వద్దంటే వదిలెయ్యాలి | should respect the girl's opinion that you do not want | Sakshi
Sakshi News home page

వద్దంటే వదిలెయ్యాలి

Published Mon, Jul 3 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

వద్దంటే వదిలెయ్యాలి

క్రైమ్‌ పేరెంటింగ్‌

వదిలెయ్యకపోతే ఏమవుతుంది?
లైఫ్‌లో ఎన్నో వదులుకోవాల్సి వస్తుంది!
సంతోషాలను వదులుకోవాల్సి వస్తుంది..
గౌరవాన్ని వదులుకోవాల్సి వస్తుంది..
ఇంట్లో ప్రేమను.. బయట స్నేహాన్నీ వదులుకోవాల్సి వస్తుంది..
ఫుల్‌నెస్‌ను వదులుకోవాల్సి వస్తుంది..
చివరికి ఎంప్టీనెస్‌లో బతకాల్సి వస్తుంది!
నీ ఫీలింగ్స్‌ తన ఫీలింగ్స్‌ కానక్కర్లేదు.
అంతగా ఫీల్‌ అవొద్దు.
వద్దంటే వదిలెయ్యాలి!!


నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడితే... నువ్వంటే ఇష్టంలేదు అన్న ఆ అమ్మాయి అభిప్రాయాన్ని గౌరవించాలి.. ఆమె సంతోషాన్ని కోరుకొని పక్కకు తప్పుకోవాలి.

‘‘న్యూస్‌ పెట్టరా అజయ్‌’’ రిమోట్‌ అంతెత్తున ఎగిరి పడింది! ‘‘నువ్వే పెట్టుకో’’ సూర్య షాక్‌ తిన్నాడు. ‘‘ఒరేయ్‌.. ఎక్కడికీ! టిఫిన్‌ చెయ్యకుండా..’’ ఉప్మా ప్లేటు టేబుల్‌ మీద గిర్రున తిరిగింది! ‘‘ఇది టిఫినా మమ్మీ.. తినూ తినూ అని ఎందుకు చంపుతావ్‌?’’ వసంత షాక్‌ తింది! ‘‘అన్నయ్యా.. నా ఫోన్‌లో వై–ఫై డిస్‌కనెక్ట్‌ అయింది. కొంచెం కనెక్ట్‌ చెయ్యవా ప్లీజ్‌?’’పెద్ద సౌండ్‌తో తలుపు ధడేల్‌మంది.‘‘ఎన్నిసార్లు చెప్పాలి. నా రూమ్‌లోకి రావద్దని. ఫో అవతలికి’’ సౌమ్య షాక్‌ తింది.

అమ్మ, నాన్న, చెల్లి... ఈ ముగ్గురూ షాక్‌ తిన్నవాళ్లు. అజయ్‌.. షాక్‌ ఇచ్చినవాడు! కొత్తగా ఇవ్వడం కాదు.. కొన్నాళ్లుగా వాడికి ఇంట్లోవాళ్ల పొడే గిట్టడం లేదు. మాటకు మందు ‘ఐ నో’ అంటున్నాడు. మాట తర్వాత ‘స్టే అవే’ అంటున్నాడు. ఏమైంది అజయ్‌కి!రాత్రి... భోజనం చేస్తూ కొడుకు తీరునే గమనిస్తున్నాడు సూర్య. టీవీలో ఏ ఒక్క చానల్‌ మీద కూడా మనసు లగ్నం చేయట్లేదు అజయ్‌. పదేపదే చానళ్లు మారుస్తున్నాడు. అసలు వాడి దృష్టి టీవీ మీద కూడా లేనట్లుంది. అన్యమనస్కంగా ఉన్నాడు. తినే తిండి మీద కూడా ధ్యాస లేదు. ఎక్కడో మనసు పెట్టి కంచంలో నాలుగు మెతుకులు కతికి లేస్తున్నాడు. వాడి ధోరణికి భార్యాభర్తలు మొహమొహాలు చూసుకోవడం ఎక్కువైపోయింది ఈమధ్య.

చీటికి మాటికి కోపం!
అజయ్‌ టీవీ రిమోట్‌ను విసిరేస్తూ అక్కడినుంచి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోయాక అతడిని అనుసరించాడు సూర్య. నిజానికి ఆ వంకతో కొడుకుతో మాట్లాడాలనుకున్నాడు సూర్య. ఈ మధ్య అజయ్‌ ఏదో పోగొట్టుకున్నట్టుగా.. దిగులుగా.. కనిపిస్తున్నాడు. మాట్లాడితే కోపం తెచ్చుకుంటున్నాడు. మొదటినుంచీ కాస్త మొండివాడు. వాడు ఏది కావాలంటే అది కొనివ్వాల్సిందే. కోపమూ ఎక్కువే. కాని కొన్నిరోజులుగా ఆ కోపం మరింత ఎక్కువైంది! ఇంట్లో తల్లి దగ్గర, చెల్లి దగ్గర కూడా అదే ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి రాకను గమనించి కూడా గమనించనట్లే గదిలో లైట్‌ ఆఫ్‌ చేసి అటుతిరిగి పడుకున్నాడు అజయ్‌!

అయామ్‌ ది బెస్ట్‌ అనే ఫీలింగ్‌
అజయ్‌.. బీటెక్‌ ఫైనలియర్‌లో ఉన్నాడు. చదువులో చురుకే. ఇంజనీరింగ్‌లో ఫ్రీ సీట్‌ కూడా సాధించుకున్నాడు. వాళ్లది మధ్యతరగతి కుటుంబం. తండ్రి సంపాదన మీదే అంతా నడుస్తుంది. సర్దుబాట్లతో సాగుతోంది. ఆ సర్దుబాటంటే చిరాకు అజయ్‌కి. దాంతో ముందు అజయ్‌కి అన్ని సమకూర్చాకే మిగతావాటితో మిగిలినవాళ్లు అడ్జస్టవడం అలవాటు చేసుకున్నారు. అందునా మొదటి సంతానం అవడంవల్ల ఇంట్లో అజయ్‌కే ప్రయారిటీ. ఈ ప్రాధాన్యం అజయ్‌లో తనేదో ప్రత్యేకం అనే భావనను పెంచిపోషించింది. ఐయామ్‌ ది బెస్ట్‌ ఎమాంగ్‌ ఆల్‌.. అనే ఫీలింగ్‌  జీర్ణించుకుపోయింది అజయ్‌లో.

అజయ్‌ ఇంట్లో లేని ఓ రోజు
‘ఏమైంది అంకుల్‌... మమ్మల్ని రమ్మన్నారు?’ అజయ్‌ ఫ్రెండ్‌ రఘు అడిగాడు. అతనితోపాటు అజయ్‌ వాళ్లింటికి వచ్చిన మిగిలిన ముగ్గురు స్నేహితులూ ఆయన ఏం చెప్పబోతున్నాడోనని ఊహిస్తూ ఎదురు చూస్తున్నారు. ‘వసంతా... రఘు, దీపక్‌ వాళ్లు వచ్చారు.. టీలు.. పెట్టిస్తావా..?’ రిక్వెస్టింగ్‌గా అడిగాడు భార్యను సూర్య. అలాగే అంటూ వంటింట్లోంచి హాల్లోకి వచ్చి అజయ్‌ ఫ్రెండ్స్‌ని పలకరించి టీ పెట్టడానికి మళ్లీ లోపలికి వెళ్లిపోయింది వసంత. భార్య అక్కడ లేదని నిర్ధారించుకున్నాక గొంతు సవరించుకున్నాడు సూర్య. ‘చెప్పండంకుల్‌..’ అన్నాడు దీపక్‌.

‘ఏంలేదర్రా.. ఈ మధ్య అజయ్‌ మరీ మొండిగా బిహేవ్‌ చేస్తున్నాడు. ఏమైంది? కాలేజ్‌లో బాగానే ఉంటున్నాడా? ఎవరితోనైనా గొడవపడ్డాడా...?’.. కొంత కంగారుగానే అడిగాడు సూర్య. ‘అబ్బే.. అలాంటిదేమీ లేదు అంకుల్‌’ అని అన్నాడు రఘు.‘ఒరేయ్‌.. ఇంత దూరం వచ్చాక అసలు విషయం దాచడమెందుకు?’అని ఫ్రెండ్స్‌ని వారించి ‘అంకుల్‌.. నిజానికి మేమే మిమ్మల్ని కలుద్దామనుకున్నాం.. ఈలోపు మీరే పిలిచారు. మంచిదే అయింది..’ అంటూ జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టాడు జయంత్‌.‘అంకుల్‌.. మా క్లాస్‌మేట్‌ దివ్యని అజయ్‌ ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి వీడిని ఫ్రెండ్‌లాగే ట్రీట్‌ చేస్తోంది. మాతో సినిమాలకు వచ్చేది. క్యాంటీన్లో కూర్చుని తినేవాళ్లం.. ఇంకా... లాంగ్‌ డ్రైవ్స్‌కీ వచ్చింది. వాడి  ప్లేట్‌లోంచి షేర్‌ చేసుకునేది.. ఇవన్నీ చూసి అజయ్‌ ఆమె కూడా తనను ఇష్టపడుతుందేమో అనుకున్నాడు అంకుల్‌’ అన్నాడు జయంత్‌. ‘వీడు ఆ అమ్మాయితో చెప్పాడా ఇష్టమని?’ అడిగాడు సూర్య. ‘ఊ... చెప్పాడు అంకుల్‌’ రఘు సమాధానం.

‘కాని ఆ అమ్మాయి మాత్రం.. నేను నిన్ను అలా చూడలేదు. అందరితో ఉన్నట్టే నీతో ఉన్నా. నిన్ను మంచి ఫ్రెండ్‌లాగే అనుకున్నా.. అసలు లవ్‌ అన్న థాటే లేదు నాకు. సారీ అజయ్‌.. ఒకవేళ నీకు నేను అలాంటి ఫీలింగ్‌ కలిగించి ఉంటే క్షమించు’’అని చెప్పింది. వాడు దాన్ని రిజెక్షన్‌లా ఫీలవుతున్నాడు. ఇన్‌సల్ట్‌ అనుకుంటున్నాడు. ఇది జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి వాడితో స్నేహంగానే ఉండడానికి ప్రయత్నించింది. కాని వీడే సాధించే పని పెట్టుకున్నాడు. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడ్తున్నాడు అంకుల్‌. నీది తప్పురా.. అని చెప్పినందుకు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు!’ పూర్తి చేశాడు జయంత్‌. ‘బట్‌. ఆ అమ్మాయి అంత క్లోజ్‌గా మూవ్‌ కావల్సింది కాదేమో అంకుల్‌... ’ అన్నాడు దీపక్‌. ‘ఆ క్లోజ్‌నెస్‌ చూసి వాడే కాదు, నేనూ ఆమె వీడిని ఇష్టపడుతుందనే అనుకున్నా.. ’ అన్నాడు. ‘ఆగరా.. నువ్వు! అంకుల్‌.. ఆ పిల్ల అజయ్‌తోనే కాదు. మా అందరితోనూ అంతే క్లోజ్‌గా ఉంది.. నిజంగానే ఓ ఫ్రెండ్‌లాగే ఉంది. ఆ అమ్మాయిదేం తప్పులేదు’ అన్నాడు జయంత్‌. ‘హూ...’ అంటూ నిట్టూర్చాడు సూర్య. ఈలోపు టీలు తెచ్చిచ్చింది వసంత.

అనుకుంటే సరిపోతుందా?
బాల్కనీలో కూర్చుని సెల్‌ఫోన్‌లో చాట్‌ చేస్తున్న కొడుకు దగ్గరకు వెళ్లాడు సూర్య. ఒక కుర్చీలో కూర్చొని ఇంకో కుర్చీలో కాళ్లు బార్లా చాపి పెట్టుకున్న అజయ్‌.. తండ్రిని చూసి కూడా చూడనట్టే సెల్‌ఫోన్‌లో మునిగిపోయాడు. ‘‘కాళ్లు తియ్‌’’ అంటూ కొడుకు కాళ్లను తట్టాడు. ఇక తప్పదన్నట్టుగా కాళ్లు తీసి కింద పెట్టుకున్నాడు అజయ్‌. ఆ కుర్చీలో కూర్చుంటూ కొడుకు మీద చూపులు నిలిపాడు. ఇబ్బందిగా అనిపించిందేమో..  సర్దుకున్నాడు అజయ్‌. ‘నీతో మాట్లాడాలి..’ అన్నాడు సూర్య. ‘దేని గురించి?’ కొంచెం నిర్లక్ష్యంతో కూడిన సమాధానమే అజయ్‌ నుంచి. ఆ వెంటనే, ‘చూడూ... నాకు విషయం తెలిసింది’ అన్నట్టు కళ్లతోనే చెప్తూ.. ‘ఒరేయ్‌.. అనుకున్నవన్నీ సాధించడం కుదరదు’ అంటూ మొదలు పెట్టాడు.

అజయ్‌ వయసులో సూర్య
‘‘నా పాతికేళ్ల వయసులో.. బిజినెస్‌ చేద్దామను కున్నా. మా నాన్నని పెట్టుబడి కోసం అయిదువేలు  అడిగా. అప్పుడే చెల్లి పెళ్లి ఖాయం అయింది. ఇంట్లో డబ్బూ ఉంది. అయిదువేలు అందులోంచి ఇస్తే.. పెళ్లప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని ‘వీలుకాదు’ అని చెప్పాడు నాన్న . నేను నాన్నపై కోపం పెంచుకోలేదు. ఆయన నిస్సహాయతను అర్థం చేసుకున్నా. నా ఫ్రెండ్‌ని అడిగాను. వాడూ కుదరదనే అన్నాడు. వాడి మీదా కోపం పెంచుకోలేదు. పరిస్థితి తెలుసుకున్నా. ముందు ఏదో ఒక ఉద్యోగం చేసి కొంత డబ్బు పోగేసుకొని వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా.

ఉద్యోగం సంపాదించా. అనుకున్నట్లుగానే షేర్స్‌ బిజినెస్‌లోకి దిగుదామనుకున్నా. కాని అప్పటికి అందులో పెట్టుబడి పెట్టిన నా ఫ్రెండ్స్‌ అంతా అప్పులపాలయ్యారు. అచ్చిరాదు అనుకొని ఉద్యోగంలోనే కంటిన్యూ అయ్యా. జాబ్‌తో గొప్పగా సంపాదించలేకపోవచ్చు.. కాని నా కుటుంబానికి మూడుపూటలా తిండి, నా పిల్లలకు మంచి చదువు.. నా భార్యకు చిన్నచిన్న ఆనందాలనైతే ఇవ్వగలిగాను. ఆ సంతృప్తిని అయితే సొంతం చేసుకున్నా. ఆ రోజు మా నాన్న మీద, నా ఫ్రెండ్‌ మీద కసి పెంచుకొని కక్ష్య సాధించి ఉంటే.. ఈ రోజు రత్నాల్లాంటి నా ఈ పిల్లలకు దూరమై ఉండేవాడిని. ఈ ఆనందాన్ని జీవితకాలం మిస్‌ అయి ఉండే వాడిని’’ అంటూ.. ఆగాడు సూర్య. అజయ్‌ తదేకంగా తండ్రినే చూస్తున్నాడు.

ప్రేమించలేదని సాధించాలా!!
‘‘జీవితం అంటే అంతే.. మనసుపడ్డవన్నీ ఇవ్వదు. దక్కాల్సిందే దక్కుతుంది. దక్కినదాని మీద ప్రేమను పెంచుకోవాలి తప్ప, దక్కనిదానిపై ద్వేషాన్ని ఏర్పరచుకోకూడదు. అయినా నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడితే... నువ్వంటే ఇష్టంలేదు అన్న ఆ అమ్మాయి అభిప్రాయాన్నీ గౌరవించాలి.. ఆమె సంతోషాన్ని కోరుకొని పక్కకు తప్పుకోవాలి. అప్పుడే నీ ఇష్టానికి విలువ.. నువ్వంటే రెస్పెక్ట్‌ పెరుగుతుంది. వెంటపడి వే«ధించడం ఇష్టం కాదురా.. పైశాచికత్వం. రాక్షసత్వం. ఆ అమ్మాయి మనసులో మనిషిగా మిగులుతావో.. రాక్షసుడిగా ముద్రపడ్తావో.. నీ ఇష్టం!’ అంటూ కొడుకుతో చెప్పి అక్కడి నుంచి కదిలాడు సూర్య.
– శరాది

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement