శాంతిశీల సమర యోధుడు! | short story about mahatma gandhi | Sakshi
Sakshi News home page

శాంతిశీల సమర యోధుడు!

Published Fri, Aug 15 2014 12:33 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

శాంతిశీల సమర యోధుడు! - Sakshi

శాంతిశీల సమర యోధుడు!

సంక్షిప్తంగా: మహాత్మాగాంధీ
 
ఇరవయ్యవ శతాబ్దపు భారతదేశాన్ని రాజకీయంగా, సామాజికంగా ప్రభావితం చేసిన అత్యంత శక్తిమంతుడైన స్వాతంత్య్రోద్యమ నాయకుడు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. ‘జాతిపిత’గా ఆయనను భావించినప్పుడు ఒక్క భారత్‌కే ఆయన పరిమితమైన వ్యక్తిగా అనిపించినప్పటికీ, ‘మహాత్మ’గా ఆయనను అవతరింపజేసిన సిద్ధాంతాలు.. అహింస, సత్యాగ్రహం.. విశ్వవ్యాప్తంగా మన్ననలు పొందినవి! ఈ రెండు సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన భారత జాతీయోద్యమాన్ని ఇంచుమించుగా ఒక్కతాటిపై నడిపించారు.

ప్రాథమికంగా హైందవ మత విలువలను అనుసరించిన గాంధీజీ క్రమేణా జైన, క్రైస్తవ మతబోధనలకూ; టాల్‌స్టాయ్, థోరో రచనలకూ ప్రభావితులై అంత్యసారంగా ‘సత్యాగ్రహ’ సిద్ధాంతాన్ని పైకి తేల్చారు. సత్యాగ్రహం అంటే... దౌర్జన్యాలపై హింసకు తావులేని ఒక బలమైన నిరసన విధానం.
 
1920 నాటికి గాంధీజీ భారత రాజకీయాలలో ముఖ్య నాయకుడయ్యారు. ఆయన నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది. శాంతియుతమైన సహాయ నిరాకరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపును అందుకుని బ్రిటిష్ వస్తువులను, సంస్థలను బహిష్కరించిన వేలాదిమంది భారతీయులు అరెస్టయ్యారు. 1922లో గాంధీజీ కూడా అరెస్టయ్యారు. ఆయనకు ఆరేళ్ల కారాగార శిక్ష పడింది. అయితే రెండేళ్లకే విడుదలయ్యారు. అనంతరం రాజకీయాల నుంచి వైదొలిగి, అప్పటికే క్షీణించి ఉన్న హిందూ-ముస్లిం సంబంధాల పునరుద్ధరణకు అంకితమయ్యారు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు.
 
ఉప్పుపై బ్రిటిష్ ప్రభుత్వం పన్ను విధించినందుకు నిరసనగా దండి ప్రాంతంలో సముద్రపు ఒడ్డుకు యాత్ర జరిపి, తమ ఉప్పును తామే తయారు చేసుకుంటామన్న సంకేతాన్ని బ్రిటిష్ వారికి పంపారు గాంధీజీ. తర్వాత 1934లో పార్టీకి రాజీనామా చేశారు. తన అహింసా సిద్ధాంతాన్ని పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నందుకు ఆవేదన చెంది ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 1945 నాటికి బ్రిటిష్ ప్రభుత్వానికీ, భారత జాతీయ కాంగ్రెస్‌కు మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ‘మౌంట్‌బాటన్ ప్లాన్’ తయారైంది. ఆ ప్రకారం 1947లో బ్రిటిష్ ఇండియా విభజన జరిగి ఇండియా, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్ర రాజ్యాలు మత ప్రాతిపదికన ఏర్పాటయ్యాయి. గాంధీజీ ఈ విభజనను వ్యతిరేకించారు.
 
విభజన కల్లోలాన్ని చల్లబరిచేందుకు ఆయన కలకత్తా, ఢిల్లీలలో నిరాహారదీక్షలు చేపట్టారు కూడా. అటు, ఇటు.. ప్రజలు, ప్రభుత్వాలు సద్దుమణిగే సమయంలో 1948 జనవరి 30న ఒక హిందూ అతివాది పేల్చిన బులెట్‌లకు గాంధీజీ నేలకొరిగారు. ఆయన మరణం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే మహాత్ముడికి మరణం అనేది ఉంటుందా? మనిషి గాంధీమార్గంలో నడుస్తున్నంత కాలం ఏ తరంలోనైనా మహాత్ముడు జీవించి ఉన్నట్లే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement