యంతవైభవంగా ఆరంభమైన శాకంబరీ ఉత్సవాలు జూలై 9న మహాశాకంభరీ ఉత్సవంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక వ్యాస కదంబం.

ఓరుగల్లు కొండల్లో ఏర్పాటైన శ్రీచక్రం కలిగిన దివ్య క్షేత్రంలో అమ్మవారితో పాటు భద్రేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, వల్లభ గణపతి, ఆదిశంకరాచార్య, చంద్రమౌళీశ్వరస్వామి పూజలందుకుంటున్నారు. పూర్వం దేవతలు, సిద్ధులు కూడా అమ్మవారిని పూజించారట. క్రీ.శ 625 నాటికే చాళుక్యరాజైన రెండో పులకేశి కాలంలో ఏకాండశిలపై ఉన్న అమ్మవారి విగ్రహం ముందు దేవాలయం గర్భగుడి, అంతరాళ మండపం నిర్మించబడింది. 1950లో దేవాలయ జీర్ణోద్దరణ జరిగినప్పటినుండి చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో శాకంబరీ నవరాత్రులు, ఆశ్వయుజమాసంలో శరన్నవరాత్రులను, మాఘమాసంలో మాఘనవరాత్రులను వైభవంగా నిర్వహిస్తున్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా శ్రీభద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణోత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. వీటితోపాటు శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు దేశంలోనే ఎక్కడా జరగనంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

ఉత్సవాలు ఇలా...
సర్వతోభద్రవాస్తుయోగినీ, గణపతి నవగ్రహ క్షేత్రపాలకమండలదేవతాయజనం తదితర అనుష్టానాలు నిర్వహించి కలశస్థాపన చేస్తారు. పంచరంగులతో రూపొందించిన మండలంలోని తొమ్మిది కోష్టాలలో 1008 కలశాలలో ప్రక్షిప్తం చేసి నాలుగు వేదాల మూలమంత్రాలతో తీర్థావాహన చేస్తారు. సహస్ర కలశాభిషేకంలో భాగంగా వేదపండితులు వెదురుబుట్టలలో కలశాలను అర్చకులు అభిషేకం చేస్తారు.

నువ్వులనూనె, నారింజ, నిమ్మపండ్లు, ఖర్జూరపండ్లు, ద్రాక్షపండ్లు, మారేడు, దానిమ్మ, పూజిత ఫలాలు, పనస పండ్లు రసాలతో, నైరుతి కోష్టంలో మధ్యపూర్వాతి క్రమంలోని ఆవుపాలు, కుంకుమ, నాగపుష్పాలు, సంపెంగ, మాలతి, పొన్న, కలువ, మల్లె, పశ్చిమ కోష్టనవకల్పంలోని అరటిపండ్లు, వాననీరు, హిమజలం. నిర్జరజలం, గంగోదకం, సప్తసాగర జలం, సరోవరజలం, నదీసంగమజలం, వాపిజలం, వాయువ్యకోష్టంలోని  పెరుగు, సహాదేవి, కుమారీ, సింహి, వ్యాఘ్రి, అమృత, విష్ణుతర్ని, శతశివా, వచ, ఉత్తరకోష్టంలోని చెరకురసం, తాంబూలం, యాలకులు, చిల్లంగకోష్టం, వ్నశీరం, శ్వేతచందన చూర్ణం, రక్తచందన చూర్ణం, కస్తూరి, కృష్ణాగరువు, ఈశాన్యకోష్టంలోని చంద్రచీరం, వెండిరౌప్యం, సీసం, లోహం, తామ్రం, సువర్ణం, పంచరత్నాలు, రీతికం, విశేషద్రవ్యాలు, మధ్యభాగంలో ఉన్న తొమ్మిది కలశాల్లో ప్రక్షేపించిన వడ్లు, దూసవడ్లు, మొదలైనవాటితోనూ దివ్య ఔషధాలు, వనమూలికలు, లోహలు, నవరత్నాలు, పవిత్రవృక్షాల ఆకులు, సువాసనలు కలిగిన పుష్పాలు, సుగంధాలు, పంచమృత్తికలు, జలాలు, ఫలరసాలు, నవధాన్యాలు, తృణధాన్యా లు, పసుపు, కుంకుమలు పంచరంగులతో అభిషేకం జరుగుతుంది.

అనంతరం అమ్మవారికి పూజలు జరిపి వివిధ కూరగాయలతో అలంకరిస్తారు. దీంతో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అమ్మవారిని వివిధ కూరగాయల హారాలతో అలంకరిస్తూ ఆరాధిస్తారు. శుక్లపక్ష చంద్రుడు రోజు వృద్ధి చెందుతూ పౌర్ణమినాడు షోడశకళాప్రపూర్ణుడైనట్లే పక్షం రోజులపాటు çకూరగాయల అలంకరణలను పెంచుతారు. చివరగా మహాశాకంబరిగా అలంకారం చేస్తారు.

ఇలా అవతరించింది
పూర్వం అనావృష్టితో పంటలు పండక భూమిపై జంతుకోటి నాశనం అవుతున్న సమయంలో మునీశ్వరులు దేవతలను ప్రార్థించగా జగజ్జనని శాకంబరీ దేవిగా కమలాసనంపై కూర్చుని, ఒక చేతిలో ధనుస్సును, పిడికిలిలో వరిమొలకలను, ఇతర చేతులలో పుష్పాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు, కూరగాయలు తదితర శాకా సముదాయాలతో అవతరించి లోకాన్ని రక్షించిందట. ఈమే దుర్గముడు అనే రాక్షసుని సంహరించి దుర్గాదేవిగా ప్రసిద్ధమైంది. భక్తులు ఈమెనే శతాక్షిదేవిగా కూడా పిలుస్తారు.

మహాశాకంబరి అవతారం
చివరిరోజున ఆషాఢ శుద్ధపౌర్ణమి నాడు మితాక్రమంలో అమ్మవారి భేరీమూర్తిని టన్నుల కొద్ది కూరగాయలతో మహావైభవంగా అలంకరిస్తారు. ఉత్సవాలలో ప్రతిరోజు అమ్మవారిని గజపూమాలలతో అలంకరిస్తారు. పౌర్ణమి నాడు ఉదయం 4 నుండి శ్రీ భద్రకాళి అమ్మవారిని వివిధ రకాలైన ఆకుకూరలతో, కూరగాయలతో, మహా శాకంబరిగా అలంకరిస్తారు. శాకంబరీ రూపం చూడడానికి వేయికళ్లైనా చాలవనిపిస్తుంది.
– అడ్లూరి శివప్రసాద్‌ సాక్షి, హన్మకొండ
 

Advertisement
Advertisement
Advertisement