డేవిడ్‌ కిటికీ | Sicily Sanders as Nurse | Sakshi
Sakshi News home page

డేవిడ్‌ కిటికీ

Published Fri, Jun 22 2018 12:32 AM | Last Updated on Fri, Jun 22 2018 12:32 AM

Sicily Sanders as Nurse - Sakshi

‘‘డిశ్చార్జ్‌ అవ్వాల్సిందేనా?’’ బెంగగా అడిగాడు డేవిడ్‌. ‘డిశ్చార్జ్‌’ అనే మాట చుట్టూ నర్స్‌ ఆలోచనలు తిరుగుతున్నాయి.    ‘‘ఈ క్షణంలో నీ మనసు, నీ హృదయం ఏం ఆలోచిస్తున్నాయి?’’ .. అడిగాడు డేవిడ్‌. ‘‘నీ సమక్షంలో ఉన్నప్పుడు నా ఆలోచనలనైనా నేను నా చెంతకు రానివ్వను’’ అంది నర్స్‌.

బతికించడానికి మందులు కావాలి. బతకరని తెలిశాక ప్రేమ కావాలి. డేవిడ్‌ టాస్మాకు తను బతకడని తెలియదు. నలభై ఏళ్లవాడతడు. పోలెండ్‌ దేశపు యూదుడు. రాజధాని వార్సాలోని ‘ఘెట్టో’ నుంచి తప్పించుకుని లండన్‌ వచ్చి, వైద్యం కోసం ఆసుపత్రిలో చేరాడు. ఘెట్టో అంటే విధిలేక ఉండవలసి వచ్చిన ప్రదేశం. లేదా, విధి తన్నితే ఎగిరొచ్చి పడిన ప్రదేశం.  రెండో ప్రపంచయుద్ధం ముగిసి అప్పటికి రెండేళ్లవుతోంది. యుద్ధం ప్రపంచాన్ని జబ్బున పడేసింది. ఆ జబ్బు ప్రపంచంలో ఒక జబ్బు మనిషి డేవిడ్‌. ఆ జబ్బుకు వైద్యంతో పాటు అతడికి ప్రేమ కూడా అందింది! తనకు సేవలు అందిస్తున్న నర్సును ప్రేమించాడతడు! ప్రేమిస్తే ప్రేమ అందుతుందా? అదృష్టం. అతడికి అందింది. నర్స్‌ కూడా అతడిని ప్రేమించింది. అతడి కన్నా పదేళ్లు చిన్న ఆమె. ఆమెకు తెలుసు అతడు చనిపోబోతున్నాడని. ఆ విషయం అతడికి చెప్పలేదు. మందుల్ని, ప్రేమను మాత్రం అందించింది. నిజాన్ని దాచేసింది. అది అతడికి ఏమాత్రం అవసరం లేని నిజం అనుకుంది. తను అతని పక్కన ఉన్నంతకాలం అతడికి ఆ నిజంతో గానీ, ఆ నిజానికి అతడితో గానీ పనిలేదని అనుకుంది. మరణం కనిపించకుండా అతడికి అడ్డుగా నిలుచుంది. 

ఓ రోజు వైద్యులొచ్చి ‘‘డేవిడ్‌.. మీరిక వెళ్లిపోవచ్చు’’ అని చెప్పారు. అతడి పక్కన నర్స్‌ లేదు. ‘ఇంత తొందరగా నయమైపోయిందా’ అన్నట్లు నిరాశగా చూశాడు. ‘‘ఇప్పుడిక నయం అవడానికి ఏమీ లేదు డేవిడ్‌’’ అని వాళ్లు అన్నారు. అలా అంటున్నప్పుడే నర్స్‌ అక్కడికి వచ్చింది. ‘డిశ్చార్జ్‌ చేద్దాం శాండర్స్‌’ అని చెప్పి వాళ్లు వెళ్లిపోయారు. డేవిడ్‌ తలను ఒడిలోకి తీసుకుంది నర్సు. అతడి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ‘‘డిశ్చార్జ్‌ అవ్వాల్సిందేనా?’’ బెంగగా అడిగాడు డేవిడ్‌. ‘డిశ్చార్జ్‌’ అనే మాట చుట్టూ నర్సు ఆలోచనలు తిరుగుతున్నాయి. ‘‘ఈ క్షణంలో నీ మనసు, నీ హృదయం ఏం ఆలోచిస్తున్నాయి?’’ అని అడిగాడు డేవిడ్‌. ‘‘నీ సమక్షంలో ఉన్నప్పుడు నా ఆలోచనలనైనా నేను నా చెంతకు రానివ్వను’’ అంది నర్స్‌. అతడు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత తన దగ్గర ఉన్న 500 పౌండ్‌లను ఆమె చేతిలో పెట్టాడు. ఏమిటన్నట్లు చూసింది. ‘నీ ఇంటికి నేనొక కిటికీని అవ్వాలి’ అన్నాడు డేవిడ్‌. క్యాన్సర్‌ తనను ఎత్తుకుపోతున్నట్లు అతడికి తెలిసిపోయిందని అర్థం చేసుకుంది నర్స్‌ సిసిలీ శాండర్స్‌. 

ఇప్పుడు డేవిడ్‌ లేడు.  శాండర్స్‌ లేరు. లండన్‌లోని ‘సెయింట్‌ క్రిస్టఫర్స్‌ హాస్పిస్‌’ భవనం ప్రవేశ ద్వారం దగ్గర డేవిడ్‌ కోరుకున్నట్లుగా ఆయన ఇచ్చిన డబ్బులతో కట్టిన కిటికీ ఉంది. డిశ్చార్జ్‌ అయిన కొన్నాళ్లకే డేవిడ్‌ చనిపోయాడు. 2005లో 87 ఏళ్ల వయసులో సిసిలీ శాండర్స్‌ చనిపోయారు. ‘సెయింట్‌ క్రిస్టఫర్స్‌ హాస్పిస్‌’ ఆమె కట్టించిందే. ‘ఆల్‌ యు నీడ్‌ ఈజ్‌ లవ్‌’ అనే బీటిల్స్‌ సాంగ్‌ బ్రిటన్‌ని ఊపేయడానికి నెల ముందు 1967లో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు శాండర్స్‌. ‘హాస్పిస్‌’ అంటే చివరి రోజులలో ఉన్న వాళ్లకు ప్రేమగా సేవలందించే వైద్యాలయం. అక్కడ ప్రేమొక్కటే ప్రధాన చికిత్స. ప్రేమగా మాట్లాడతారు. ప్రేమగా మాటల్ని వింటారు. ప్రేమగా సేవలు చేస్తారు. ‘టోటల్‌ పెయిన్‌’ని పోగొడతారు. ఈ ‘టోటల్‌ పెయిన్‌’ అనే మాటను కనిపెట్టింది కూడా శాండర్సే! కనిపెట్టడం కాదు. పెయిన్‌ని ఫీల్‌ అవడం. వ్యాధిగ్రస్తులలో పైకి కనిపించేది శారీరక బాధ ఒక్కటే. కానీ వారిలో ఆమె ఫిజికల్‌ పెయిన్‌తో పాటు ఎమోషనల్‌ పెయిన్, సోషల్‌ పెయిన్, స్పిరిచ్యువల్‌ పెయిన్‌.. ఇవన్నీ చూశారు. వాటన్నిటికీ ప్రేమను లేపనంలా అద్దే ‘హాస్సిస్‌’ అనే సేవా భావనకు ఆద్యురాలయ్యారు. నేడు సిసిలీ శాండర్స్‌ నూరవ జన్మదినం. 1918 జూన్‌ 22న ఆమె జన్మించారు. తను నెలకొల్పిన ప్రేమాలయంలోనే క్యాన్సర్‌తో మరణించారు. ప్రేమను పొందిన మనిషికి మరణం లేదనడానికి డేవిడ్‌ ‘కిటికీ’ ఒక నిదర్శనమైతే.. ప్రేమ లేని చోటే ఈ ప్రపంచంలో లేదనడానికి మన కళ్లెదుట ప్రతి నర్సులోనూ కనిపించే సిసిలీ శాండర్స్‌ మరొక నిదర్శనం. 
– మాధవ్‌ శింగరాజు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement