ఫుల్‌గా తినేది ఒక్కరోజే..
సీనియర్ యాంకర్స్‌లో ఒకరైన శిల్పాచక్రవర్తి... పెళ్లయి, ఇద్దరు పిల్లల తల్లి అని చెబితే ఠక్కున నమ్మాలంటే కష్టం అన్నంత చక్కని ఫిజిక్‌ని మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు తగినంత బరువుతో ఫిట్‌గా కనిపించే ఈ ‘శిల్ప’మ్ కూడా ఒకప్పుడు అధిక బరువు బాధితురాలే. తనను తాను స్లిమ్ అండ్ ట్రిమ్‌గా మలచుకున్న వైనం గురించి ఆమె చెప్పిన విశేషాలివి...
పిల్లలతో మొదలు...
ఓ రకంగా చెప్పాలంటే నా వ్యాయామం నా ఇద్దరు పిల్లల పనులతో తెల్లవారుజామునే మొదలవుతుందనాలి. వాళ్లను స్కూల్‌కి పంపేవరకూ ఇంట్లో ఉరుకులు పరుగులే. ఆ తర్వాత కాసేపు ఊపిరి పీల్చుకుని నన్ను నేను షేప్ అప్ చేసుకునే పనులపై దృష్టి పెడతాను.
కార్డియోతో స్టార్ట్...
మా ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఫిట్‌బజ్ జిమ్‌కి ఉదయం 8 గంటల సమయంలో వెళతాను. అక్కడ మాలిని, అత్తర్‌లు నా ట్రైనర్స్. వ్యాయామం కార్డియోతో స్టార్ట్ చేస్తాను. ఒక రోజు 10నిమిషాలు కార్డియో తర్వాత వర్కవుట్ ఆ తర్వాత మళ్లీ కార్డియో మళ్లీ వర్కవుట్ అలా మార్చి మార్చి చేస్తుంటాను. ఒక్కో రోజు కేవలం వెయిట్ ట్రైనింగ్, ఒక్కోరోజు కేవలం లోయర్ బాడీకి మాత్రమే వర్కవుట్ ఉంటుంది. ఒక రోజు కార్డియో ప్లస్ ఆప్పర్‌బాడీ, ఒకరోజు కార్డియో ప్లస్ లోయర్ బాడీ... ఇలా నా వర్కవుట్ షెడ్యూల్ ఉంటుంది. అదే విధంగా స్టెప్పర్ వినియోగించి ఒక రోజు ఎరోబిక్స్ చేస్తాం. రోజూ ఒకటే కాకుండా 5 రోజులు 5 రకాల రొటీన్స్ ఉంటాయి. ఒక్కో రోజు సర్క్యూట్ ట్రైనింగ్ ఉంటుంది. దీనిలో భాగంగా ఒక్కరోజులో 15 రకాల వేరియేషన్స్ చేస్తాం. ఒక్కో వేరియేషన్ 20 రిపిటీషన్స్, 2 సెట్స్ చొప్పున చేస్తాను. సగటున రోజుకి గంటన్నర సమయం వర్కవుట్‌కి కేటాయిస్తాను.
బ్రేక్‌ఫాస్ట్ భారీగానే...
జిమ్‌కి వెళ్లడానికి ముందుగానే బిస్కట్స్, వాల్‌నట్స్ తిని వెళతాను. దీని వల్ల వ్యాయామ సమయంలో అవసరమైనంత ఎనర్జీ వస్తుంది. వర్కవుట్ నుంచి రాగానే గ్రీన్ టీ తాగుతాను. ఆ తర్వాత రెగ్యులర్ టిఫిన్ దోసె లేదా ఇడ్లీ అయితే చాలా మితంగా... తీసుకుంటాను. ఒక ఎగ్‌వైట్ కూడా ఇందులో భాగమే. మిల్క్–కార్న్‌ఫ్లేక్స్ కలిపి తీసుకుంటాను. జ్యూస్ లేదా ఫ్రూట్ తప్పకుండా తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం కొంచెం హెవీగానే ఉంటుంది. మధ్యాహ్నం ఒక రోటీ, కాస్త ఎక్కువగా వెజ్ కర్రీ తింటాను. ఆదివారం మాత్రమే రైస్ లేదా రైస్‌తో చేసిన బిరియానీ లాంటివి తీసుకుంటాను. ఐస్‌క్రీమ్, బట్టర్ బ్రెడ్ వంటివి కూడా తీసుకుంటాను. డిన్నర్ టైమ్ 8 గంటలకు కాస్త అటూ ఇటూ. డిన్నర్‌లో లావురవ్వ ఉప్మా లేదా ఓట్స్ ఉప్మా వంటివి తింటాను. బటర్‌మిల్క్, వాటర్ మిలన్, యాపిల్, కోకోనట్ వాటర్... వంటివి రోజంతా సిప్ చేస్తూనే ఉంటాను. గ్రీన్ టీ కూడా. 3నెలలకు ఒకసారి వారం పాటు పూర్తిగా ద్రవపదార్ధాలే నా ఆహారం. ఇది టాక్సిన్స్‌ను పోగొట్టడానికి ఉపకరిస్తుంది.
వెయిట్‌లాస్... ఫిట్ ప్లస్...
డెలివరీ తర్వాత నా బరువు 82 కిలోలకు పెరిగింది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామం వల్ల 60కి తగ్గాను. యోగా నాకు సెట్‌కాలేదు. బ్యాక్ వీక్ అందుకని చేయలేను. క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్ అంటే నాకు ఇష్టం బాగా ప్రవేశం కూడా ఉంది. వారంలో 3 రోజులు తప్పకుండా ఏదో ఒక డ్యాన్స్ చేస్తాను.
సమన్వయం ,సత్యబాబు