డిసెంబర్ 12 నుంచి 18 వరకు
టారో బాణి
మీరు తలపెట్టిన ఓ సాహసోపేతమైన పనికి మీ బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. ఇది మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ప్రేమ/ ధ్యానం/ జీవితం లేదా పెయింటింగ్/ మ్యూజిక్/ డ్యాన్స్/ కవితలు... ఇలా ఎందులోనైనా సరే, మీరు సంపూర్ణంగా లీనమైతే తప్ప అందులోని ఆనందాన్ని అనుభవించలేరని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: వైట్
జీవితం ఒడుదొడుకులు లేకుండా సాఫీగా సాగాలని ఆలోచించడం మాని, సాహసాలకు చోటివ్వండి, కొత్త జీవితానికి శుభారంభం పలకండి. ప్రేమ-ధ్యానం, కుటుంబ బంధం- ఒంటరితనం కూడా బొమ్మాబొరుసుల్లాంటివే. ఒంటరిత నంలోని ఆనందాన్ని అనుభవించగలిగినప్పుడే ప్రేమమాధుర్యాన్ని ఆనందించగలమని గ్రహించండి. కలిసొచ్చే రంగు: పీచ్ కలర్
యోగ, ధ్యానం, పరివర్తన చెందడమనేవి చదవడానికి బాగానే ఉంటాయి. అయితే అలా చదివి వదిలేస్తే ప్రయోజనం ఏమిటి? ఆచరించినప్పుడే కదా అలవడేది! జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు. గేర్ మారిస్తేనే కదా వాహనం ముందుకు నడిచేది! బాగా ధ్యానం చేయండి. అందులోని ఆనందాన్ని అనుభవించండి. కలిసొచ్చే రంగు: వయొలెట్
జీవితం ఎప్పుడూ నల్లేరుపై బండినడకలా సాగాలని, ఏ సమస్యలూ లేకుండా ఉండాలని మీ కోరిక. అలా జరిగితే ఇక అది జీవితం అవుతుందా? శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలుంటాయి.. ఆలోచిస్తే, మనసు మాట వింటే! మనమసలు ప్రకృతిలో భాగంగా ఉన్నప్పుడు, ప్రకృతిని ప్రేమించినప్పుడు ఏ సమస్యలూ ఉండవు. కలిసొచ్చే రంగు గ్రీన్
కొత్తజీవితం కావాలని కోరుకునేలా చేస్తుంది ఈ వారమంతా! అయితే గొంగళిపురుగుతో సహా అనేక దశలు దాటిన తర్వాతనే శీతాకోకచిలుకగా రూపాంతరం చెందిందని గుర్తుతెచ్చుకోండి. మార్పు అనివార్యం. రకరకాల పరిస్థితులను, గడ్డుసమస్యలను అధిగమించాలి. బుర్రకు పదును పెడితే సరి! కలిసొచ్చే రంగు: మావ్ (రక్తవర్ణం)
ఎదగాలనే కోరిక ఎప్పుడూ అణగారనిది. అయితే కాలానికి, కోరికలకు పగ్గాలుండవని గుర్తుంచుకోండి. మార్పు కావాలని కోరుకున్నారు కదా, వస్తుంది. అయితే ఆ మార్పు ఎలా ఉండాలంటే విత్తనం మర్రివృక్షంలా ఎదిగినట్లుండాలి. అలాగే మార్పు నీ అంతరాళాల నుంచే రావాలి. కలిసొచ్చే రంగు: లేత ఊదారంగు
జీవిత ప్రయాణం మామూలు ప్రయాణాల వంటిది కాదు. ఏదో ఒక సత్యాన్ని బోధిస్తూనే సాగిపోతుంది. మనం అనుకున్నది జరగదు, జరగనివ్వదు. తన ప్రవాహంలో మనల్ని కూడా కలుపుకెళుతుంది. అలాగే సత్యాన్వేషణ చేసే ముందు నీ మనసును ఖాళీగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. కలిసొచ్చే రంగు: గ్రే
మీరు కోరుకుంటున్నట్లుగా మనశ్శాంతి లభిస్తుంది. మీ మనస్సు, శరీరం శక్తిని, బలాన్ని పుంజుకుంటాయి. నోరారా తాగితేనే దప్పిక తీరినట్టే, ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు దానిమీద పూర్తిగా దృష్టి పెట్టినప్పుడే కదా మనలో చైతన్యం నిండేది. మౌనంగా ఉండి నీలోకి నీవు ప్రయాణించాల్సిన తరుణమిది. కలిసొచ్చే రంగు: గోల్డెన్.
జాతకంలో శనిదశ ఉన్నప్పుడు అంటే దేవుడు మనకు కష్టాలను ఇచ్చినప్పుడే, వాటిని తట్టుకోగలిగే శక్తిని, గుండెనిబ్బరాన్ని కూడా ప్రసాదిస్తాడు. కష్టాలను కూడా ఇష్టంగా స్వీకరించడాన్ని అలవరచుకోండి. రేయింబవళ్లు ఒకదాని తర్వాత ఒకటి వ చ్చినట్టే, కష్టం తర్వాత సుఖం ఉంటుందని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: రెయిన్‌బో
లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నప్పుడు ఒంట్లోని శక్తినంతటినీ, మన ఏకాగ్రతనంతటినీ కేంద్రీకరించాలని గ్రహించండి. నేను తప్ప నా చుట్టుపక్కల వారంతా ఆనందంగా ఉన్నారు... అని అనుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆ ఆనందం నీకు కలగాలంటే ఏం చేయాలో తెలుసుకో ముందు. కలిసొచ్చే రంగు: ఫిరోజా రాయి రంగు (పగడం రంగు)
మీ బలహీనతలను వదిలించుకుని, మీ తెలివితేటలకు, శక్తిసామర్థ్యాలకు పదును పెట్టేందుకు ఇది తగిన సమయం. పాతజ్ఞాపకాలు, అనుభవాలను గుణపాఠంగా తీసుకోండి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి. కార్యాలను అవలీలగా సాధించగలుగుతారు. కలిసొచ్చే రంగు: ఆరంజ్
సానుకూల వాతావరణాన్ని సాధించేందుకు ప్రయత్నించండి. ధ్యానంలో మరింత లోతుకు చేరేందుకు కృషి చేయండి. శరీరం, ఆత్మ ఒకటైనప్పుడే అలా లోతుకు చేరతారని తెలుసుకోండి. అక్కర్లేని మాటలు ఎంత చేటో, మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడకపోవడం కూడా అంతే అనర్థమని గుర్తించండి. కలిసొచ్చే రంగు: ఎల్లో
సౌర వాణి
ఇంటా బయటా ఆద రణ అంతంతమాత్రంగానే ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లోనూ, మీ వృత్తిలోనూ కూడా మీ మాటకి పెద్ద విలువ ఈ వారంలో ఉండకపోవచ్చు. ఇతరులు మీ గురించి చెప్పిన మాటలుగానీ, మీ ప్రవర్తనలో మార్పుగానీ ఈ పరిస్థితికి కారనం కావచ్చేమో ఆలోచించుకోండి. ఏమైనా మీ కోపం పట్టుదలా ఒక స్థాయికి మించకూడదని గ్రహించాలి.
శుభాశుభాల మిశ్రమంగా గడుస్తుందీ వారం. వృత్తి లేదా ఉద్యోగం చేసేవారికి ఏమాత్రపు అనుకూలతా ఈ మాసంలో దాదాపు ఉండకపోవచ్చు. మీ ప్రతికదలికనూ- అసూయా దృష్టితో ద్వేషబుద్ధితో మీ పై అధికారులకి చాడీలుగా చెప్పే వారి సంఖ్య కొద్దిగా పెరిగినా ఆశ్చర్యపడనక్కరలేదు. అలాంటి వారెవతరు అని ఆలోచించకండా, మీ జాగ్రత్తలో మీరుండండి.
ఆదాయం అంతంతమాత్రంగా ఉంటుంది. పని ఒత్తిడి మాత్రం ఓ పండుగా పబ్బం అనేది కూడా లేకుండా ఉంటుంది. మీరు ఓ సంస్థలోగాని పని చేస్తున్నవారైతే సంస్థ యాజమాన్యం మీద తిరుగుబాటు చేయాలనే ధోరణిని మీకు నూరిపోసి మిమ్మల్ని రెచ్చగొట్టే వారిని ఏమాత్రం విశ్వసించక , ఆ మాటల్ని మొగ్గలోనే తుంచేయండి లేదా పని ఉందని తొలగిపొండి.
ఉత్సాహంగా ఉంటారు. మీ కుటుంబానికి సంబంధించిన ఓ సమస్య మీకు మనశ్శల్యంగా బాధిస్తూ ఉన్నా తట్టుకోగల గట్టి గుండెధైర్యం మీది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీ ఇంటి విషయాలు వీధిలోనికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తపడండి. ఆరోగ్యంలో లోపమున్నా వైద్యుని అవసరం దాకా రాద్దు. మనశ్శాంతి ఉన్నట్లు అందరికీ కన్పించడం మీ ప్రత్యేకత.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఎంతగా దూసుకుపోవాలని ఓ ప్రణాళికని వేసుకుని వెళ్తున్నా అది సామాన్య ప్రయోజనాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప ఊహించినంత ఎత్తుగా ఉండకపోవచ్చు. అయితే నిరుద్యోగులకి మాత్రం ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నాలు రాబోయే ఉన్నతిని అంచనా వేసేలా చేస్తుంది. ఇప్పుడు మాత్రం కాదు.
కుటుంబంలో ఐకమత్యం అంటే అందరిదీ ఒకే మతిగా ఉంటారు ఈ వారంలో. ఇది కుటుంబానికి శ్రేయస్సుని కల్గించే అంశం. వేసిన ప్రతిరాయీ చెట్టుకున్న ఫలానికి తగలనట్టుగా మీ అన్ని ప్రయత్నాలూ ఫలించవు. ఒకటి మాత్రం నెలచివరలో ఫలించే అవకాశం ఉంది. ముత్యాలు, రత్నాలు, బంగారం వంటి విలువైన వాటిని కొనే అవకాశం ఉంది.
మీరు ఏం చేయదలిచినా దానికి ప్రతిబంధకాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఆ అడ్డంకుల కారణంగా మీ ఊహ కార్యరూపాన్ని దాల్చదు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మానసిక వ్యధని కల్గిస్తుంది. మీరు కూడా మానసికంగా బాగా అలిసిపోతారు. మీ ఉన్నతిని గురించి మీరాలోచించుకోవడం శ్రేయస్కర. మీ శక్తికి మించి మీ కుటుంబం మొత్తాన్ని ఎత్తనక్కర్లేదు.
ఏ పని చేయబోయినా ప్రస్తుతమున్న గ్రహదశ కారణంగా వాయిదాపడుతుంది. కష్టనష్టాలు ఎదురు కావుకానీ మానసిక వ్యధ పడే అవకాశం మాత్రం ఉంది. ముఖ్యంగా దాంపత్యానికి సంబంధించిన ఇబ్బంది లేదా సంతానానికి సంబంధించిన పొరపచ్చాలతో సతమతమయ్యే పరిస్థితి ఉండవచ్చు. ఏమైనా గుండెనిబ్బరంతో ఉండండి. విజయం మీదేనని గ్రహించండి.
పనులు నిదానంగా సాగుతాయి. కొత్త ప్రదేశాలకి వెళ్లే అవకాశం ఉంది. మాటకి మాటని చెప్పితీరే మీ ధోరణిని ఎదుటివారన్న మాటని ఎప్పుడు మళ్లీ వాళ్లకి అప్పజెప్పాలా అనే ఆలోచనని మార్చుకుంటే మరింతగా రాణిస్తారు. ఈ తీరు వల్ల మీ మీద అందరికీ ఓ ప్రత్యేక దృష్టి ఏర్పడుతోందని గ్రహించండి. మీకు మీరు ముఖ్యం. ఇలా మీ ఆలోచనని మార్చుకోండి.
ఇన్నాళ్లూ మీ తండ్రి, తాతముత్తాతలకీ మీ కుటుంబ సభ్యులందరికీ భోజనాన్ని పెట్టిన పొలాన్ని అలా అమ్మి తెచ్చుకున్న ధనాన్ని తాత్కాలికమైన చరాస్తులైన వాహనాలమీదా ఇతర వస్తువుల మీదా పెట్టేయడం కంటే, దాన్ని తిరిగి భూమి మీదనే పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఇక మీదట ఏ పరిస్థితులలోనూ ఇంతకు ముందు కొనుక్కున్న భూమిని అమ్మవద్దు.
ఈ వారం వ్యాపారం లాభసాటిగా లేకున్నా నష్టాలు మాత్రం ఉండవు. రావలసిన బకాయిలుగాని, నెలసరి జీతంగాని సకాలంలో రాకపోవచ్చు. వచ్చిన ఆదాయం కూడా పెద్దగా నిలవకపోవచ్చు. అనవసర వ్యయం మీరు చేయకపోవచ్చేమోగాని, అవసరంగా చేయవలసిన వ్యయమే బరువనిపించవచ్చు. ఏమైనా ఆర్థికంగా కత్తిమీద సామే ఈ వారంరోజులూ మీకు.
ఒక గడ్డు సమస్యకి బంధువుల సమక్షంలో ఓ ఒప్పందం జరిగిన కారణంగా మీరు ధైర్యంగా ఉంటారు. అయితే మీ విరోధులు మీకు శారీరకంగానూ ఆర్థికంగానూ ఇబ్బందిని కలగజేయబోతారు కాబట్టి, ఈ విషయంలో ఏమాత్రపు సడలింపునీ అంగీకరించవద్దు. అలాగే చేసుకున్న ఒప్పందానికి చిరుమార్పుల్ని కూడా ఒప్పుకోవద్దు. జరిగిన నిర్ణయానికి కట్టుబడి ఉండండి.