బాల్యంలోనే బీజాలు పడాలి
సందర్భం
‘‘నిర్మలమైన, పవిత్రమైన మనస్సుతో నీ విధులను నువ్వు సక్రమంగా నిర్వర్తించు, ఫలితం దానంతట అదే వస్తుంది’’ అంటారు శ్రీభారతీ తీర్థ మహాస్వామివారు. జగద్గురు ఆదిశంకరులు స్థాపించిన చతురామ్నాయ పీఠాలలో మొదటిది, దక్షిణాపథానికంతటికీ గురుస్థానం ఈ పీఠానిదే. అంతటి శృంగేరీ శారదా పీఠానికి అధిపతి శ్రీ భారతీ తీర్థ స్వామివారి 66వ వర్ధంతి ఉత్సవాలు నేడు, రేపు జరగనున్నాయి. 1951 ఏప్రిల్ 11న గుంటూరు జిల్లా నాగులేరు సమీపంలోని అలుగుమల్లెపాడులో తంగిరాల వారి ఇంట జన్మించిన సీతారామాంజనేయశర్మ ఇలా శృంగేరీ పీఠానికి 36వ అధిపతిగా సనాతన ధర్మమూలాలను రక్షించే దార్శనికుడిగా ఎదగడం తెలుగువారి అదృష్టం. ఆయన 66వ వర్ధంతి సందర్భంగా వారి బోధామృతం నుంచి రాలిన కొన్ని చినుకులు...
‘‘యువతరం క్రమశిక్షణను ఎప్పుడూ కోల్పోకూడదు. అదుపు తప్పి ప్రవర్తించకూడదు. యువతరం ఋజుమార్గంలో జీవితంలో ముందుకు సాగాలంటే, అందుకు బాల్యంలోనే బీజాలు పడాలి. పిల్లలు ఇంటర్నెట్‌తో ఆటలాడుకుంటుంటే, టీవీ చూస్తుంటే మురిసిపోవడం కాదు... వారికి నైతిక, పౌరాణిక కథలు చెప్పాలి. మన దేశ ఘనవారసత్వాన్నీ, సాంస్కృతిక విలువలనూ బోధించాలి. మంచి అలవాట్లు కాని, చెడు అలవాట్లు కాని మనం ఎవరి సాంగత్యంలో ఉంటామో వారి నుంచి సంక్రమిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ సత్సాంగత్యాన్నే కోరుకోవాలి.అలాగే, కాలాన్ని కోల్పోతే దానిని తిరిగి తీసుకురావడం ఎవరి తరమూ కాదు. కాబట్టి కాలాన్ని వృథా చేయకుండా మంచి పనులతో గడపాలి.’’ శ్రీ భారతీ తీర్థుల వారి బోధలు అందరికీ శిరోధార్యం. వారి అడుగు జాడలలో నడవడమే మనం వారికి చెల్లించే గౌరవ ప్రపత్తులు.
గమనిక: సన్న్యాసాశ్రమం స్వీకరించిన వారికి వారి జన్మదినాన్ని కూడా వర్ధంతిగా పరిగణించడం ఆచారం. అదే విధంగా శృంగేరీ జగద్గురువులు తమ ఉత్తరాధికారిని తామే ఎంపిక చేయడం పీఠ సంప్రదాయం. శృంగేరీ పీఠ ఉత్తరాధికారిగా శ్రీ విధుశేఖర భారతీస్వామివారిని ఎంపిక చేశారు.